---మోదుకూరి జతీంద్రశర్మ
" ఆనందం తండ్రి పోయారట" నా మిత్రుడు ఫోన్ చేసి చెప్పేడు. క్లాసులో ఉన్న నేను సాధారణంగా క్లాసు అవుతుంటే ఫోన్ తీయను. కానీ ఆవేళ ఇంకో క్లాసులో ఉన్నాను , కుర్రాళ్లు పరీక్ష రాస్తూంటే కాపలాగా. పరీక్ష సమయం అవగానే తొందర తొందరగా పేపర్లు లెక్క చూసి తోటి ఉపాధ్యాయునికి అప్పచెప్పి ఆనందం ఇంటికి పరుగు తీసేను.
అప్పటికే ఊర్లో ఉన్న చాలామంది ఆనందం ఇంటికి చేరేరు. గబగబా ఇంటిలోకి వెళ్ళేను, ఆనందానికి కావలసిన వాడిని అని అందరికీ తెలుసు కనుక నన్నెవరూ అడ్డగించలేదు. ఆనందం హాల్లో సోఫాలో ఒంటరిగా కూచున్నాడు. మొఖం వాడిపోయి ఉంది. అందరూ ఆనందానికి దూరంగా గుంపులు గుంపులు గా నిలబడి లోగొంతులతో మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఇటువంటి సమయంలో అందరూ ఏడుస్తున్న ఆనందం చుట్టూ చేరి అతన్ని ఓదార్చడం సహజం. కానీ ఆనందం కన్నీరు పెట్టడు. ఆనందం కళ్ళు నీళ్లు లేని కళ్ళు. ఆనందం మనసులో ఎంత బాధపడ్డా ఒతని కంటినుంచీ ఒక్కబొట్టు కూడా కన్నీరు రాదు.
ఆనందందీ నాదీ లాగూలనాటి స్నేహం. వాడు పుట్టిన జిల్లా ఆసుపత్రిలోనే నేను వాడికన్న రెండు గంటల ఆలస్యంగా పుట్టేను. అందుకని నామీద చిన్ననాటినుండీ ఆధిపత్యం చూపించేవాడు. నాకు అక్కలేకానీ, అన్నదమ్ములు లేకపోవడంతో, నాకు అన్న వాడే అయేడు.
మేమిద్దరం పక్క పక్క ఇళ్ళలో ఉండటం, మా నాన్నగారిదీ, ఆనందం తండ్రిదీ వ్యాపారాలే అవడంతో మా కుటుంబాలు రెండూ మంచి స్నేహంగా ఉండేవి. అలా ఎలిమెంటరీ స్కూలునించి, కాలేజ్ చదువు దాకా కలిసే చదువుకున్నాం. నాకు వ్యాపారం చేసే ఆసక్తి ఉండేది కాదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్శిటీ లో చేస్తుండగా నాన్న పోయారు. మా అమ్మ అంతకు ముందే పోవడంతో ఆ వ్యాపారాన్ని అమ్మివేసి, నేను లెక్చరర్ గా ఉద్యోగం చేసుకోసాగేను. ఈ పరిస్థితులన్నిటిలో ఆనందం చేసిన సహాయ్యం మరువలేనిది.
ఆనందం వాళ్ళ కుటుంబవ్యాపారం చేస్తూ శ్రీకాకుళం లోనే ఉండిపోయాడు. నేను ప్రభుత్వ కళాశాలలోనే చేస్తున్నాను. మళ్లీ మా మధ్య స్నేహం కొత్తచివురులు తొడగసాగింది. ఆనందానికీ నాకూ పెళ్ళిళ్ళు అయేయి. మా కుటుంబాలమధ్య కూడా అనుబంధం పెనవేసుకుంది.
