Friday, 17 July 2020

అందమైన అతిధులు.

శ్రీకాకుళం లో ప్రభుత్వ కళాశాల పక్కన  ఒక జీడిమామిడి తోట ఉండేది. ఒక మట్టిరోడ్డు,  కాలేజీకి ఆ తోటకీ మధ్యనించి హాస్పిటల్ కి పోయేది. కాలేజి విద్యార్ధులు ఆ తోటలోని చెట్లమీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఓ చిన్న కాంటీన్ అని పిలువబడే హోటల్ ఉండేది.
ఇప్పుడు ఆ తోట లేదు. ఆ స్ధానే ఇళ్ళు లేచేయి. కొన్ని ఎపార్ట్ మెంట్లు, కొన్ని ఇళ్ళు. శాంతినగర్ అని ఓ కాలనీ.  అందులో ఓ  నాలుగు అంతస్దుల  ఎపార్ట్ మెంట్ లో అంతస్ధుకి ఆరు చొప్పున రెండు పడకగదుల ఇళ్ళ "ఆనందనిలయం" ఉంది. 

రావు ఉద్యోగరీత్యా తరచూ బదిలీలతో ఎక్కడా ఒక  ఇల్లంటూ కొనుక్కోలేదు అప్పటిదాకా. ఉద్యోగం లో ఉండగానే పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ చేయడంతో ఆట్టే పొదుపు కూడా చేయలేకపోయాడు. రిటైరయ్యాక వచ్చే డబ్బుతో , తను పుట్టిపెరిగిన ఊరు, శ్రీకాకుళంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని విశ్రాంత జీవనం గడపాలని రావు కోరిక. రిటైర్మెంట్ సంధర్భంగా పిల్లలు  ఇద్దరూ వచ్చేరు. వాళ్ళకి తన కోరిక తెలియజేసేడు రావు. 


అప్పుడే పెద్దవాడు  ఈ ప్రణాళిక చేసేడు. వాళ్లిద్దరే శ్రీకాకుళం వచ్చి ఈ ఫ్లాట్ కొనడానికి నిశ్చయించి అడ్వాన్స్ కూడా  ఇచ్చి వచ్చేరు.

ఆ  ఆనందనిలయంలో రెండో అంతస్ధులో రెండు, రెండు పడకగదుల ఇళ్ళు తీసుకొని ఒక్కటిగా ఆధునీకరించి రావు వసంత ఉండడానికి వారి కొడుకులు బహుమతిగా ఇచ్చేరు. "ఆతిధేయమ్" అని పేరు పెట్టుకున్నాడు రావు,  తమ ఇంటికి. 

 ఫ్లాట్ అప్పజెప్పేందుకు ఓ ఏడాది సమయం పడుతుందిగా అంతవరకూ ఆరునెలలు అమెరికాలోను, ఆరునెలలు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆ దేశాలు కూడా చూసినట్టు ఉంటుందని నిర్ణయించేరు. 

రావు కొడుకులు ఆ ఇంటికి అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ఏ లోటూ లేకుండా చూసేరు. మొత్తం ఫర్నిచర్ అంతా సమకూర్చేరు. వాళ్ళ పాత సామానులూ ఏవి కొత్త ఇంటిలోకి రానివ్వలేదు, ఒక్క దేవుని సామానులు తప్ప.  తమ తల్లిదండ్రులు ఊరికి వెళ్ళాల్సి వస్తే  ఎవరూ లోపలకు జొరబడకుండా కిటికీలు, వరండాలూ అన్ని చిన్న కన్నాలున్న జాలీ తో, గాలీ వెలుతురూ వచ్చే వీలుంచుతూ, మూయించేరు. ఇంటిలో ఉన్న నాలుగు గదులకు విద్యుత్ సరఫరా ఆగిపోయినా కూడా ఇబ్బంది రాకుండా ఇన్వెర్టర్ సౌకర్యం ఉంది. ఇంకా ఊరు పెరుగుతూనే ఉంది కనక కారు కొని, పార్కింగ్ లో ఉంచేరు. ముఖద్వారం ముందు ఓ కటకటాల తలుపు ఉంది, ఎవరైనా వస్తే, ముందుగా తెలిసిన వాళ్ళో కాదో చూసుకొని తలుపు తీయాలనే ఆదేశంతో పాటు. అన్నీ ముందుగానే ఏర్పాటు చేసి, ఎక్కడ ఉండవలిసిన వస్తువులు అక్కడ సర్దించేసి, గృహప్రవేశం అయ్యేక, వాళ్ళు తమ తల్లిదండ్రులకు కొడుకులుగా తమ భాధ్యతని సక్రమంగా చేసేం అనే సంతృప్తితో వెళ్ళేరు, పెద్దకొడుకూ కుటుంబం అమెరికా, రెండో కొడుకూ కుటుంబం ఆస్ట్రేలియాకి. 

అదిగో అలా ఆ దేశాలలో ఏడాది గడిపి తిరిగి రాగానే, ఈ ఇంటిలో గృహప్రవేశం చేసి దిగేరు. వాళ్ళకి చాలా అలసటగా అనిపించింది. రైలొచ్చి వెళ్ళిన ప్లాట్ ఫారంలా తోచింది ఇల్లు వాళ్ళిద్దరికీ. కొత్త  ఇంటిలో ఆ  ఇద్దరే గడిపిన  ఆ మొదటి రేయి అలసటతో ఒళ్ళెరగని నిద్ర పోయారు. 

  *******

మరునాడు ఉదయాన్నే కాలింగ్ బెల్ శబ్దం వినబడి లేచేడు రావ్. బయట వాచ్ మేన్ మరో ఇద్దరు వ్యక్తులతో నిలబడి ఉండటం చూసి తలుపు తీసేడు. 

"అయ్యా! ఈడు పాలోస్తాడండి. ఈడు పేపరేస్తాడండి. మీకు కావాలా సార్?" అడిగేడు వాచ్ మేన్.వాళ్లిద్దరితో మాట్లాడి పంపి, లోపలికి వెళ్ళి తయారయి కిందకి వెళ్ళాడు. ఆ భవనం లో ఉన్న మిగిలిన వాళ్ళెవరు కనబడలేదు. వాచ్ మేన్ని ఎవరెవరు ఉంటున్నారో కనుక్కున్నాడు. అందరూ ఉద్యోగస్తులే. చాలామంది భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళే. తన ఉద్యోగ జీవితం, ఆ పరుగులూ ఉరుకులూ గుర్తువొచ్చేయి. 'ఇప్పుడు నాకీ బాధ లేదు' అనుకున్నాడు. 

ఆ ఫ్లాట్ లో ఉన్న ఒక బాల్కనీ లోెంచి దూరంగా పారుతున్న నాగావళి నది కనబడుతోంది. నదిలో నీరు ఎక్కువగా ఉన్నట్టు లేదు. నాగావళి లో నీరు మంచివాడి కోపంలా ఎక్కువ రోజులుండదు. రావ్ కి తన చిన్నతనం లో ఆ ఏటి ఒడ్డున ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. మనసంతా ఆనందంగా అయిపోయింది. వసంత వంటయింటిలో ఉంది. ఆక్కడికి వెళ్ళేడు. 

"ఇదిగో!  అయిపోయింది. అయిదునిమిషాలలో పెట్టేస్తాను టిఫిన్"  అంది. 

"ఏం చేసేవ్?"  అడిగేడు రావు. 

"నాలుగురోజులై ఏమిటేమిటో తిన్నాం. ఇవేళ ఉప్మా చేసేను. ఓ రెండురోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది". అంది. 

"సరే! నేను ఒక్కసారి అలా ఊర్లోకి వెళ్ళొస్తాను."  అన్నాడు రావు. 

"వస్తున్నప్పుడు కూరలేవైనా తీసుకురండి " అంది వసంత అలవాటుగా.  

