Sunday, 16 August 2020

వానరయూధమ్. (దేవాలయాలలో కోతులెందుకు ఉంటాయ్)

"మీరు రారా ?" అడిగేను రావుగారిని, అందరం బయల్దేరుతుంటే కాళ్ళు జాపుకుని కుర్చీలో కూర్చున్నారాయన. ఆలంపూర్ లోని జోగులాంబ దేవాలయం చూడ్డానికి వచ్చేం, ఆయన నేను మరికొంతమంది స్నేహితులం.  ఎందుకైనా మంచిదని, అక్కడి హరితా హోటల్ లో ఓ గది తీసుకున్నాము, విశ్రాంతి తీసుకునే అవసరం పడితే కొంచెంసేపైనా ఉండచ్చని. 

" నేనా!" గొల్లున నవ్వేడాయన.   "నా సంగతి తెలుసుండీ ఎందుకు అడిగేరు?"  

ఆయన నాస్తికుడ్నని చెప్పుకుంటాడు. అందుకని మాతో తీర్థప్రదేశాలు చూడ్డానికి వచ్చినా దేవాలయంలోకి రాడు. దేవుడ్ని ప్రార్ధించాలంటే గుడికే వెళ్ళక్కర్లేదని ఆయన నమ్మకం. 

" సరే!మేం వెళ్ళొస్తాం. " కొట్టవలసిన కొబ్బరికాయ, పళ్ళూ, ఇతర పూజకి అవసరమైన సామగ్రి అంతా ఉందో లేదో సరి చూసుకుంటూ చెప్పాను, మిగిలిన మిత్రబృందంతో బయటపడుతూ....

ఏదో పర్వదినం లా ఉంది. చాలా మంది భక్తజనం ఉన్నారావేళ. పెద్దపెద్ద వరసలలో నిలబడి దేవి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం కూడా చాలమందే ఉన్నారు. 

"మన అదృష్టం బాగుంది. అమ్మవారు వెలసిన రోజట. అందుకే ఇంతమంది జనం.  " పరవశంగా అన్నాడో మిత్రుడు. 

భక్తులు చాలామందే వస్తారని ఆ కోవెల వాళ్ళకి తెలుసు కదా..  అందుకే బయటంతా చాందినీలు, అక్కడక్కడ మంచినీళ్లు ఇచ్చేవాళ్లనీ కింద కాళ్ళు కాలకుండా తివాచీలాంటిదీ ఏర్పాటు చేసేరు. 

సుమారు నాలుగు గంటలు పట్టింది దర్శనం చేసుకోని బయటపడ్డానికి. అలసిపోయి జిడ్డు కారుతున్న, మొఖాలతో ఎండలో నిలబడి, నిలబడి కాళ్ళు పీకుతూంటే, నిలుచునీ, కూచొనీ నలిగిపోయిన బట్టలతో, రెండు నిమిషాలకన్నా తక్కువసేపే దేవి దర్శనం అయినా అదే సంతృప్తితో బయటపడ్డాం. 

గది చేరుతుండగా ఓ మిత్రుడు అన్నాడు నింపాదిగా." నా చేతి సంచీ కోతులెత్తుకు పోయాయి. "

"సంచిలో ఏమిటేమిటి ఉన్నాయి ?" అడిగేను ఆందోళనగా. 

"ఆఁ! పెద్ద ఏమీలేవులే. ధ్వజస్థంబం దగ్గర కొట్టిన కొబ్బరికాయ తప్ప." 

అలసిపోయి ఉన్నామేమో, భోజనం చేసి అలా ఉన్న నాలుగు కుర్చీలలో కూచునే పడుకుండిపోయేం. నాలుగు కావస్తుండగా రావుగారు అందర్నీ లేపేరు. "పదండి. పదండి. కొంచెం సేపు తుంగభద్ర అందాలు చూసి వెనక్కి వెళదాం!"

గబగబ తయారయి నది ఒడ్డుకు చేరేం. చాలా మెట్లుదిగి నది దగ్గరకు వెళ్లాం. నదిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి. కాసేపు ఆ మెట్లమీద కూర్చున్నాం. మాటలు కోతులెత్తుకుపోయిన సంచీ మీదకు మళ్లేయి. 

" అసలు దేవాలయాలలో కోతులెందుకు ఉంటాయో!" మామూలుగా జనాంతికంగా అన్నాను, రావుగారు నా పక్కనే ఉన్న సంగతి మర్చిపోయి. ఆయనేదైనా విషయం మీద మాట్లాడటం మొదలు పెడితే ఓ పట్టాన ఆపడు. 

"చాలా మంచి ధర్మసందేహమే వచ్చిందే. దీనికి కారణం గా ఓ కధ ఉంది. చెప్పమంటారా?" అడిగేరు. 

" కధా! తప్పకుండా చెప్పండి"  అన్నాడు సంచి పోగొట్టుకున్న మిత్రుడు, వద్దు వద్దన్నట్టుగా నేను చేస్తున్నసైగలని గమనించకుండా. ఆతనికి కధలంటే ఇష్ఠం. 