సుమారుగా నలభై మూడు సంవత్సరాలక్రితం కృష్ణాజిల్లా దివి సీమని ఒక పెను ఉప్పెన తాకిన సంఘటన ఆ తరం వాళ్ళకి అందరికీ గుర్తుండే ఉంటుంది. నవంబరు 19 1977 వ తారీఖున మొదలైన వాన, తుఫానై, ఉప్పెనై దివి సీమను ఊడ్చిపెట్టింది. గంటకి 130 నించి 140 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులకు భారీ చెట్లునేలకొరిగాయి. గ్రామాలకి గ్రామాలు శ్మశానాలుగా మారిపోయాయి. అధికారికంగా సుమారు పధ్నాలుగు వేలమంది ప్రాణాలు కోల్పోతే, అనధికారికంగా సుమారు యాభైవేలమంది చనిపోయారు. శవాలగుట్టల మధ్య అయినవారిని వెతికేందుకు కొన్ని రోజులు పట్టింది. వరద నీరు నిలిచి పోవడంతో శవాలను కాల్చటానికి వీలు లేని పరిస్థితి.
అప్పుడు సహాయక చర్యలకి వెళ్ళిన వాళ్లలో ఆనందం ఒకడు. అప్పడే ఆనందానికి తన మనసు దారుణాలకి చలించదనే విషయం అవగతమైంది. ఆ హృదయవిదారక ఆపత్తిలో పశువుల శరీరాలు అగ్నికి ఆహుతి ఇవ్వడం దగ్గర్నించీ, శవాలని సామూహిక దహనం చేసే పని దాకా, ఇతరులు ఆ దృశ్యాన్ని చూసి భరించలేక దూరం జరిగినప్పుడు, నేనున్నానని ముందుకు వెళ్ళి అలుపెరగని సహాయం చేసేడు. ఆతని సహాయక చర్యలని మెచ్చుకొని రాష్ట్రప్రభుత్వం ఆ ఉప్పెన పునరావాస చర్యలు అయిపోయాక, సత్కరించింది కూడా.
అదిమొదలు, ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, ఆనందం ఆ బాధితులకు తన చేయూతని ఇవ్వడం ఆనవాయితీ అయింది.
ఆనందం తో నేను చాలాసార్లు అన్నాను. "ఆనందం! నీకు ఒక రకమైన వ్యాధి ఉందేమో.. చూడబోతే ఎక్కడైనా ప్రమాదం జరగకపోతే బాధ పడేలా ఉన్నావు. "
" ఎందుకలా అనుకుంటాను? ప్రమాదం జరిగితే సహాయం చేయడం తప్పుకాదు కద!" అన్నాడు ఆనందం.
ఈ రోజు కూడా ఆనందంకి కళ్ళనీళ్ళు రాలేదు. ఆనందం తండ్రి శ్రీకాకుళం లో పేరున్న వ్యక్తి కావడంతో దాదాపుగా ఊరు ఊరంతా కదలి వచ్చింది. ఆనందం కళ్ళలో కనబడని కన్నీళ్లు అతను ఓ కసాయివాడిగా, కన్నతండ్రి పోయినా కన్నులనీరు పెట్టనివాడిగా అందరూ భావించేరు. కొంతమంది ఆయితే ఆనందం మొఖంమీదే తమ ఆలోచనని చెప్పేరు. నేను మౌనంగా ఉండిపోయాను. నాకు ఆనందం సంగతి తెలుసు కాబట్టి.
ఒక పెద్దాయన ఆనందం దగ్గరకు వచ్చేడు. "చూడు బాబూ! నాకూ మీ నాన్న పోవడం చాలా బాధగా ఉంది. నాకన్నా చిన్నవాడు. ముందుగా పోతాడనుకోలేదు. కానీ బాధని మనసులో ఉంచుకోవడం మంచిది కాదు బాబూ... కళ్ళనీళ్ళు మనసులో బాధని తగ్గిస్తాయి" అన్నాడు.
నేనేదో అనబోతే ఆనందం కళ్ళతోనే వారించేడు. "అలాగే అంకుల్"అని మాత్రం అన్నాడు.
