Sunday, 27 September 2020

హోమగుండం

 వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చక్కని ఇల్లు. జీవితపు తొలి దశలో ఉన్నారేమో తమ నవ్య ఆలోచనలన్నిటికీ రూపమిచ్చి చిన్పదైనా పదిలంగా అల్లుకున్న పొధరిల్లు లాగా. 


గృహప్రవేశానికి ఆహ్వానపత్రం సామాజిక మాధ్యమంలో పంపించినా, స్వయంగా ఫోన్ చేసి మరీ మరీ రమ్మని పిలిచేరు. "ఆట్టే ఎక్కువ మంది రావడం లేదంకుల్. అందరూ కుటుంబ సభ్యులు మాత్రమే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు ఆంటీ తప్పకుండా రావాలి"అని దంపతులు ఇద్దరూ కోరితే తప్పక హాజరయ్యేం. అందరూ ముఖానికి మాస్కులతో, మరీ జాగ్రత్త ఉన్నవారు చేతుల కి గ్లవ్స్ తో ఉన్నారు.

పూజారి గారు హోమం చేస్తున్నారు. యజమాని కి చెప్పేరు "స్వాహ" అన్నప్పుడు హోమంలో నెయ్యి వెయ్యండని. మా అందరికీ హోమద్రవ్యాలు ఇంకొక పూజారి ఇచ్చేడు "స్వాహ" అన్న తరువాత వెయ్యాలి అనే ఆదేశంతో.

అందరూ ఆయన చెప్పినట్టే స్వాహా మంత్రం అన్నాక చిటికడంటే చిటికెడు హోమ ద్రవ్యాలను హోమంలో వేయసాగేం. అందరం కొంచెం కొంచెం మాత్రమే వేయసాగేం ఎందుకంటే అందరి మనస్సులలో యాగ ప్రక్రియ పూర్తి కాకముందే హోమద్రవ్యాలు అయిపోతాయేమో అన్న అనుమానం. ఆ యజమాని కూడా నెయ్యిని చిన్న చెంచాతో కొద్ది కొద్దిగా వేస్తున్నాడు, నెయ్యి అయిపోతుందేమో అన్న భయంతో.

మంత్రోచ్ఛారణ కొనసాగింది. స్వాహా అన్నప్పుడు అందరం హోమాగ్నిలో ద్రవ్యాలు నెయ్యి వేస్తున్నాం. హోమ క్రతువు పూర్తయ్యింది.

మా అందరి చేతుల్లో హవనద్రవ్యాలు చాలానే మిగిలి పోయాయి. నెయ్యి అయితే సగం కూడా వినియోగించబడలేదు.

హోమం పూర్తయ్యాక పురోహితులు మాకు మిగిలిన హోమద్రవ్యాలు హోమంలో పూర్తిగా వేసేయమని చెప్పేరు. ఆ యజమానిని కూడా నెయ్యి పూర్తిగా వేసేయమన్నారు.

అందరం ఒక్కసారిగా హోమంలో మా చేతుల్లో మిగిలిన ద్రవ్యాలను అగ్ని లో పడేశాం. మిగిలిన నెయ్యి ఆయన వేసేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో అంతా పొగ నిండిపోయింది. ఆ గదిలో ఎవరూ ఉండలేనంత పొగ. పైగా మాస్కులు. అందరం దగ్గుకుంటూ ఆ గదినుండి ఆ అపార్ట్మెంట్ నుండి బయటకు పరిగెత్తాం. ఆ పోగ బయటకు కూడా రాసాగింది. ఆ మంట మళ్ళీ రాజుకొనేదాకా ఆ పొగలోకి వెళ్ళే వీలు కాలేదు ఎవరికీ. అందరం చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. .
.
.
.
.
.
.
.
.
కధ ఇక్కడతో అయిపోయింది.
.
.
.
.
.
.
.
ఒక్కవిషయం అందరికీ అవగతమైంది. ఆ హోమం పూర్తవడానికి పూజా సామానులన్నీ హోమంలోనే వెయ్యాలి. కానీ అందరూ తమతమ అనుమానాలతో కొంచెం కొంచెం వేస్తూ ఆ ద్రవ్యాలను మిగిల్చేరు.

దాదాపుగా మనం కూడా ఇలాగే చేస్తాం. మన స్వభావం ఇంతే. భవిష్యత్తులో అవసరమని మనం ఇలాగే అనేకమైనవి దాచుతూ ఉంటాం. మనకి ఆ క్షణంలో నచ్చిన వ్యాసం. మనకి వచ్చిన ఉత్తరాలు, ఎన్నో వందల ఫోటోలు జ్ఞాపకాలను అలా దాచుతూ దాచుతూ ఓ ఉదయం పారేస్తాం. ఇవే చివరకు స్థలాలు ఇళ్ళు రూపంలో నగా నట్రా రూపంలౌ బ్యాంక్ లో ఖాతాల రూపంలో మిగిలి పోతాయి.

జీవితమనే యాగం పూర్తవుతుంది. కానీ చాలామటుకు పూజాసామగ్రి మన చేతులలో మిగిలి పోతుంది. జాగ్రత్తగా ఉపయోగించాలనే మన తాపత్రయంలో మనం తెచ్చిన హోమాద్రవ్యాలు హోమంలో వేసేయాల్సిందే అన్న సామాన్య విషయం కూడా మర్చిపోతాం. వాటిని దాచి దాచి ఏం ప్రయోజనం. ఆఖరికి వాటిని హోమంలో వేయవలసిందే కద. అప్పుడు మనం పొగలో బాధపడటం తప్పదుగా.

మన జీవితాలూ హోమకుండం లాటిదే. జీవితం మనం చేసే హోమం.

ఏదో ఒక రోజు మన సంపాదించింది అంతా హోమకుండం లో వేసేయాల్సిందేగా.

నిజమైన హోమం ఎటువంటిదంటే

సంపాదించినది , తెచ్చినదీ సరిగ్గా ఉపయోగపడాలి, జీవన హోమంలో... పూర్తయిపోకూడదు. అలా అని వ్యర్ధంగా మిగలకూడదు. ఇదే జీవితాన్ని సరిగా నిర్వహించుకోవడమంటే. కలలలో జీవిస్తూ జీవించడాన్ని మరిచిపోరాదు.


ఆఖరుగా... మనం జీవితంలో ఎన్నిసార్లు ఊపిరి తీసుకున్నామనే లెక్క కాదు ముఖ్యం.... ఆ ఊపిరి లో ఎన్ని క్షణాలు మనం నిజంగా జీవించాం అన్నది ముఖ్యం. 

నీళ్ళు లేని కళ్ళు.


  