" రాముడు, సీత, సౌమిత్రి వనవాసం చేసేవారు." నాటకీయంగా ఆపి అందరు వింటున్నారా అన్నట్టు అందరివైపు చూసేడాయన. 

"రాముడు అయోధ్యనేలిన దశరధుడి కొడుకు. రాముడి భార్య సీత. రాముడికి ముగ్గరు తమ్ములు. అందులో లక్ష్మణుడు ఒకడు.  దశరధుడి మూడో భార్య కైక కోరిక మేరకు దశరధరాముడు పధ్నాలుగేళ్ళు వనవాసం చేసేడు భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో. సీతని రావణుడు ఎత్తుకు పోతే వానర రాజు సుగ్రీవుడు, ఆతని మంత్రి హనుమంతుని సహాయ్యంతో రావణుడ్ని చంపి తిరిగి రాజ్యాన్ని ఏలేడు. ఈ కధని ఈ దేశంలో చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు.!" కొంచెం హేళనగా అన్నాను. 

" నా కధ పూర్తిగా వినవోయ్ ! " నవ్వుతూ అన్నారాయన. 

"రావణుడు సీతని ఎత్తుకు పోయాక, రాముడు సీత కోసం వెదుకుతూ చెట్టు పుట్టా పట్టుకు తిరిగేడు. అలా తిరుగుతున్నపుడే కబంధుడ్ని వధించేడు. కబంధుడు, గంధర్వుడి గా మారి తన లోకానికి వెళ్తూ, ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఉంటాడు. అతని తో స్నేహం చేస్తే నీకు మేలు జరుగుతుంది. అని చెప్పేడు. తరువాత శబరీ అదే మాట చెప్పింది. శబరి దగ్గర తిండి తిన్నవాడు కాబట్టి శబరి చెప్పిన మాటను నమ్మేడు రాఘవుడు. 

"ఆ సమయానికి ......

" సుగ్రీవుడు, అన్నకి భయపడి, తన సన్నిహితులైన కోతులతో ఋష్యమూక పర్వతంపై బతుకుతున్నాడు. మాతంగ మహర్షి శాపకారణంగా వాలి ఋష్యమూకం మీదకి రాలేడు. అది కారణంగా సుగ్రీవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు.           అన్నకి తను చేసిన ద్రోహం, అన్న తనకి చేసిన ద్రోహం రెండూ సుగ్రీవుణ్ణి భయపెడుతున్నాయి. ఉన్న వానరాలలోనే, ఆతని మంత్రి, హనుమకూడా ఉన్నాడు. 

"ఇక సుగ్రీవుడి అన్న వాలి మహా బలశాలి. రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాడు.  కిష్కింధ ప్రశాంతంగా ఉంది. వానరరాజ్యం మంచి స్థితిమంతంగా ఉంది. వానరాలు వాలి పాలనలో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాయి. వానరులకప్పుడు, ఇనుప ములుకులతో ఉన్న బాణాల గురించి కానీ, బాగా వంచి, సన్నటి జంతునరంతో కట్టబడే ధనస్సులగురించి గానీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే. భుజబలం. వాళ్ళ ఆయుధాలు, గోళ్ళూ, రాళ్లూ, చెట్లూ. వాలి తన భుజబలంతో ఒక సాల వృక్షాన్ని పడగొట్టగలడు. సుగ్రీవుడికది చేతకాదు. 

"ధనుర్ధరులై  వస్తున్న  రామలక్ష్మణులను చూసి, తన్ని చంపడానికి వాలి వాళ్ళని పంపి ఉంటాడేమో అని భయపడ్డ సుగ్రీవుడు, ఆంజనేయుడ్ని రాయబారిగా పంపి, వాళ్ళని మంచి చేసుకున్నాడు. ఇద్దరికీ త్వరగానే స్నేహం కలిగింది, ఎందుకంటే ఇద్దరి భార్యలూ పరుల అధీనంలో ఉన్నారనే కష్టం ఒకటే కనక. 

"వాలి బలపరాక్రమాల గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడు, వివరంగా, భయంగా. వాలిని చంపుతానని తాను చేసిన వాగ్దానం సుగ్రీవుడు నమ్మాలంటే, వాలికన్న తాను బలవంతుడిని  అని నిరూపించుకోవాలి అని తెలిసింది రామునికి. ఒక బాణాన్ని సంధించి, ఆకర్ణాంతం  లాగి వదిలేడు. ఏడు సాలవృక్షాలలోంచి దూసుకు వెళ్లిందా బాణం. సుగ్రీవుడు నిశ్చేష్ఠుడై పోయాడు. భయపడిపోయాడు. ఉన్నచోటు నుండి కదలకుండ ఏడు సాల వృక్షాలని పడగొట్టిన రాముని చూసి. నీ బానిసని అన్నాడు. రాజ్యం నాకు దక్కిన తరువాత నా సైన్యం అంతా నీదే అన్నాడు. 