*******

రావు తండ్రిది పెద్దకుటుంబం.  అయిదుగురు అన్నదమ్ములూ ఆరుగురు అక్కచెల్లెళ్ళు. అందరూ  ఒకే చూరు కింద పెరిగినా,  పెరిగిన వయసులతోనూ, కుటుంబాలతోనూ, శ్రీకాకుళం లో  ఒక చెల్లి తప్పితే మిగిలిన వాళ్ళు దేశంలో అనేక చోట్ల స్థిరబడ్డారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎలా ఛిన్నమయి పోయేయో చెప్పడానికి రావు తండ్రి కుటుంబం ఒక ఉదాహరణ. రావ్ తండ్రి నాలుగోవాడు, రావ్ తరువాత ఒక తమ్ముడూ, ఒక చెల్లీ ఉన్నారు. 

అందరు కలిసి శ్రీకాకుళం లోనే పెరిగి పెద్దయ్యారు. ముందుగా పెద్దన్నయ్యకి ఒరిస్సాలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. ఆతను భువనేశ్వర్ లోనే స్థిరబడ్డాడు. అక్కచెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి తన పెళ్ళి కాకముందే తన తండ్రి ఈ లోకాన్ని వదిలేడు. తనకి బేంకులో ఉద్యోగం వచ్చేక కలకత్తా వెళ్ళిపోయాడు. తన పెద్దబావగారు వసంత వాళ్ల సంబంధం తెచ్చారు. పెళ్ళి చూపులలో వసంత తెగ నచ్చింది రావ్ కి. అప్పటికే తన తమ్ముడికి ఉద్యోగం వచ్చి చెన్నైలో చేరేడు. పిల్లల పెళ్ళిళ్ళకి ఉన్న ఒక్క ఇల్లూ అమ్మవలసి రావడంతో కాలక్రమేణా  శ్రీకాకుళం తో సంబంధం పలచబడుతూ వచ్చినా, రావ్ కి  శ్రీకాకుళం అంటే వల్లమాలిన ఇష్ఠం. నార్త్ లో ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో పనిచేసినా, ఎప్పుడు వీలయితే అప్పుడు  శ్రీకాకుళం వస్తూ ఉండేవాడు. ముగ్గురు నలుగురు స్నేహితులు ఇక్కడే స్థిరబడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే రావ్ చెల్లి కుటుంబం కూడా ఇక్కడే స్థిరబడ్డారు. 

ఇప్పుడు రావు బయలుదేరింది ఆతని చెల్లి దగ్గరకే. 

కొడుకులు వద్దన్నా వినకుండా, తన స్కూటర్ ని ఉంచుకున్నాడు. ఆస్ట్రేలియానుంచే తన స్నేహితుడూ కొలీగ్ కి ఫోన్ చేసి, తన స్కూటర్ ని శ్రీకాకుళం పంపించే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్కూటర్ మీద బయల్దేరాడు. కాలేజి ప్రాంతం  అంతా దాదాపుగా నిర్మానుష్యంగా ఉండేది రావు చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా వైద్యసదుపాయా్లకి కేంద్రం లాగా అయిపోయి, చాలా రద్దీగా తయారయింది. 

అలా ఇల్లీసుపురం లోంచి, ఊరిని గమనిస్తూ, బలగ వైపు పోనిచ్చేడు స్కూటర్ని. ఇల్లీసుపురం దాటాక అక్కడ ఫిషరీస్ ఆఫీస్ పక్కనుండి లోపలకి వెళితే ఒక కొత్త కాలనీ తయారయింది. అందులో ఒక ఇల్లు కట్టుకొని ఉంటూంది రావు చెల్లి కుటుంబం. 

ఆప్యాయంగా పలకరించి లోపలకు తీసుకువెళ్ళారు అతనిని. ఓ గంటసేపు కబుర్లు చెప్పకుని బయల్దేరేడు వెనక్కి. అలా బయల్దేరి, రైతుబజారులో కూరలు కొని, రెండుమూడు సార్లు జరగబోయే ప్రమాదాలని తప్పించుకుంటూ డే అండ్ నైట్ జంక్షన్ లోంచి ఇల్లు చేరేడు. స్టేడియం దాదాపుగా మూలపడ్డది. 

భోజనం చేసి అలా ఓ కునుకు తీసి, లేచేసరికి సాయంత్రం అయింది. వసంతని బయల్దేరదీసి, అలా కాలేజి లోకి వెళ్ళారు. 'ఇక్కడ మా ఇంగ్లీష క్లాస్ అయ్యేది. ఇక్కడ మా కామర్స్ క్లాస్ అయ్యేది' అంటూ కాలేజీ అంతా కలయ తిప్పేడు. వసంతకి భర్త తన కాలేజీ జ్ఞాపకాలలో అంతలా తేలిపోవడం సరదాగా అనిపించింది. కాలేజి చాలా మారిపోయింది.  ఇప్పుడు అందరూ ఇంజనీరింగో లేదా మెడిసినో చదవడానికి శ్రద్ద చూపుతున్నారు కానీ, ఆర్ట్స్, కామర్స్, డిగ్రీ చదువులు చదవక, విద్యార్ధులు రాక, కొంచెం కొంచెంగా,  ఒక్కో భాగం లో ఇంకేవో ఆఫీసులు వచ్చేస్తున్నాయి. 

రావు మనసు అకస్మాత్తుగా ఉదాసీనంగా బరువుగా అయిపోయింది. 

ఆనాటినుండీ రావు దినచర్య దాదాపుగా అలాగే అయింది. ఉదయాన్నే ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి , తన చెల్లెలి ఇంటికో, లేదా తన చిన్ననాటి స్నేహితులను కలసి రావడమో, భోజనం అయ్యేక కాసేపు నిద్రించి, సాయంత్రం భార్యతో అలా షికారు చేసి, కాసేపు టీవీ చూసి పడుకోవడం. 

సుఖంగా రోజులు గడిచిపోతున్నాయి రావుకీ వసంతకీ. 

అలా సుఖంగా గడిచిపోతే ఎలా... వాళ్ళ జీవితంలోకే కాదు , ప్రపంచంలో అందరి జీవితాల్లోకి ఓ అనవసరపు అతిధి వచ్చింది. 

*********

మార్చి ఇరవైరెండో తేదీన జనతా కర్ఫ్యూ పాటించమని, సాయంత్రం దీపాలు వెలిగించమని ప్రధాని పిలుపుకి రావు, వసంతా కూడా ఉత్సాహంగా బయటికి వెళ్ళకుండా, రాత్రి దీపాలు వెలిగించి గడిపేరు. అంతలోనే లాక్ డౌన్  అన్నారు. మొత్తం దేశంతో పాటుగా శ్రీకాకుళం కూడా స్థంభించి పోయింది. 

పిల్లలు రోజూ వీడియో లో వాళ్ళ పరిస్థితిని కనుక్కోవడం మొదలు పెట్టేరు. వాళ్ళ అమ్మకి ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చేరు "ఎటువంటి పరిస్థితిలోనూ నాన్నని బయటకు వెళ్ళనీయకు. మీకేమైనా కావలిస్తే ఫోన్ చేసి ఇంటికి తెప్పించుకోండి. వచ్చిన కూరలనీ, వస్తువులనీ శుభ్రంగా కడిగి వాడండి. బయటికి కిందకి వెళ్ళినా సరే, మాస్క్ పెట్టుకొని వెళ్ళండి." ఇలా. 

నెల గడిచింది. రెండునెలలు గడిచేయి. రావ్ కి చెల్లిని చూసి రావాలనిపించి, ఫోన్ చేసేడు.  "ఇప్పుడు రావడం అదంత అవసరమా అన్నయ్యా? మా అత్తగారు కూడా ఉన్నారు కదా. ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది కదా.." అంది. 

ఆమె మాటల్లో రావ్ అప్పుడు రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టం అయింది. అతనికి చాలా నిరాశగా అనిపించింది. 

మరునాడు తన స్నేహితుడికి ఫోన్ చేసి మాటాడుతూ కలుద్దామని ఆన్నాడు. 

" నీకెమైనా మతి పోయిందా? ఎలా ఉందో పరిస్థితి చూస్తున్నావు కద. ఇలా ఉండటమే మనందరికీ క్షేమం." అని చీవాట్లు పెట్టేడు. 

