Saturday, 8 October 2022

జుత్తు కటింగ్... జ్ఞాపకాలు


"మీరోసారి హేర్ కట్ చేయించుకోవాలేమో" ఆజ్ఞలాంటి సలహా పడేసింది శ్రీమతి. ఆవిడ గమనించి అలాంటి సలహా ఇస్తే ఇక తప్పేదేముంది, ఇంత త్వరలో తిరుమల ప్రయాణం కూడాలేదు. 


"అవును. నాకూ అలానే అనిపిస్తుంది" అద్దంలో చూసుకుంటూ గంభీరంగా అని బయటపడ్డాను. 


ఉజ్జోగం వెలగబెడుతున్నప్పుడు ఖచ్చితంగా నెలతిరిగేసరికి అలవాటు పడ్డ సెలూన్ కి వెళ్ళేవాడిని. రిటైర్ అయ్యాక నాకు చీకాకుగా అనిపిస్తేనో...ఇదిగో ఇలా ఆవిడ నోటీసు జారీ చేసినప్పుడో సెలూన్ కి వెళ్ళడం జరుగుతూంది. అదీకాక ఆరునెలలకొకసారి తిరుమలలో పరకామణి సేవ పడితే మూడునెలలు గుండుతో, మూడునెలలు గడ్డం జుత్తూ తప్పేవికావు.. 


ఇంతలో కరోనా వచ్చిపడింది. మూడునెలలు బయటకు వెళ్ళడం బంద్... ఆ తరువాత కూడా 'ఎందుకు రిస్క్ ' అని అర్బన్ కంపెనీ వాడి బిజినెస్ తెలివితేటలవల్ల ఆ మంత్రిగారెవరో ఇంటికే వచ్చి చక్కగా జుత్తుకత్తిరించి, ఒక్క వెంట్రుక కూడా కిందన వదిలేయకుండా నీట్ గా చేసి వెళ్ళడం ఓ పరిణామం. 


ఇవేళ మళ్ళీ మూడున్నరేళ్ళ తర్వాత బయట సెలూన్ లో చేయించుకొని వస్తూంటే చిన్ననాటి జుత్తు తరగడం ప్రహసనాలు గుర్తుకొచ్చాయి. 


గుడివీధిలో మా పెదనాన్న గారి కర్రల దుకాణం వెనక , బడికి ముఃదూ ఉండేవాడు మంగలి అప్పారావు. నాన్నగారు నెలకోసారి వాడ్ని పిలిచి ఆయనకీ నాకు మా తమ్ముడు కి చక చక కత్తిరింపించేవారు. ఆయనకి అర్ధరూపాయి మాకు చెరో పావలా ఛార్జీ. మా ఇంట్లో కి అడుగుపెడుతూనే చిన్న ఖాళీ ప్రదేశం ఉండేది. అందులో కూర్చొని బుర్రలప్పగించేస్తే వాడికొచ్చినట్టు కట్ చేసేసే వాడు. ఓ రోజు మరీచిన్నగా, ఇంకోసారి ఒకదగ్గరెక్కువా ఒకదగ్గర తక్కువ, ఇలా వాడి నైపుణ్యం మా జుత్తు ల మీదే... 


కొంచెం హైస్కూలు మెట్లెక్కేక , శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్ లో అప్పుడే బ్యూటి సెలూన్ అని విద్వాన్ సి హెచ్ (మంగలి) నరసింహులు తెరిచేడు. అందులో హేర్ కట్ చేయించుకోవడం ఓ ఫేషన్ స్టేట్మెంట్ . ఆ రివాల్వింగ్ కుర్చీలో కూచొని వాళ్ళు మంచి తెల్లటి గుడ్డలు కప్పితే ఎదురుగా అద్దంలో చూసుకుంటు స్టైయిల్ గా కట్ చేయించుకోవడం కోసం అమ్మనీ నాన్న నీ సతాయించి డబ్బులు తెచ్చుకోవడం. 


కాలేజీ మెట్లెక్కేక ఇంకా ఏ ఏ సెలూన్లు ఉన్నాయో అని వెతికి వెతికి వెళ్ళడం. ఆ సెలూన్లలో సినీతారల బొమ్మలు, బొమ్మల పుస్తకాలు, సినిమా పత్రికలు చూడటం ఓ సరదా. నా స్నేహితుడు ముత్యం వెంకట రమణ ఉండేవాడు. సెలూన్ లోకి వెళ్ళి అక్కడ దువ్వెనతో తల దువ్వుకొని కొంచెం పౌడర్ అడిగి ముఖానికి పట్టించి వస్తూండేవాడు. 