                                                                                                          ---మోదుకూరి జతీంద్రశర్మ

" ఆనందం తండ్రి పోయారట" నా మిత్రుడు ఫోన్ చేసి చెప్పేడు. క్లాసులో ఉన్న నేను సాధారణంగా క్లాసు అవుతుంటే ఫోన్ తీయను. కానీ ఆవేళ ఇంకో క్లాసులో ఉన్నాను , కుర్రాళ్లు పరీక్ష రాస్తూంటే కాపలాగా. పరీక్ష సమయం అవగానే తొందర తొందరగా పేపర్లు లెక్క చూసి తోటి ఉపాధ్యాయునికి అప్పచెప్పి ఆనందం ఇంటికి పరుగు తీసేను. 
అప్పటికే ఊర్లో ఉన్న చాలామంది ఆనందం ఇంటికి చేరేరు. గబగబా ఇంటిలోకి వెళ్ళేను, ఆనందానికి కావలసిన వాడిని అని అందరికీ తెలుసు కనుక నన్నెవరూ అడ్డగించలేదు. ఆనందం హాల్లో సోఫాలో ఒంటరిగా కూచున్నాడు. మొఖం వాడిపోయి ఉంది. అందరూ ఆనందానికి దూరంగా గుంపులు గుంపులు గా నిలబడి లోగొంతులతో మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఇటువంటి సమయంలో అందరూ ఏడుస్తున్న ఆనందం చుట్టూ చేరి అతన్ని ఓదార్చడం సహజం. కానీ ఆనందం కన్నీరు పెట్టడు. ఆనందం కళ్ళు నీళ్లు లేని కళ్ళు. ఆనందం మనసులో ఎంత బాధపడ్డా ఒతని కంటినుంచీ ఒక్కబొట్టు కూడా కన్నీరు రాదు. 
ఆనందందీ నాదీ లాగూలనాటి స్నేహం. వాడు పుట్టిన జిల్లా ఆసుపత్రిలోనే నేను వాడికన్న రెండు గంటల ఆలస్యంగా పుట్టేను. అందుకని నామీద చిన్ననాటినుండీ ఆధిపత్యం చూపించేవాడు. నాకు అక్కలేకానీ, అన్నదమ్ములు లేకపోవడంతో, నాకు అన్న వాడే అయేడు.
మేమిద్దరం పక్క పక్క ఇళ్ళలో ఉండటం, మా నాన్నగారిదీ, ఆనందం తండ్రిదీ వ్యాపారాలే అవడంతో మా కుటుంబాలు రెండూ మంచి స్నేహంగా ఉండేవి. అలా ఎలిమెంటరీ స్కూలునించి, కాలేజ్ చదువు దాకా కలిసే చదువుకున్నాం. నాకు వ్యాపారం చేసే ఆసక్తి ఉండేది కాదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్శిటీ లో చేస్తుండగా నాన్న పోయారు. మా అమ్మ అంతకు ముందే పోవడంతో ఆ వ్యాపారాన్ని అమ్మివేసి, నేను లెక్చరర్ గా ఉద్యోగం చేసుకోసాగేను. ఈ పరిస్థితులన్నిటిలో ఆనందం చేసిన సహాయ్యం మరువలేనిది.
ఆనందం వాళ్ళ కుటుంబవ్యాపారం చేస్తూ శ్రీకాకుళం లోనే ఉండిపోయాడు. నేను ప్రభుత్వ కళాశాలలోనే చేస్తున్నాను. మళ్లీ మా మధ్య స్నేహం కొత్తచివురులు తొడగసాగింది. ఆనందానికీ నాకూ పెళ్ళిళ్ళు అయేయి. మా కుటుంబాలమధ్య కూడా అనుబంధం పెనవేసుకుంది.
సుమారుగా నలభై మూడు సంవత్సరాలక్రితం కృష్ణాజిల్లా దివి సీమని ఒక పెను ఉప్పెన తాకిన సంఘటన ఆ తరం వాళ్ళకి అందరికీ గుర్తుండే ఉంటుంది. నవంబరు 19 1977 వ తారీఖున మొదలైన వాన, తుఫానై, ఉప్పెనై దివి సీమను ఊడ్చిపెట్టింది. గంటకి 130 నించి 140 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులకు భారీ చెట్లునేలకొరిగాయి. గ్రామాలకి గ్రామాలు శ్మశానాలుగా మారిపోయాయి. అధికారికంగా సుమారు పధ్నాలుగు వేలమంది ప్రాణాలు కోల్పోతే, అనధికారికంగా సుమారు యాభైవేలమంది చనిపోయారు. శవాలగుట్టల మధ్య అయినవారిని వెతికేందుకు కొన్ని రోజులు పట్టింది. వరద నీరు నిలిచి పోవడంతో శవాలను కాల్చటానికి వీలు లేని పరిస్థితి.
అప్పుడు సహాయక చర్యలకి వెళ్ళిన వాళ్లలో ఆనందం ఒకడు. అప్పడే ఆనందానికి తన మనసు దారుణాలకి చలించదనే విషయం అవగతమైంది. ఆ హృదయవిదారక ఆపత్తిలో పశువుల శరీరాలు అగ్నికి ఆహుతి ఇవ్వడం దగ్గర్నించీ, శవాలని సామూహిక దహనం చేసే పని దాకా, ఇతరులు ఆ దృశ్యాన్ని చూసి భరించలేక దూరం జరిగినప్పుడు, నేనున్నానని ముందుకు వెళ్ళి అలుపెరగని సహాయం చేసేడు. ఆతని సహాయక చర్యలని మెచ్చుకొని రాష్ట్రప్రభుత్వం ఆ ఉప్పెన పునరావాస చర్యలు అయిపోయాక, సత్కరించింది కూడా.
అదిమొదలు, ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, ఆనందం ఆ బాధితులకు తన చేయూతని ఇవ్వడం ఆనవాయితీ అయింది.
ఆనందం తో నేను చాలాసార్లు అన్నాను. "ఆనందం! నీకు ఒక రకమైన వ్యాధి ఉందేమో.. చూడబోతే ఎక్కడైనా ప్రమాదం జరగకపోతే బాధ పడేలా ఉన్నావు. "
" ఎందుకలా అనుకుంటాను? ప్రమాదం జరిగితే సహాయం చేయడం తప్పుకాదు కద!" అన్నాడు ఆనందం. 
ఈ రోజు కూడా ఆనందంకి కళ్ళనీళ్ళు రాలేదు. ఆనందం తండ్రి శ్రీకాకుళం లో పేరున్న వ్యక్తి కావడంతో దాదాపుగా ఊరు ఊరంతా కదలి వచ్చింది. ఆనందం కళ్ళలో కనబడని కన్నీళ్లు అతను ఓ కసాయివాడిగా, కన్నతండ్రి పోయినా కన్నులనీరు పెట్టనివాడిగా అందరూ భావించేరు. కొంతమంది ఆయితే ఆనందం మొఖంమీదే తమ ఆలోచనని చెప్పేరు. నేను మౌనంగా ఉండిపోయాను. నాకు ఆనందం సంగతి తెలుసు కాబట్టి. 
ఒక పెద్దాయన   ఆనందం దగ్గరకు వచ్చేడు. "చూడు బాబూ! నాకూ మీ నాన్న పోవడం చాలా బాధగా ఉంది. నాకన్నా చిన్నవాడు. ముందుగా పోతాడనుకోలేదు. కానీ బాధని మనసులో ఉంచుకోవడం మంచిది కాదు బాబూ... కళ్ళనీళ్ళు మనసులో బాధని తగ్గిస్తాయి" అన్నాడు. 
నేనేదో అనబోతే ఆనందం కళ్ళతోనే వారించేడు. "అలాగే అంకుల్"అని మాత్రం అన్నాడు. 
ఆయన మరికాస్సేపు ఓదార్పు మాటలాడి వెళ్ళిపోయాడు. "వీళ్ళకి ఏం చెప్పినా అర్ధం చేసుకోలేరు. వదిలేయ్" అన్నాడు ఆనందం నాతో. 
ఇంతలో తరువాతి కార్యక్రమాలు చేయడంలో నలుగురికి పనులను పురమాయించడంలో బిజీ అయిపోయాడు ఆనందం. నేను ఆనందం తండ్రి పార్ధివదేహం ఉన్న చోటికి వెళ్ళాను. బయట ఓ షామియానా వేసి ఓ బల్లమీద పడుకో బెట్టేరు దేహాన్ని.   ఆ దేహం చుట్టూ చాలామంది చేరి ఉన్నారు. కొన్ని కుర్చీలు లాన్లో వేసి ఉన్నాయి. కొంతమంది ఆ కుర్చీలలో కూర్చుని లోగొంతుకలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకాయన ఆ జనానికి టీలు అందిస్తున్నాడు. ఎవరెవరో వచ్చి ఆ పార్ధివదేహానికి నమస్కరించి, కాసేపు కళ్ళు మూసుకొని నిలబడి, తెలిసిన వారు కనబడితే తలపంకించి వారి దగ్గరకు వెళ్ళి మాట్లాడుకోసాగేరు. అప్రయత్నంగా నాకు కొంతమంది మాటలు చెవిలో పడ్డాయి. ఆ మాటల సారాంశం ఏమిటంటే ఆనందానిది రాయిలాంటి హృదయం. తండ్రి పోయినా కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఎంత చేసేడాతండ్రి ఈ కృతఘ్నుడికి. 
నాకు అర్ధంకాని విషయం ఏమిటంటే కళ్ళనీళ్ళు పెడితేనే ప్రేమ ఉన్నట్టా లేకపోతే రాయేనా... ఆనందం తండ్రి చివరిరోజుల్లో తండ్రికి ఎంత సేవ చేసేడో వీరికి తెలియదు. లోకానికి కనబడేటట్టు గుండెలు బాదుకొని ఏడిస్తే వీరికి సంతోషమేమో.. వారికి ఓదార్చే అవకాశం లేదనా ఏమిటి వీరి ఫిర్యాదు... 
ఇంతలో ఆంబులెన్స్ వచ్చింది. ఆ తండ్రికి చివరి వీడుకోలు పలకడానికి బయటకు వచ్చింది ఆనందం భార్య. ఆమె కంటికీమింటికీ ఏడవసాగింది. ఆడవాళ్లు అందరూ ఆమె చుట్టూ చేరి ఓదారుస్తున్నారు. ఆంబులెన్స్ వీధి మలుపు తిరిగే దాకా ఉండి లోపలకు వెళ్ళిందామె. నా స్కూటర్ ఎక్కి ఆంబులెన్స్ వెనక వెళ్ళేముందు ఆమెని కలసి అస్పష్టంగా నా విచారాన్ని తెలియజేసేను. ఆమెకి మామగారంటే ప్రత్యేకమైన అభిమానమూ లేదు అలా అని ఆయన్ని దూరం పెట్టనూ లేదు. 
ఆ కార్యక్రమం అయినదాక ఆనందంతో ఉండి అంతా  అయినాక ఆనందంతో మరోసారి మాట్లాడి ఇంటికి బయల్దేరేను. 
ఆనందం ఎదిగొచ్చిన ఏకైక కొడుకు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో పోయాడు. ఆతడు అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించేందుకు వీసాకోసం హైదరాబాద్ వెళ్ళి ఓ ప్రైవేటు బస్సులో విశాఖపట్నం వస్తూ ప్రమాదం లో మరణించేడు. అప్పడుకూడా ఆనందం ఏడుస్తాడో లేదో చూడటానికి కొంతమంది వచ్చేరట. ఆనందం కంట నీరు పెట్టలేదు.  అప్పుడే వచ్చింది ఆనందానికి ఆ పేరు. నీళ్ళు లేని కళ్ళమనిషి అని. ఏదో వ్యాధి అని కూడా ప్రజలు అనుకున్నారు. 
ఆనందానికి తన కళ్ళలో నీళ్లు లేవని అందరూ ఆనుకుంటున్నారని కూడా తెలిసింది. ఆ తరువాత కూడా చాలా ప్రమాదఘటనలలో ఆనందం సహాయచర్యలలో పాల్గోవడం మానలేదు. ఆనందం పేరు ఊరిలో మారుమ్రోగసాగింది. తాపీగా జిల్లాలో, రాష్ట్రంలో ఏ ప్రకృతి విపత్తి వచ్చినా ఆనందంకి కబురు వెళ్ళసాగింది.
2014 లో విశాఖపట్నం తీరాన్ని హుద్ హుద్ తుఫాన్ తాకింది. ఈసారి ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా, నగరానికి చుట్టూఉన్న పల్లెలకి చాలా నష్టం కలిగింది. మామూలుగానే సహాయచర్యలలో ఆనందం చురుగ్గా పాల్గొన్నాడు. ఎక్కడ ఏ అవసరమొచ్చినా ఆనందాన్ని అధికారులూ, ఎమ్మల్యేలూ అందరూ ఆనందాన్ని సలహాలు అడగడం, ఆనందం ఆధ్వర్వయంలో పునరావాస చర్యలు చేపట్టడం జరిగింది.
ఇదంతా గమనించిన ఓ పత్రికా విలేఖరి ఆనందాన్ని ఇంటర్వ్యూ చేసి ఆనందం దివి సీమలో చేసిన సహాయచర్యలతో మొదలుపెట్టి ఆనందానికి వచ్చిన ప్రభుత్వ పురస్కారాలతో, ఆనందం సహాయం చేస్తూండగా తీయబడిన ఫోటోలతో ఓ ప్రముఖ దినపత్రికలో వ్యాసం రాసేడు. ఆ వ్యాసం చూసి ఓ టెలివిజన్ ఛానెల్ వారు ఇంటర్వ్యూ ప్రసారం చేసేరు. 
ఈ వ్యాసం , ఇంటర్వ్యూ అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేయి. ఆయన ఆనందాన్ని పిలిపించి మాట్లాడి , రాష్ట్ర విపత్తుల సహాయ సంస్థకి అధ్యక్షుడు గా నియమించేడు రాష్ట్ర సహాయమంత్రి స్థాయిలో. 
ఇప్పుడు ఆనందానికి రక్షణకు సెక్యూరిటీ సిబ్బంది, అమరావతిలో ప్రధాన కార్యాలయం, ఈ ఊరిలో ఓ కార్యాలయం. అధికారంతో వచ్చిన మందీ మార్బలం హడావుడి అన్నీ మొదలయేయి. శ్రీకాకుళం లో ఓ పౌర సన్మానం కూడా జరిగింది. అందులో వక్తలందరూ ఆనందం నిస్వార్థ సేవని వేనోళ్ళ పొగిడారు. 
ఆ సన్మాన కార్యక్రమానికి నాకూ ఆహ్వానం వచ్చింది. నాకోసం వేదిక దగ్గరగా ఓ కుర్చీ ప్రత్యేకించేరు ఆనందం సూచనతో. కానీ నేను వెళ్ళేసరికే ఓ ఛోటానాయకుడు ఆ కుర్చీలో కూర్చోవడంతో నేను వెనక నిలబడి ఆ కార్యక్రమాన్ని చూసేను. 
ఆ రోజు అర్ధరాత్రి ఆనందం నేను ఇద్దరమే నాగావళి నది వారధిమీద ఉన్న గట్టుమీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాము. 
ఆనందం తను చేయబోయే ప్రణాళికలు అన్నీ చాలా ఉత్సాహంగా చెప్పేడు. 
అంతవరకూ ఆ సెక్యూరిటీ గార్డులు కూతవేటు దూరంలో నిలబడే ఉన్నారు. 
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఆనందం తన పదవిపోతుందనే అనుకున్నాడు. కొత్తముఖ్యమంత్రి అంతకుముందు ప్రభుత్వం చేసిన నియామకాలు అన్నీ రద్దుచేసి తన వారిని నియమించడం మొదలుపెట్టారు. ఆనందం ఆ ముఖ్యమంత్రి ని కలసి తన రాజీనామా ఇవ్వబోతే ఆయన వారించేడని చెప్పేడు ఆనందం. ఏడాది గడిచింది కొత్త ప్రభుత్వం కొలువై. ఆనందానికి తనను పదవినుంచి మార్చరన్న నమ్మకం ఏర్పడింది. 
*********
ఆ వార్త వింటూనే ఆనందం ఇంటికి పరుగుతీసేను. 
ఎప్పుడూ ఎంతోకొంతమంది జనంతో కళకళలాడుతూ ఉండే ఆనందం ఇల్లు దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. ఓ ఇద్దరు బయట లాన్ లో మాట్లాడుకుంటున్నారు గుసగుసగా. లోపల హాల్లో ఇద్దరు.  మేడమీద ఉన్నాడన్నట్టు ఓ వ్యక్తి సైగ చేసేడు, ఆనందం చిన్ననాటి స్నేహితుడిగా నన్ను ఆనందం అనుయాయులందరికీ తెలుసు. మేడ మీదకి వెళ్ళాను. పడకగది చేరుతుండగా చిన్నగా వినబడింది, వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం. ఆశ్చర్యపోతూ పడకగది తలుపు మెల్లగా తోసేను. 
నేలమీద కూర్చుని, మంచం మీద తలానించి, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆనందం.  చూసి మ్రాన్పడిపోయి నిలబడిపోయాను. అరవయైదేళ్ళ స్నేహంలో ఆనందం కళ్ళనీళ్ళు పెట్టగా చూడటం కాదు, భోరుమని ఏడవటం కూడా అదే మొదటిసారి కావడంతో.... ఎందుకంటే ఎంత బాధ కలిగినా ఆనందంకి కంటనీరు రాదు. ఎంత దారుణమైన, హృదయవిదారకమైన దృశ్యాన్ని చూసినా చలించడు. అటువంటి ఆనందం ఇలా... నేను వచ్చిన సంగతికూడా పట్టించుకోకుండా.... వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆపకుండా... ఓ ఆనకట్ట తెగిపోతే వచ్చే నీటి ప్రవాహంలా.. భోరుమని వర్షం పడుతున్నప్పుడు చూరునుంచి కారే నీటి ధారల్లా వాడి కంటనీరు చెక్కిళ్ళమీంచి కారి, మంచం మీద పడి పోతోంది. 
పక్కన కూర్చొని అనునయంగా ఆనందం భుజం మీద చెయ్యివేసేను. నా స్పర్శతో నా వైపు తిరిగి నన్ను వాటేసుకుని "అయిపోయిందిరా! అంతా అయిపోయింది" అంటూ ఓ కాగితం నా చేతిలో ఉంచేడు. ఆనందం కళ్ళనీళ్ళు ఆ కాగితం మీద అక్కడక్కడ పడి ఉన్నాయి. 
ఆనందాన్ని రాష్ట్ర విపత్తుల సహాయసంస్థకి అధ్యక్షునిగా తప్పిస్తూ జిల్లాలో ఇంకోక వ్యక్తిని నియమిస్తూ తెలియజేసే ఆదేశం అది. 
ఆనందం, ఎవరి కళ్ళు నీళ్ళు లేని కళ్ళని అనుకుంటున్నామో.. ఎంత హృదయవిదారకమైన సంఘటనని చూసి కూడా ఎప్పుడూ కంటనీటి చుక్కరాల్చని ఆనందం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..... 
పదవి పోయినందుకు. 
మ్రాన్పడి కూర్చున్నాను ఆనందాన్ని చూస్తూ. 
*******అయిపోయింది****

Saturday, 26 September 2020

గర్వభంగం.

                                                                    
                                                                                                          ----మోదుకూరి జతీంద్ర శర్మ

"ఈ రోజు బృందావనం అంతా కొత్తగా కనిపిస్తున్నాది కదా?" అడిగేడు నందుడు తనతో వస్తున్న ఉపనందుడ్ని.  కావడానికి గ్రీష్మం అయినా, పొగడ చెట్టు విరగబూస్తున్నాది. దారంతా పొన్న పూలు తివాచీలాగా పరచి ఉన్నాయి. బృందావనం అంతా పువ్వులు పూసిన చెట్లతో వసంతం అప్పుడే వచ్చిందా అన్నట్లున్నాది. ఆ పొగడపూల దారిమీద ఆవు దూడల గిట్టల గుర్తులు,  ఆ వెనుకనే వాటిని తోలుతూ వెళ్ళిన బాలగోపాలకుల చిన్న చిన్న అడుగులూ కనిపిస్తున్నాయి. దూరంనించి బాలకృష్ణుని మురళీరవం గాలిలో తేలుతూ ఆహ్లాదంగా వినవస్తూంది. 'ఎంతో దూరం లేరు  ' అనుకున్నాడు నందుడు. 
వారందరూ మధురకి కప్పం కట్టడానికి వెళ్ళి బృందావనం తిరిగి వస్తున్నారు. సాయంత్రం కావొస్తూంది. చీకటి పడక ముందే వ్రజం చేరేందుకు తొందరగా నడుస్తున్నారు. 
"గత ఏడాదిగా నాకైతే రోజూ కొత్తగానే కనిపిస్తున్నాది, రాజా !" అన్నాడు ఉపనందుడు. 
నందుడికి రేపల్లె వదిలి బృందావనం వచ్చిన సంఘటన అంతా కళ్ళముందు కదిలింది. మూడు సంవత్సరాలైెంది వారు బృందావనం వచ్చి. రేపల్లెతో పోలిస్తే కన్నయ్యకి రాక్షసపీడ తగ్గినట్టే ఉంది. అన్న బలరామునితో ఇతర గోపబాలకులతో దూడలని మేతకి తీసుకు వెళ్తున్నాడు. 
" అవును. మీరు గమనించేరో లేదో.. ఆవులు దూడలు తాగేక కూడా ఎక్కువ పాలు ఇస్తున్నాయి. సాధారణంగా ఒక దూడ పుట్టేక మళ్లీ చేపుకొచ్చిన ఆవు దూడకి పాలు ఇవ్వదు. గానీ మరో దూడ పుట్టినా రెండు దూడలకీ పాలు ఇస్తున్నాయి. అయినా ముందు కన్నా పాలు ఎక్కువగానే ఉంటున్నాయి. రాత్రి అయితే ఎడ్లు దూడలకు కాపాలాగా అన్నట్లు వాటి చుట్టూనే ఉంటున్నాయి. ఏడాదయి మన మందలో పశువులని క్రూరమృగాలేవీ చంపడంలేదు. " అన్నాడు నందుడు. 
" అంతా దేవుని దయ!" అన్నాడు మరో గోపుడు. "ఈసారి ఇంద్రుని పూజ ఘనంగా చెయ్యాలి."
సరే అన్నట్టు తలూపేడు నందుడు. దూడలని తీసుకువెళ్తున్న కృష్ణుడు వాళ్ళూ దగ్గరయే సమయంలో, కన్నయ్య వెనక్కి తిరిగి చూసేడు. నందుని చూడగానే ఆనందంగా,  "అయ్యా !" అంటూ చేతులు చాచుతూ పరిగెత్తుకు వచ్చేడు. చేతిలో ఉన్న కర్రని పక్కన ఉన్న ఓ గోపుడికి ఇచ్చి, తన చేతులు చాచి, వస్తున్న చిన్ని కొడుకుని ఎత్తుకున్నాడు. "అయ్యా అయ్యా మరే.. ఇవేళ ఏమయిందో తెలుసా...... " అంటూ ఏవో  కబుర్లు చెప్తున్న కొడుకు మాటల్లో పడి, తనకి ముందు వచ్చిన ఆలోచనలన్నీ మరిచిపోాయాడు నందుడు. పక్కనే నడుస్తూ వస్తున్న బలరాముడు ఇదంతా గమనించి చిన్నగా నవ్వుకున్నాడు. 
ఆరోజు మధ్యాన్నమే కన్నయ్యని తానూ అదే ప్రశ్న అడిగేడు చుట్టూ ఎవరూ లేకుండా చూసి... "స్వామీ! గత కొన్ని మాసములుగా చూస్తున్నాను. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీదా దూడల మీదా గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకు వచ్చింది; వీరు ఇదివరకు మీ ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో, ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడ ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే మిమ్ము చూసినట్లే ప్రేమా, ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను. మానవులు గానీ దానవులు దేవతలు కానీ చేసిన మాయ కాదు కదా. లేక నా స్వామి అయిన మీ యొక్క మాయ యేమో.". 
అన్నమీద జాలికలిగింది కన్నయ్యకి. "అన్నా! నీకు కలిగిన సందేహం సరైనదే. ఏంజరిగిందంటే..." కృష్ణుడు చెప్పసాగాడు. 
సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఓ రోజు బలరాముడు క్రేపులతో అడవికి రాలేదు. కృష్ణుడు మిగిలిన గోపబాలురూ యధావిధిగా దూడలతో బయల్దేరారు. తల్లి యశోద చల్ది ఓ కుండలో పెట్టి దాన్ని చక్కగా అలంకరించిన ఉట్టెలో పెట్టి, చిన్నారి కృష్ణుని కి చక్కగా తలదువ్వి, కొప్పులో పూదండ చుట్టి, నెమలి పింఛం అందంగా అమర్చి, పెద్దవాడు బలరాముడు రావడంలేదని జాగ్రత్తలు చెప్పి పంపింది. నందుడు వారికి కాపలాగా ఇద్దరు బలాఢ్యులైన గోపులను పిల్లలకి రక్షణ గా పంపేడు. "వనంలో ఓ పెద్దపులి తిరుగుతూన్నది. ఏమరక ఉండండి." అంటూ జగద్రక్షకుడికి రక్షణగా పంపేడు. 
పిల్లలు ఆడుతూ పాడుతూ మధ్యాహ్నానికి ఓ కొలను పక్కన చేరేరు. అక్కడే ఉన్న ఓ పెద్దరాయి మీద అందరూ కూర్చొని చల్దులు ఆరగించసాగారు.  ఓ పక్కగా గడ్డి మేస్తున్న దూడలవైపు ఓ కన్నేసి ఉంచేడు కృష్ణయ్య. ఆ లేగలు గడ్డి మేస్తూ మేస్తూ దూరంగా పోయాయీ. ఇంతలో పులి గాండ్రింపు కూడా వినబడడంతో రక్షణకు వచ్చిన ఇద్దరు గోపాలురూ అటువైపు పరిగెత్తారు. 
" మిత్రులారా! మీరు సావకాశంగా చల్దులారగించండి. నేను దూడలని వెదకి తెస్తాను" అని కృష్ణుడు బయల్దేరాడు. అప్పుడే 
బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేడు. "లీలామాత్రంగా సర్వలోకాలనూ సృష్టిచేసి, పోషించి , తననుండి పుట్టిన లోకాలను తన లోనే కలుపుకొనే జగన్నాధుడు, అన్నీ తానై, అన్నిటా తానైన వాడు తనను కూడా సంకల్ప మాత్రం చేత పుట్టించిన తన తండ్రి నారాయణుడా ఈ గోపబాలుడు... ఇలా ఒక దూడ కోసం వెతుక్కుంటున్న ఈ నందనందనుడా దైవకార్యాన్ని పూర్తి చేయడానికి అవతరించిన శ్రీహరా.? కంసాది దానవులను చంపగలిగే శక్తి ఈ నరుడికి ఉందా? ఈ పిల్లవాడు చూడబోతే అర్భకుడు. అంతమంది రాక్షసులను వధించేడంటే నమ్మకం కలగడంలేదు. గోరంతలని కొండంతలు చేయడం నారదునికి అలవాటేగా! ". నరలోకంకి వచ్చిన సృష్ఠికర్త కూడా మనుష్యుల లా ఆలోచించడం మొదలు పెట్టాడు. 
"ఈ గోపకులందరినీ దాచి ఉంచితే ఏంచేస్తాడీ గొల్లపాపడు?. పనిలోపనిగా ఆ వత్సములను కూడా దాచితే కనుగొనగలడా?" అనుకున్నాడు. వెంటనే సంకల్పమాత్రం చేత ఆ దూడలనీ, ఆ గోపబాలకులనీ ఓ గుహలో దాచేసాడు. వారు సహాయం కోసం అరవకుండా వారిని నిద్రలో ముంచేసాడు. వారికి ఆకలిదప్పులే లేకుండా చేసాడు. కృష్ణయ్య వస్తున్న అలికిడి విని అదృశ్యమైనాడు. 
దూడలకోసం వెదకి అవి కనబడక వెనక్కి వచ్చేసి ఉంటాయని తాము చల్దులు తిన్న స్థానానికి వచ్చేడు బాలకృష్ణుడు. అక్కడ తన నేస్తాలూ కనబడలేదు. ఒక్క క్షణం ఏం జరిగిందని ధ్యానించేడు. తన బిడ్డడైన కమలాసనుని పని తెలిసి చిన్నగా నవ్వుకున్నాడు. 
ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్నుకప్పి మోసం చేసాడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం మనకెందుకు వద్దులే” అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ; గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు."అనుకుంటూ  ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు.
సాయంత్రం అయింది.
దూడలని ఇంటికి మరల్చి వ్రజం చేరేడు. వ్రజంలో ఇళ్ళన్నీ  అర్ధ చంద్రాకారంలో  ఏర్పాటు చేసేడు నందుడు. ప్రవేశం దగ్గర ఒక ప్రక్క నందుడి ఇల్లూ , రెండో పక్క ఉపనందుడి ఇల్లూ. ఎవరైనా లోపలికి రావాలంటే ఈ రెండు ఇళ్ళలోని కాపలాదారులను, వ్రజ రక్షకులనూ దాటి రావాల్సిందే. 