ఆయన మరికాస్సేపు ఓదార్పు మాటలాడి వెళ్ళిపోయాడు. "వీళ్ళకి ఏం చెప్పినా అర్ధం చేసుకోలేరు. వదిలేయ్" అన్నాడు ఆనందం నాతో.
ఇంతలో తరువాతి కార్యక్రమాలు చేయడంలో నలుగురికి పనులను పురమాయించడంలో బిజీ అయిపోయాడు ఆనందం. నేను ఆనందం తండ్రి పార్ధివదేహం ఉన్న చోటికి వెళ్ళాను. బయట ఓ షామియానా వేసి ఓ బల్లమీద పడుకో బెట్టేరు దేహాన్ని. ఆ దేహం చుట్టూ చాలామంది చేరి ఉన్నారు. కొన్ని కుర్చీలు లాన్లో వేసి ఉన్నాయి. కొంతమంది ఆ కుర్చీలలో కూర్చుని లోగొంతుకలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకాయన ఆ జనానికి టీలు అందిస్తున్నాడు. ఎవరెవరో వచ్చి ఆ పార్ధివదేహానికి నమస్కరించి, కాసేపు కళ్ళు మూసుకొని నిలబడి, తెలిసిన వారు కనబడితే తలపంకించి వారి దగ్గరకు వెళ్ళి మాట్లాడుకోసాగేరు. అప్రయత్నంగా నాకు కొంతమంది మాటలు చెవిలో పడ్డాయి. ఆ మాటల సారాంశం ఏమిటంటే ఆనందానిది రాయిలాంటి హృదయం. తండ్రి పోయినా కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఎంత చేసేడాతండ్రి ఈ కృతఘ్నుడికి.
నాకు అర్ధంకాని విషయం ఏమిటంటే కళ్ళనీళ్ళు పెడితేనే ప్రేమ ఉన్నట్టా లేకపోతే రాయేనా... ఆనందం తండ్రి చివరిరోజుల్లో తండ్రికి ఎంత సేవ చేసేడో వీరికి తెలియదు. లోకానికి కనబడేటట్టు గుండెలు బాదుకొని ఏడిస్తే వీరికి సంతోషమేమో.. వారికి ఓదార్చే అవకాశం లేదనా ఏమిటి వీరి ఫిర్యాదు...
ఇంతలో ఆంబులెన్స్ వచ్చింది. ఆ తండ్రికి చివరి వీడుకోలు పలకడానికి బయటకు వచ్చింది ఆనందం భార్య. ఆమె కంటికీమింటికీ ఏడవసాగింది. ఆడవాళ్లు అందరూ ఆమె చుట్టూ చేరి ఓదారుస్తున్నారు. ఆంబులెన్స్ వీధి మలుపు తిరిగే దాకా ఉండి లోపలకు వెళ్ళిందామె. నా స్కూటర్ ఎక్కి ఆంబులెన్స్ వెనక వెళ్ళేముందు ఆమెని కలసి అస్పష్టంగా నా విచారాన్ని తెలియజేసేను. ఆమెకి మామగారంటే ప్రత్యేకమైన అభిమానమూ లేదు అలా అని ఆయన్ని దూరం పెట్టనూ లేదు.
ఆ కార్యక్రమం అయినదాక ఆనందంతో ఉండి అంతా అయినాక ఆనందంతో మరోసారి మాట్లాడి ఇంటికి బయల్దేరేను.
ఆనందం ఎదిగొచ్చిన ఏకైక కొడుకు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో పోయాడు. ఆతడు అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించేందుకు వీసాకోసం హైదరాబాద్ వెళ్ళి ఓ ప్రైవేటు బస్సులో విశాఖపట్నం వస్తూ ప్రమాదం లో మరణించేడు. అప్పడుకూడా ఆనందం ఏడుస్తాడో లేదో చూడటానికి కొంతమంది వచ్చేరట. ఆనందం కంట నీరు పెట్టలేదు. అప్పుడే వచ్చింది ఆనందానికి ఆ పేరు. నీళ్ళు లేని కళ్ళమనిషి అని. ఏదో వ్యాధి అని కూడా ప్రజలు అనుకున్నారు.
