శాప విమోచనం
----
మోదుకూరి జతీంద్ర శర్మ
అర్ధరాత్రి దాటి ఓ ఘడియ దాటిందేమో, అంతవరకూ జోరుగా,ప్రళయ
ఝంఝామారుతంలా వీస్తున్న గాలి అకస్మాత్తుగా ఆగి, మందంగా, ఆహ్లాదంగా వీచడం
ప్రారంభించింది.
నంద వ్రజంలో నందుని ఇంట పెరట్లో ఉన్న
ఆ రెండు మద్దిచెట్లూ గాలిలో వచ్చిన తేడాని గమనించి కొంచెం ఆశ్చర్యపోయాయి. శ్రావణ
మాసంలో సాధారణంగా గాలి ఇలా ఆహ్లాదంగానూ, అదీ తుఫాను
వచ్చేముందు వీచే గాలి వీచేటట్లు వీస్తూ అకస్మాత్తుగా ఆగి,
మలయమారుతంలా, ఇంత చల్లగానూ, హాయిగా వీచడం
అన్నది ఎన్నడూ వాటి అనుభవంలో లేదు.
“ఎప్పుడూ హడావుడిగా వుండి
రాత్రన్నదేలేనట్లువుండే నందవ్రజం, ఈరోజెందుకో నిద్రపోతోంది. క్రూరమృగాల బారినుండి
ఆలమందలనుకాచే రక్షకులు కూడా ఆదమరచి నిద్రపోవడం ఎపుడూ ఎరగం” అనుకొంది ఓమద్ది
చెట్టు.
దూరంగా ఎవరో వస్తున్నట్లు అలికిడి
వినబడింది. తమ ఆకులన్నీ ఎవరో మహానుభావుడు వస్తున్నప్పుడు, ఎదురుచూసే
కన్నులు తిరిగేటట్లు ఆ సవ్వడి
వస్తున్నవైపు తిరగడం గమనించి ఇంకా ఆశ్చర్యపోయాయి.
ఒక ఆజానుబాహుడు. గడ్డం పెరిగిఉంది.
చాలా దూరంనించి గబగబ నడచి రావడం వల్ల కొంచెం రొప్పుతున్నా, ఆ
వ్యక్తి మొఖంలో అలసట కనబడటం లేదు. ఆ వ్యక్తి నడక చాలా రోజుల్నుండి శృంఖలాలలో బంధింపబడివుండే
వాళ్ళు నడిచే వాళ్ళ నడకలా ఇబ్బందిగా నడుస్తున్నట్లు, అడుగులు
బారుగా పడకుండా, స్వేచ్చగా నడిచేవాడి నడకలా కాకుండా వుంది.
ఆయన గుండెలకత్తుకొని ఒక మూట వుంది. ఆ
మూటలోంచి అద్భుతమైన కాంతులు వెదజల్లుతూ, ఓచిన్నిముఖం కనబడుతూవుంది.
ఆ వ్యక్తి సడిచెయ్యకుండా యశోదాదేవి
నిద్రిస్తున్న మందిరంలోకి వెళ్ళాడు. “ఏం చెయ్యబోతున్నాడో ఈయన? గట్టిగా
గొంతెత్తి అరచి అప్రమత్తం చేద్దామంటే గొంతే లేదే?”
అనివిచారించిందో చెట్టు. నందవ్రజంలో ప్రతి ప్రాణి, ప్రతి
పురుగు, అతినిశ్శబ్దంగా ఓ అద్భుతమైన సంఘటనకి సాక్షీభూతులైనట్లు, అన్నీ
యశోదాదేవి మందిరం వైపే చూస్తున్నాయ్. క్షణాలు గడిచేయి. ఆయన మళ్ళీ మరోమూటతో బయటకి
వచ్చేడు. ఆయన ప్రవర్తన ఏనేరమో చేసినవాడిదిలా లేదు.
వ్యక్తి తనుచేయవలసిన పనిని అత్యంత శ్రద్దతో
చేస్తున్నట్లు ఉంది. మళ్ళీవచ్చిన త్రోవలో వెళ్ళిపోయాడు. యశోదాదేవి మందిరంలోంచి
వస్తున్న ఆ వెలుగు మెల్లగా ఆగిపోయింది.