అందరు పిల్లలూ వాళ్ళ దూడలను సరిగ్గా తోలుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేరు. "అమ్మా! ఆకలే!" అంటూ వచ్చిన పిల్లలని చూసిన ఆ వల్లవ వనితలు తాము కృష్ణుని చూస్తున్న అనుభూతిని పొందేరు. కళ్ళముందు తమ బిడ్డలే. రోజూ చూస్తున్న వారే. వాళ్ళ హావభావాలలో ఏమీ తేడా కనబడ్డంలేదు. కానీ వీళ్ళని చూస్తుంటే ఇవేళ విచిత్రంగా కన్నయ్యని ముట్టుకున్నట్టు, యశోదానందనుడు తమ ఒడిలో కూర్చున్న భావం కలిగింది అనుకున్నారు. ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో; ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు.
ఆవులు తమ దూడలను చూస్తూనే తమ పొదుగులనుంచి ఆప్యాయంగా పాలు కురిపించసాగేయి. తనివితీరనట్టు తమ తమ దూడలని పదే పదే నాకసాగాయి. 
గోపికలకు, గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు.
పూర్వం బాలకృష్ణుని మీద తమకు మిక్కిలి అధికమైన ప్రేమ కలిగినట్లు. ఈ గోపబాలకుల పైన కూడ గోకులంలోని జనులు అందరికి రోజురోజుకీ ప్రేమలు పెరగుతూ ఏరోజు కారోజు క్రొత్తలు తొడుగుతూనే ఉండేవి.
ఒకరోజు గోవర్ధనగిరి మీద ఆవులను మేపుతున్నారు గోపకులు. కింద మైదానంలో దూడలని మేపుతున్నారు గోపబాలురు. అకస్మాత్తుగా ఆ కొండమీద మేస్తున్న ఆవులు, కొండకిందనున్న దూడలను చూసి, ఆనందంతో తోకలెత్తుకొని తమతమ దూడలదగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పాలను ఇవ్వసాగాయి. ఆ గోపాలకులు ఎంత ప్రయత్నించినా వాటిని వారించడం వారికి వీలుకాలేదు. తాము తమ పిల్లలను చూసి ప్రేమతో దగ్గరకు తీసుకొని వారితో ఆటల్లో మునిగి పోయారు. 
"ఇదీ అన్నా! జరిగింది. బహుశా రేపో మరునాడో ఆ బ్రహ్మయ్య వస్తాడు. దానితో ఈ ఘట్టం ముగుస్తుంది" అన్నాడు కృష్ణుడు బలరామునితో. 

మరునాడు కృష్ణుడూ మిగిలిన గోపబాలురూ దూడలని తీసుకుని బయలుదేరి వనంలోకి వెళ్ళారు. గత ఏడాదై ఆలమందలో ఒక్క పశువూ క్రూరమృగాల పాలు పడలేదు. నందరాజుకి ధైర్యం వచ్చింది, పిల్లనూ దూడలనూ రక్షణలేకుండా పంపేంత. 
ఓ పెద్ద మర్రిచెట్టు. దాని కొమ్మలు భూమిమీద పాకి అచ్చంగా  కూర్చునేంందుకు వీలుగా ఉన్నాయి. ఆ కొమ్మమీద కూర్చుని తీసి వేణువు మధురంగా వాయిస్తున్న కన్నయ్య దగ్గరకు ఓ పులి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. 
ఆ పులి చాలా చిక్కిపోయిఉంది. కళ్ళలో ప్రాణం పెట్టుకొని ఉంది. అలా మురళీకృష్ణుని దగ్గరగా చేరి నిస్సత్తువ గా పడుకుండిపోయింది. 
"ఏమైంది శార్దూలమా?" మృదువుగా అడిగాడు కృష్ణయ్య. 
"స్వామీ! నువ్వు జగద్గురువవు. విశ్వాత్ముడవు. విశ్వమంతా నీలో ఉంది. విశ్వాన్నంతా నువు సృష్టిస్తావు. పోషిస్తావు. మళ్ళీ నీలో కలిపేసుకుంటావు. నీవెరుగనిది ఏదీలేదీ జగాన అయినా నన్ను ఆదేశించావు కనుక చెప్తాను. 
"నాది నైమిశారణ్యం. బృందావనంలో ఆలమందలు ఇబ్బడముబ్బడిగా ఉన్నాయనీ, ఆహారానికి లోటుండదని తెలిసి ఏడాది క్రితం వచ్చేను ఇక్కడికి. వచ్చిన కొత్తలో ఒకటి రెండు బలిష్ఠమైన ఎడ్లు ఆహారంగా దొరికేయి. 
"కానీ ఏమైందో అకస్మాత్తుగా ఒకరోజునుంచి ఆలమందలున్న చోట అన్ని దూడలలో నువ్వే కనిపిస్తున్నావు. అందరి పిల్లల్లో నువ్వే కనిపిస్తున్నావు. అంతెందుకు నేను బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనబడుతున్నావు. 
"ఏ జంతువు నీ చంప బుద్ది కాలేదు. ఆకలికి భరించలేక నైమిశారణ్యం తిరిగి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నీ ముగ్ధమోహన రూపం వదలి వెళ్ళాలనిపించలేదు. నాకు ఏమీ చేయాలనిపించలేదు. నీవు నీ తోడివారితో దూడలను మేపగా నిన్ను చూస్తూ గడిపేను. ఆకలయితే నీళ్ళుతాగేను. 
"కానీ ప్రభూ! ఇక జీవనం కష్టంగా ఉంది. నీ పాదాల చెంత ప్రాణాలు వదిలేద్దామని వచ్చేను. నన్ను కరుణించు కృష్ణా!" అంది నీరసంగా. 
ఇంతలో ఆకాశంలో పెద్దరెక్కల చప్పుడయింది. కృష్ణుడు ఆ వ్యాఘ్రమూ ఇద్దరూ ఆ శబ్దం వచ్చేవైపు చూసేరు. 
ఒక తెల్లని హంస మీద చతుర్ముఖ బ్రహ్మ కూర్చుని వస్తూ అక్కడ మేతమేస్తున్న దూడలనీ, వాటిని కాపుకాస్తూ ఆడుకుంటున్న గోపబాలకులనీ చూసేడు. ఆశ్చర్యపోయాడు. తను మాయజేసి దాచిన పశువులు పశుపాలకులూ బయటకు ఎలా వచ్చేరా అని. తను దాచిన చోటు చూసాడు. అక్కడ అందరూ ఆ చతురాననుడు ఎలా ఉంచేడో అలానే ఉన్నారు. 
"ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో?
నేను  సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే వాడిని నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ దేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?” అనుకున్నాడు.  బ్రహ్మకి ఒక్క క్షణం లో కనువిప్పు అయింది. 
పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమై పోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వస చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప కృష్ణుని మాయామోహితుడిని చేయడం సాధ్యమా? అనుకున్నాడు. 
ఇలా అనుకుంటూ వితర్కించుకుంటూ ఆ వత్సలవైపూ గోబాలకులవైపూ చూసేడు. ఆక్షణంలో ఆ విరించికి అందరు గోపబాలురూ, దూడలూ అన్నీ శంఖచక్రగదా వైజయంతీ మాలలతో నీలమేఘశ్యామవర్ణ శరీరంతో చతుర్భుజాలతో, శ్రీవత్ససమనే పుట్టుమచ్చ తో, కౌస్తుభమణితో విరాజిల్లుతున్న వైకుంఠుడులా కనబడ్డారు.  ఈ దృశ్యం చూసి ఆశ్చర్యంగా చిత్తరువులా నిలబడ్డ బ్రహ్మని చూసి, పిల్లాడు అల్లరిగా చేసిన పని కి కోపంరాని తండ్రిలా చూసేడు కృష్ణుడు. 
  ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మపదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా.” అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేసాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేసాడు, మాయంచేసేసాడు.
ఇంతలో అంతటి ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడూ, మృతిచెందినవాడు బ్రతికి వచ్చినట్లు, తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్లు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకూ చూసాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూసాడు. ఎదుట బృందావనం కనిపించింది. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. అటువంటి బృందావనం చూసాడు బ్రహ్మదేవుడు.
అంతటా కృష్ణుడే కనబడ్డాడు ఆ పద్మసంభవునకు. తన హంస వాహనంమీదనుంచి బంగారు చేతికర్ర పడ్డట్టు కింద పడి , కృష్ణుని పాదాలు పట్టుకుని పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు.
అనేక విధాలా స్తుతించేడు. ఓ గణనాతీతా! శ్రీకృష్ణా! ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులూ లెక్కపెట్టలేరు. నేనెంతవిడను. నా గర్వం భంగమైంది తండ్రీ. నన్ను కరుణించి మన్ననం చేయి. ఇలా స్తుతించిన బ్రహ్మను లేవనెత్తి కృష్ణుడు అన్నాడు. " ఓ చతుర్ముఖా! నీకు తమోగుణం ఆవహించింది. నా లీలను తెలుసుకోవాలనుకున్నావు. సరే! ఇక సత్యలోకం పోయిరా. ఇదిగో ఈ శార్దూలం నా భక్తుడు. ఏడాదిగా నన్నే కొలుస్తూ అన్నిటా నన్నే చూస్తు నిరాహారిగా తపస్సు చేసేడు. వీనిని సశరీరంగా నీలోకం తీసుకు వెళ్ళు" అని చెప్పి బ్రహ్మకి సెలవిచ్చి ఆ పులిని ఆశీర్వదించి పంపేడు. 
బ్రహ్మ దాచిన దూడలూ , గోపాలబాలురూ అందరూ నిద్రలేచి వచ్చినట్టు వచ్చేరు. వారికి సంవత్సరంపాటు తాము నిద్రపోయేమని తెలియనే తెలియదు. 