"తరువాత, వాలి వధ, హనుమ సాగరాన్నిదాటి లంకకి వెళ్ళి సీత జాడ కనుక్కొని రావడం, వానరసైన్యంతో లంకమీద దాడి సాగించి, రావణుని చంపి, సీతతో లక్ష్మణునితో, మొత్తం వానరులూ, యుద్దంలో చనిపోగా, మిగిలిన విభీషణుని రాక్షససైన్యం తో, రాముడు అయోధ్యకి తిరిగి వెళ్ళి, పట్టాభిరాముడైనాడు. 

" పట్టాభిషేకం తరువాత, రాజారాముడు, వానరులందరికీ వెలలేని ఆభరణాలు కానుకగా ఇచ్చేడు, కృతజ్ఞతతో. వనచరులైన వానరులకి, ఆ అయోధ్య వైభవం, ఆ ఆభరణాలూ చూసి ఆనందానికి, ఆశ్చర్యానికీ అంతులేదు. ' ప్రభో!నీ సామంతుడ్ని ' అని రాముని కాళ్ళమీద పడ్డాడు సుగ్రీవుడు, 'నా రాజ్యం, నా ప్రాణం నీవే '  అన్నాడు. 'ఇంత ధనవంతుడూ, శక్తిమంతుడూ అయిన రామునితో నేనెక్కడ తూగగలను' అనుకున్నాడు, భయంగా, గౌరవంగా. 

" అంతవరకూ ప్రశాంతంగా, స్థిరంగా బ్రతుకుతున్న వానరరాజ్యం 'రామభజన ' రాజ్యంగా తయారయింది. రామభక్తులం అని చెప్పుకొన్నవారికి ఆస్థానంలో ఉద్యోగాలు దొరికేయి. దొంగకోతులూ, నేరం చేసిన కోతులూ, రామభక్తులం అని చెప్పి శిక్షని తప్పించుకోసాగేయి. రామనామ జపం చేసేవాళ్ళని శిక్షించకూడదని సుగ్రీవాజ్ఞ. ప్రతి ఇల్లూ ఒక రామమందిరం అయిపోయింది. రాజు సుగ్రీవుడు రాజప్రాసాదంలో ఉన్న రామమందిరం దాటి బయటకు రావడమే లేదు.  వస్తే అది అయోధ్యకే అయేది. హనుమంతుడు సరేసరి. శ్రీరామపాదపద్మాలను విడచి కిష్కింధకి రానేలేదు. 

" వానర రాజ్య ఆర్ధిక పరిస్థితి తారుమారయ్యింది. వర్తకకోతులు, ఆహారధాన్యాలని నిలువజేసి, 'రాములవారికి బహుమానం ' అనే పేరుతో తప్పించుకుని, హెచ్చుధరలకి ప్రజాకోతులకి అమ్మసాగేయి. సైన్యపుకోతులు, 'జగద్రక్షుకుడు రాముడుండగా మేం రక్షసేయవలసింది ఏముంది' అని గంజాయి పీలుస్తూ 'హే రామ్!' అంటూ రామనామస్మరణలో మునిగిపోయేయి. సుగ్రీవుడు ప్రతీ ఏటా అయోధ్యకి కప్పం కట్టడం కోసం ప్రజలమీద అదనపు పన్నులు వేసి వసూలు చేయసాగేడు. 

"కోతుల జీవన ప్రమాణం పడిపోయింది. ఒకప్పుడు  అత్యంత సంపన్నంగా ఉండిన వానర రాజ్యం దరిద్రదశకు చేరుకుంది. ఇది అంతా గమనించిన కొన్ని మేధావి కోతులు యువకోతులూ, రాజు సుగ్రీవుని కలసి, పరిస్థితి అంతా విశదీకరించేయి. "రాముడైనా దేముడైనా మన రాజ్యపటిష్ఠత తరువాతే. ముందు కళ్ళు తెరిచి రాజ్యాన్ని చక్కదిద్దండి." అని విన్నవించుకున్నాయి. 

"సుగ్రీవుడు ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు. రాజు ఆలోచనలో పడ్డం గమనించిన మిగిలిన ఆస్థానకోతులు భయపడ్డాయి. వాటిలో అవి కూడబలుక్కున్నాయి. 'ఇప్పుడు రాజు రాజ్యం పరిస్థితి పట్టించుకుంటే మన నేరాలు అన్నీ బయటపడతాయి. రాజు మనలని ఉరి తీసినా ఆశ్చర్యం లేదు. '  అనుకున్నాయి. 

"సుగ్రీవుడ్ని ఏకాంతంగా కలసి బోధచేసేయి. "రాజా! ఇది కేవలం రాజద్రోహం. మనకి రాజారాముడు రాజూ దైవమూనూ.. అందుచేత ఇది దైవద్రోహం కూడా. జగద్రక్షకుడు రాముడు. ఈ లోకానికి అంతా రాముడే ప్రభువు. రామధిక్కారం రాజద్రోహం. దీనికి కోపించి రాముడు ఈ రాజ్యాన్ని మీనుంచి తప్పించి అంగదుడికి ఇవ్వవచ్చు. మీతో ఎంత విధేయతతో కనబడ్డా, అంగదునికి తన తండ్రి మరణానికి కారణం మీరే అని కోపం ఇంకా ఉంది. మీరు రాజ్యాన్ని కోల్పోయి, అంగదుడు రాజే అయితే, మీకు మరణశిక్ష ఖాయం"  అని భయపెట్టాయి. 