ఓ చంటిపిల్లవాడు,అప్పుడే
పుట్టిన పసిపాపడు ఏడుస్తున్నట్లు, “కేర్,కేర్” మని ఏడుపు యశోదాదేవి మందిరంలోంచి వచ్చింది. నందవ్రజం
నిద్రలోంచి మేల్కొంది, అజ్జానికి జ్జానం వచ్చినట్లు.
“నందరాజుకిపుత్రోదయం. జయం. జయం” అంటూ
లోపల్నుంచి గోపపరిచారికలు బయటికి వచ్చి ప్రకటించేరు.
ఆ మాట విన్న మద్దిచెట్లు ఆనందంతో
పులకించిపోయేయి. ఆనందాశ్రువులు రాలుస్తున్నట్లు, ఆకుల్ని
రాల్చేయి, గ్రీష్మం కాకపోయినా.
“చూసేవా, ఆ మహానుభావుడు
వసుదేవుడన్నమాట. వచ్చింది దేవదేవుడైన కృష్ణుడన్న మాట. ఇంక మనకి జన్మరాహిత్యం, ఈ శాప
విమోచనం ఎంతో దూరం లేదన్నమాట. మనం మళ్ళీ మన తండ్రి గారి దర్శనం, ఆ
పరమశివుడి సేవా భాగ్యం చేసుకోబోతున్నామన్నమాట.” అంటూ సంతోషించేయి.
ఆ తెల్లవారు ఝామున నందవ్రజం
ఆనందసాగరంలో ఓలలాడింది. పశువులన్నీ మూఱ పైకెత్తి ఆనందంగా “అంబా”అని అరచేయి. ఆవేళ, మద్దిచెట్లు, తమ కొమ్మలపైనుండి
కూస్తున్న పక్షుల కిలకిలారావాలలో కొత్త ఆనందాన్ని గమనించేయి.
జననమరణాదులకతీతమైన నారాయణుడు,
దేవకీవసుదేవులకు జనియించి, తనలీలలను లోకానికి చాటి చెప్పేందుకు,
నందయశోదాదేవులకు జన్మరాహిత్యం కలుగజేయడానికా అన్నట్లు,
నందవ్రజంలో బాలుడై యశోదాదేవి ఒడిలో, సామాన్య బాలకులలా
ఏడుస్తూ లోకానికి తన రాకను వెల్లడించాడు.
***
పదకొండు రోజులయినాయి శ్రీకృష్ణజననం
అయి. నందవ్రజంలో పండుగ వాతావరణం యింకా కొనసాగుతునేఉంది. గొల్లలందరూ, నందుడికి
బహుమానాలనందించడంలో పోటీ పడుతునేఉన్నారు. గొల్లభామలయితే యశోదాదేవి వద్దంటున్నా, ఆ యిల్లు
విడువడం లేదు. ఆ భామలందరూ, కృష్ణుడు తనచిన్నినోటితో ఆవలిస్తే”అబ్బ! చూడవే, ఎంత
అందంగా ఆవలిస్తున్నాడో!. పెద్దవాళ్ళలాగా చెయ్యపెట్టుకోవడం రాదుగా! పురుగులూ అవీ
దూరతాయో ఏమో!పాపం.” అని జాలిపడతారు. వచ్చేవాళ్ళు,
పోయేవాళ్ళూ గొల్లల సందడితో నందుడియిల్లు పూర్వం కన్నా కళకళలాడసాగింది.