*********అయిపోయింది**** 

---------------------------------------------------------------------------------------------------------------------------

బృందావనంలో శ్రీకృష్ణుడు చేసిన అనేక లీలలలో బ్రహ్మదేవునకు చేసిన ఈ గర్వభంగం చాలా ప్రముఖమైనది.  నేను చేసిన పని ఏమిటంటే ఓ పెద్దపులి పాత్రని తీసుకురావడం. అంత క్రూరమృగం కూడా ఆ దేవదేవుని చూసి తన స్వాభావికమైన క్రూరత్వాన్ని వదలి కృష్ణుని శరణు కోరడం. బృందావనంలో జంతువులు సహజవైరం మాని నివసిస్తున్నాయి  అని అన్నాడు వ్యాసుడు. సహజవైరం మానేస్తే వాటి ఆహారం ఎలా  అన్న ప్రశ్న నుంచి ఈ కధ వచ్చింది. 

Thursday, 10 September 2020

సన్మానం.

                                                                                                 మోదుకూరి జతీంద్ర శర్మ.


పాంచాల దేశానికి ఒక్కసారిగా రెండు ఆపదలు వచ్చిపడ్డాయి. ముందు పొరుగు దేశం తో యుద్ధం జరిగింది. అందులో జయాపజయాలు ఎవరివీ కాలేదు. సంధి జరిగింది. అయితే ఖజానా చాలావరకు ఖాళీ అయింది. ఈ పరిస్థితి లో వర్షాలు కురవక క్షామం ఏర్పడింది. 

పాంచాలరాజు సుధీరుడికి ఏమి చెయ్యటానికి పాలుపోలేదు. కొందరు హోమాలు, యజ్ఞాలు చెయ్యమన్నారు. అసలే ఖజానా ఖాళీ గా ఉండటంతో రాజుకి ఈ సూచన నచ్చలేదు. అంతలో ఒక సభికుడు మరొక సూచన చేసాడు. ఆ దేశంలో ఉన్న మరో నగరంలో ఒక వైణికుడు ఉన్నాడు. ఆయన అసలుపేరు ఏదైనా దీపకుడన్న పేరు వచ్చింది. ఆ పేరెలా వచ్చిందంటే ఆయన తన వీణ మీద దీపకరాగం వాయిస్తే దీపాలు వాటంతట అవే వెలుగు తాయట. అలాంటి విద్వాంసుడు మేఘమల్హార్ రాగం ఆలపిస్తే వానలు కురవచ్చునేమో.. 

ఈ వార్త విని రాజు ఆశ్చర్యపోయి, అలాంటి విద్వాంసుని శక్తి సామర్ధ్యాలను తప్పక చూడాలనుకున్నాడు. రాజూ మంత్రి మారువేషాలు ధరించి దీపకుడుండే నగరాన్ని చేరి, ఆ రాత్రి సత్రంలో బస చేసి మర్నాడు ఉదయం దీపకుడి ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి దీపకుడు తన పూజామందిరంలో సరస్వతీ దేవి కి ఎదురుగా కూర్చొని వీణ మీద దీపకరాగంలో కీర్తన వాయించటం ప్రారంభించాడు. కొద్దిసేపటి కి దేవి విగ్రహం ముందు దీపాలు వెలిగాయి. తరువాత దీపకుడు సరస్వతీదేవి ని పూజించసాగేడు. 

ఇది కళ్ళారా చూసిన రాజూ మంత్రి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు. దీపకుడు పూజ పూర్తిచేసేక రాజు వైపు తిరిగి "నా వల్ల మీకుఏం పని కావలసి.ఉన్నది మహారాజా?"అని అడిగాడు. 

రాజు ఆశ్చర్యపడి "నన్ను గుర్తించేరన్న మాట!"అన్నాడు. 

"లోగడ తమరిని చూసాను. నాతో పని ఉన్నట్టయితే, కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కద."అన్నాడు దీపకుడు. 

నీ ప్రతిభను దేశం కోసం వినియోగించ రాదా?" అన్నాడు రాజు. 

"ఎలా ఉపయోగపడగలను?" అడిగాడు దీపకుడు. 

దీపకరాగం తో దీపాలు వెలిగించగలిగిన వాడివీ మేఘమల్హార్ రాగాన్ని ఆలపించి వర్షాలు కురిపించలేవా? ప్రజలు నీటికొరతతో పంటలు లేక అల్లాడుతున్నారు." అన్నాడు రాజు. 

దీపకుడు ఆశ్చర్యంగా " ఆ పని నా వల్ల అవుతుందా? నేను మేఘమల్హార్ తో వర్షం కురిపించే యత్నం ఎన్నడూ చేయలేదు."అన్నాడు. 

"ఇప్పుడు ప్రయత్నించరాదా?" అన్నాడు రాజు. 

దీపకుడు వారం రోజుల గడువు అడిగి రాజునూ మంత్రినీ పంపేశాడు. తరువాత వారం రోజుల పాటు సరస్వతీదేవి ఆరాధిస్తూ మేఘమల్హార్ రాగాన్ని అనితర సాధ్యంగా సాధన చేసాడు.  
ఆఖరిరోజున సమీపంలో ఉన్న పర్వతం మీద దేవి ఆలయంకి వీణతో సహా వెళ్ళాడు. ఈ కబురు ఆనోటా ఈనోటా తెలీసిన ప్రజలు అక్కడ గుమిగూడి వర్షంకోసం ఎదురు చూడసాగేరు. ఎవరిని రానీయకుండా ఏర్పాటు చేసి వంటరిగా దేవాలయం లో కూర్చొని వీణ వాయించసాగాడు. కొన్ని గంటల్లో అన్ని వైపులనుండీ మేఘాలు కమ్ముకున్నాయి. క్రమంగా వర్షం ప్రారంభమయి కుంభ వృష్టిగా మారింది. వర్షం మొదలయినా ఆపకుండా వీణని వాయించసాగాడు దీపకుడు. వట్టిపోయిన బావులూ చెరువులూ నిండేయి. ఆపకుండా అలా ఒక రాత్రంతా వీణతో వానదేవుడిని ఆరాధించేక అలసటగా పడిపోయాడు దీపకుడు. ఆతన్ని ప్రజలు ఇల్లుచేర్చేరు. 

తరువాత రాజు దీపకుడిని తన సభకు పిలిపించి, అతనికి పెద్ద ఎత్తున సన్మానం తలపెట్టాడు. అయితే రాజు ఇతర సభికులు ఎంత చెప్పినా దీపకుడు సన్మానం నిరాకరించి తన.నగరానికి వెళ్ళిపోయాడు..

కొంతకాలం గడిచింది. ఒకనాడు సుధీరుడి ఆస్థానానికి దూరదేశం నుంచి ఒక వైణికుడు వచ్చి "రాజా! నాపేరు మైనాకుడు. నేను వీణా వాయద్యంలో అనేక రాజ్యాలలో విద్వాంసులను ఓడించి ఇప్పటి వరకు పరాజయమును ఎరగను. మీ రాజ్యంలో దీపకుడనే వైణికుడు ఉన్నాడనీ , ఆయన తన విద్యను సంగీతం కోసంకాక గారడీ విద్యలకు ఉపయోగిస్తున్నాడని విన్నాను. నాకు గారడీ లోనూ హస్తలాఘవంలోనూ నమ్మకం లేదు. మూఢప్రజలు గోరంతలు కొండంతలు చేస్తారు. మీరనుమతిస్తే మీ దీపకుడితో నేను పోటీ చేయదలచాను. నాకు అవకాశం ఇప్పించండి." అన్నాడు అతిశయంగా. 

