Thursday, 6 February 2020

మనబడి


మన బడి 

మునిసిపల్ హైస్కూలు. ఆ ఏడురోడ్ల జంక్షన్ లో ఒక ఐకానిక్ బిల్డింగ్ లా, ఠీవిగా నిలబడి అన్నిరోడ్లనూ తేరిచూస్తూ. రెండు గేట్లు ఉండేవి. జంక్షన్ వేపు ఒక గేట్. పోష్టాఫీసు వైపు ఒకటి. మైన్ గేట్ లోంచి లోపలికి వస్తే కుడిచేతి వేపు అరుగమీద సంస్కృతం క్లాసు. పక్కనే స్కూల్ గంట ఉండేవి. ఆ కుడి వరస గదులు పెంకుటింటి గదులు. ఎడమవైపు సిమెంట్ బిల్డింగ్. మొదట హెడ్ మాష్టారు గది. పక్కన టీచర్స్ గది. ఎల్ షేపులో ఉండే ఆ గదులకీ తిలక్ హాలుకీ ఇటువేపు ఉన్న తరగతి గదులకీ మధ్యన కొంత ఖాళీ స్థలం. గాంధీగారి విగ్రహం. ఆ విగ్రహం వెనక్కాల లేబొరేటరీ. మెట్లెక్కి వెళితే హయ్యర్ క్లాస్ రూములుండేవి. తిలక్ హాల్ కి అటువైపు సమాంతరంగా రెండు క్లాసు గదుల హాల్సు ఉండేవి. విశాలంగా ఉన్న దారీ , పడమట వైపు మళ్ళీ తరగతి గదుులు. ఆతరువాత  కొత్తగా కట్టిన రెండు గదులు. రెండోగేట్ దాటేక రోడ్డు కి అవతల రెండు తరగతి గదులు. పోస్టాఫీసు కి వెళ్ళే దారి దాటేక గ్రౌండ్ ని చూస్తూ మూడు తరగతులు. గ్రౌండ్ కి ఆవలవైపు ఆర్ ఎండ్ బీ బిల్డింగ్ ముంద మరో మూడు తరగతులు. ఆ ప్రక్కనే పీ.టీ. గది పక్కనే మరో గది.


మన స్కూల్ గురించి తలుచుకుంటే ఈలా ఒక డ్రోన్ షాట్ లాగా కళ్ళముందు కనబడుతుంది. ఆ గ్రౌండ్ ఆ ఫుట్ బాల్ పోస్టులూ, అక్కడ కట్టిన ఒక ఓపెన్ స్టేజ్. ఆ స్టేజ్ కి ఇరువైపులా బ్యాంట్మింటన్ కోర్టులూ. ఖోఖో ఆడే స్థంబాలూ, గ్రౌండ్ కి ఆ చివర బాస్కెట్బాల్ కోర్టూ, పక్కనే కబడ్డీ ఆడే ఇసుకతో నింపిన కోర్టు.


ఎన్ని జ్ఞాపకాలూ, ఎన్ని మధుర స్మృతులూ.


అన్నీ కలబోసుకొని, ఓవైపు కాలేజీ మెట్లు ఎక్కుతున్నామన్న ఆనందం , మరోవైపు కాలేజీలో ఈ స్నేహం దొరుకుతుందో దొరకదో అన్న ఆందోళన , మిత్రులు ఏ ఏగ్రూపుల్లో చేరేరో అన్న ఆసక్తితో ఆ స్కూల్ కు వీడుకోలు చెప్పేం. అప్పట్లో వీడుకోలు వేడుకలు లేవు.


జీవనయాత్రలో ఎక్కడెక్కడో ప్రయాణం చేసేం. చాలామంది జీవితాలు సంతృప్తికరంగానే ఉన్నాయంటే కారణం , మన గురువులు ఇచ్చిన ఆశీస్సులూ, దీవెనలూ.