ఓరోజు నందుడు మధురకి కప్పం చెల్లించడానికి బయలుదేరాడు. యశోదాదేవి కృష్ణుడ్ని ఉయ్యాలలో పడుకోపెట్టి , రోహిణీ దేవి తో కలసి తనపనులు చేసుకొనేవేళ, పూతన కంసుని పనుపున అప్పుడేపుట్టిన బాలకులందరనీ హతమారుస్తూ, నందవ్రజం వచ్చింది. చక్కనియువతిలా అలంకరించుకొని, వస్తున్న ఆమె ఉనికి పసిగట్టి, నందుని ఇంట్లో వున్న ఆవులు భయంభయంగా అరిచేయి. మద్దిచెట్లకి కట్టబడిన రెండు ఎద్దులు, నందుడికి ఎంతోప్రీతిపాత్రమైనవి, కొమ్ములు వంచుతూ, గిట్టలు నేలకి రాస్తూ, హుంకరిస్తూ అశాంతిగా కట్లు విప్పుకోడానికన్నట్లుగా ప్రవర్తించసాగేయి. మద్దిచెట్ల ఆకులన్నీ భయంతో ముడుచుకుపోయినట్టుగా అయేయి. ఆ పూతన వడివడిగా వెళ్ళి, ఊయలలో వున్న చిన్నికృష్ణుడి చనుబాలు తాగిస్తానని, తస చనుబాలు తాగించప్రయత్నం చేసింది. విషనాగులకు శత్రువైన గరుడుడే తన వాహనంగాఉన్నవాడు, విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నశివునికి చెలికాడు, విషనాగులందరిలో ప్రముఖుడైనట్టి, శేషునిపై శయనించేవాడు, విషములో అంటే నీళ్ళలోపుట్టిన కమలంలో పుట్టిన బ్రహ్మదేవుని తండ్రి అయినవాడికి, విషం తాగడం ఒక విశేషమా! ఇంతలో పెద్దగా కేకవేస్తూ,వికృత రూపంతో ఆ పూతన పెరట్లోకి వచ్చి మరొక్కసారి భయంకరంగా అరచి, నిజరూపంతో చచ్చిపడింది. దాని భీకరరూపంకింద పడి ఎన్నో వృక్షాలు నలిగి పోయాయి. పశువులన్నీ భయంతో కకావికలైపోయాయి.
మద్దిచెట్లు కూడా ఆభీకర స్వరూపం
వాటినెక్కడ పడదోస్తుందో అని ఒక్క క్షణం భయపడ్డాయి.ఐతే నారదమహర్షి అనుగ్రహం వల్ల
తమకి కృష్ణుడి పద స్పర్శవల్ల శాపవిమోచనం అన్నవిషయాన్ని గుర్తు చేసుకొని
ఊరడిల్లాయి.
***
నూరుసంవత్సరాలు మీరు మద్దిచెట్లుగా
నంద వ్రజంలో పడియుండండి అని ముని శాపం. నూరుఏళ్ళు పూర్తి గావొస్తున్నాయి.
బాలకృష్ణుడి పాదధూళికోసం ఆ మద్దిచెట్లు ఎదురుచూస్తున్నాయి. ఆ బాలగోపాలుడు తమని
ఎప్పుడు ఏలతాడో అని ఆబాలగొపాలం ఎదురుచూస్తోంది.
ఓ సాయింత్రం,
యశోదాదేవి బాలకృష్ణుణ్ణి, జగత్తులో ఏ సౌందర్యమూ సాటిరాని వానిని, చక్కగా
ముస్తాబు చేసి పెరట్లో ఓ మంచం వేసి, మెత్తని పరుపులు
వేసి, మళ్ళీ చిన్నికృష్ణుడికి ఏ విధమైనవీ ఒత్తుకోకుండా ఒక్క మెత్తనిబట్ట దానిమీద
పరచి, కృష్ణుణ్ణి పడుకోపెట్టి, బలరాముడితో, “నాన్నా!, తమ్ముడు
పడిపోకుండా చూస్తూ ఉండు” అని జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వెళ్ళింది తన
పనులుచేసుకొనేందుకు.
నీలం రంగు మేనిచాయతో,జుట్టు ముడివేసి, అ ముడిలో ఓ చిన్న నెమిలిఫింఛంతో, ఎర్రని చిన్నపాదాలతో, విప్పారినకన్నులతో, తానే సృష్టించిన జగత్తును, మొదటిసారి చూస్తున్నవాళ్ళా, ఆ మంచం మీద పడుకున్న శేషశాయి, ఆ సాయింత్రం లోకాలన్నిటినీ పరీక్షగాచూస్తూ పడుకున్నాడు. పెరట్లో తల్లి ఆవుల రాకకోసం చూస్తూ అంతవరకూ హడావుడి చేస్తున్న లేగ దూడలన్నీ అలా ఆ ముగ్ధమనోహరరూపం చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాయి. సాయం సంజెవేళ, ఆ చిన్నిబాలకృష్ణుడిమీద ఎండ పడకుండా,ఆ మద్దిచెట్ల కొమ్మలు తామంత తామె కొంచంగా దిశమార్చుకొని తమనీడని కృష్ణుడిమీద పడేటట్లు చేసేయి.