రావ్ కి కాలక్షేపం కన్నా, తన వాళ్ళని కలిసి మాట్లాడడమే ఇష్టం.  అలా కలవడానికీ అవకపోవడంతో అతనికి, తమ ఇంటికి ఎవరై నా వస్తే బాగుండును అనుకునేవాడు. 

"అబద్దాలు ఆడేవాడికి సత్యం అని పేరు పెట్టినట్టుంది మన ఇంటి పేరు. ఆతిధేయమ్ అంటే అతిధులు రా దగ్గ ప్రదేశం అని. ఎవరొస్తారు మన ఇంటికి" అన్నాడు దిగులుగా వసంతతో. 

వసంత ఆతన్ని ఓదార్చే యత్నం చేసింది. రావ్ మూడ్ మారలేదు. 

"పోనీ ఓ కుక్కని పెంచుకుందామన్నా, ఈ బిల్డింగ్ సొసైటీ నిబంధనలు ఒప్పుకోవట." ఇంకా అదే మూడ్ లో అన్నాడు రావ్. 


*********
మర్నాడు ఉదయం మాస్క్ వేసుకుని వరండాలో కూర్చుని, పేపరు చదువుతున్న రావ్, కనుచూపుల చివర్నించి, ఒక చిన్న పిచ్చుక, వరండాలోకి వచ్చి అటూ ఇటూ తిరగడం చూసేడు. కాస్సేపు దానిని పరిశీలించేడు. అది అక్కడ కింద పడి ఉన్న గింజలను తింటూ, ఒక్కసారి, బయటకి ఎగిరి, మళ్ళి వచ్చి గింజలను తినసాగింది. 

రావ్ కి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఈసారి ఆ పిట్ట బయటకు వెళ్ళినప్పుడు, లోపల్నించి మరి కొన్ని గింజలు తెచ్చి అక్కడ వేసేడు. 

ఆ పిచ్చుక కాసేపు, ఆ కటకటాల మీద నిలబడి, లోపలికి రావొచ్చో లేదో అన్నట్టు చూసింది. "రా.. రాా.." అని మనసులోనే ఆహ్వానించేడు రావు. 

అది లోపలికి వచ్చి గింజలు తీసుకొని మళ్ళీ ఎగిరి పోయింది. మళ్ళీ వస్తుందో రాదో అనుకుంటు రావ్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. 

ఈసారి ఆ పిచ్చుక మరో పిచ్చుకని తోడు తెచ్చింది. ఆ రెండు ఆ గింజలని ముక్కున కరచుకొని ఎగిరిపోయాయి. 

వసంత లోపలనించి టిఫిన్ చేయడానికి పిలిచే వరకూ ఆ రెండు పిట్టలూ రాకపోక గమనిస్తూ కూర్చున్నాడు రావ్. టిఫిన్ చేసి వచ్చేక మళ్ళీ ఆ పిచ్చుకలు రాలేదు. 

"రేపు వస్తాయో రావో?" అనుకున్నాడు. "వస్తే బాగుండును" అనుకున్నాడు ఆశగా. 
ఆ రోజు రాత్రి పడుకునేముందు, కొన్ని బియ్యం గింజలు వరండా లో వేయడం గమనించింది వసంత. "ఎందుకూ అక్కడ బియ్యం జల్లేరు?" అడిగింది. 

"ఓ ఇద్దరు అందమైన అతిధులకోసం" అన్నాడు రావు. 

ఎవరో అన్నట్టు కళ్ళెగరేసింది వసంత ఆతని గొంతులో ఉత్సాహాన్ని గమనించి. 

"రేపు నువ్వే చూస్తావుగా" అన్నాడు రావు పడుకుంటూ. 

మరునాడు ఉదయం పూజాదికాలు ముగించుకొని, వరండాలో కూర్చున్నాడు రావ్ పేపర్ పట్టుకొని. కానీ ఆతని కళ్ళు పేపర్ మీద లేవు. ఆ పిచ్చుకలు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నాడు. వసంత రెండుసార్లు బయటికి వచ్చి చూసి మళ్ళీ లోపల తన పని చేసుకోసాగింది. 

ఇంతలో ఆ పిచ్చుక వచ్చింది. కొంచెం గింజలు ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చినట్టు ఆ కటకటాల మీదే వాలి కొంచెం సేపు కిచకిచలాడింది. మెల్లగా కిందకి వాలి గింజలని తిని బయటకి ఎగిరింది. ఈసారి నిన్నటిలాగే మరో పిచ్చుకని తనతో తెచ్చింది. 

వాటిని  గమనించి, రావు, తన ఇంటి పేరు ధన్యమైందని. ఆనందంతో వసంతని పిలిచి తన అందమైన అతిధులను చూపించేడు, చిన్నపిల్లాడిలా సంతోషంతో. 

********అయిపోయింది.**********












Sunday, 12 July 2020

హనీమూన్

హనీమూన్ 

ఓ మిత్రుడిని కలిసి రావ్ ఇంటికి వచ్చేసరికి భార్య వసంత బాత్రూమ్ లో వుంది. తలుపు తాళం చెవులు  తన దగ్గర ఒకటి భార్య దగ్గర ఒకటి ఉంటాయి తాళం కోసం ఇబ్బంది లేకుండా. చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తాళం తీసి తలుపు మళ్ళీ వేసేసి తమ గది లోకి వెళ్లి చప్పుడు కాకుండా దుస్తులు మార్చుకుని లుంగీ కట్టుకున్నాడు.  వంటింట్లోకి వెళ్లి చూసాడు. అన్నీ  చక్కని రీతిలో పద్దతి గా పెట్టివున్నాయి. వంట కూడా అయిపోయినట్టుంది. ప్లేటులో మూతపెట్టి టిఫిన్, థెర్మోస్ లో కాఫీ తయారుగా వున్నాయి. 

స్నానాలగదిలోంచి మెల్లగా కూనిరాగంతో 'రాకోయి అనుకోని అతిధి ' అన్న పాట  వినిపిస్తోంది.  తన అడుగుల చప్పుడు వసంతకి వినబడకుండా స్నానాలగది దగ్గరగా నిలబడ్డాడు. మామూ లుగా వున్నప్పుడు పాడమంటే  పాడదు వసంత. లోపలినించి నీళ్లచప్పుడు, బకెట్లో మునుగుతున్న మగ్  చప్పుడు, నీళ్లు వంటిమీదనించి జారుతున్న చప్పుడు వినబడుతున్నాయి. పాట  మధ్యలో తాళాల్లా.  పాట  ఆగింది. తువ్వాలు లాగిన చప్పుడు వినబడింది. తుండుగుడ్డ తో వళ్ళు తుడుచుకోవడం వూహించుకున్న రావ్ కి వంట్లో వేడి పుట్టింది. రక్తం వేగంగా పరుగు తీసింది. చెవుల్లోంచి వెచ్చటి ఆవిరి వచ్చింది.

వసంత తలుపుతీసుకొని బయటికి రాగానే వెనకనించి చటుక్కున వాటేసుకున్నాడు. భయంతో కెవ్వున కేకేసింది. భర్తేనని తెలిసేక ముద్దుగా కోప్పడింది. "ఏమిటీ పోకిరి వేషాలు" అంటూ.  రావ్ పెదవులతో సమాధానం చెప్పేడు. జుట్టుపట్టి వెనక్కి లాగుతూ మందలిస్తున్నట్లు అంది. "మరీ రోజు రోజుకీ  చిన్న పిల్లాడు అవుతున్నారు. ఎంత భయపడ్డానో తెలుసా".  పడకగదిలోకి రాబోతున్న రావ్ ని బయటికి నెట్టి తలుపువేస్తూ అంది వసంత. "చీర కట్టుకొని వస్తాను. అందాక బుద్ధిగా  వుండండి."

నిరుత్సాహంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్లి కాఫీని రెండు గ్లాసుల్లో  పోసి, టిఫిన్ రెండు ప్లేట్లలో పెట్టి, ముందు గదిలో టీపాయి  మీద పెట్టాడు. ఫ్రిజ్ లోంచి నీళ్లు తీసి గ్లాసుల్లో పోస్తుండగా వసంత నీలంచీర  కట్టుకుని వచ్చింది. ఆమె పసుపుపచ్చని శరీర రంగుమీద ఆ చీర అద్భుతంగా అనిపించింది రావ్ కి.