తరువాత జ్యోతి హేర్ కటింగ్ సెలూన్ అని గౌరీశంకర్ హోటల్ ఎదురుగా వచ్చింది. శ్రీకాకుళం లో పోస్టాఫీసు లో పనిచేసినప్పుడు అంతకుముందు 'ఆరోగ్యాన్నిపుంజుకుంటున్నప్పుడూ'       ..(ఖాళీగా నిరుద్యోగిగా ఉన్నప్పుడు అన్నమాట) ఈ సెలూన్ కే వెళ్ళేవాడిని. అప్పటికి ఇంగ్లీషు నవలలు చదవడం అలవాటు అవడంతో ఆ నవలలలో రాసినట్లు మనకీ ఓ ప్రత్యేకమైన హెయిర్ స్టైలిస్ట్ ఉండాలని ఆ సెలూన్ కే వెళ్ళేవాడిని , మన రేంజ్ లో... 


మా అన్న ఫణికి దేవానంద్ హేర్ స్టైల్ ఉండేది. "ఒరే చూడు" భుజంమీద పొడుస్తు చెప్పేవాడు" మంగళవారం ఉదయాన్నే వెళ్ళాలి సెలూన్ కి. ఎందుకంటే సోంవారం సెలవుకదా ఆ గుడ్డలన్నీ ఉతికించి తెస్తారు." అనేవాడు. 


ఈ మధ్యనే అప్పుడే హేర్ కట్ చేయించుకున్న నన్నుచూసి నాతోబాటే పనిచేసి రిటైర్ అయిన ఓ మిత్రుడు "ఇంకా హేర్ కట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా" అనడిగాడు తన బట్టతలని నిమురుకుంటూ....

Thursday, 1 September 2022

నేనే లేకపోతే

 ఈ వాట్సప్ సందేశం నేను 22/01/2020 లో రాసి వాట్సప్ గ్రూపులలో పంచుకున్నాను.


మళ్ళీ ఇన్నాళ్ళకు ఇది మరో సమూహంలో పంచుకోబడి నా వద్దకే  వచ్చింది ఆశ్చర్యంగా...



నేేేను లేకపోతే ఏంజరిగిఉండేదో.....?



పట్టాభిషేకం జరిగింది. శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు. హనుమ రాముని వద్దకు వచ్చి అన్నారు..
ప్రభూ!  లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంతవరకు , నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది. ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరతభూమిలోనే ఉంటారనీ పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయినవేళలో విభీషణుని సలహామేర తల్లిి
దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధుపురుషుని ద్వారా తెలియజేయబడిందే.. బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని.




అశోకవనం లో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తిదూసిన క్షణంలో , ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతంచేయాలనే బలమైనకోరిక నాలో కలిగింది. కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడి ని వారించి వాడినుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది. ప్రభూ! ఎంతచక్కని అనుభవమిచ్చావు, నేనే కనక వాడిని హతమార్చి ఉంటే నేనే కనక లేకపోతే ఏమయి ఉండేది అనేభావం నాలో పొడసూపేది.


నేనే  లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది.   చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకూకలిిగిిఉండేేది. కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయం రావణుని పత్ని మందోదరి చేత చేయించేవు. దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించిలనుకుంటావో వారి తో ఆ పని నెరవేర్చుకుంటావు. ఇందులో మా మహత్వమేమీలేదు.


దేవా! త్రిజట తన స్వప్ననవృత్తాంతం తోటిరాక్షస స్త్రీలకు చెబుతూ లంకలకి ఒక కోతి వస్తుందనీ, ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని. రావణుడి ఆస్థానంలో రావణసైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించేవని అర్ధమైంది.


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నాతోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు. లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాట ఈ విధంగా నిజమవుతున్నందుకు. లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ.. ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపేవే అటువంటి ది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!
***
అందుచేత జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు. అందుకని నేనేకనక లేకపోతే ఏమీజరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు.