----మోదుకూరి జతీంద్ర శర్మ
"ఈ రోజు బృందావనం అంతా కొత్తగా కనిపిస్తున్నాది కదా?" అడిగేడు నందుడు తనతో వస్తున్న ఉపనందుడ్ని. కావడానికి గ్రీష్మం అయినా, పొగడ చెట్టు విరగబూస్తున్నాది. దారంతా పొన్న పూలు తివాచీలాగా పరచి ఉన్నాయి. బృందావనం అంతా పువ్వులు పూసిన చెట్లతో వసంతం అప్పుడే వచ్చిందా అన్నట్లున్నాది. ఆ పొగడపూల దారిమీద ఆవు దూడల గిట్టల గుర్తులు, ఆ వెనుకనే వాటిని తోలుతూ వెళ్ళిన బాలగోపాలకుల చిన్న చిన్న అడుగులూ కనిపిస్తున్నాయి. దూరంనించి బాలకృష్ణుని మురళీరవం గాలిలో తేలుతూ ఆహ్లాదంగా వినవస్తూంది. 'ఎంతో దూరం లేరు ' అనుకున్నాడు నందుడు.
వారందరూ మధురకి కప్పం కట్టడానికి వెళ్ళి బృందావనం తిరిగి వస్తున్నారు. సాయంత్రం కావొస్తూంది. చీకటి పడక ముందే వ్రజం చేరేందుకు తొందరగా నడుస్తున్నారు.
"గత ఏడాదిగా నాకైతే రోజూ కొత్తగానే కనిపిస్తున్నాది, రాజా !" అన్నాడు ఉపనందుడు.
నందుడికి రేపల్లె వదిలి బృందావనం వచ్చిన సంఘటన అంతా కళ్ళముందు కదిలింది. మూడు సంవత్సరాలైెంది వారు బృందావనం వచ్చి. రేపల్లెతో పోలిస్తే కన్నయ్యకి రాక్షసపీడ తగ్గినట్టే ఉంది. అన్న బలరామునితో ఇతర గోపబాలకులతో దూడలని మేతకి తీసుకు వెళ్తున్నాడు.
" అవును. మీరు గమనించేరో లేదో.. ఆవులు దూడలు తాగేక కూడా ఎక్కువ పాలు ఇస్తున్నాయి. సాధారణంగా ఒక దూడ పుట్టేక మళ్లీ చేపుకొచ్చిన ఆవు దూడకి పాలు ఇవ్వదు. గానీ మరో దూడ పుట్టినా రెండు దూడలకీ పాలు ఇస్తున్నాయి. అయినా ముందు కన్నా పాలు ఎక్కువగానే ఉంటున్నాయి. రాత్రి అయితే ఎడ్లు దూడలకు కాపాలాగా అన్నట్లు వాటి చుట్టూనే ఉంటున్నాయి. ఏడాదయి మన మందలో పశువులని క్రూరమృగాలేవీ చంపడంలేదు. " అన్నాడు నందుడు.
" అంతా దేవుని దయ!" అన్నాడు మరో గోపుడు. "ఈసారి ఇంద్రుని పూజ ఘనంగా చెయ్యాలి."
సరే అన్నట్టు తలూపేడు నందుడు. దూడలని తీసుకువెళ్తున్న కృష్ణుడు వాళ్ళూ దగ్గరయే సమయంలో, కన్నయ్య వెనక్కి తిరిగి చూసేడు. నందుని చూడగానే ఆనందంగా, "అయ్యా !" అంటూ చేతులు చాచుతూ పరిగెత్తుకు వచ్చేడు. చేతిలో ఉన్న కర్రని పక్కన ఉన్న ఓ గోపుడికి ఇచ్చి, తన చేతులు చాచి, వస్తున్న చిన్ని కొడుకుని ఎత్తుకున్నాడు. "అయ్యా అయ్యా మరే.. ఇవేళ ఏమయిందో తెలుసా...... " అంటూ ఏవో కబుర్లు చెప్తున్న కొడుకు మాటల్లో పడి, తనకి ముందు వచ్చిన ఆలోచనలన్నీ మరిచిపోాయాడు నందుడు. పక్కనే నడుస్తూ వస్తున్న బలరాముడు ఇదంతా గమనించి చిన్నగా నవ్వుకున్నాడు.
ఆరోజు మధ్యాన్నమే కన్నయ్యని తానూ అదే ప్రశ్న అడిగేడు చుట్టూ ఎవరూ లేకుండా చూసి... "స్వామీ! గత కొన్ని మాసములుగా చూస్తున్నాను. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీదా దూడల మీదా గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకు వచ్చింది; వీరు ఇదివరకు మీ ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో, ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడ ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే మిమ్ము చూసినట్లే ప్రేమా, ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను. మానవులు గానీ దానవులు దేవతలు కానీ చేసిన మాయ కాదు కదా. లేక నా స్వామి అయిన మీ యొక్క మాయ యేమో.".
అన్నమీద జాలికలిగింది కన్నయ్యకి. "అన్నా! నీకు కలిగిన సందేహం సరైనదే. ఏంజరిగిందంటే..." కృష్ణుడు చెప్పసాగాడు.
సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఓ రోజు బలరాముడు క్రేపులతో అడవికి రాలేదు. కృష్ణుడు మిగిలిన గోపబాలురూ యధావిధిగా దూడలతో బయల్దేరారు. తల్లి యశోద చల్ది ఓ కుండలో పెట్టి దాన్ని చక్కగా అలంకరించిన ఉట్టెలో పెట్టి, చిన్నారి కృష్ణుని కి చక్కగా తలదువ్వి, కొప్పులో పూదండ చుట్టి, నెమలి పింఛం అందంగా అమర్చి, పెద్దవాడు బలరాముడు రావడంలేదని జాగ్రత్తలు చెప్పి పంపింది. నందుడు వారికి కాపలాగా ఇద్దరు బలాఢ్యులైన గోపులను పిల్లలకి రక్షణ గా పంపేడు. "వనంలో ఓ పెద్దపులి తిరుగుతూన్నది. ఏమరక ఉండండి." అంటూ జగద్రక్షకుడికి రక్షణగా పంపేడు.
పిల్లలు ఆడుతూ పాడుతూ మధ్యాహ్నానికి ఓ కొలను పక్కన చేరేరు. అక్కడే ఉన్న ఓ పెద్దరాయి మీద అందరూ కూర్చొని చల్దులు ఆరగించసాగారు. ఓ పక్కగా గడ్డి మేస్తున్న దూడలవైపు ఓ కన్నేసి ఉంచేడు కృష్ణయ్య. ఆ లేగలు గడ్డి మేస్తూ మేస్తూ దూరంగా పోయాయీ. ఇంతలో పులి గాండ్రింపు కూడా వినబడడంతో రక్షణకు వచ్చిన ఇద్దరు గోపాలురూ అటువైపు పరిగెత్తారు.
" మిత్రులారా! మీరు సావకాశంగా చల్దులారగించండి. నేను దూడలని వెదకి తెస్తాను" అని కృష్ణుడు బయల్దేరాడు. అప్పుడే
బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేడు. "లీలామాత్రంగా సర్వలోకాలనూ సృష్టిచేసి, పోషించి , తననుండి పుట్టిన లోకాలను తన లోనే కలుపుకొనే జగన్నాధుడు, అన్నీ తానై, అన్నిటా తానైన వాడు తనను కూడా సంకల్ప మాత్రం చేత పుట్టించిన తన తండ్రి నారాయణుడా ఈ గోపబాలుడు... ఇలా ఒక దూడ కోసం వెతుక్కుంటున్న ఈ నందనందనుడా దైవకార్యాన్ని పూర్తి చేయడానికి అవతరించిన శ్రీహరా.? కంసాది దానవులను చంపగలిగే శక్తి ఈ నరుడికి ఉందా? ఈ పిల్లవాడు చూడబోతే అర్భకుడు. అంతమంది రాక్షసులను వధించేడంటే నమ్మకం కలగడంలేదు. గోరంతలని కొండంతలు చేయడం నారదునికి అలవాటేగా! ". నరలోకంకి వచ్చిన సృష్ఠికర్త కూడా మనుష్యుల లా ఆలోచించడం మొదలు పెట్టాడు.