ఆనందానికి తన కళ్ళలో నీళ్లు లేవని అందరూ ఆనుకుంటున్నారని కూడా తెలిసింది. ఆ తరువాత కూడా చాలా ప్రమాదఘటనలలో ఆనందం సహాయచర్యలలో పాల్గోవడం మానలేదు. ఆనందం పేరు ఊరిలో మారుమ్రోగసాగింది. తాపీగా జిల్లాలో, రాష్ట్రంలో ఏ ప్రకృతి విపత్తి వచ్చినా ఆనందంకి కబురు వెళ్ళసాగింది.
2014 లో విశాఖపట్నం తీరాన్ని హుద్ హుద్ తుఫాన్ తాకింది. ఈసారి ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా, నగరానికి చుట్టూఉన్న పల్లెలకి చాలా నష్టం కలిగింది. మామూలుగానే సహాయచర్యలలో ఆనందం చురుగ్గా పాల్గొన్నాడు. ఎక్కడ ఏ అవసరమొచ్చినా ఆనందాన్ని అధికారులూ, ఎమ్మల్యేలూ అందరూ ఆనందాన్ని సలహాలు అడగడం, ఆనందం ఆధ్వర్వయంలో పునరావాస చర్యలు చేపట్టడం జరిగింది.
ఇదంతా గమనించిన ఓ పత్రికా విలేఖరి ఆనందాన్ని ఇంటర్వ్యూ చేసి ఆనందం దివి సీమలో చేసిన సహాయచర్యలతో మొదలుపెట్టి ఆనందానికి వచ్చిన ప్రభుత్వ పురస్కారాలతో, ఆనందం సహాయం చేస్తూండగా తీయబడిన ఫోటోలతో ఓ ప్రముఖ దినపత్రికలో వ్యాసం రాసేడు. ఆ వ్యాసం చూసి ఓ టెలివిజన్ ఛానెల్ వారు ఇంటర్వ్యూ ప్రసారం చేసేరు.
ఈ వ్యాసం , ఇంటర్వ్యూ అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేయి. ఆయన ఆనందాన్ని పిలిపించి మాట్లాడి , రాష్ట్ర విపత్తుల సహాయ సంస్థకి అధ్యక్షుడు గా నియమించేడు రాష్ట్ర సహాయమంత్రి స్థాయిలో.
ఇప్పుడు ఆనందానికి రక్షణకు సెక్యూరిటీ సిబ్బంది, అమరావతిలో ప్రధాన కార్యాలయం, ఈ ఊరిలో ఓ కార్యాలయం. అధికారంతో వచ్చిన మందీ మార్బలం హడావుడి అన్నీ మొదలయేయి. శ్రీకాకుళం లో ఓ పౌర సన్మానం కూడా జరిగింది. అందులో వక్తలందరూ ఆనందం నిస్వార్థ సేవని వేనోళ్ళ పొగిడారు.
ఆ సన్మాన కార్యక్రమానికి నాకూ ఆహ్వానం వచ్చింది. నాకోసం వేదిక దగ్గరగా ఓ కుర్చీ ప్రత్యేకించేరు ఆనందం సూచనతో. కానీ నేను వెళ్ళేసరికే ఓ ఛోటానాయకుడు ఆ కుర్చీలో కూర్చోవడంతో నేను వెనక నిలబడి ఆ కార్యక్రమాన్ని చూసేను.
ఆ రోజు అర్ధరాత్రి ఆనందం నేను ఇద్దరమే నాగావళి నది వారధిమీద ఉన్న గట్టుమీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాము.
ఆనందం తను చేయబోయే ప్రణాళికలు అన్నీ చాలా ఉత్సాహంగా చెప్పేడు.