తాను వచ్చేసరికి అన్నీ అమర్చిన భర్తని మురిపెంగా చూస్తూ "థాంక్స్" అంది. పొడవాటి జుట్టును దువ్వుకోబోతూండగా దువ్వెన లాక్కుంటూ అన్నాడు రావ్. "కాఫీ వయసు రెండూ ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి. నువ్వు పెట్టిన కాఫీ చల్లారిపోతే బాగుండదు. వయసు సంగతి రాత్రి ఆలోచిద్దాం. "

"ఏమిటో గురూగారు  మంచి మూడ్లో ఉన్నారీవేళ." అంది వసంత చిత్రంగా కళ్ళెగరేస్తూ.

"మరే !మంచి తెలివైన ఆలోచన వచ్చింది. ఈ నెల ఇరవయ్యారు ఏమిటి?" అడిగాడు రావ్.
"శుక్రవారం" అంది వసంత.

"అదిసరే . జనవరి ఇరవయ్యారు కి ఒక ప్రత్యేకత వుంది".

"ఓ అదా. రిపబ్లిక్ డే " అంది వసంత

"ఎహే  అదికాదు. దేశానికి రిపబ్లిక్ డే కావొచ్చు. మరి మనకో?" కొంచం గొంతు పెంచుతూ అడిగేడు రావ్.

వసంతకు నవ్వు వచ్చింది. ఆ రోజు వాళ్ళ పెళ్లిరోజు. స్త్రీలకి మర్చిపోలేని రోజులు, పుట్టిన రోజులు, పెళ్లి రోజు. అవి వాళ్ళకి అంతలా ఎందుకు గుర్తుంటాయో  వాళ్ళకే తెలీదు. భర్తని మరి కాసేపు ఆడించాలని  కాఫీ చప్పరిస్తూ "మనకా? మనకేంటి?" అంది అమాయకంగా.

రావ్ 'పడ్డాడు'. అతనికి చర్రున కోపం  వచ్చింది.

"ఛీ ! నీదింత మట్టి బుర్ర అనుకోలేదు. " అన్నాడు చివాలున లేచిపోతూ. చరచర  వెళ్లి పడక గదిలో దూరేడు.  తాను ఎంతో  ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయాన్ని వసంత అంత తేలిగ్గా తీసుకోవడం అతనికి కోపం తెప్పించింది. ఇరవైఆరో తారీఖు  ఇంకా నాలుగు రోజులే వుంది. వసంత తో కలసి అరకు వెళదామని ఎన్నో ఆలోచనలు చేసేడతను. కొన్నేళ్ళబట్టి అనుకుంటున్నా ఎప్పుడూ యేవో అడ్డంకులు. చిరాగ్గా స్నానాలగదిలో దూరేడు. టపటప మని శబ్దం చేస్తూ నీళ్లు పోసుకొని పడక గదిలో ఏసీ  వేసుకొని మంచం మీద వాలేడు .

నవ్వుకుంటూ గ్లాసులు, ప్లేటులు తీసింది వసంత. "రాత్రికి కూరేంచెయ్యమన్నారు?" అడుగుతూ  వచ్చింది వసంత.

జవాబు చెప్పకుండా అటుతిరిగి పడుకున్నాడు. "పోనీ పదండి అలాగ తిరిగివద్దాం. వస్తూ నాగావళి లో టిఫిన్ తిని వచ్చేద్దాం." అంది అనునయంగా.

తిరిగి వద్దాం అన్నమాట విని వెంటనే లేచి తయారయి  "పద పద" అన్నాడు రావ్. నవ్వుకుంటూ బయల్దేరింది వసంత.

 వసంత తాళం వేసి వచ్చేలోపల స్కూటర్ తీసి స్టార్ట్ చేసి తయారుగా ఉన్నాడు  రావ్. వచ్చి వెనకాల కూర్చున్న  వసంతాన్ని అడిగేడు. "ఎక్కడకెళదాం?"

"కొత్త బ్రిడ్జి మీదకి పదండి. కాసేపు నాగావళి గాలి అనుభవించి వద్దాం" అంది వసంత.

నాగావళి నది మీద ఒక పాత బ్రిడ్జి ఉండేది. ఇరువైపులా ప్రజలు కూర్చుండి వీలుగా వెడల్పుగా సిమెంట్ తో గట్టు ఉండేది. ఇప్పుడు పాత బ్రిడ్జి స్థానే కొత్త బ్రిడ్జి వచ్చింది నాగావళిలో కొత్త నీరు వచ్చినట్టుగా.. ఆ గట్టు  ఇప్పడు లేదు. ఒక రైలింగ్ లాగా ఉంది ఇప్పుడు.

స్కూటర్ ఒక ప్రక్కగా అపి వచ్చే పోయే వాహనాలకు ఆటంకం లేకుండా చూసి, మెల్లగా ఆ బ్రిడ్జి మీద నడవ సాగేరు. చల్లటి గాలి ఆప్యాయంగా వాళ్ళని పలకరించింది. బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి . నది వడ్డున వున్న కోటేశ్వరస్వామి కోవెల లోంచి గంటలు వినపడుతున్నాయి. నదిలో నీరు తగ్గి, ఒక చిన్న పాయలా పారుతోంది. మధ్యలో జిబ్రాల్టర్ రాయి  మీద బుద్ధుడు హుస్సేన్సాగర్ లో బుద్దుడి విగ్రహానికి తమ్ముడులా నిలబడి శ్రీకాకుళం ప్రజల అడావుడిని గమనిస్తున్నట్టున్నాడు.

బ్రిడ్జికి ఇరువైపులనించి పట్టణంలో దీపాలు వెలుగుతూ కనపడుతున్నాయి.

"ఊరు పెద్దదయిపోతోంది. " అన్నాడు రావ్. శ్రీకాకుళం లో పుట్టి పెరిగిన రావ్ కి శ్రీకాకుళం అంటే ప్రాణం. ఉద్యోగరీత్యా ఎక్కడికెళ్లినా వీలైనంత త్వరగా శ్రీకాకుళం బదిలీ చేయించుకుని వచ్చేసేవాడు. వసంతకు  కూడా శ్రీకాకుళం అంటే చాలా ఇష్టం. రావ్ పుట్టిన ఊరని. రావ్ కి నచ్చే వూరని.

"ఇంతకీ మీరేమిటి చెప్పాలనుకున్నది?" అడిగింది వసంత. ఇంకా కోపం పోనట్టు మౌనంగా ఉండిపోయేడు రావ్. "చెప్పండి ప్లీజ్" అంది వసంత.

"ఇరవైఆరు ఏమిటి?" మళ్ళీ అడిగేడు రావ్.

"ఈ అబ్బాయిగారికి ఒక మంచిపిల్లతో పెళ్లిఅయిన రోజు. " అంది వసంత రావుకి మాత్రమే వినబడేటట్లు.

"కదా.. అందుకే మనం ఈసారి అరకు వెళ్లి మన పెళ్లి రోజు గడుపుదాం" అన్నాడు రావ్.

"నిజంగా! వావ్" సంతోషంగా అంది వసంత . "అలాగే. కానీ అక్కడ గదులు, ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యడానికి టైం సరిపోతుందా" అంది వసంత.

ఆ బ్రిడ్జి పిట్టగోడని పట్టుకుని నిలబడి, గుడి వైపు చూస్తూ అన్నాడు రావ్. " నీకు మన పెళ్లి రోజు గుర్తుందా.. నా పెళ్లికాక ముందు పెళ్లయినాక హనీమూన్ కి అరకు వెళ్లాలని నా కల. పెళ్ళైన ఇన్నేళ్లయినా ఆ కల తీరలేదు. నా భార్యతో వెళ్లాలని నేనింతవరకు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా అరకు వెళ్ళలేదు. అందుకే ఈసారి అన్నీ ముందుగా ఏర్పాటు చేసేసేక నీకైనా చెప్పాలి అనుకున్నాను. అక్కడ ఉండటానికి, రానూ పోను టికెట్స్ అన్ని  బుక్ చేసేసేను. ఇప్పుడు ఏ కారణం చెప్పినా ఆగేది లేదు. ఇరవైఅయిదు న వైజాగ్ నుంచి గ్లాస్ ట్రైన్లో టిక్కెట్టు  కొన్నాను.   అది ఉదయాన్నే సుమారు ఏడు  గంటలకి బయల్దేరుతుంది కనక ముందు రోజు రాత్రి వైజాగ్ వెళ్లి విస్సుగాడి ఇంట్లో ఉండి స్టేషన్ కి బయల్దేరుతాము. వాడికి చెప్పలేదు. కానీ వస్తున్నామని ఇరవైనాలుగు తారీకు న చెప్తాను. "

"ఆలా ఎందుకు? ఏదైనా హోటల్ లో ఉండచ్చుగా" అంది వసంత.

"సరే అలాగే చేద్దాం. ఇరవైఐదున సుమారు పన్నెండు గంటలకి చేరటం. ఇరవైఆరు పూర్తిగా అక్కడే వుంది, ఇరవై ఏడున మళ్ళీ మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకి రిటర్న్ అవుతాం వైజాగుకి.రాత్రి ఎనిమిదిన్నరకల్లా వచ్చేస్తాం కనక బస్టాండ్ కి వచ్చి బస్సు పట్టుకుని వచ్చేయచ్చు. ఏమంటావు?" అన్నాడు రావ్.

"బాగుంది ప్రోగ్రాం అలాగే వెళదాము. అక్కడ ఏమైనా తినడానికి తయారు చేస్తాను. మీరు హోటల్ భోజనం సరిగ్గా చెయ్యరు." అంది వసంత.

ఇద్దరూ  కాసేపు మౌనంగా ఉండిపోయేరు. ఏమిటి తయారు చెయ్యాలా అని ఆలోచనలో వసంతా.. రాబోయే ప్రయాణంని ముందుగా ఊహించుకుంటూ రావ్ . గాలి వీచడం కొంచం తగ్గింది. మెల్లగా వెనక్కి తిరిగారు ఇద్దరు. స్కూటర్ దగ్గరకు వచ్చి, నాగావళి హోటల్ కి చేరి అల్పాహారం కానిచ్చి ఇంటికి చేరేవరకు, రావ్ చాల ఉద్విగ్నతతో తన కలలని అవి సాకారమయ్యే సమయం వచ్చినందుకు యెంత ఆనందంగా ఉందో చెప్తూనే వున్నాడు.

వసంతకి తమ పెళ్లి జరగడానికి దారి తీసిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. తన జీవితంలో మొట్టమొదటి పెళ్లి చూపులు అవి. రావ్ తో. అవే  ఆఖరివి అవడం తన అదృష్టం. రావ్ తల్లి తోటి, అక్కతోటి వచ్చేడు. నెమ్మదిగా తలెత్తి చూసి 'బాగున్నాడు' అనుకుంది. కానీ తాను చూస్తుండగా అతను తనని చూడలేదు. చూసేడో  లేదో అనుకుంది. చాలా సంప్రదాయబద్దంగా జరిగేయి పెళ్లి చూపులు.

తరువాత బ్యాంక్ లో చలాన్  కట్టడానికి వెళ్ళినప్పుడు కౌంటర్ లో రావుని చూసి తడబడింది కొంచెం. రావ్ కూడా ఆశ్చర్యంగా చూసేడు. చలాన్ నింపడానికి వివరాలు అడుగుతున్నప్పుడు, తనతో మాట్లాడుతున్నప్పుడు గొంతులో చిన్న వణుకు, ఆ "బ్లష్ " అవడం అంతా  గుర్తున్నాయి. తనని నిలబెట్టి పనంతా ముగించి రసీదు తీసుకువచ్చి మెల్లగా అన్నాడు. "కాఫీ తాగుదామా" మళ్ళీ గబగబ అతనే అన్నాడు "మీకభ్యంతరం లేకపోతేనే."

నిజానికి తనకప్పుడు చాల భయం వేసింది. అయినా సరేనన్నట్లు తలవూపింది. అకౌంటంట్ దగ్గర అనుమతి తీసుకుంటుంటే అనుకుంది. "అతనేమిటి మాట్లాడతాడు? ఏమిటి అడుగుతాడు? నువ్వు నాకు నచ్చావ్ అని చెప్తాడా? నా అభిప్రాయం అడుగుతాడా? తన నిర్ణయం చెప్తాడా?"

హోటల్ లో కూర్చున్నాక, కాఫీకి ఆర్డెరిచ్చి  అన్నాడు రావ్. "మీకు నేను నచ్చానా వసంత గారు?" మళ్ళీ గొంతులో అదే వణుకు. బహుశా ఆడపిల్లలతో మాట్లాడటం మొదటిసారి కాబోలు అనుకుంది. మెల్లిగా తల ఊపింది.

"చూడండి. మీరు వేరేగా అనుకోకండి. మనం పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండగలమని మీకు అనిపిస్తేనే ఒప్పుకోండి . నాకెందుకో మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. అదోరకమైన భావన. మీరు ఒప్పుకోరేమోనని భయపడ్డాను కూడా. థాంక్ గాడ్." అన్నాడు ఆనందంగా. కాఫీ వచ్చింది. తాగుతున్నంతసేపు ఏమి మాట్లాడలేదు వసంత.

"థాంక్యూ! థాంక్యూ వెరీ మచ్ " అంది బయటకు వచ్చేక. తలూపి గబగబా వెళ్ళిపోయాడు రావ్. వెనక్కి తిరిగి చూస్తాడేమోనని అనుకుంది. బ్యాంక్ లోకి అతను వెళ్లిపోయేక ఇంటి ముఖం పట్టింది.

నెలరోజులు తిరగకుండా వాళ్ళ పెళ్లి అయిపొయింది. వాళ్ళ మొదటి రాత్రి గందరగోళం గా జరిగింది.

వాళ్లిద్దర్నీ  గదిలోకి పంపించేక రావ్ వసంత ఒకరినొకరు చూసుకుంటూ అలాగే నిలబడ్డారు. మెల్లిగా రావ్ వసంతాన్ని దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టుకోబోతు, "ఏమి అనుకోవు కదా" అని అడిగేడు.

నవ్వొచ్చింది వసంతకి. రాత్రంతా ఇలాగే అనుమతులు అడుగుతాడా అని. వాళ్ళిద్దరికీ మొదటి ముద్దు ఒక మధురానుభవం. మెల్లగా వసంతాన్ని మంచం మీద కూర్చోబెట్టాడు రావ్. ఆమె వడిలో తలపెట్టుకొని పడుకుంటుండగా స్పష్టంగా వినబడింది.

కిర్రుమన్న శబ్దం.

ఇద్దరు తుళ్ళిపడి చూసేరు. ఆ మంచం కీళ్లు కొంచెం ఒదులు . మంచం మీద పడుకున్నా కూర్చున్న కొంచం కదిలినా కిర్రున శబ్దం చేస్తుంది.

కాస్సేపాగి మళ్ళీ ప్రయత్నం చేసేడు.  ఈసారి కొంచం నెమ్మదిగా కూర్చొని జరిగేడు. మళ్ళీ కిర్రుమంది. ఇద్దరికీ ఫక్కుమని నవ్వు వచ్చింది. కానీ అంతలోపు పక్క గదిలో బంధువులున్నారు గుర్తొచ్చి ఆపుకున్నారు. మంచం మీంచి పరుపు తీసి కిందని వేశారు. హాయిగా నిట్టూర్చి వసంతకి మరో పెద్ద ముద్దిచ్చి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు.

"లైటు" అంది రావ్ చెవిలో వసంత. రావ్ లేచి లైట్ ఆర్పేశాడు. ఆ గదిలో బెడ్ లైట్ లేదు.

ఆడవాళ్ళకి కొందరికి కొన్ని విచిత్రమైన భయాలుంటాయి. కొందరికి బొద్దింకలు చూస్తే భయం. కొందరికి బల్లిని చూస్తే భయం. పిల్లిని చూస్తే వొళ్ళు జలదరిస్తుంది కొందరికి.

వసంతకి ఎలుకలంటే ప్రాణ భయం.

రావ్ వసంత తమ ఆనంద సామ్రాజ్యం లో హాయిగా విహరిస్తుంటే ఓ ఎలక సహించలేక పోయింది. మెల్లగా, అతిమెల్లగా ఆ ఎలక వసంత కాలిమీదనించి ఒక ఎగురు ఎగురుతూ మధ్యలో ఆమె చిటికిన వేలిని కొద్దిగా రక్కింది.

వసంత "కెవ్" మంటూ లేచి కూచుంది. రావుకి గుండె ఆగినంత పనయ్యింది. లేచి లైటేసాడు. ఎలక మీసాలని అల్లల్లాడించి పెట్టె కిందకి పారిపోయింది.

"ఏం నాయనా? ఏమైంది?" మామగారి గొంతు వినబడింది అవతలనించి.

"ఏం లేదు. " అన్నాడు గాభరాగా. వసంత సిగ్గుతో దుప్పటి కప్పుకుని కూచుంది.. లైటుంచితే సిగ్గు, లైట్ ఆర్పితే ఎలకలు. లైట్ వేసుకుని రావ్ నిద్రపోయేడు. వసంతకి మాత్రం ఆ రాత్రంతా జాగారం అయింది.

మర్నాడు వసంత తండ్రి ఆ మంచం చూసి కేకలు వేసి, మరో మంచం వేయించేడు. ఆ రోజు రాత్రి వాళ్ళ జీవితంలో తొలి రాత్రి అయ్యింది.

ఇల్లు చేరేరు. తలుపు తీసుకొని వస్తుంటే వసంత నవ్వుకోవడం గమనించి అడిగేడు రావ్. "ఏమిటి?."

"మన మొదటి రాత్రి, గది . కిర్రు మంచం. ఎలక" అంది వసంత. రావ్ కి నవ్వొచ్చింది. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా వారిద్దరూ నవ్వుకుంటుంటారు.

                         **************

రావ్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇద్దరు సాయింత్రం శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సు ఎక్కి బయల్దేరేరు. సరిగ్గా వంద కిలోమీటర్లు వైజాగ్. బస్సు లో పక్క పక్క కూచున్నాక వసంత తో అన్నాడు రావ్. "యెంత ఎక్సయిటింగ్ గా ఉందొ తెలుసా". మెల్లగా చెయ్య మీద చెయ్యవేసి సున్నితంగా నొక్కింది. 

వైజాగ్ లో ఒక హోటల్ లో రూమ్ తీసుకుని పడుకున్నారు. మర్నాడు ఉదయాన్నే లేచి తయారయి స్టేషన్ కి వెళ్లి, గ్లాస్ ట్రైన్ లో వాళ్ళ సీట్స్ లో కూర్చున్నారు. పైనించి, ప్రక్కనించి కనబడే ప్రకృతి అందాలు చూస్తూ, ఆనందిస్తూ బొర్రా గుహలు స్టేషన్ చేరేసరికి రావ్ కి కొంచం అసౌకర్యంగా అనిపించింది. ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న క్షణం  కదా ఉద్విగ్నత వల్ల  అని అనుకున్నాడు. కొంచం సేపటికి మళ్ళీ మామూలుగా అనిపించింది.

అరకులో దిగి తాము బుక్ చేసుకున్న బంగాళా దగ్గరికి రిక్షా లో వెళ్ళేరు. రూంలో దిగి అలా అలసటగా అనిపించి వసంత కొంచం తయారు అయి వస్తానని స్నానాలగదిలోకి వెళ్ళింది. రావ్ అలా మంచం మీద పడుకున్నాడు. 

ఎంతసేపు అయిందో మెల్లిగా కళ్ళువిప్పి చూడటానికి ప్రయత్నం చేస్తే, కళ్ళు విడడం  లేదు. చాలా మత్తుగా అనిపించింది. ఎవరివో గొంతులు వినబడుతున్నాయి. ఒక గొంతు వసంతది లాగ వుంది. ఎవరితోటో  మాట్లాడుతోంది. మళ్ళీ నిద్ర పట్టేసింది.

మళ్ళీ తెలివి వచ్చేసరికి చీకటి పడ్డట్టుగా వుంది. దాహంగా అనిపించి లేవాలి అనుకున్నాడు. కానీ లేవలేకపోయాడు. 'దాహం' అని గట్టిగా అన్నాడు. కానీ తన గొంతు తనకే నీరసంగా వినపడింది.
"ఇదిగో కొంచం నీళ్లు తాగండి" అంటూ వసంత గ్లాస్ తో నీళ్ళని తన గొంతులో పోసింది. మళ్ళీ నిద్ర పట్టేసింది.

ఈసారి తెలివి వచ్చేసరికి "ఏమండీ ఎలావుందీ? " అని అడుగుతూ ఆందోళనగా చూస్తున్న వసంత మొహం కనబడింది. "అమ్మయ్య తెలివి వచ్చిందా" అంటూ తన చేతిమీద చెయ్యి వేసి భరోసా ఇస్తున్నట్టు తట్టింది.

కళ్ళు పూర్తిగా విడివడ్డాయి రావ్ కి. చుట్టూ చాలామంది ఉన్నారు. కొడుకు, కోడళ్ళు, డాక్టర్, నర్సులు, మిత్రుడు విశ్వనాధం. "ఏమిటి అయింది? నాకు?" అంటూ లేవబోయిన రావుని కొడుకు "లేవకండి నాన్నగారు" అంటూ వారించేడు. మళ్ళీ నిద్ర పట్టేసింది రావ్ కి.

మర్నాడు ఉదయం  తెలివి పూర్తిగా వచ్చింది రావుకి. కొడుకు పక్క కుర్చీలో నిద్రబోతున్నాడు. రావ్ లేచిన అలికిడికి లేచేడు.

"ఏమైంది నాకు" అని అడిగేడు. తన వంటిమీద ట్యూబ్ లు చూసుకున్నాడు. చుట్టును చూసేడు. తాను హాస్పిటల్ లో ఉన్నట్టు అర్ధం అవుతున్నది.

" థాంక్ గాడ్ నాన్న. మీకు  శుభాకాంక్షలు చెప్దామని, ఇరవైఅయిదవ తారీకు రాత్రి ప్రయత్నించడం మేలైంది. మీ ఫోన్ ఏది దొరకకపోతే, విశ్వనాధం అంకులు కి ఫోన్ చేసేను. ఆయనకీ మీరెప్పుడో అరకులో బంగళా  గురించి అడగటం, ఇంతలో అమ్మ పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేయడం తో ఆయన వెంటనే ఆంబులెన్స్ తో వచ్చి మిమ్మల్ని వైజాగ్ తీసుకు వచ్చేరు. మీకు స్ట్రోక్ వచ్చింది అని వెంటనే సర్జరీ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఓకే. నేను తమ్ముడు, పిల్లలం అందరం వచ్చేము." అన్నాడు రావ్ కొడుకు.

ఇంతలో రావు కోడళ్ళు, పిల్లలు,  వసంత అందరు లోపలి వచ్చేరు. వసంత మొహంలో ఆ క్షణం లో కనబడ్డ రిలీఫ్ రావ్ కి ఆమె ఎంత ఆందోళనకి గురయ్యిందో చెప్పింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకేమి ప్రమాదం లేదని, రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు.

అందరూ  రావ్ ని వసంతని గదిలో వదిలి  బయటకి వెళ్ళేరు.

నీరసంగా అన్నాడు రావ్ "మన హనీ మూన్ ఇలా అయిందా?."

"పోనీ లెండి. మీరు క్షేమంగా ఉన్నారు అంతేచాలు. దేవుడి దయ. \" అంది వసంత.

బయటనుండి పెద్దకోడలు కొడుకుతో అంటున్న మాటలు వినబడ్డాయి. "విచిత్రం కాకపొతే ఈ వయసులో హనీమూన్ ఏమిటి?"