శకటాసురడనేవాడు, కంసుడి
భ్రుత్యుడు. పూతనని చంపినవాడెవడో ఈ ఇంట్లోనే వున్నాడని విని, వానిని
మట్టుబెట్టాలని ఇక్కడే కాపుకాసేడు. బాలకృష్ణుణ్ణి చూసి, ఆతనిని
సంహరిస్తే కంసుని అనుగ్రహం పొంద వచ్చునని ఆలోచనచేసాడు. బాలకృష్ణుడి ప్రక్కనే వున్న
ఒక బండి చక్రం లో ప్రవేశించి అదునుకోసం ఎదురుచూడసాగాడు. ఆకలి వేసినబిడ్డ తల్లి
కోసం వెతుక్కుని పక్కకి బోర్లాపడి మళ్ళీ ఇటు దొర్లి,
కాళ్ళుకొట్టుకుంటూ ఏడ్చే పసివాడిలాగా కాళ్ళు కొట్టుకుంటూ, కాలితో ఆ
చక్రాన్ని అలవోకగా ఒక తన్నుతన్నేడు బాలకృష్ణుడు. ఆ చిన్న దెబ్బకే, ఆ చక్రం
గింగిరాలు తిరుగుతూ పైకెగిరి, క్రిందపడి, ముక్కలుచెక్కలు
అయింది. ఈశబ్దానికి లోపల్నుంచి రేణుకా, యశోదా
పరిగెత్తుకుని వచ్చి ముక్కలుగా విరిగివున్న బండినీ,ఆకలితో
ఏడుస్తున్నట్లున్న బాలకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క ఉదుటున కృష్ణుణ్ణి
యశోదాదేవి ఎత్తుకొని లోపలికి తీసుకొనిపోయింది.
ఈ లీల చూసిన మద్దిచెట్లు అనుకున్నాయి
“ ఒక చిన్న తన్ను తన్నితేనే ఆ బండి చక్రం ముక్కలు ముక్కలు అయింది కదా!. ఆ భగవానుడి
పాద స్పర్శతో కదా మనకి విముక్తి. మనకేంఅవుతుందో? ఏది
ఏమయినా భగవానుని పాద ధూళి సోకుతుందికదా!అదే పదివేలు. ఆ క్షణం ఎప్పుడొస్తుందోకదా?”
***
చిన్ని కృష్ణుడుపెరిగి
పెద్దవుతున్నాడు. ఆ పెరట్లొ కొచ్చినప్పుడెల్లా ఆ మద్దిచెట్లు ‘ ఈరోజేనా
మన విముక్తి’ అని ఆశగా ఎదురుచూడ్డం. ఏమీ జరగపోతే నిరాశగా నిలబడ్డం
జరుగుతున్నది.
బాలకృష్ణుడి ఆటలూ పాటలూ చూస్తూ మైమఱిచి పొతున్నారు నందగోకులంలో అందరూ. మిగిలిన గొల్లబాలకులతో చిన్ని కన్నయ్య ఆటలు చూసి పెరట్లొ ఆవులూ, దూడలూ, చెట్టూ, చేమాఅన్నీ పరవశిస్తున్నాయి. ఒక రోజు దొంగాట ఆడుతూ ఆ చెట్లవైపు వస్తాడు. అంతలోనే ఆగి మరోవైపు మళ్ళుతాడు. పక్కనే వున్న మర్రిచెట్టు ఊడలకి ఉయ్యాలలుకట్టి ఊగుతుంటే, ఆ నల్లనయ్య కాళ్ళు మద్ది చెట్ల దాకా వచ్చి వెనక్కి వెళ్ళుతాయి. మునీంద్రుడు ఆ జగన్నాధుని పాద స్పర్శ చేత శాపవిమోచనం అన్నాడు కానీ, ఆ స్పర్శ ఎలా లభిస్తుందో చెప్పలేదు కదా!. ఒక్కోసారి ఆ చెట్లకి కట్టిఉన్న ఎడ్ల మీద ఎక్కి, నందీశ్వరుడిమీద ఊరేగుతున్న శివుడిలా గోచరిస్తాడు. అప్పుడుఆ చరణాలు అత్యంత సమీపంలోకి వచ్చి అంతలోనే, దూరం అవుతాయి. మోక్షానికి దగ్గరగా వచ్చినా ఇంకా పరిపక్వత చెందని జీవునికి ఆ బ్రహ్మం దూరంగా జరిగేటట్లు.