"ఈ గోపకులందరినీ దాచి ఉంచితే ఏంచేస్తాడీ గొల్లపాపడు?. పనిలోపనిగా ఆ వత్సములను కూడా దాచితే కనుగొనగలడా?" అనుకున్నాడు. వెంటనే సంకల్పమాత్రం చేత ఆ దూడలనీ, ఆ గోపబాలకులనీ ఓ గుహలో దాచేసాడు. వారు సహాయం కోసం అరవకుండా వారిని నిద్రలో ముంచేసాడు. వారికి ఆకలిదప్పులే లేకుండా చేసాడు. కృష్ణయ్య వస్తున్న అలికిడి విని అదృశ్యమైనాడు.
దూడలకోసం వెదకి అవి కనబడక వెనక్కి వచ్చేసి ఉంటాయని తాము చల్దులు తిన్న స్థానానికి వచ్చేడు బాలకృష్ణుడు. అక్కడ తన నేస్తాలూ కనబడలేదు. ఒక్క క్షణం ఏం జరిగిందని ధ్యానించేడు. తన బిడ్డడైన కమలాసనుని పని తెలిసి చిన్నగా నవ్వుకున్నాడు.
ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్నుకప్పి మోసం చేసాడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం మనకెందుకు వద్దులే” అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ; గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు."అనుకుంటూ ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు.
సాయంత్రం అయింది.
దూడలని ఇంటికి మరల్చి వ్రజం చేరేడు. వ్రజంలో ఇళ్ళన్నీ అర్ధ చంద్రాకారంలో ఏర్పాటు చేసేడు నందుడు. ప్రవేశం దగ్గర ఒక ప్రక్క నందుడి ఇల్లూ , రెండో పక్క ఉపనందుడి ఇల్లూ. ఎవరైనా లోపలికి రావాలంటే ఈ రెండు ఇళ్ళలోని కాపలాదారులను, వ్రజ రక్షకులనూ దాటి రావాల్సిందే.
అందరు పిల్లలూ వాళ్ళ దూడలను సరిగ్గా తోలుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేరు. "అమ్మా! ఆకలే!" అంటూ వచ్చిన పిల్లలని చూసిన ఆ వల్లవ వనితలు తాము కృష్ణుని చూస్తున్న అనుభూతిని పొందేరు. కళ్ళముందు తమ బిడ్డలే. రోజూ చూస్తున్న వారే. వాళ్ళ హావభావాలలో ఏమీ తేడా కనబడ్డంలేదు. కానీ వీళ్ళని చూస్తుంటే ఇవేళ విచిత్రంగా కన్నయ్యని ముట్టుకున్నట్టు, యశోదానందనుడు తమ ఒడిలో కూర్చున్న భావం కలిగింది అనుకున్నారు. ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో; ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు.
ఆవులు తమ దూడలను చూస్తూనే తమ పొదుగులనుంచి ఆప్యాయంగా పాలు కురిపించసాగేయి. తనివితీరనట్టు తమ తమ దూడలని పదే పదే నాకసాగాయి.
గోపికలకు, గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు.
పూర్వం బాలకృష్ణుని మీద తమకు మిక్కిలి అధికమైన ప్రేమ కలిగినట్లు. ఈ గోపబాలకుల పైన కూడ గోకులంలోని జనులు అందరికి రోజురోజుకీ ప్రేమలు పెరగుతూ ఏరోజు కారోజు క్రొత్తలు తొడుగుతూనే ఉండేవి.