దీపకుడి కి కబురు వెళ్ళింది. దీపకుడు అందుకు సరేనని వచ్చాడు. ముందు మైనాకుడు తన విద్వత్తును ప్రదర్శించాడు. తరువాత దీపకుడు అదే రాగాన్ని వాయించేడు. ఇద్దరిమధ్యా పోటీ రసవత్తరంగా సాగింది. "గెలుపు ఎవరిదైనా ఇంత అద్భుతమైన సంగీతం విన్నాం"అనుకున్నారు ప్రజలు. చివరికి దీపకరాగంలో దీపాలు వెలిగించి తన విద్యను చూపెట్టాడు దీపకుడు. మైనాకుడు ఆయన కాళ్ళమీద పడిపోయి "సరస్వతీదేవి పుత్రుడివి. తమరిని గారడీ వాడనుకొని అపచారం చేసాను!"అని క్షమాపణ చెప్పుకున్నాడు. 

దీపకుడికి సన్మానం చేయడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని సభికులు రాజును ఎగదోశారు. దీపకుడు సన్మానాలకు వప్పుకోడని రాజు సందేహిస్తూనే అడిగాడు. అయితే దీపకుడు అందుకు ఒప్పుకున్నాడు. 

"దేశాన్ని కరవుకాటకాలనుంచి కాపాడినప్పుడు సన్మానం చేస్తానంటే ఒప్పకోని వాడివి ఇప్పుడు ఎలా ఒప్పుకున్నావు?"అని రాజు దీపకుడ్ని ఆశ్చర్యంగా అడిగాడు. 

"మహారాజా! నేను నా శక్తితో వర్షం కురిపించానని ఎన్నడూ అనుకోలేదు. నేను మేఘమల్హార్ రాగాన్ని ఆలపించడమూ వర్షం కురవటమూ కాకతాళీయం కావచ్చును. అలాకాక అందులో ఎవరి శక్తైనా ఉందంటే అది ఆ తల్లి సరస్వతీదేవి దే. ఆమె అనుగ్రహం నా పైన ఉండటమే నాకు పెద్ద సన్మానం. ఒక పౌరుడిగా దేశానికి ఉపయోగపడటం నా బాధ్యత కూడా. 
"ఇప్పుడు నేను కేవలం ఒక వీణా విద్వాంసుడిగా మాత్రమే సాటి విద్వాంసుడి మీద విజయం సాధించేను. ఇప్పుడు సన్మానం చేయండి. చేయించుకుంటాను. "అన్నాడు దీపకుడు. 


************
ఈ కధ నేను 1978 డిసెంబరులో వ్రాసి చందమామ కి పంపేను. 1979 జనవరిలో ప్రచురణకి స్వీకరించామని వర్తమానం అందింది. నా ఆనందానికి అవధులు లేవు. కశింకోట ప్రభాకరదేవ్  అని ఒక రచయిత ఉండేవాడు శ్రీకాకుళంలో... ఆతని మాటల్లో అప్పటి వరకూ శ్రీకాకుళంనుంచి చందమామలో కధ పడ్డ రచయిత ను నేనే. 1979 ఏప్రియల్ లో కధ ప్రచురించేరు. నాకు బాగా గుర్తు. మా నాన్నగారు, ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తూ ఏదో సమస్య మీద పోరాడుతూ, వారి ఆఫీసు ముందే టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. పోష్ట్ మేన్, నా పేరు మీద వచ్చిన చందమామ సంచికను ఆయనకు ఇచ్చేడు. ఆయన నా కధ చదివి నాకు కబురు పెట్టి వారి సహోద్యోగులముందు నాకు ఆ సంచికను ఇచ్చేరు. నాకు చందమామ యాజమాన్యం ఇచ్చిన పారితోషికం కన్నా ఎన్నో రెట్లు విలువైన మధురానుభూతిని ఇచ్చేరు. 

Sunday, 6 September 2020

శాపవిమోచనం

 

                                                                        శాప విమోచనం

                                                                        ---- మోదుకూరి జతీంద్ర శర్మ

అర్ధరాత్రి దాటి ఓ ఘడియ దాటిందేమో, అంతవరకూ జోరుగా,ప్రళయ ఝంఝామారుతంలా వీస్తున్న గాలి అకస్మాత్తుగా ఆగి, మందంగా, ఆహ్లాదంగా  వీచడం ప్రారంభించింది.

నంద వ్రజంలో నందుని ఇంట పెరట్లో ఉన్న ఆ రెండు మద్దిచెట్లూ గాలిలో వచ్చిన తేడాని గమనించి కొంచెం ఆశ్చర్యపోయాయి. శ్రావణ మాసంలో సాధారణంగా గాలి ఇలా ఆహ్లాదంగానూ, అదీ తుఫాను వచ్చేముందు వీచే గాలి వీచేటట్లు వీస్తూ అకస్మాత్తుగా ఆగి, మలయమారుతంలా, ఇంత చల్లగానూ, హాయిగా వీచడం అన్నది ఎన్నడూ వాటి అనుభవంలో లేదు.

“ఎప్పుడూ హడావుడిగా వుండి రాత్రన్నదేలేనట్లువుండే నందవ్రజం, ఈరోజెందుకో నిద్రపోతోంది. క్రూరమృగాల బారినుండి ఆలమందలనుకాచే రక్షకులు కూడా ఆదమరచి నిద్రపోవడం ఎపుడూ ఎరగం” అనుకొంది ఓమద్ది చెట్టు.

దూరంగా ఎవరో వస్తున్నట్లు అలికిడి వినబడింది. తమ ఆకులన్నీ ఎవరో మహానుభావుడు వస్తున్నప్పుడు, ఎదురుచూసే  కన్నులు తిరిగేటట్లు ఆ సవ్వడి వస్తున్నవైపు తిరగడం గమనించి ఇంకా ఆశ్చర్యపోయాయి.

ఒక ఆజానుబాహుడు. గడ్డం పెరిగిఉంది. చాలా దూరంనించి గబగబ నడచి రావడం వల్ల కొంచెం రొప్పుతున్నా, ఆ వ్యక్తి మొఖంలో అలసట కనబడటం లేదు. ఆ వ్యక్తి నడక చాలా రోజుల్నుండి శృంఖలాలలో బంధింపబడివుండే వాళ్ళు నడిచే వాళ్ళ నడకలా ఇబ్బందిగా నడుస్తున్నట్లు, అడుగులు బారుగా పడకుండా, స్వేచ్చగా నడిచేవాడి నడకలా కాకుండా వుంది.

ఆయన గుండెలకత్తుకొని ఒక మూట వుంది. ఆ మూటలోంచి అద్భుతమైన కాంతులు వెదజల్లుతూ, ఓచిన్నిముఖం కనబడుతూవుంది.

ఆ వ్యక్తి సడిచెయ్యకుండా యశోదాదేవి నిద్రిస్తున్న మందిరంలోకి వెళ్ళాడు. “ఏం చెయ్యబోతున్నాడో ఈయన? గట్టిగా గొంతెత్తి అరచి అప్రమత్తం చేద్దామంటే గొంతే లేదే?” అనివిచారించిందో చెట్టు. నందవ్రజంలో ప్రతి ప్రాణి, ప్రతి పురుగు, అతినిశ్శబ్దంగా ఓ అద్భుతమైన సంఘటనకి సాక్షీభూతులైనట్లు, అన్నీ యశోదాదేవి మందిరం వైపే చూస్తున్నాయ్. క్షణాలు గడిచేయి. ఆయన మళ్ళీ మరోమూటతో బయటకి వచ్చేడు. ఆయన ప్రవర్తన ఏనేరమో చేసినవాడిదిలా లేదు.                                 

 వ్యక్తి తనుచేయవలసిన పనిని అత్యంత శ్రద్దతో చేస్తున్నట్లు ఉంది. మళ్ళీవచ్చిన త్రోవలో వెళ్ళిపోయాడు. యశోదాదేవి మందిరంలోంచి వస్తున్న ఆ వెలుగు మెల్లగా ఆగిపోయింది.

ఓ చంటిపిల్లవాడు,అప్పుడే పుట్టిన పసిపాపడు ఏడుస్తున్నట్లు, “కేర్,కేర్” మని ఏడుపు యశోదాదేవి మందిరంలోంచి వచ్చింది. నందవ్రజం నిద్రలోంచి మేల్కొంది, అజ్జానికి జ్జానం వచ్చినట్లు.

“నందరాజుకిపుత్రోదయం. జయం. జయం” అంటూ లోపల్నుంచి గోపపరిచారికలు బయటికి వచ్చి ప్రకటించేరు.

ఆ మాట విన్న మద్దిచెట్లు ఆనందంతో పులకించిపోయేయి. ఆనందాశ్రువులు రాలుస్తున్నట్లు, ఆకుల్ని రాల్చేయి, గ్రీష్మం కాకపోయినా.

“చూసేవా, ఆ మహానుభావుడు వసుదేవుడన్నమాట. వచ్చింది దేవదేవుడైన కృష్ణుడన్న మాట. ఇంక మనకి జన్మరాహిత్యం, ఈ శాప విమోచనం ఎంతో దూరం లేదన్నమాట. మనం మళ్ళీ మన తండ్రి గారి దర్శనం, ఆ పరమశివుడి సేవా భాగ్యం చేసుకోబోతున్నామన్నమాట.” అంటూ సంతోషించేయి.

ఆ తెల్లవారు ఝామున నందవ్రజం ఆనందసాగరంలో ఓలలాడింది. పశువులన్నీ మూఱ పైకెత్తి ఆనందంగా “అంబా”అని అరచేయి. ఆవేళ, మద్దిచెట్లు, తమ కొమ్మలపైనుండి కూస్తున్న పక్షుల కిలకిలారావాలలో కొత్త ఆనందాన్ని గమనించేయి.

జననమరణాదులకతీతమైన నారాయణుడు, దేవకీవసుదేవులకు జనియించి, తనలీలలను లోకానికి చాటి చెప్పేందుకు, నందయశోదాదేవులకు జన్మరాహిత్యం కలుగజేయడానికా అన్నట్లు, నందవ్రజంలో బాలుడై యశోదాదేవి ఒడిలో, సామాన్య బాలకులలా ఏడుస్తూ లోకానికి తన రాకను వెల్లడించాడు.