పెద్దఇల్లు నందుడిది. నందుడు రాజు కనుక ఆగోకులంలో అందరికంటే ఆ ఇంట్లో ఆలమంద
కూడా పెద్దదే. ఆ ఆవులూ, దూడలూ, ఎద్దులూ ఉండటానికి
విశాలమైన పెరడు. పెరటిలోనికి వచ్చేముందు కొంచెంఎత్తైన అరుగులతో కూడిన పెద్దవరండా.
ఆ వరండాలో అనేక స్థంభాలు. ఒక స్థంభానికి ఒక చల్ల చిలికే కవ్వం, కుండ, యశోదాదేవి
వంటింట్లో పని చేసుకుంటూ, చల్ల చిలకడానికి వీలుగా.
సాయంకాలం కావడానికి ఇంకా కొంచెం సమయం
వుందనగా, యశోద, ఒకరోజు చల్లచిలుకుతో ఉంది. ఎక్కడనుండి వచ్చేడో కృష్ణుడు, ఆమె
చుట్టూ తిరుగుతూ, ఆమెపైన వ్రాలుతూ,ఆమె పైట లాగుతూ
అల్లరిచేయసాగేడు. “అమ్మా!రా అమ్మా! నాకు ఆకలిగా ఉంది. పాలివ్వవే” అంటూ
గంతులువేస్తూ కవ్వాన్ని పట్టుకున్నాడు. ఇలా గంతులు వేస్తున్న కన్నయ్యను నవ్వుతూ
దగ్గరకు తీసుకుని, ఒడిలో చేర్చి పాలివ్వసాగింది. ఇంతలో వంటింట్లో పాలు
పొంగుతున్నట్లు గమనించి, గభాలున కృష్ణుడ్ని కిందకి దించి, పాలకుండ
దించడానికి గబగబలోపలికి వెళ్ళింది.
తనకి సేవచేస్తున్న భక్తులు, లౌకికమైన
విషయాల లంపటంలో చిక్కుకోవడం నచ్చని దేవునికి వచ్చే కోపంలాంటి, కోపం
వచ్చింది కృష్ణుడికి. ఒక రాయి తీసుకొని ఎదురుగా ఉన్న కుండని బద్దలుకొట్టేడు.
పగిలిన ఆ కుండలోంచి పెరుగు అంతా కిందికి కారి పోయింది. దాంట్లోంచి వెన్నని తింటూ
పైగా ఒక దొంగ ఏడుపు నటించసాగేడు.
ఆ పెరట్లో ఉన్న చెట్లన్ని, తమ తమ
ఆకులన్నింటినీ కళ్ళు చేసుకొని, లీలానాటకసూత్రధారిఅయిన జగన్నాధుని ఆ కపటనాటకాన్ని చూచి
తన్మయంతో కదలకుండా, చూస్తున్నాయి. పూలమొక్కలన్ని కూడా,
సూర్యకాంతి మొక్కల్లాగా, కృష్ణుడు ఎటువైపు తిరిగితే, ఆ
దేవదేవునివైపు తిరుగుతూ చూస్తున్నాయి.
యశోద పాలకుండని దించి జాగ్రత్త చేసి వచ్చి, కొడుకు కోసం చూసేసరికి కనబడ్డదృశ్యం అది. ఆ కన్నయ్య, తిరగేసి ఉన్న ఒక రోలు మీద నిలబడి,వెన్నని ఒక కోతికి పెడుతున్నాడు. కృష్ణుని అలా చూసిన యశోదా దేవి బెత్తం చేతబట్టుకొని “ఏరా!నువ్వు ఇంత వరకూ ఎవరిచేతికీ చిక్కలేదట! ఎవరూ నిన్ను శిక్షించలేదట! ఎవరూ నిన్ను అడ్డుకోలేదటగా! అందుకే బొత్తిగా అదురు,బెదురూ లేకుండా పోయినాయిరా! ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. “ అంటూ “ఆగు అక్కడ. “ అంటూ కన్నయ్యని పట్టుకోబోయింది.