అంతవరకూ ఆ సెక్యూరిటీ గార్డులు కూతవేటు దూరంలో నిలబడే ఉన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఆనందం తన పదవిపోతుందనే అనుకున్నాడు. కొత్తముఖ్యమంత్రి అంతకుముందు ప్రభుత్వం చేసిన నియామకాలు అన్నీ రద్దుచేసి తన వారిని నియమించడం మొదలుపెట్టారు. ఆనందం ఆ ముఖ్యమంత్రి ని కలసి తన రాజీనామా ఇవ్వబోతే ఆయన వారించేడని చెప్పేడు ఆనందం. ఏడాది గడిచింది కొత్త ప్రభుత్వం కొలువై. ఆనందానికి తనను పదవినుంచి మార్చరన్న నమ్మకం ఏర్పడింది.
*********
ఆ వార్త వింటూనే ఆనందం ఇంటికి పరుగుతీసేను.
ఎప్పుడూ ఎంతోకొంతమంది జనంతో కళకళలాడుతూ ఉండే ఆనందం ఇల్లు దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. ఓ ఇద్దరు బయట లాన్ లో మాట్లాడుకుంటున్నారు గుసగుసగా. లోపల హాల్లో ఇద్దరు. మేడమీద ఉన్నాడన్నట్టు ఓ వ్యక్తి సైగ చేసేడు, ఆనందం చిన్ననాటి స్నేహితుడిగా నన్ను ఆనందం అనుయాయులందరికీ తెలుసు. మేడ మీదకి వెళ్ళాను. పడకగది చేరుతుండగా చిన్నగా వినబడింది, వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం. ఆశ్చర్యపోతూ పడకగది తలుపు మెల్లగా తోసేను.
నేలమీద కూర్చుని, మంచం మీద తలానించి, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆనందం. చూసి మ్రాన్పడిపోయి నిలబడిపోయాను. అరవయైదేళ్ళ స్నేహంలో ఆనందం కళ్ళనీళ్ళు పెట్టగా చూడటం కాదు, భోరుమని ఏడవటం కూడా అదే మొదటిసారి కావడంతో.... ఎందుకంటే ఎంత బాధ కలిగినా ఆనందంకి కంటనీరు రాదు. ఎంత దారుణమైన, హృదయవిదారకమైన దృశ్యాన్ని చూసినా చలించడు. అటువంటి ఆనందం ఇలా... నేను వచ్చిన సంగతికూడా పట్టించుకోకుండా.... వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆపకుండా... ఓ ఆనకట్ట తెగిపోతే వచ్చే నీటి ప్రవాహంలా.. భోరుమని వర్షం పడుతున్నప్పుడు చూరునుంచి కారే నీటి ధారల్లా వాడి కంటనీరు చెక్కిళ్ళమీంచి కారి, మంచం మీద పడి పోతోంది.
పక్కన కూర్చొని అనునయంగా ఆనందం భుజం మీద చెయ్యివేసేను. నా స్పర్శతో నా వైపు తిరిగి నన్ను వాటేసుకుని "అయిపోయిందిరా! అంతా అయిపోయింది" అంటూ ఓ కాగితం నా చేతిలో ఉంచేడు. ఆనందం కళ్ళనీళ్ళు ఆ కాగితం మీద అక్కడక్కడ పడి ఉన్నాయి.
ఆనందాన్ని రాష్ట్ర విపత్తుల సహాయసంస్థకి అధ్యక్షునిగా తప్పిస్తూ జిల్లాలో ఇంకోక వ్యక్తిని నియమిస్తూ తెలియజేసే ఆదేశం అది.
ఆనందం, ఎవరి కళ్ళు నీళ్ళు లేని కళ్ళని అనుకుంటున్నామో.. ఎంత హృదయవిదారకమైన సంఘటనని చూసి కూడా ఎప్పుడూ కంటనీటి చుక్కరాల్చని ఆనందం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.....