ఒకరోజు గోవర్ధనగిరి మీద ఆవులను మేపుతున్నారు గోపకులు. కింద మైదానంలో దూడలని మేపుతున్నారు గోపబాలురు. అకస్మాత్తుగా ఆ కొండమీద మేస్తున్న ఆవులు, కొండకిందనున్న దూడలను చూసి, ఆనందంతో తోకలెత్తుకొని తమతమ దూడలదగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పాలను ఇవ్వసాగాయి. ఆ గోపాలకులు ఎంత ప్రయత్నించినా వాటిని వారించడం వారికి వీలుకాలేదు. తాము తమ పిల్లలను చూసి ప్రేమతో దగ్గరకు తీసుకొని వారితో ఆటల్లో మునిగి పోయారు.
"ఇదీ అన్నా! జరిగింది. బహుశా రేపో మరునాడో ఆ బ్రహ్మయ్య వస్తాడు. దానితో ఈ ఘట్టం ముగుస్తుంది" అన్నాడు కృష్ణుడు బలరామునితో.
మరునాడు కృష్ణుడూ మిగిలిన గోపబాలురూ దూడలని తీసుకుని బయలుదేరి వనంలోకి వెళ్ళారు. గత ఏడాదై ఆలమందలో ఒక్క పశువూ క్రూరమృగాల పాలు పడలేదు. నందరాజుకి ధైర్యం వచ్చింది, పిల్లనూ దూడలనూ రక్షణలేకుండా పంపేంత.
ఓ పెద్ద మర్రిచెట్టు. దాని కొమ్మలు భూమిమీద పాకి అచ్చంగా కూర్చునేంందుకు వీలుగా ఉన్నాయి. ఆ కొమ్మమీద కూర్చుని తీసి వేణువు మధురంగా వాయిస్తున్న కన్నయ్య దగ్గరకు ఓ పులి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది.
ఆ పులి చాలా చిక్కిపోయిఉంది. కళ్ళలో ప్రాణం పెట్టుకొని ఉంది. అలా మురళీకృష్ణుని దగ్గరగా చేరి నిస్సత్తువ గా పడుకుండిపోయింది.
"ఏమైంది శార్దూలమా?" మృదువుగా అడిగాడు కృష్ణయ్య.
"స్వామీ! నువ్వు జగద్గురువవు. విశ్వాత్ముడవు. విశ్వమంతా నీలో ఉంది. విశ్వాన్నంతా నువు సృష్టిస్తావు. పోషిస్తావు. మళ్ళీ నీలో కలిపేసుకుంటావు. నీవెరుగనిది ఏదీలేదీ జగాన అయినా నన్ను ఆదేశించావు కనుక చెప్తాను.
"నాది నైమిశారణ్యం. బృందావనంలో ఆలమందలు ఇబ్బడముబ్బడిగా ఉన్నాయనీ, ఆహారానికి లోటుండదని తెలిసి ఏడాది క్రితం వచ్చేను ఇక్కడికి. వచ్చిన కొత్తలో ఒకటి రెండు బలిష్ఠమైన ఎడ్లు ఆహారంగా దొరికేయి.
"కానీ ఏమైందో అకస్మాత్తుగా ఒకరోజునుంచి ఆలమందలున్న చోట అన్ని దూడలలో నువ్వే కనిపిస్తున్నావు. అందరి పిల్లల్లో నువ్వే కనిపిస్తున్నావు. అంతెందుకు నేను బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనబడుతున్నావు.
"ఏ జంతువు నీ చంప బుద్ది కాలేదు. ఆకలికి భరించలేక నైమిశారణ్యం తిరిగి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నీ ముగ్ధమోహన రూపం వదలి వెళ్ళాలనిపించలేదు. నాకు ఏమీ చేయాలనిపించలేదు. నీవు నీ తోడివారితో దూడలను మేపగా నిన్ను చూస్తూ గడిపేను. ఆకలయితే నీళ్ళుతాగేను.
"కానీ ప్రభూ! ఇక జీవనం కష్టంగా ఉంది. నీ పాదాల చెంత ప్రాణాలు వదిలేద్దామని వచ్చేను. నన్ను కరుణించు కృష్ణా!" అంది నీరసంగా.