కృష్ణుడు భయపడినట్టు ముఖం పెట్టి రోలు
మీంచి గభాలున దూకి కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా పరుగుతీసాడు. ఆ చిన్ని
కన్నయ్యను పట్టుకోవడానికని యశోద కూడా వెనువెంటనే పరుగుతీసింది. మహా మహా
యోగీంద్రులుకూడా మనస్సులలో పట్టుకోలేని ఆ లీలా గోపాలుణ్ణి పట్టాలనే తపనతో వెంటబడి
తరమ గలిగిన ఆ యశోద అదృష్టాన్ని ఆ మద్దిచెట్లు ఆశ్చర్యంతో గమనించసాగేయి.
కృష్ణుడు వాకిట్లో స్తంభాలను చాటు
చేసుకుంటూ అటూ ఇటూ పరుగుతీస్తూ దొరక్కుండా ఉన్నాడు. మధ్య మధ్యలో “అమ్మా!కొట్టకే. ఇంకెప్పుడూ ఇలా చేయనే! ఈ
ఒక్కసారికీ మన్నించవే!” అంటూ దొంగ కన్నీటితో వెక్కిళ్ళు పెడుతున్నాడు. తనని
పట్టుకోవడానికి తల్లి పడుతున్న అవస్థని గమనించేడు. ఆమె ముంగురులు చెదిరిపోయేయి. జడముడి
విడిపోయింది. పెట్టుకున్న పూలదండ జారిపోయింది. చెమటలు ముఖంనిండా పట్టేయి.
కృష్ణుడికి చాలజాలివేసింది. భగవానుడు తనంతతానుగా భక్తులకు లొంగాలనుకుంటే
లొంగిపోతాడు కదా! అమ్మకి మరి కష్టం కలిగించకూడదనుకున్నాడో ఏమో,
దొరికిపోయేడు ఆ యశోదమ్మకి. “అమ్మయ్య!దొరికేడు ఈ చిన్నివెన్నదొంగ” అంటూ
బాలకృష్ణుణ్ణి పట్టుకున్నది.పట్టుకొన్నదేగాని కొట్టడానికి తల్లి కదా చేతులు
రాలేదు. అటూ ఇటూ చూసింది. ఆ రోటికి కట్టేస్తేపోతుంది ఇంక ఎక్కడికీ పోలేడు. అని
తలచింది. ఒక చేత్తో కృష్ణుణ్ణి పట్టుకుని,
ఇంకోచేత్తోఅక్కడే పడివున్న తాళ్ళని తీసుకుంది. ఒక తాడు తీసి, రోటి
చుట్టూ చుట్టి, కృష్ణుడి నడుం చుట్టూ చుట్టింది. అది ఒక రెండుఅంగుళాలు
తక్కువ అయింది. కృష్ణుడి చుట్టూచెయ్యి వేసి,
పారిపోకుండా పట్టుకుని, ఒక తాడుకి మరో తాడు కలిపి ముడివేసి కట్టడానికి
ప్రయత్నించింది. మళ్ళీ రెండుఅంగుళాలు తక్కువఅయింది. ఇలా తాడుకి తాడు ముడి వేస్తునే
ఉంది. ఆ బొజ్జ చుట్టూ కట్టడానికి సరిపోవడంలేదు.
ఈ ప్రయత్నం చూసి ఆ చెట్లు “ఆ బొజ్జలో ముజ్జగములూ కొలువైఉన్నాయి. అటువంటి బొజ్జని కట్టడానికితరమా!” అని అనుకున్నాయి. వాటి మనసులలో ఏ మూలో వాటికి శాపవిమోచనం కలుగనున్నాదని అనిపించింది. అయ్యో! ఇప్పుడు శాపవిమోచనం అవకుండాఉంటే, లీలాకృష్ణుని లీలలు చూస్తూ ఈ జన్మ ధన్యం చేసుకోవచ్చు కదా! ఆ నారద మునీంద్రుడు నిజానికి మాకు శాపం ఇచ్చి నట్లు లేదు వరం ప్రసాదించినట్లు ఉంది. ఇంత చక్కనిలీలలుచూసే అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత తపస్సు చేసినా దొరకదు కదా! అనుకున్నాయి. ఆ దేవదేవుడు ఇటు వచ్చి శాప విముక్తి చెయ్యకుండావుంటే బాగుండనని మొదటిసారిగా మద్దిచెట్లు తమ మనస్సులో అనుకున్నాయి.
కృష్ణుడు తల్లి పడుతున్న అవస్థని
గమనించేడు. ఇంక చాలు అనుకున్నాడో ఏమో.. తాడు ఈసారికి సరిపోయింది. అమ్మయ్య అనుకుంది
ఆతల్లి. “ఇక అల్లరి చేయకుండా ఉండండి” అని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుడు
అటూ ఇటూ చూసేడు. కొంతమంది గోపబాలురు కృష్ణుడి అవస్థ చూసి నవ్వ సాగేరు. కొంత మంది
కృష్ణుడు ఇప్పుడేం చేస్తాడో అని చూడసాగేరు.
ఆ మద్దిచెట్లకి అర్థం అయిపోయింది.
నూరుసంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది అని. కృష్ణుడు ఆరోలుని
మెల్లగా యీడ్చుకుంటూ ఆ మద్దిచెట్ల మధ్యనుండి తీసుకువెళ్ళాడు. ఆ రోలు తిరగబడింది.
రోటిని మద్దిచెట్లమొదలు అడ్డింది. కన్నయ్య ఒక్కసారి బలంగా రోలుని లాగేడు.
అంతే!. ఫెళఫెళ మంటూ ఆ మద్దిచెట్లు
రెండూ కూలిపోయేయి. నలకూబర మణిగ్రీవులనే కుబేరపుత్రులు తమ నిజ రూపాలతో కృష్ణుని
ముందు సాగిలపడి వేవేలుగా స్తుతించేరు. అంతలోనే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. “దేవ
దేవా! నీ పాద స్పర్శతో మా శాపవిమోచనం కావాలని ఎంతో తపించేం. కాని ఇప్పుడు నీ లీలలు
చూసే అదృష్టాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా వుంది. జగదీశా! సదా నీ సన్నిధిలో
కాలం గడిపే వరం ప్రసాదించు తండ్రీ!” అని ప్రార్ధించేరు.
“మరికొన్ని సంవత్సరాల తరువాత, శివుడ్ని
ప్రార్ధించేందుకై నేను కైలాసం వస్తాను. అప్పుడు మీకు మరల నా దర్శనం లభిస్తుంది”
అని కృష్ణుడు వారిని “ఇక మీరు మీ లోకాలకు పోవచ్చును”అని అనుమతినిచ్చేడు.
కృష్ణార్పణం.
***************************అయిపోయింది*********************************
ఈ కధ భాగవతం స్ఫూర్తితో రాసింది. పోతనగారి భాగవతం నుండీ పొందిన రసానుభూతి తో రాసింది. చిన్నికృష్ణయ్య లీలలను మద్దిచెట్ల తరుఫునుంచి ఊహ చేసేను. అదొక్కటే నా స్వకపోల కల్పితం.
గొప్పగా అనుభవించి వ్రాసారు. ఇకపై మరిన్ని ప్రసాదించండి! పోతన గారి ప్రేరణ ఊరికే పోదులేండీ!
ReplyDeleteచాలా చక్కగా వుంది మద్దిచెట్ల స్వగతం శాపవిమోచనం కోసం తహ తహ ఒకవైపు శ్రీ కృష్ణునిలీలకు దూరమవుతామనే తపన ఇంకొకవైపు. అనుభవింఛి వ్రాసి నట్లుంది
ReplyDeleteచదువుతున్నంతసేపు గోకులంలో నేను విహరించిన అనుభూతి కలిగించిన నీకు కృతజ్ఞతలు
ReplyDeleteఅయ్యో, అప్పుడే అయిపోయిందా...
ReplyDeleteరమేష్ చౌదరి.
శాపవిమోచనమే మరి కధకి ముగింపు కద
Deleteఒక్క సారిగా నంద వ్రజం లోఉన్నామా అనిపించింది. కధ ఇంకా కొనసాగుతూనే ఉంటే బాగుండేది కదా అనికూడా అనిపించింది. రాసిన విధం అంత బాగుంది. కృష్ణ లీలలు చాలా చాలా బాగా వర్ణించారు.
ReplyDeleteNijanga nandavrajam lo vunnattu ga anipinchindi! Appude aipoinda, chinni krishnuni leelalu inkonni chuste bavunnu anipinchindi! Chaala baga vraseru! Aa maddi chetlalo nenoo okatai nattuga vundi! Inka krishna leelalu mee raatala dwara choodalani vundi! Aa gokulamlo oka aakuno, puvvuno ,Oka lega doodano ayye avakasam ivvandi!!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteJatheendra!