పదవి పోయినందుకు.
మ్రాన్పడి కూర్చున్నాను ఆనందాన్ని చూస్తూ.
*******అయిపోయింది****
I was shocked to know the reason for his tears! He didnt even loose any big position also, if we think he is fond of people always to be around him and praising him. Ending konchem asamthrupri kaliginchindi, but kadha, kadhanam adbhutam!
ReplyDeleteకధా కథనం రెండూ బాగున్నాయి. అంతవరకు అంటే తండ్రీ, కొడుకులు పోయినా ఎడవని ఆనందం, సేవాహృదయం కల ఆనందం పదవి పోయినందుకు కనీళ్లు
ReplyDeleteపెట్టుకోవడం కృతకం గా ఉంది.
బాధలో ఉన్న వారికి సాయం చేయడం, ఎక్కడ బాధాకర సంఘటనలు జరిగినా హాజరై సహాయం అందించడం పాత్ర మంచి స్వభావాన్ని తెలియజేస్తుంది. బాధాకర సంఘటనలు చూస్తూ ఉండడం వల్ల బహుశా అతని హృదయం మొద్దు బారిపోయి ఉండొచ్చు. కళ్ళల్లో నీరు ఇంకిపోయే ఉండొచ్చు. కానీ రక్తసంబంధీకులైన తండ్రి మరణం గాని హఠాత్తుగా మరణించిన పుత్రుని మరణం గాని అతన్ని కదిలించలేదంటే అతని మానసిక పరిస్థితిపై సందేహం మాత్రం కలుగుతుంది.మొదటి నుంచి అతనికి ఏ పదవిపై వ్యామోహం ఉన్నట్టుగా కనబరచలేదు. మరి అనుకోకుండా వచ్చిన పదవి హఠాత్తుగా ఊడిపోయినంతమాత్రాన వెక్కీ వెక్కీ ఏడుస్తూ బాధపడటం ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది.ఈ పాత్ర సృష్టికి రచయిత సంఘంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారెమోనని భావిస్తూ ఉండటమా? ఏమిటో? కథ కన్నా కథనం మాత్రం బాగుంది
ReplyDeleteఇలాంటి ప్రోబ్లం ఉన్నవాళ్లు ఉన్నారని..వారి మనో భావాలు ఎలా ఉంటాయి అని గ్రహించి బాగా రాసేరు..congratulations..కానీ ఈ నీళ్లు రాని కళ్ళల్లో పదవి పోయినందుకు అంతలా ఏడవడం అన్నది ఎంటో నాకు ఎంటో గా అనిపించింది..ఇన్ని సంవత్సరాలు ఇంత నిస్వార్థం గా సేవ చేసిన మనిషి పదవి పోయినందుకు అంత బాధ పడాలా అనిపించింది..కానీ మీ naration చాలా బాగుంది..ఫీలింగ్స్ నీ బాగా narate చేస్తున్నారు..కీప్ ఇట్ ఉప్.
ReplyDeleteకళ్ళనీళ్ళు పెట్టుకోవడానికి ఏ విషయం కెటలిస్ట్ గా పనిచేస్తుంది. ఆత్మీయులు దగ్గరవాళ్ళు మనలని విడిచిపోవడం. రెండోది తన చాలా అనుభవించిన విషయం దూరం అవడం. నిస్వార్థంగా సేవ చేసిన ఎంతో మంది రాజకీయాలు లోకి వచ్చి 'అయ్యో!ఇతను కూడా ఇలా ఐపోయేడే' అన్న భావం మనలో కలగలేదా... నిస్వార్థంగా సేవచేస్తున్నవాడు కూడా ఈ పదవీ వ్యామోహంలో పదవి పోతే ఎంతలా బాధ పడతాడో చెప్పడం నా ఆలోచన్
ReplyDeleteఓకె..కవి హృదయం అర్థమైంది..అవును..ఈ రోజుల్లో మనిషికి అన్ని కష్టాల కంటే పదవి పోయిన కష్టమే పెద్ద కష్టం. థాంక్స్ ఫర్ ది క్లారిఫికేషన్..,👍👍
ReplyDeleteపదవి పోవడం కష్టమే. అందులో రాజకీయ పదవి. రాజకీయాలు ఎలాంటి వారినీ మారుస్తాయి అంటే ఇదేనేమో!