ఇంతలో ఆకాశంలో పెద్దరెక్కల చప్పుడయింది. కృష్ణుడు ఆ వ్యాఘ్రమూ ఇద్దరూ ఆ శబ్దం వచ్చేవైపు చూసేరు.
ఒక తెల్లని హంస మీద చతుర్ముఖ బ్రహ్మ కూర్చుని వస్తూ అక్కడ మేతమేస్తున్న దూడలనీ, వాటిని కాపుకాస్తూ ఆడుకుంటున్న గోపబాలకులనీ చూసేడు. ఆశ్చర్యపోయాడు. తను మాయజేసి దాచిన పశువులు పశుపాలకులూ బయటకు ఎలా వచ్చేరా అని. తను దాచిన చోటు చూసాడు. అక్కడ అందరూ ఆ చతురాననుడు ఎలా ఉంచేడో అలానే ఉన్నారు.
"ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో?
నేను సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే వాడిని నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ దేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?” అనుకున్నాడు. బ్రహ్మకి ఒక్క క్షణం లో కనువిప్పు అయింది.
పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమై పోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వస చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప కృష్ణుని మాయామోహితుడిని చేయడం సాధ్యమా? అనుకున్నాడు.
ఇలా అనుకుంటూ వితర్కించుకుంటూ ఆ వత్సలవైపూ గోబాలకులవైపూ చూసేడు. ఆక్షణంలో ఆ విరించికి అందరు గోపబాలురూ, దూడలూ అన్నీ శంఖచక్రగదా వైజయంతీ మాలలతో నీలమేఘశ్యామవర్ణ శరీరంతో చతుర్భుజాలతో, శ్రీవత్ససమనే పుట్టుమచ్చ తో, కౌస్తుభమణితో విరాజిల్లుతున్న వైకుంఠుడులా కనబడ్డారు. ఈ దృశ్యం చూసి ఆశ్చర్యంగా చిత్తరువులా నిలబడ్డ బ్రహ్మని చూసి, పిల్లాడు అల్లరిగా చేసిన పని కి కోపంరాని తండ్రిలా చూసేడు కృష్ణుడు.
ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మపదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా.” అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేసాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేసాడు, మాయంచేసేసాడు.
ఇంతలో అంతటి ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడూ, మృతిచెందినవాడు బ్రతికి వచ్చినట్లు, తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్లు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకూ చూసాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూసాడు. ఎదుట బృందావనం కనిపించింది. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. అటువంటి బృందావనం చూసాడు బ్రహ్మదేవుడు.
అంతటా కృష్ణుడే కనబడ్డాడు ఆ పద్మసంభవునకు. తన హంస వాహనంమీదనుంచి బంగారు చేతికర్ర పడ్డట్టు కింద పడి , కృష్ణుని పాదాలు పట్టుకుని పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు.
అనేక విధాలా స్తుతించేడు. ఓ గణనాతీతా! శ్రీకృష్ణా! ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులూ లెక్కపెట్టలేరు. నేనెంతవిడను. నా గర్వం భంగమైంది తండ్రీ. నన్ను కరుణించి మన్ననం చేయి. ఇలా స్తుతించిన బ్రహ్మను లేవనెత్తి కృష్ణుడు అన్నాడు. " ఓ చతుర్ముఖా! నీకు తమోగుణం ఆవహించింది. నా లీలను తెలుసుకోవాలనుకున్నావు. సరే! ఇక సత్యలోకం పోయిరా. ఇదిగో ఈ శార్దూలం నా భక్తుడు. ఏడాదిగా నన్నే కొలుస్తూ అన్నిటా నన్నే చూస్తు నిరాహారిగా తపస్సు చేసేడు. వీనిని సశరీరంగా నీలోకం తీసుకు వెళ్ళు" అని చెప్పి బ్రహ్మకి సెలవిచ్చి ఆ పులిని ఆశీర్వదించి పంపేడు.
బ్రహ్మ దాచిన దూడలూ , గోపాలబాలురూ అందరూ నిద్రలేచి వచ్చినట్టు వచ్చేరు. వారికి సంవత్సరంపాటు తాము నిద్రపోయేమని తెలియనే తెలియదు.