"తనకి రాజ్యముప్పు, ప్రాణముప్పు అనే ఆలోచనని సహించలేకపోయాడు సుగ్రీవుడు. ఒకసారి రాజ్యాన్ని కోల్పోయి అష్టకష్టాలూ పడ్డాడు. అప్పుడు మహనీయుడు శ్రీరాముడు ఈ సింహాసనాన్ని తనకు ఇప్పించేడు. ఆరోజు వాలి వధ జరిగిన తరువాత, తలుచుకుంటే రాముడే ఈ సింహాసనాన్నిఏలి ఉండేవాడు. కానీ మా స్నేహం మీద గౌరవంతో ఆయన నాకు ఇచ్చిన భిక్ష. అటువంటి మహనీయుని మీదా తిరుగుబాటు? సుగ్రీవునికి కోపమొచ్చింది. 

"వెంటనే ఆ మేధావి కోతులనీ, వారితో వచ్చిన యువకోతులనీ దేశబహిష్కరణ చేసి, రాజ్యంలోంచి పంపేశాడు." ఏకబిగిన చెప్పి రావుగారు ఆగేరు. 

అందరూ శ్రద్ధగా వింటున్నారు. నాకు చిరాకు, కోపం కలగలసి కలిగేయి. పవిత్రమైన రామాయణాన్ని, అందులో అంశాలనీ తన కధకోసం తన కిష్టం వచ్చినట్లు మారుస్తున్న రావుగారిని చూసి. సుగ్రీవుడినీ, మిగిలిన దైవాంశ సంభూతులైన వానరులనీ, కేవలం రామునికోసమే తమ ప్రాణాలను వడ్డి రాక్షససేనలతో పోరాడిన మహనీయులని, కోతులంటూ, వాళ్ళని నీతిలేనివాళ్ళుగా మతిలేనివాళ్ళుగా చిత్రీకరించడం చూసి బాధపడ్డాను. కోపం వచ్చింది. 

దూరంగా కోవెలలోంచి గంటల శబ్దం వినబడుతూంది. సూర్యుడు అస్తమిస్తూ , ఏ చిత్రకారుడూ వేయలేనంత అద్భుత రంగుల మిశ్రమంతో చిత్రీకరిస్తున్నాడు తూర్పూ పడమర అనే తేడాలేకుండా మొత్తం ఆకాశాన్నంతా. 

" రెండున్నరపేజీల కధ చెప్పారు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు!" అన్నాను వ్యంగ్యంగా. 

"ఆ విషయానికే వస్తున్నా.. అలా దేశ బహిష్కరణ పొందిన కోతులు ప్రాణాలకి తెగించి, దేశ సమస్యని, రాజ్యసమస్యని పౌరులందరికీ వివరంగా చెప్పేయి. చాలా కోతులు నమ్మలేదు. కొన్ని కొట్టబోయేయి. మరికొన్ని ఆలోచించేయి. నమ్మేయి. ఆ మేధావి కోతులతో పాటు అరణ్యాలలోకి పారిపోయేయి.

మేధావి కోతుల హెచ్చరికని పెడచెవిన పెట్టినందుకు, కొద్దికాలంలోనే ఆ వానరరాజ్యం విచ్ఛిన్నమైంది. అయోధ్యలో రాముడు నిర్యాణం చెందేడు. తనతో పాటు ఆ అయోధ్యలో ఉన్న ప్రజలనందరినీ, తనతో వైకుంఠం రావడానికి సిద్దపడ్డవాళ్ళందరినీ, సుగ్రీవునీ తీసుకుని పోయాడు. హనుమంతుడు గంధమాదన పర్వతసానువులలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు.

"అంగదుడు ఆ వార్తవిని మరణించేడు. రాజ్యం రాజులేక, ముక్కలు చెక్కలు అయింది. కోతులకి ఆశ్రయం, రక్షణ ఇచ్చేవాడు లేకపోయాడు. వాటికి వనాలలో చెట్లమీద దొరికే ఫలాలు కోసుకుని తినే అలవాటు తరాలకిందే పోయింది. దేవుడు, జగద్రక్షకుడే దిక్కు అనుకున్నాయి.  ఈ ఆలయాలలో భక్తులు పెట్టే ఆహారం వాటికి కష్టపడకుండా దొరకసాగింది. కాలక్రమేణా భక్తులు వాటికి ఆహారం పెట్టడం మానుకున్నారు. అప్పట్నించీ బతుకు తెరువు కోసం దొంగతనాలు చేస్తూ అందరిచేతా అసహ్యించుకోబడుతూ జీవిస్తున్నాయి. 

"సుగ్రీవుడిచేత దేశబహిష్కరణ పొందిన మేధావి కోతులూ, వాటితోపాటుగా అడవుల్లోకి పారిపోయిన కోతులూ, వారి సంతతీ, అరణ్యాలలో, స్వతంత్రంగా, హాయిగా ఉంటున్నాయి. ఆవిధంగా, దేవాలయాల్లో కోతులు ఉండటం జరిగింది." అన్నారు రావుగారు. 