మళ్ళీ మనం మార్చి మొదటి తారీఖున కలవబోతున్నాం. మన జ్ఞాపకాలను పంచుకొని మధుర స్మృతులు గా మార్చుకొనే అవకాశం మళ్ళీ పొందబోతున్నాం అనే ఆలోచనే చాలా ఉత్సుకతని కలగా జేస్తోంది. తప్పకుండా కలుస్తారు కదూ .  


జతీంద్ర 





parichayam

ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది . శ్రీకాకుళం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డనాటినించి ఒక సమభావ భాగస్వామ్య వేదిక తయారు చేసికోవాలని నాలాగే వున్నా ఇతర భావుకులందరి ఆలోచనలు పంచుకోవాలని ఊహలు బలంగా మారే సమయంలోనే ఇన్నాళ్ళకి సిక్కోలువాసి అని బ్లాగ్ తయారు చేసేఅవకాశం కలిగింది.

ఆ నాగావళి యేరు ఆ తీరం, కోటేశ్వరుని కోవెల, వడ్డాది పాపయ్య గారి చిలుకు ద్వాదశి నాటి చిత్రం లో లాగా ఆ కోవెల తీరం.  గుడివీధి , ఏడురోడ్ల జంక్షన్, రామకృష్ణ టాకీసు, చిన్న బజారు, క్రిష్ణా పార్కు, కాలేజ్ రోడ్, పాత బస్టాండు అరసవిల్లి,  ఇలా ప్రతీ జాగా గుర్తుస్తోంది .

ఏడురోడ్ల జంక్షన్, నా మిత్రుడు అన్నట్టు, దేశం లో ఇంకెక్కడా చూడని ప్రత్యేక కూడలి చిక్కోలుకే ప్రత్యేకం. ఒక పక్క మునిసిపల్ హై స్కూల్ ఠీవిగా అన్ని రోడ్లను పరికించి చూస్తున్నట్లు, పాత బస్టాండ్ నుండి వచ్చే బస్సులను, గుజరాతీపేట నుండి వచ్చే కూరగాయల్ని అమ్ముకునే వాళ్ళను, మూడు చక్రాల రిక్షాలను, పడమట వైపు ఆటస్థలాన్ని , వెనకవైపు హెడ్డుపోస్టాఫీస్ నీ, తూర్పువైపు పాలకొండ రోడ్డుని అటు మురళీ టాకీసు వెళ్లే దారిని కొల్లవారి వీధి నుండి, గుడివీధి వెళ్లే దారిని అన్నీ  పరికించి చూస్తూ, నిక్కర్లలో, పరికిణి జాకెట్లలో బడి కి వచ్చే పిల్లలని ముచ్చటగా చూస్తూ, ఆ హై స్కూల్.

నాగావళి లోకి నీరువచ్చినప్పుడు ఆ వారధి మీంచి చూస్తూ పరవశించిన రోజులు, ఏటవతల ఉన్న వేంకటేశుని గుడికి శనివారం వెళ్లడం. ఆదివారం అరసవిల్లి, సోమవారం ఈశ్వరుడి గుడి, యేరు ఎండిపోయినప్పుడు ఆవలి వడ్డులో ఇసుకలో కబాడీ ఆడటం
.
ఆ వారధి ఎన్ని జ్ఞాపకాల ను పోగు చేసిందో . కాలం తీరిన వృద్ధులని పనికిరాని వారని తీసేసినట్లు ఆ వారధిని పడగొట్టేసేరు. పురాతన కట్టడాలని జాగ్రత్తగా చూసుకోలేని ఈ తరం వాళ్ళం మనం.

అద్దం మీద ధూళి పేరుకున్నట్లు జ్ఞాపకాల పొరలు ఒక్కసారి తుడిచి చూస్తే, అంతరంగంలో ఆ చిన్నతనం మళ్ళీ స్పష్టం గా కనపడుతోంది .

మిత్రులు ఎవరైనా నాతో  పంచుకుంటారా  మీ స్మృతుల్ని.


జతీంద్ర
06/02/2020