*********అయిపోయింది****
---------------------------------------------------------------------------------------------------------------------------
బృందావనంలో శ్రీకృష్ణుడు చేసిన అనేక లీలలలో బ్రహ్మదేవునకు చేసిన ఈ గర్వభంగం చాలా ప్రముఖమైనది. నేను చేసిన పని ఏమిటంటే ఓ పెద్దపులి పాత్రని తీసుకురావడం. అంత క్రూరమృగం కూడా ఆ దేవదేవుని చూసి తన స్వాభావికమైన క్రూరత్వాన్ని వదలి కృష్ణుని శరణు కోరడం. బృందావనంలో జంతువులు సహజవైరం మాని నివసిస్తున్నాయి అని అన్నాడు వ్యాసుడు. సహజవైరం మానేస్తే వాటి ఆహారం ఎలా అన్న ప్రశ్న నుంచి ఈ కధ వచ్చింది.
గ్రేట్ sir? ఒక చిన్న సందేహం లోంచి ఎంత మధురమైన కథని పుట్టించేరు..చాలా గొప్ప విషయం ఆ వయసులోనే మీక maturity రావడం..అంతా అప్పుడే వచ్చేసింది కాబట్టి ఇప్పుడింకేమి రాయడానికి మిగల్లేదు అని రాయడం లేదా..రాయండి sir!
ReplyDeleteMeethopaatu mammalnee aa brundavananiki thesukellaru! Chinni krishnuni leelalu marinni chusi tharinche bhagyam maaku ivvandi!
ReplyDeleteచాలా బాగుంది కధ. మంచి చందమామ కధ చదివించేరు. అంటే చిన్న పిల్లలు కూడా ఆసక్తిగా వినేటట్లు రాసేరు. భాగవత కథలని ఇలా చదివిస్తున్నారు. ధన్యులు.
ReplyDeleteపులి పాత్ర నీ కల్పితమా? చాలా బాగుంది.
ReplyDeleteపులి పాత్ర నీ కల్పితమా? చాలా బాగుంది.
ReplyDeleteప్రియ మిత్రమా
ReplyDeleteభాగవతంలోని శ్రీకృష్ణుని బృందావన లీలలను ఎంతో అద్భుతమయిన నీ కథనంతో అందరికి అర్ధమయ్యే రీతిలో అందిస్తున్న నీ అభిరుచికి ప్రయత్నానికి విజ్ఞతకు శతకోటి వందనాలు. నీ మిత్రుడినయినందుకు చాలా సంతోషంగా ఉంది.
నీ మిత్రుడు
గోపాలకృష్ణ
బాగా అనుభవించి, బాగా అనుభవించేలా వ్రాశారు.,, మంచి అనుభూతి కల్గింది జతీంద్రజీ!
ReplyDelete" గర్వ భంగం "
ReplyDeleteజతీంద్ర .......... నీ ఊహా జగత్తులోనించి ,బాపు ,రమణ లాంటి ఒక కమనీయమైన కళాఖండాన్ని సృజించేవు.
అద్భుతమైన భావ వ్యక్తీకరణ, కట్టిపడేసే కథనంపై ప్రత్యేకమైన పట్టు , ఒక దివ్యమైన రచన చదివిన అనుభూతి .గొప్ప కవిని ఆవిష్కరించేవు .ప్రత్యేక అబినందనలు .గ్రూపులో కూడా పోస్టు చేస్తే బాగుండేది .గొప్ప రచనగురించి వ్యాఖ్య చేసే సాహసం చేయరాదు .
శ్రీనివాస్
Brahmademudu garvabhangam ane vishayam theesukoni inthakadha kallaki kttinattu cheppadam chala bagundi.Puli konam alochimpa chesindi - Ratnam garu
ReplyDeleteChala bavundi Mamayyagaru...anniti lo, andari lo aa Bhagavantudu unnaru...ee vishayanni nammi, aachariste ila untundi annamata ani anipinchindi andi...aa bhavana manasanta nindi poyindi...thank you.
ReplyDelete