                                                              ***

పదకొండు రోజులయినాయి శ్రీకృష్ణజననం అయి. నందవ్రజంలో పండుగ వాతావరణం యింకా కొనసాగుతునేఉంది. గొల్లలందరూ, నందుడికి బహుమానాలనందించడంలో పోటీ పడుతునేఉన్నారు. గొల్లభామలయితే యశోదాదేవి వద్దంటున్నా, ఆ యిల్లు విడువడం లేదు. ఆ భామలందరూ, కృష్ణుడు తనచిన్నినోటితో ఆవలిస్తే”అబ్బ! చూడవే, ఎంత అందంగా ఆవలిస్తున్నాడో!. పెద్దవాళ్ళలాగా చెయ్యపెట్టుకోవడం రాదుగా! పురుగులూ అవీ దూరతాయో ఏమో!పాపం.” అని జాలిపడతారు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళూ గొల్లల సందడితో నందుడియిల్లు పూర్వం కన్నా కళకళలాడసాగింది.

                            ఓరోజు నందుడు మధురకి కప్పం చెల్లించడానికి బయలుదేరాడు. యశోదాదేవి కృష్ణుడ్ని ఉయ్యాలలో పడుకోపెట్టి , రోహిణీ దేవి తో కలసి తనపనులు చేసుకొనేవేళ, పూతన కంసుని పనుపున అప్పుడేపుట్టిన బాలకులందరనీ హతమారుస్తూ, నందవ్రజం వచ్చింది. చక్కనియువతిలా అలంకరించుకొని, వస్తున్న ఆమె ఉనికి పసిగట్టి, నందుని ఇంట్లో వున్న ఆవులు భయంభయంగా అరిచేయి. మద్దిచెట్లకి కట్టబడిన రెండు ఎద్దులు, నందుడికి ఎంతోప్రీతిపాత్రమైనవి, కొమ్ములు వంచుతూ, గిట్టలు నేలకి రాస్తూ, హుంకరిస్తూ అశాంతిగా కట్లు విప్పుకోడానికన్నట్లుగా ప్రవర్తించసాగేయి. మద్దిచెట్ల ఆకులన్నీ భయంతో ముడుచుకుపోయినట్టుగా అయేయి. ఆ పూతన వడివడిగా వెళ్ళి, ఊయలలో వున్న చిన్నికృష్ణుడి చనుబాలు తాగిస్తానని, తస చనుబాలు తాగించప్రయత్నం చేసింది. విషనాగులకు శత్రువైన గరుడుడే తన వాహనంగాఉన్నవాడు, విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నశివునికి చెలికాడు, విషనాగులందరిలో ప్రముఖుడైనట్టి, శేషునిపై శయనించేవాడు, విషములో అంటే నీళ్ళలోపుట్టిన కమలంలో పుట్టిన బ్రహ్మదేవుని తండ్రి అయినవాడికి, విషం తాగడం ఒక విశేషమా! ఇంతలో పెద్దగా కేకవేస్తూ,వికృత రూపంతో ఆ పూతన పెరట్లోకి వచ్చి మరొక్కసారి భయంకరంగా అరచి, నిజరూపంతో చచ్చిపడింది. దాని భీకరరూపంకింద పడి ఎన్నో వృక్షాలు నలిగి పోయాయి. పశువులన్నీ భయంతో కకావికలైపోయాయి.

మద్దిచెట్లు కూడా ఆభీకర స్వరూపం వాటినెక్కడ పడదోస్తుందో అని ఒక్క క్షణం భయపడ్డాయి.ఐతే నారదమహర్షి అనుగ్రహం వల్ల తమకి కృష్ణుడి పద స్పర్శవల్ల శాపవిమోచనం అన్నవిషయాన్ని గుర్తు చేసుకొని ఊరడిల్లాయి.

                                                              ***

నూరుసంవత్సరాలు మీరు మద్దిచెట్లుగా నంద వ్రజంలో పడియుండండి అని ముని శాపం. నూరుఏళ్ళు పూర్తి గావొస్తున్నాయి. బాలకృష్ణుడి పాదధూళికోసం ఆ మద్దిచెట్లు ఎదురుచూస్తున్నాయి. ఆ బాలగోపాలుడు తమని ఎప్పుడు ఏలతాడో అని ఆబాలగొపాలం ఎదురుచూస్తోంది.

ఓ సాయింత్రం, యశోదాదేవి బాలకృష్ణుణ్ణి, జగత్తులో ఏ సౌందర్యమూ సాటిరాని వానిని, చక్కగా ముస్తాబు చేసి పెరట్లో ఓ మంచం వేసి, మెత్తని పరుపులు వేసి, మళ్ళీ చిన్నికృష్ణుడికి ఏ విధమైనవీ ఒత్తుకోకుండా ఒక్క మెత్తనిబట్ట దానిమీద పరచి, కృష్ణుణ్ణి పడుకోపెట్టి, బలరాముడితో, “నాన్నా!, తమ్ముడు పడిపోకుండా చూస్తూ ఉండు” అని జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వెళ్ళింది తన పనులుచేసుకొనేందుకు.

నీలం రంగు మేనిచాయతో,జుట్టు ముడివేసి, అ ముడిలో ఓ చిన్న నెమిలిఫింఛంతో, ఎర్రని చిన్నపాదాలతో, విప్పారినకన్నులతో, తానే సృష్టించిన జగత్తును, మొదటిసారి చూస్తున్నవాళ్ళా, ఆ మంచం మీద పడుకున్న శేషశాయి, ఆ సాయింత్రం లోకాలన్నిటినీ పరీక్షగాచూస్తూ పడుకున్నాడు. పెరట్లో తల్లి ఆవుల రాకకోసం చూస్తూ అంతవరకూ హడావుడి చేస్తున్న లేగ దూడలన్నీ అలా ఆ ముగ్ధమనోహరరూపం చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాయి. సాయం సంజెవేళ, ఆ చిన్నిబాలకృష్ణుడిమీద ఎండ పడకుండా,ఆ మద్దిచెట్ల కొమ్మలు తామంత తామె కొంచంగా దిశమార్చుకొని తమనీడని కృష్ణుడిమీద పడేటట్లు చేసేయి.

శకటాసురడనేవాడు, కంసుడి భ్రుత్యుడు. పూతనని చంపినవాడెవడో ఈ ఇంట్లోనే వున్నాడని విని, వానిని మట్టుబెట్టాలని ఇక్కడే కాపుకాసేడు. బాలకృష్ణుణ్ణి చూసి, ఆతనిని సంహరిస్తే కంసుని అనుగ్రహం పొంద వచ్చునని ఆలోచనచేసాడు. బాలకృష్ణుడి ప్రక్కనే వున్న ఒక బండి చక్రం లో ప్రవేశించి అదునుకోసం ఎదురుచూడసాగాడు. ఆకలి వేసినబిడ్డ తల్లి కోసం వెతుక్కుని పక్కకి బోర్లాపడి మళ్ళీ ఇటు దొర్లి, కాళ్ళుకొట్టుకుంటూ ఏడ్చే పసివాడిలాగా కాళ్ళు కొట్టుకుంటూ, కాలితో ఆ చక్రాన్ని అలవోకగా ఒక తన్నుతన్నేడు బాలకృష్ణుడు. ఆ చిన్న దెబ్బకే, ఆ చక్రం గింగిరాలు తిరుగుతూ పైకెగిరి, క్రిందపడి, ముక్కలుచెక్కలు అయింది. ఈశబ్దానికి లోపల్నుంచి రేణుకా, యశోదా పరిగెత్తుకుని వచ్చి ముక్కలుగా విరిగివున్న బండినీ,ఆకలితో ఏడుస్తున్నట్లున్న బాలకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క ఉదుటున కృష్ణుణ్ణి యశోదాదేవి ఎత్తుకొని లోపలికి తీసుకొనిపోయింది.

ఈ లీల చూసిన మద్దిచెట్లు అనుకున్నాయి “ ఒక చిన్న తన్ను తన్నితేనే ఆ బండి చక్రం ముక్కలు ముక్కలు అయింది కదా!. ఆ భగవానుడి పాద స్పర్శతో కదా మనకి విముక్తి. మనకేంఅవుతుందో? ఏది ఏమయినా భగవానుని పాద ధూళి సోకుతుందికదా!అదే పదివేలు. ఆ క్షణం ఎప్పుడొస్తుందోకదా?”

                                                              ***

చిన్ని కృష్ణుడుపెరిగి పెద్దవుతున్నాడు. ఆ పెరట్లొ కొచ్చినప్పుడెల్లా ఆ మద్దిచెట్లు ‘ ఈరోజేనా మన విముక్తి’ అని ఆశగా ఎదురుచూడ్డం. ఏమీ జరగపోతే నిరాశగా నిలబడ్డం జరుగుతున్నది. 

బాలకృష్ణుడి ఆటలూ పాటలూ చూస్తూ మైమఱిచి పొతున్నారు నందగోకులంలో అందరూ. మిగిలిన గొల్లబాలకులతో చిన్ని కన్నయ్య ఆటలు చూసి పెరట్లొ ఆవులూ, దూడలూ, చెట్టూ, చేమాఅన్నీ పరవశిస్తున్నాయి. ఒక రోజు దొంగాట ఆడుతూ ఆ చెట్లవైపు వస్తాడు. అంతలోనే ఆగి మరోవైపు మళ్ళుతాడు. పక్కనే వున్న మర్రిచెట్టు ఊడలకి ఉయ్యాలలుకట్టి ఊగుతుంటే, ఆ నల్లనయ్య కాళ్ళు మద్ది చెట్ల దాకా వచ్చి వెనక్కి వెళ్ళుతాయి. మునీంద్రుడు ఆ జగన్నాధుని పాద స్పర్శ చేత శాపవిమోచనం అన్నాడు కానీ, ఆ స్పర్శ ఎలా లభిస్తుందో చెప్పలేదు కదా!. ఒక్కోసారి ఆ చెట్లకి కట్టిఉన్న ఎడ్ల మీద ఎక్కి, నందీశ్వరుడిమీద ఊరేగుతున్న శివుడిలా గోచరిస్తాడు. అప్పుడుఆ చరణాలు అత్యంత సమీపంలోకి వచ్చి అంతలోనే, దూరం అవుతాయి. మోక్షానికి దగ్గరగా వచ్చినా ఇంకా పరిపక్వత చెందని జీవునికి ఆ బ్రహ్మం దూరంగా జరిగేటట్లు.  