"ప్రేమకి వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళ మధ్య అనురాగం  అటువంటిది. " అంటున్నాడు పెద్దకొడుకు.

మత్తుగా నిద్రలోకి జారిపోతూ అనుకున్నాడు. "అవును. ప్రేమకి వయసుతో నిమిత్తం లేదు. ప్రేమించే మనసు ఉంటే చాలు".

 మళ్ళీ నిద్ర పట్టేసింది రావుకి.

============  అయిపొయింది. ==========


సూర్యారావు కథ.

చిన్న బజారులో ఉంది ఆ బ్యాంక్ బ్రాంచి. నాలుగైదు మెట్లెక్కి బ్రాంచిలోకి వెళ్ళాలి. బ్రాంచిసిబ్బంది తమ సైకిళ్ళని ఆ  అరుగుమీద పెట్టేవారు. అవి దాటుకొని, సూర్యారావుని దాటుకొని బ్రాంచిలోకి వెళ్ళాలి తమ పనులు చేసుకోవడానికి.

పెద్దమీసాలతో, భారీకాయంతో , యూనిఫారంలో చూపరులకు భయపెట్టేలా చేతిలో తుపాకీతో  ఆ గేట్ దగ్గర నిలబడి బ్రాంచ్ లోకి  వచ్చే పోయేవాళ్ళని ,  తెలిసిన వాళ్లైతే సెల్యూట్ చేసి, తెలియని వాళ్లైతే "ఏం పని? " గద్దించి అడిగే సూర్యారావు ఆ బ్రాంచి సిబ్బంది అంతా తలలో నాలికలా  ఉంటాడంటారు. 

పదిహేను సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయి, ముప్ఫయైదేళ్ళకి బేంకులో సెక్యూరిటీ గార్ఢ్ గా ఉన్నఊరికి దగ్గరలో శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇస్తామంటే చేరేడు. పదేళ్ళయింది ఉద్యోగంలో చేరి.  మిలటరీ నుంచి వచ్చే ఫింఛను  కాక బాంక్ లో వచ్చే జీతంతో, పల్లెలో ప్రభుత్వం  ఇచ్చిన భూమి మీద ఆదాయంతో  తన కొడుకునీ, కూతుర్నీ మంచి చదువు చదివించు కుంటూ, తన వారి మధ్యలో ఒక స్టేటస్ తో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. 

80వ దశకంలో బేంకు ఉద్యోగం చాలా ఆకర్షణీయంగా ఉండేది. ముఖ్యంగా అవార్డ్ స్టాఫ్, అంటే క్లరికల్, ప్యూన్ సెక్యూరిటీ గార్ఢ్స్ పదవులలో అసలు వత్తిడి ఉండేది కాదు. పదిగంటలకు బ్రాంచికి వచ్చి సరిగ్గా అయిదుగంటలకల్లా  ఇంటికి వెళ్ళిపోయేవారు. అందులో సెక్యూరిటీ గార్ఢ్ కి ఇంకో సౌలభ్యం ఉండేది. మిలిటరీలో పనిచేసి రిటైరయినందువల్ల నెలకోసారి దగ్గరలో ఉన్న  మిలిటరీ కేంటీన్లో బియ్యం, పప్పుదినుసులు తప్ప మిగిలినవన్ని చవకగా దొరికేవి. ముఖ్యంగా మందు బాటిల్స్. 

డిపాజిట్స్ సేకరణ, లోన్స్  ఇవ్వడం అన్నీ బ్రాంచి మేనేజర్ దే బాధ్యతగా ఉండేది. బేంకుల్లో కొన్ని శాఖలలో ఎక్కువగా కేష్ జమ అవుతుంది. కొన్ని శాఖలలో కేష్ చాలా అవసరం ఉంటుంటుంది. శ్రీకాకుళంలో ఉన్న ఈ బ్రాంచిలో నగదు జమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆ బ్రాంచి మేనేజర్ కి తరుచూ ఈ కేష్ విశాఖపట్నంకో, విజయవాడలో ఉన్న తమ కరెన్సీ చెష్టుకో పంపడం ఓ పెద్దపనిగా ఉండేది. 

ఆ మేనేజర్ కి తరచూ పుచ్చుకునే అలవాటు ఉండేది, అదీ ఎవరైనా పిలిచి ఇస్తే. లేకపోతే  ఎవరిచేతనైనా పిలిపించుకొనేవాడు. అందుచేత ప్రతీనెలా  మొదటి తారీఖునొ లేదా కేంటీన్ లో సామానులు ఇచ్చే రోజున విశాఖపట్నంకు తప్పనిసరిగా నగదు పంపేవాడు. సూర్యారావు అలా బేంకు పనిమీద విశాఖపట్నంకు వెళ్ళి బేంకు పని చూసుకొని, కేంటీన్ కి వెళ్ళి తనకి కావాల్సిన సామాన్లు వాటితో పాటు మేనేజర్ కోసం ఒక సీసా తీసుకొని వచ్చేవాడు.  ఇదేకాక బేంకు స్టాఫ్ ఎప్పుడైనా పార్టీ చేసుకుంటే అందులో సూర్యారావుది ముఖ్యపానపాత్ర. అందుకే ఓ క్లార్క్ "అందరూ సూర్యారావుని తలలో నాలిక అంటారు.కానీ నేనంటాను. "సూర్యారావు మన తలలో పానపాలిక. త్రీ ఛీర్స్ ". మత్తులో ఉన్న మిగిలిన అందరూ చప్పట్లు కొట్టడడానికి ప్రయత్నం చేసి ఒక చేతిలో గ్లాసు ఉండటంవల్ల  వీలుపడక వచ్చిన వాళ్ళు ఈలలువేసి తమ ఆమోదాన్ని తెలియజేసేరు. 

సూర్యారావు కూతురుకి పెళ్లి కుదిరింది. మేనరికమే. బాంకులో లోను తీసుకుని తన దగ్గిర ఉన్న సేవింగ్స్ తో ఘనంగా చేసేడు. స్టాఫంతా మంచి బహుమతి ఇచ్చి తమ కృతజ్ఞతని తెలియజేసేరు. 

సూర్యారావు కొడుకు సంతోష్ తన తండ్రికి బేంకులో సిబ్బంది అంత గౌరవం  ఇవ్వడం చాలా నచ్చింది. అతడు చక్కగా చదువుకుంటూ ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు అందర్నీ చక్కగా పలకరించి కలిసిపోయాడు. 

********

అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. 

సూర్యారావు కొడుకు సంతోష్ ఓ మంచి  కంపనీలో ఉద్యోగి అయ్యేడు. ఆతనికి తన తండ్రి అంటే  అంతులేని గౌరవం. తమ తల్లి పోయినా తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా తమని పైకి తీసుకువచ్చేడని. తమ తండ్రి తాగుతాడని, ఆ అలవాటు ఆయనకీ ఆర్మీలో అయిందని తెలుసు. కాని తమ తండ్రి అలవాటు తమకెప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులలోకి నెట్టలేదు. అతనికి తన తండ్రి మరీ ఖరీదైన మద్యం తాగేవాడు కాదని తెలుసు. అనవసరమైన ఖర్చు చేయడం  తండ్రికి ఇష్టం ఉండేది కాదు. 

ఓసారి శ్రీకాకుళం సెలవు పెట్టి వచ్చేడు తండ్రి రమ్మని పదేపదే కోరడం వల్ల. సాయంత్రం తండ్రి మెల్లగా కొడుకు కి తను చూసిన పెళ్ళి సంబంధం గురించి చెప్పేడు. సూర్యారావు చెప్పిన ఆ  అమ్మాయి సంతోష్ కి తెలుసు. ఆతనికి ఏమీ అభ్యంతరం లేదని చెప్పేడు. సూర్యారావు ఆనందానికి అవధుల్లేవు. 

" సరేరా అబ్బాయ్! నేనలా బయటికి వెళ్ళొస్తాను."  ఆతనికి వెంటనే ఈ ఆనందాన్ని పండగ చేసుకోవాలనిపించింది. 

సూర్యారావు ఉద్దేశం కనిపెట్టాడు సంతోష్. "ఆగు నాన్నా! " అన్నాడు "నేనూ వస్తాను. మనిద్దరం వెళ్దాం."

" నువ్వూ...." అసందిగ్దంగా ఆగాడు సూర్యారావు.

"లేదు నాన్న!" చిరునవ్వుతూ అన్నాడు సంతోష్. " నీతో గడపాలని. నువ్వు తీసుకో. నేను కూచుంటాను."

'అమ్మయ్య' అనుకున్నాడు సూర్యారావు. 

శ్రీకాకుళం మిగిలిన ప్రపంచంతో బాటుగా  ఎదగడానికి ప్రయత్నిస్తూంది. దానికి గుర్తుగా శివారులలో ఒక కొత్త  రిసార్ట్ లు, బార్లకి కొత్త పేరు, వెలిసాయి. తండ్రిని మోటర్ సైకిల్ మీద ఆటువంటి బార్ కి తీసుకువెళ్ళేడు సంతోష్, శ్రీకాకుళం నుండి సింగుపురం దారిలో కొత్తగా వెలసిన ఆ బార్ కి. 

"ఇక్కడికెందుకురా బాబూ... ఇక్కడ అన్ని చాలా రేట్లెక్కువ. " అన్నాడు సూర్యారావు. 

"పర్లేదు నాన్నా... ఇవేళ ఒక్కరోజుకీ ఏమనకు. " అన్నాడు సంతోష్.

లోపలికి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. బేరర్ వచ్చి మెన్యూకార్డ్ ఇచ్చి వెళ్ళాడు. 

"ఎలా ఆర్డరు చెయ్యాలి?" అడిగేడు సంతోష్. 

తెలిసి అడుగుతున్నాడో నిజంగానే తెలియదో అనుకున్నాడు సూర్యారావు. "ఇలా యియ్యి. " అన్నాడు మెన్యూకార్డ్ వైపు చేయిచాస్తూ. 

" ఏది చెప్పాలో నేను చెప్తాను. ఎంత చెప్పాలో చెప్పు." అన్నాడు సంతోష్. 

ఎంతకావాలో చెప్పేడు సూర్యారావు. బేరర్ ని పిలిచి ఆర్డరిచ్చేడు సంతోష్. సంతోష్ ఆర్డరిచ్చిన బ్రాండ్ పేరు వింటూ తుళ్ళిపడ్డాడు సూర్యారావు. 

"ఒరే బాబూ  అది చాలా ఖరీదైనది రా. నేనెప్పుడు తాగలేదు కూడా అ"న్నాడు సూర్యారావు. 

"పరవాలేదులే నాన్నా!  ఇవేళే కదా. నీ కొడుకు నీకు పార్టీ ఇస్తున్నాడనుకో. " అన్నాడు సంతోష్. 

ఏమనలేక ఊర్కొన్నాడు సూర్యారావు.

తనకోసం తెప్పించిన కూల్ డ్రింక్ తాగుతూ తండ్రితో పిచ్చాపాటీ మాట్లాడసాగేడు సందోష్. 
ఒక రౌండ్ అయింది. ఇంతలో "ఒరేయ్ సూర్రావూ"  అనే పిలుపు వినబడింది గట్టిగా. అదిరిపడ్డట్టు అటువైపు చూసేరు.  రెండు వరసల ఆవల ఓ టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకాయన మళ్ళీ అంతే గట్టిగా "ఒరే సూర్రావూ" అని పిలుస్తూ చెయ్యూపేడు. 

సూర్యారావు చటుక్కున లేచి "రా రా బాబూ" అంటూ అటువైపు అడుగులు వేసేడు. సంతోష్ కి వాళ్ళెవరో తెలియరాలేదు. కాని తండ్రిని ఎంత చనువున్నా అంత గట్టిగా పిలవడం నచ్చలేదు. తండ్రి వెనకనే వెళ్ళాడు. 

అప్పటికే చాలాసేపయి తాగుతున్నట్టున్నారు టేబుల్ మీద ఖాళీ బాటిల్స్ రెండు మూడు దర్శనమీచ్చేయి. టేబుల్ సమీపీస్తుండగా, అందులో ఒక వ్యక్తిని చూసి, మిలటరీ పద్దతిలో సెల్యూట్ చేసేడు సూర్యారావు. ఆయన కూడా ప్రతిగా సెల్యూట్ చేసి " ఏం సూర్యారావు బాగున్నావా "అని అడీగేడు.  

"సార్..." అంటూ ఇంకా ఎటెన్షన్ లోనే ఉన్న సూర్యారావుని, ఇది "బారయ్యా  బార్కాస్ కాదు," అన్నాడాయన. "ఎవరీ కుర్రాడు?" అడిగేడు. 

ఇదంతా చూస్తున్న సంతోష్ కి కోపం రాసాగింది. తన తండ్రితో తన సమయాన్ని వీళ్ళు దోచేస్తున్నారన్న భావన. 

"నాా కొడుకు సార్.. హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు." అని పరిచయం చేసేడు." ఈ సారు మాకు పెద్దసారు. వీళ్ళిద్దరూ మా కంపనీలోనే, మేమందరం కలసి పనిచేసేం." 

"మీ నాన్న మా ప్రాణాలు కాపాడేడయ్యా..." అన్నాడొకాయన. 

ప్రశ్నార్ధకంగా చూసేడు సంతోష్. 

"ఇలా కూర్చోండి. అంటూ ఖాళీగా ఉన్నకుర్చీలు చూపించేరు. అది మేం బారాముల్లాలో తీవ్రవాదులకోసం కూంబింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అటువైపునుంచి కాల్పులు మొదలైనాయి. మీ నాన్న ముందుగా ఉన్నాడు. చటుక్కున వెనక్కి తిరిగి మమ్మల్ని ముగ్గురునీ నేలమీదకి తోసేసి మా మీద తను పడ్డాడు. అప్పడే తనకాళ్ళకి ఒక బుల్లెట్ తగిలింది. ఇంతలో మిగిలిన వాళ్ళ వచ్చి తిరుగు కాల్పులు జరపడంతో  ఆ తీవ్రవాదులు మళ్ళీ పాకిస్తాన్ లోకి పారిపోయారు. అలా మీ నాన్న రక్షించకపోతే మేం తిన్నగా వాళ్ళ కాల్పులు జరుపుతున్న వైపే వెళ్ళేవాళ్ళం. " 

సూర్యారావు కల్పించుకొని అన్నాడు. "అప్పుడు వీళ్ళు నన్ను మోసుకొని 3 కి.మి. నడచి హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు తెలుసా... ఆ శత్రవులు మా వాహనాలన్నీ ధ్వంసం చేసేసారు." 

సంతోష్ కి క్షణం క్రితం తన ఆలోచనలు గుర్తుకు వచ్చి సిగ్గేసింది. వీళ్ళ త్యాగాలు మనం ఎప్పుడూ అర్ధం చేసుకోలేము అనుకున్నాడు. చటుక్కున వంగి వాళ్ళపాదాలకి నమస్కారం చేసేడు. 

"నువ్వుంటే ఉండవయ్యా  లేకపోతే మీ నాన్నని మేం ఇంటి దగ్గర దింపుతాములే"  అన్నాడాయన. తండ్రివైపు ప్రశ్నార్ధకంగా చూసేడు సంతోష్. 

సరే అన్నట్లు తలాడించేడు సూర్యారావు. 

"మంచిదండి నేను వెళ్తాను. జాగ్రత్త నాన్నా!"  అంటూ బయల్దేరేడు సంతోష్. 

గేటు దాటుతూ వెనక్కి చూసేడు. 

ఎవరో ఏదో జోక్ చేసినట్టుంది. పగలబడి నవ్వుతున్నారు నలుగురూ. అప్రయత్నంగా తండ్రిలాగా ఆర్మీ స్టైల్ లో సెల్యూట్ చేసి ఆనందం నిండిన మనసుతో ఇంటివైపు మోటార్ సైకిల్ని పోనిచ్చాడు. 


************************అయిపోయింది.********************