Deleteమనిషి దేనికి చలిస్తాడో తనకే అర్థం కాదు అనేదే ఈకథ సారాంశం అనుకోవాలి.
ReplyDeleteసరిగ్గా నా ఉద్దేశం అదే
Deleteమీతోపాటు మమ్మల్ని అలా సందర్భాలు, సన్నివేశాలు, ప్రదేశాలు చాలా తేలికగా తిప్పి తీసుకొచ్చారు.... చక్కటి కథ, ఇంకా చక్కటి కథనం..!
ReplyDelete..// నీళ్లు లేని కళ్లు //...
ReplyDeleteకథ బాగుంది .ఇతివృతం చివరలో ఒక కుదుపు లాంటి ట్విస్ట్ .నేనయితే అసలు ఊహించలేదు కూడా .
" అనందం " స్వతహాగా కష్ట సుఖాలకు చలించని ఒక ఆపద్బాంధవుడు .ఏమీ ఆశించని చిన్న చిన్న సంతృప్తులకై అలవాటుపడుతున్న
మనసు .అలా అంచెలంచెలుగా పెరుగుతున్న సంతృప్తికి సరిపడా ప్రతిఫలం అనుకోకుండా సంప్రాప్తించి ,తెలియకుండగనే హోదా కూడా మారిపోయింది .ఇదంతా బుద్ధి చేస్తున్న పనని మనసు గ్రహించేసరికి అది ఇంకొ సంతృప్త తలంలోకి వెళ్లిపోయింది .
ఆనందం , మన శ్రీకాకుళం" రెడ్క్రాస్ శాస్త్రి " లా సేవాదృక్పధం నుండి ,హోదా మరియు పేరు ప్రఖ్యాతులు సుడిగుండంలో చిక్కుకుపోయాడు .విధి వైచిత్రి ,ఒక రోజు ,గాలివానకు కుదేలయిన రాబందులా చుట్టూ చీకటి క్రమ్మెసరికి గుండె బ్రద్దలై ,హృదయం ద్రవించి ,గూడుకట్టుకున్న బాధంతా కళ్ళలోనించి ఉబికివచ్చింది .
....శ్రీనివాస్ .ఎం .
Chala variety ga vundi nijamey padaviki aa power vundi.Bahu bagu - Ratnam garu
ReplyDeleteచాలా అద్భుతం గా నడిపించేవు కథ ని. అభినందనలు
ReplyDeleteదయాల్
చాలా అద్భుతం గా నడిపించేవు కథ ని. అభినందనలు
ReplyDeleteదయాల్
చాలా అద్భుతం గా నడిపించేవు కథ ని. అభినందనలు
ReplyDeleteదయాల్
Evaru ae sanghatanaki ela spandistaro evvaramu cheppalemu...something that is valuable to a person might not be important at all to someone else...judgemental society gurinchi chakka ga rasaru...prati okkaru tama expectations ane chatram lo migata varini bandhichalani chustaru...ala jaraganappudu valla disappointment ni manasu gayapadetatuvanti vyakhyala tho bayatapedataru...are, nenanukunnattu atanu/aame enduku behave cheyyali anna okka chinna alochana prati manishi ki vaste, manade kaka, mana chutuu unna prapancham kuda anandamayam ga untundi.
ReplyDeleteKadha kadhanam rendu bagunnai. Kavi hrudayam artham chesukovadam anta easy kadu. Antarangam arthamaina taruvata kadha ending bagundi.
ReplyDelete