చీకటి పడింది. రావుగారి కధకి ఎలా కౌంటరు ఇద్దామా అని ఆలోచిస్తున్నాను. 

మళ్ళీ రావుగారి కంఠం వినబడింది. " ఆలోచనలనీ, కధలనీ కట్టిబెట్టండి. పురుగూ పుట్రా ఉంటాయి. ఇప్పుడు బయల్దేరితే అర్ధరాత్రి అవుతుంది హైదరాబాద్ చేరేటప్పటికి." అంటూ లేచేరు. " పదండి!" 


 *************************అయిపోయింది.********************************

ఈ కధ నేను సెప్టెంబరు 1978 లో రాసేను.  ఇన్నాళ్ళ తరువాత ఈ ఆముద్రిత కధని చదివితే ఎన్నో ఆలోచనలు. కధలు రాయడం మొదటిరోజుల్లో రాసిన కధ. మా నాన్నగారికి చాలా నచ్చిన నా కధ. అందుకే నేనే పత్రికకు పంపలేదు ప్రచురణార్ధం. ఈ కధ ఏ ఎడిటర్ కో నచ్చకపోయినా, నాన్నగారికి నచ్చింది. అంతేచాలు అనుకున్నాను. ఇప్పుడు నా బ్లాగులో కద. ఇబ్బంది లేదనిపించింది. 

మీకు నచ్చినా నచ్చకపోయినా ఓ కామెంట్ రాయడం మర్చిపోకండి కామెంట్ కింద మీ పేరు రాయకపోతే unknown అని వస్తుంది.  

Sunday, 9 August 2020

థ్రిల్

 "మనం ఇప్పుడు వెళ్ళే పార్కు రాములపాడులో ఉంది. గోపాల్ అక్కడే ఉంటున్నాడు." అన్నాడు రాజారావు. 

ఎనిమిదిన్నర అయింది అప్పటికి సమయం. పశ్చిమజర్మనీ రాజధాని బాన్ నుండి వచ్చేను నా దేశం. నా ఊరు. రాజారావు, గోపాల్ నేను చిన్ననాటి స్నేహితులం. పశ్చిమజర్మనీలో ఓ ప్రసిద్ద మందులు తయారుచేసే కంపనీలో పనిచేస్తున్నాను. రాజారావు శ్రీకాకుళంలోనే వ్యాపారం చేస్తున్నాడు. గోపాల్ శ్రీకాకుళం ఏజన్సీ ప్రాంతంలో రాములపాడు  అనే గ్రామం దగ్గర ఒక స్నేక్ పార్కు పెట్టాడు. అక్కడికే ఇప్పుడు ప్రయాణం. 

గోపాల్ స్నేక్ పార్కుకి మంచిపేరు వచ్చింది. విషం ప్రాణం పోసే ఔషధంగా మారుతున్న ఈ రోజుల్లో వాడి స్నేక్ పార్కునుండి ఎగుమతి అయ్యే విషానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది.  వీలైతే వాడి పార్కుకి మా కంపనీ కి ఒక ఆర్డరు సంపాదించాలని నా ఉద్దేశం. మళ్ళీ మూడు రోజుల్లో నేను వెళ్ళిపోవాలి. 

"చిన్నప్పట్నించి సాహసాలంటే వాడికి చాలా ఇష్టం. ఇప్పుడుకూడా ప్రమాదకరమైన పనినే వృత్తిగా ఎంచుకున్నాడు."  అన్నాను రాజారావుతో.

పోర్టికోలో ఉన్న కారులో సామానులు సర్దిస్తున్న రాజారావు నా మాటలు విని, వెనక్కి తిరిగి నవ్వి అన్నాడు. "విదేశాలలో ఉండి నువ్వు మనదేశపు అలవాట్లు మర్చిపోయేవులా ఉంది."

"అంటే...." సంధిగ్ధంగా అడిగేను. 

"మన చేతికి మట్టి అంటకుండా పని జరగాలన్నది ఈదేశ ప్రజల ముఖ్య సిద్దాంతం.  అలాగే గోపాల్ కూడా. వాడు పాములను పట్టడు. వాడి చేతికింద మనుషులున్నారు. వాళ్ళో, ఆ పల్లె ప్రజలు పట్టి అమ్మినవో పాములు. వీడు కేవలం విషం తీస్తాడు అత్యంత ఆధునిక పద్దతులలో. ఆ సమయంలో కూడా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొనే తీస్తాడు. అంచేత అస్సలు రిస్కు అనేదే లేదు." అన్నాడు. "కారెక్కు. బయల్దేరదాం. ఎండెక్కుతోంది."

అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, కెమెరా జాగ్రత్తగా వెనక సీట్లో పెట్టాను. "కెమెరా ఎందుకు?" అడిగేడు రాజారావు. 

"పోలోరాయిడ్ కెమెరా ఇది. జర్మనీలో ప్రత్యేకం. ఫోటో తీసినవెంటనే ప్రింట్సు వస్తాయి. ఇవేళ పౌర్ణమిట. కేలెండరులో చూసేను. రాత్రి వెన్నెల్లో దృశ్యాలు అధ్భుతంగా వస్తాయి." అన్నాను.

చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాజారావు. మా ప్రయాణం మొదలైంది. 

                                          *                        *                        *

రాములపాడు చేరేసరికి భోజనాల సమయం కావొచ్చింది. గోపాల్ కి ముందే కబురు చేయబట్టి బస్టాండు దగ్గర నిరీక్షిస్తూ నిలబడ్డాడు గోపాల్. మమ్మల్ని చూస్తునే వాడి మొఖం ఆనందంతో వెలిగిపోయింది. 

"ఎన్నాళ్ళయిందిరా చూసి!. రండి! రండి! వెల్కం టూ స్నేక్ పార్క్.! " అన్నాడు ఆప్యాయంగా కౌగలించుకొంటూ. "ఎప్పడొచ్చావ్ బాన్ నుండి? ఏమిటి విశేషాలు?? ఎన్నాళ్ళుంటున్నావ్? మీ నాన్నగారు అమ్మగారు బాగున్నారా? మీ అక్కయ్యలు ఎక్కడెక్కడ ఉన్నారు? " ప్రశ్నల వర్షం కురిపించేడు. 

"మనం ముందుకు వెళ్దామా లేక ఇక్కడ్నించే వెనక్కి పంపేస్తావా?"  రాజారావు చిరునవ్వుతో అడిగేడు.

"సారీ రా పదండి". అన్నాడు కారెక్కుతూ. 

"బావుగారూ..." అన్నాడు అతని పక్కన అంతవరకూ నిలబడ్డ వ్యక్తి. 

"నువ్వు సామానులు తీసుకొని వచ్చేయ్, కాళయ్యా" అన్నాడు గోపాల్ ఒకపక్క ఆజ్ఞాపిస్తూ. ఇంకోపక్క మాకు పరిచయం చేస్తూ. ఆరడుగుల భారీ విగ్రహంతో నల్లగా ఏకశిల రాయిలా ఉన్నాడు కాళయ్య. 

ఓ గంటసేపు పల్లెటూరి మట్టిరోడ్ల మీద ప్రయాణం చేసేక కారు, విశాలంగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది. చుట్టూ చెట్లగుబురులతో అడవి మధ్యలో ఉన్నట్టు ఉంది ఆ ఇల్లు. పూరిగడ్డితో నేసిన ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. బయట ఎంత నిరాడంబరంగా ఉందో లోపల అంత ఆధునికంగా ఉంది. ఇద్దరికి వేర్వేరు గదులు ఇచ్చాడు. పూరి గడ్డతో నేసినది కావడం వల్ల కాబోలు బయట ఎంత ఎండగా ఉన్నా, లోపల చల్లగా ఉంది. 

కాళయ్య వచ్చేసాడు. ఏవో సామానులు కొన్నట్టున్నాడు గోపాల్. అవన్నీ లోపల పెట్టి, భోజనాలబల్ల మీద మాకు భోజనాలు ఏర్పాటు చేసేడు. గోపాల్ శ్రీమతి పిల్లలతో తన పుట్టింటికి వేసవి సెలవులకని వెళ్ళిందట. గోపాల్ క్షమాపూర్వకంగా చెప్పేడు. భోజనాలు చేసేక తనకి నిద్ర వస్తూందని రాజారావు వెళ్ళి పడుకున్నాడు. నేను గోపాల్ బాతాఖానీలో పడ్డాం. సాయంత్రం కావొస్తుండగా ఇద్దరం బయటపడ్డాం. చుట్టూ చెట్లతో అడవిలా ఉంది. చల్లగా ఉంది. తన స్నేక్ పార్కుని చూపించసాగేడు గోపాల్.

చాలా చక్కగా అమర్చేడు పార్కుని. ప్రమాదం కలిగించని పాములని ఒకప్రక్కగా,  అతి ప్రమాదకారులైన పాములని ఒకప్రక్కగా, విదేశాలనుంచి తెప్పించిన పాములని ఒకప్రక్కగా, ఆల్బమ్ లో స్టాంపులని అతికించినట్లు. 

గడ్డితో నేసిన పెద్ద షెడ్డులాగా ఉంది. అందులో వరసగా గాజు తొట్టెలు అమర్చేడు. ఆ తొట్టెల్లో రాళ్ళూ, ఇసక, చిన్న చిన్న కొమ్మలూ అమర్చి, అందులో పెట్టేడు పాములని. ఒక్కొక్క పాము పేరు, అది దొరికే ప్రదేశం, అది తీసుకొనే ఆహారం, ఎలా గుడ్లని పెడుతుందో, అన్నీ తెలుగులో, ఇంగ్లీషులో వివరంగా వ్రాసేడు. రకరకాల పాములు. ఊహల్లో తల్చుకోవడానికే భయమేసే పాములు అలా ఉండగా చూడటానికి చాలా వింతగా, థ్రిల్లింగ్ గా ఉంది.

"ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పాములు పన్నెండు రకాలు మాత్రమే. అందులో కింగ్ కోబ్రా అని పిలవబడే నాగుపాము ఒకటి. అమెరికాలో కనబడే రాటిల్ స్నేక్ అన్నింటికన్న ప్రమాదకారి. కాని నాగుపాముని మించిన అందమైన పాము మరోటి లేదు ప్రపంచంలో. " అన్నాడు గోపాల్ ఇండియన్ కోబ్రా అని రాసివున్న తొట్టెను చూపిస్తూ. అందులో చాలా పాములున్నాయి, ఒకదానిని ఒకటి చుట్టుకొని. మూలమూలల పడుకొని. 

"వెన్నెల్లో పడగ విప్పుకుని నిలబడ్డప్పుడు చూడాలి దీని అందం మెచ్చుకోలుగా" అన్నాడు గోపాల్. 

వెంటనే నాకు కెమెరా గుర్తొచ్చి అడిగాను. - "వాటికి విషం ఉందా?   "

ఎంత మామూలుగా అడిగినా నా కంఠంలో ధ్వనించిన భయాన్ని గమనించి నవ్వేడు గోపాల్. "ఉహూఁ! లేదు. నిన్ననే తీసేసేను. ఫ్రిజ్ లో ఉంది అంతా. బహుశా రేపు పంపేస్తాను. అమెరికా నుండి ఒక ఆర్డరు ఉంది. వాళ్లకి పంపాలి."

ఇంటిముందు ఒక వరండా ఉంది. ఆక్కడ పాతకాలపు ఈజీఛైర్ ఉంది. ప్రక్కనే కొన్ని కుర్చీలున్నాయి. "అలా విశ్రాంతిగా కూర్చో.." అని నన్ను ఆ పడకకుర్చీలో కూచోబెట్టి తను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కాళయ్య లోపల్నించి కొబ్బరి బోండాలు తెచ్చి ఇచ్చేడు. తాగుతూ అడిగేను." నువ్వు పట్టవా పాముల్ని? "

"వూఁహూఁ! నేను పట్టను. కాళయ్య పడతాడు ఎక్కువగా. ఇంకెవరైనా తెస్తే కొంటాను." అన్నాడు. 

"అయ్యో ! నీకేవైనా అనుభవాలు ఎదురవుతాయనుకున్నాను " అన్నాను నిరాశగా. 

" అనుభవాలా!  " చిన్నగా నవ్వేడు. ఇంతలో కాళయ్య వచ్చి ఆ అరుగు మీద గొంతుకిలా కూచున్నాడు. కాళయ్యని చూసి ఏదో గుర్తొచ్చినట్టు అన్నాడు. " ఒకేఒకసారి ఎదురయింది."

"ఏమయ్యింది?" ఆతృతగా అడిగేను.

చీకటి పడసాగింది. సూర్యుని కిరణాలు పడమటి వైపునుంచి, చెట్లకొమ్మలలోంచి ఆ  ఇంటి ముంగిటిలో పడసాగేయి. చీకట్లు సూర్యకిరణాలని ఆకలిగా తినేస్తున్నాయి. హిస్ మన్న శబ్దం పక్షుల కిలకిలా రావాలతో కలసిపోతోంది. 

" ఒకే ఒకసారి వెళ్ళాను కాళయ్యతో. ఈ దగ్గరలోనే ఉన్న పొదలకు రెండు రోజులై పాము వస్తోెందని చూసిన రైతులు చెప్పారు. కాళయ్య వెళుతుంటే నేను సరదాగా వెళ్లాను. ఆ పొదని సులువుగానే గుర్తుపట్టాడు కాళయ్య. ఆ పొద పక్కనే పాము తరచు వస్తున్నట్లు గుర్తులు, విడిచిన కుబుసం, గడ్డి ఒత్తుకోబడి దారిలా అయినట్టు ఓ పొడవయిన గుర్తు, కాళయ్య ఆవేళ తను పాము అక్కడ తిరుగుతున్నదీ లేనిదీ ఎలా గుర్తిస్తాడో చెప్పేడు. చీకటి పడే దాకా రాలేదు ఆ పాము ఆ పొద దగ్గరకి. కాళయ్య నేను ఆ పొద కి కొంచెం దూరంలో కూచుని, ఊపిరి తీయడానికి కూడా సందేహిస్తూ ఆ పాము కోసం ఎదురుచూడసాగేం. చీకటి పడింది. ఆ రోజు వెన్నెలరోజు అనుకుంటా   ---" ఆగి కాళయ్యని అడిగేడు.  "  వెన్నెెల ఉంది కదూ?"

కాళయ్య అవునన్నట్లు తలూపేడు. 