పెద్దఇల్లు నందుడిది. నందుడు  రాజు కనుక ఆగోకులంలో అందరికంటే ఆ ఇంట్లో ఆలమంద కూడా పెద్దదే. ఆ ఆవులూ, దూడలూ, ఎద్దులూ ఉండటానికి  విశాలమైన పెరడు. పెరటిలోనికి వచ్చేముందు కొంచెంఎత్తైన అరుగులతో కూడిన పెద్దవరండా. ఆ వరండాలో అనేక స్థంభాలు. ఒక స్థంభానికి ఒక చల్ల చిలికే కవ్వం, కుండ, యశోదాదేవి వంటింట్లో పని చేసుకుంటూ, చల్ల చిలకడానికి వీలుగా.

సాయంకాలం కావడానికి ఇంకా కొంచెం సమయం వుందనగా, యశోద, ఒకరోజు చల్లచిలుకుతో ఉంది. ఎక్కడనుండి వచ్చేడో కృష్ణుడు, ఆమె చుట్టూ తిరుగుతూ, ఆమెపైన వ్రాలుతూ,ఆమె పైట లాగుతూ అల్లరిచేయసాగేడు. “అమ్మా!రా అమ్మా! నాకు ఆకలిగా ఉంది. పాలివ్వవే” అంటూ గంతులువేస్తూ కవ్వాన్ని పట్టుకున్నాడు. ఇలా గంతులు వేస్తున్న కన్నయ్యను నవ్వుతూ దగ్గరకు తీసుకుని, ఒడిలో చేర్చి పాలివ్వసాగింది. ఇంతలో వంటింట్లో పాలు పొంగుతున్నట్లు గమనించి, గభాలున కృష్ణుడ్ని కిందకి దించి, పాలకుండ దించడానికి గబగబలోపలికి వెళ్ళింది.

తనకి సేవచేస్తున్న భక్తులు, లౌకికమైన విషయాల లంపటంలో చిక్కుకోవడం నచ్చని దేవునికి వచ్చే కోపంలాంటి, కోపం వచ్చింది కృష్ణుడికి. ఒక రాయి తీసుకొని ఎదురుగా ఉన్న కుండని బద్దలుకొట్టేడు. పగిలిన ఆ కుండలోంచి పెరుగు అంతా కిందికి కారి పోయింది. దాంట్లోంచి వెన్నని తింటూ పైగా ఒక దొంగ ఏడుపు నటించసాగేడు.

ఆ పెరట్లో ఉన్న చెట్లన్ని, తమ తమ ఆకులన్నింటినీ కళ్ళు చేసుకొని, లీలానాటకసూత్రధారిఅయిన జగన్నాధుని ఆ కపటనాటకాన్ని చూచి తన్మయంతో కదలకుండా, చూస్తున్నాయి. పూలమొక్కలన్ని కూడా, సూర్యకాంతి మొక్కల్లాగా, కృష్ణుడు ఎటువైపు తిరిగితే, ఆ దేవదేవునివైపు తిరుగుతూ చూస్తున్నాయి.

యశోద పాలకుండని దించి జాగ్రత్త చేసి వచ్చి, కొడుకు కోసం చూసేసరికి కనబడ్డదృశ్యం అది. ఆ కన్నయ్య, తిరగేసి ఉన్న ఒక రోలు మీద నిలబడి,వెన్నని ఒక కోతికి పెడుతున్నాడు. కృష్ణుని అలా చూసిన యశోదా దేవి బెత్తం చేతబట్టుకొని “ఏరా!నువ్వు ఇంత వరకూ ఎవరిచేతికీ చిక్కలేదట! ఎవరూ నిన్ను శిక్షించలేదట! ఎవరూ నిన్ను అడ్డుకోలేదటగా! అందుకే బొత్తిగా అదురు,బెదురూ లేకుండా పోయినాయిరా! ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. “ అంటూ “ఆగు అక్కడ. “ అంటూ కన్నయ్యని పట్టుకోబోయింది.

కృష్ణుడు భయపడినట్టు ముఖం పెట్టి రోలు మీంచి గభాలున దూకి కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా పరుగుతీసాడు. ఆ చిన్ని కన్నయ్యను పట్టుకోవడానికని యశోద కూడా వెనువెంటనే పరుగుతీసింది. మహా మహా యోగీంద్రులుకూడా మనస్సులలో పట్టుకోలేని ఆ లీలా గోపాలుణ్ణి పట్టాలనే తపనతో వెంటబడి తరమ గలిగిన ఆ యశోద అదృష్టాన్ని ఆ మద్దిచెట్లు ఆశ్చర్యంతో గమనించసాగేయి.

కృష్ణుడు వాకిట్లో స్తంభాలను చాటు చేసుకుంటూ అటూ ఇటూ పరుగుతీస్తూ దొరక్కుండా ఉన్నాడు. మధ్య మధ్యలో     “అమ్మా!కొట్టకే. ఇంకెప్పుడూ ఇలా చేయనే! ఈ ఒక్కసారికీ మన్నించవే!” అంటూ దొంగ కన్నీటితో వెక్కిళ్ళు పెడుతున్నాడు. తనని పట్టుకోవడానికి తల్లి పడుతున్న అవస్థని గమనించేడు. ఆమె ముంగురులు చెదిరిపోయేయి. జడముడి విడిపోయింది. పెట్టుకున్న పూలదండ జారిపోయింది. చెమటలు ముఖంనిండా పట్టేయి. కృష్ణుడికి చాలజాలివేసింది. భగవానుడు తనంతతానుగా భక్తులకు లొంగాలనుకుంటే లొంగిపోతాడు కదా! అమ్మకి మరి కష్టం కలిగించకూడదనుకున్నాడో ఏమో, దొరికిపోయేడు ఆ యశోదమ్మకి. “అమ్మయ్య!దొరికేడు ఈ చిన్నివెన్నదొంగ” అంటూ బాలకృష్ణుణ్ణి పట్టుకున్నది.పట్టుకొన్నదేగాని కొట్టడానికి తల్లి కదా చేతులు రాలేదు. అటూ ఇటూ చూసింది. ఆ రోటికి కట్టేస్తేపోతుంది ఇంక ఎక్కడికీ పోలేడు. అని తలచింది. ఒక చేత్తో కృష్ణుణ్ణి పట్టుకుని, ఇంకోచేత్తోఅక్కడే పడివున్న తాళ్ళని తీసుకుంది. ఒక తాడు తీసి, రోటి చుట్టూ చుట్టి, కృష్ణుడి నడుం చుట్టూ చుట్టింది. అది ఒక రెండుఅంగుళాలు తక్కువ అయింది. కృష్ణుడి చుట్టూచెయ్యి వేసి, పారిపోకుండా పట్టుకుని, ఒక తాడుకి మరో తాడు కలిపి ముడివేసి కట్టడానికి ప్రయత్నించింది. మళ్ళీ రెండుఅంగుళాలు తక్కువఅయింది. ఇలా తాడుకి తాడు ముడి వేస్తునే ఉంది. ఆ బొజ్జ చుట్టూ కట్టడానికి సరిపోవడంలేదు.

ఈ ప్రయత్నం చూసి ఆ చెట్లు “ఆ బొజ్జలో ముజ్జగములూ కొలువైఉన్నాయి. అటువంటి బొజ్జని కట్టడానికితరమా!” అని అనుకున్నాయి. వాటి మనసులలో ఏ మూలో వాటికి శాపవిమోచనం కలుగనున్నాదని అనిపించింది. అయ్యో! ఇప్పుడు శాపవిమోచనం అవకుండాఉంటే, లీలాకృష్ణుని లీలలు చూస్తూ ఈ జన్మ ధన్యం చేసుకోవచ్చు కదా! ఆ నారద మునీంద్రుడు నిజానికి మాకు శాపం ఇచ్చి నట్లు లేదు వరం ప్రసాదించినట్లు ఉంది. ఇంత చక్కనిలీలలుచూసే అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత తపస్సు చేసినా దొరకదు కదా! అనుకున్నాయి. ఆ దేవదేవుడు ఇటు వచ్చి శాప విముక్తి చెయ్యకుండావుంటే బాగుండనని మొదటిసారిగా మద్దిచెట్లు తమ మనస్సులో అనుకున్నాయి.

కృష్ణుడు తల్లి పడుతున్న అవస్థని గమనించేడు. ఇంక చాలు అనుకున్నాడో ఏమో.. తాడు ఈసారికి సరిపోయింది. అమ్మయ్య అనుకుంది ఆతల్లి. “ఇక అల్లరి చేయకుండా ఉండండి” అని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అటూ ఇటూ చూసేడు. కొంతమంది గోపబాలురు కృష్ణుడి అవస్థ చూసి నవ్వ సాగేరు. కొంత మంది కృష్ణుడు ఇప్పుడేం చేస్తాడో అని చూడసాగేరు.

ఆ మద్దిచెట్లకి అర్థం అయిపోయింది. నూరుసంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది అని. కృష్ణుడు ఆరోలుని మెల్లగా యీడ్చుకుంటూ ఆ మద్దిచెట్ల మధ్యనుండి తీసుకువెళ్ళాడు. ఆ రోలు తిరగబడింది. రోటిని మద్దిచెట్లమొదలు అడ్డింది. కన్నయ్య ఒక్కసారి బలంగా రోలుని లాగేడు.

అంతే!. ఫెళఫెళ మంటూ ఆ మద్దిచెట్లు రెండూ కూలిపోయేయి. నలకూబర మణిగ్రీవులనే కుబేరపుత్రులు తమ నిజ రూపాలతో కృష్ణుని ముందు సాగిలపడి వేవేలుగా స్తుతించేరు. అంతలోనే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. “దేవ దేవా! నీ పాద స్పర్శతో మా శాపవిమోచనం కావాలని ఎంతో తపించేం. కాని ఇప్పుడు నీ లీలలు చూసే అదృష్టాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా వుంది. జగదీశా! సదా నీ సన్నిధిలో కాలం గడిపే వరం ప్రసాదించు తండ్రీ!” అని ప్రార్ధించేరు.

“మరికొన్ని సంవత్సరాల తరువాత, శివుడ్ని ప్రార్ధించేందుకై నేను కైలాసం వస్తాను. అప్పుడు మీకు మరల నా దర్శనం లభిస్తుంది” అని కృష్ణుడు వారిని “ఇక మీరు మీ లోకాలకు పోవచ్చును”అని అనుమతినిచ్చేడు.

                                                   కృష్ణార్పణం.

***************************అయిపోయింది*********************************

ఈ కధ భాగవతం స్ఫూర్తితో రాసింది. పోతనగారి భాగవతం నుండీ పొందిన రసానుభూతి తో రాసింది. చిన్నికృష్ణయ్య లీలలను మద్దిచెట్ల తరుఫునుంచి ఊహ చేసేను. అదొక్కటే నా స్వకపోల కల్పితం.