ReplyDeleteNalakubara,Manigreevula saapavimochanam kadha kottha konamlo aviskarinchi natluga ayindi.chalaa maarlu chadivinde ayina chivari varaku kattipadesindi.varnana kadhanam bagundi.keepit up.
ఇది కూడా ఆ రోజుల్లో నే రాసిందా..లేక ఇప్పుడు రాశిందా? అప్పుడు రాసిందే అయితే ఇంత పరిణితి మీకెలా వచ్చింది? ఈ మధ్య కాలం లో కదా మీరు ఈ పురాణాలన్నీ పుక్కిట పడుతున్నారు..చాలా గొప్ప విషయం
ReplyDelete.అప్పటించి అలానే రాసి ఉంటే మీరు ఇంకా ఇంకా ఎంత ప్రాజ్ఞులయి ఉండేవారు కదా...పాఠకుల మాట కేమీ కానీ..మీకు మీరు అన్యాయం చేసుకున్నారు..better late than never 👏👌
Jatheendra!
ReplyDeleteNalakubara,Manigreevula saapavimochanam kadha kottha konamlo aviskarinchi natluga ayindi.chalaa maarlu chadivinde ayina chivari varaku kattipadesindi.varnana kadhanam bagundi.keepit up.
చొలా బాగుంది.చదువుతూ ఉన్నప్పుడు గోకులంలో ఉన్న feeling వచ్చింది.
ReplyDeleteChaala bagundi. Inkosaari mai marachi bala krishnuni penchi nattuga anipinchindi. Inkonni aani muthyalivvandi.
ReplyDeleteచాలా చక్కగా వర్ణించారు మామయ్య గారు. ఆ వనం లో, ఏదో రూపం లో, నేను కూడా ఇవన్నీ చూసినట్టు అనిపించింది... కళ్ల కు కట్టినట్టు వ్రాసారు.
ReplyDeleteకథ పాతదైన కథనం చాలా బాగుంది. కొత్తదనంతొ కథ చాలా హృద్యంగా మలచిన తీరు నచ్చింది
ReplyDeleteచదువుతున్నoసేపు ఒక్కసారిగా ఈ కలియుగంలో నుండి ఆ ద్వాపర యుగ కాలంలో కి ప్రవేశించిన అనుభూతి కలిగించేరు. శ్రీకృష్ణ లీలల్ని కళ్లారా చూసిన ఆనందం, మరీ ముఖ్యంగా మద్దిచెట్ల రూపంలో ఉన్న రాక్షసుల దృక్పథం నుండి ఆలోచించడం వినూత్నమైన ఆలోచన. భాగవతాన్ని మధనం చేసిన అనుభవం రచయిత ఈ కథలోని పరిణీతి కి కారణం అనుకోవచ్చా..ఏది ఏమైనా మంచి అనుభూతి కలిగించారు. ధన్యవాదాలు
ReplyDeleteHi Jatindra. You have so wonderfully narrated this Pastime (LILA). Thku v m for taking me to Gokulam. Proud of u my friend.👌👌👌🙏🙏
ReplyDeleteNgk Murthy.
Super daddy!
ReplyDeleteChala baagundi Uncle... Krishnaarpanam🙏
ReplyDeleteఅద్భుతమైన ఘటనను రసవత్తరమైన వ్యాఖ్యానంతో కళ్ళకు కట్టినట్లు వివరించారు. మ్రృష్ఠాన్నభోజనం రుచి చూపించారు.
ReplyDeleteమరిన్ని వివరణలు మీ కలం నుంచి జాలువ్రాలాలని ఆశిస్తూ....
Srikakulam Gudiveedhi, Raju tammudu Prasad, చాలా బాగుంది
ReplyDeleteవారణాసి సుబ్రహ్మణ్య శివ ప్రసాద్, రాజు, మూర్తి తమ్ముడు ప్రసాద్, మోహన్ ఆన్నయ, చాలా బాగుంది
ReplyDeleteప్రసాదూ... నీ గురించి ఇంత పరిచయం అఖ్ఖర్లేదు. నీ పేరే చాలు. కథ నీకు నచ్చినందుకు ఆనందం. కృష్ణార్పణం.
ReplyDelete