"ఇద్దరమూ చెట్లలోంచి, ఆకుల మధ్యనుంచీ పడుతున్న వెన్నెలలో అలా కూర్చున్నాం. ఇంతలో ఎడమ పక్కనించీ 'హిస్ ' మని వినబడింది. కాళయ్య బరువుగా ఊపిరి వదుల్తున్నాడనుకొని 'ష్' అని మందలించి ఊరుకున్నాను. మళ్ళీ ఆ హిస్ మన్న శబ్దం వినబడింది. అప్పుడు గుర్తొచ్చింది. కాళయ్య నా కుడివైపు కూర్చున్నాడని. దడదడలాడుతున్న గుండెతో, బెదురు బెదురుగా ఓరగా చూసేను. అక్కడుంది."

" ఏమిటీ?" ఆత్రంగా అడిగేను.

"పాము"

" నాగుపాము?!"

"  అవును. మేం ఎదురు చూస్తున్న నాగుపామే. అడుగు పైకి నిలబడి పడగ పూర్తిగా విప్పి బుసకొడుతూ ఉంది. నాకు ఊపిరి ఆగినంత పని అయ్యింది. భయంతో ఏం చెయ్యాలో తోచలేదు. కాళ్ళూ చేతులూ ఆడలేదు. నా కళ్లు నిశ్చలంగా ఆ పామునే చూడసాగేయి.  

" ఎలా వెళ్ళాడో తెలీదు, కాళయ్య అంత కన్న నిశ్శబ్దంగా, ఆ పాము వెనక్కి వెళ్ళాడు. కాళయ్య చేయి ఆ పాము వైపు సాగడం చూసిన గుర్తుంది. నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి కాళయ్య ఆతృతగా నా వైపు చూస్తూ కనబడ్డాడు. ఇప్పటికీ ఆ అనుభవం తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది " అన్నాడు గోపాల్ ఆగుతూ. 

" మరి కాళయ్య కదిలితే ఆ పాము శబ్దం వినలేదా?"

"పాములకి చెవులుండవు. అది భూ ప్రకంపనాలబట్టి  అలికిడిని కనుక్కుంటుంది. అసలు ఆ వేళ నేను అలా కొయ్యబారిపోయి పోవడం పనికివచ్చింది - ఆ పాము దృష్టి అంతా నా మీద ఉండటం వల్ల కాళయ్య పని సులువైంది."

"గుడ్ గాడ్! ఆ హిస్ మన్న శబ్దం రాగానే నువ్వు కాలో చెయ్యో కదిపి ఉంటే...."

" కదిపి ఉంటే విదేశాన్నించి వచ్చిన నా మిత్రుడితో ఈ గోపాల్ మాట్లాడుతూ ఉండేవాడు కాదు. " అన్నాడు నవ్వుతూ.  

" కబుర్లేనా! కొంచెం టీ లాటిది తాగించడం ఉందా ?" నిద్రలేచి వచ్చిన రాజారావు అడిగేడు ఇంకో కుర్చీలో కూలబడుతూ. 

లోపల్నించి కాళయ్య టీలూ కొంచెం అల్పాహారాలు తెచ్చిపెట్టాడు. అలా కబుర్లలో పడ్డాం. పాముల మనస్తత్వం గురించి, తన కొచ్చిన ఆర్డర్సు గురించి, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలనుంచి అనుమతులు ఎంత కష్టపడి సంపాదించవలసి వచ్చిందో.. రాజారావు ఎంత సహాయపడ్డాడో వివరంగా చెప్పాడు. 

రాత్రి తొమ్మిది గంటలయింది. 

వెన్నెల పుచ్చపువ్వులా మెరిసిపోతోంది.  నేను రాజారావు కెమెరా పట్టుకొని బయలుదేరాం. గోపాల్ కి నిద్ర వస్తుందని రాలేదు. కాళయ్య వరండాలో ఓ మూల నిద్రపోతున్నాడు. వీళ్ళకి రాత్రి ఏడు గంటలకే మొదలవుతుంది. 

రాజారావు ఆరు సెల్సు ఉన్న టార్చిలైటు ఒకటి, ఆత్మరక్షణకై ఓ పెద్దకర్ర పట్టుకున్నాడు. గోపాల్ సలహా మేరకు మోకాళ్లదాకా ఉండే ఫైర్మన్ బూట్లు వేసుకున్నాం. అంతకు మించి పై ప్రదేశంలో కుట్టలేవట పాములు. 

వెన్నెల వెండిలా మెరుస్తూ కనబడుతూంది ఆకులమీద. అక్కడక్కడ నిద్రలో ఉలిక్కిపడ్డట్టు అరిచే పక్షుల అరుపులు మినహా ప్రకృతి  అంతా నిశ్శబ్దంగా ఉంది, ఓ పెద్దలాండ్ స్కేప్ లా. జర్మనీలో ఇంత ప్రశాంతంగా, నిర్మలాకాశాన్ని అన్ని తారలనీ చూసే అవకాశం లేదు. మంచి దృశ్యాలు చూస్తున్నానన్న ఉద్వేగంతో నడుస్తున్న నన్ను అదలించసాగాడు రాజారావు. 

రాములపాడు పక్కనే పారుతున్న ఓ వాగు వడ్డున కూర్చున్నాం. వాగు లోని నీళ్ళు కృష్ణశాస్త్రి గారి మాటవిన్నట్లు సడిచేయకుండా సాగిపోతున్నాయి. ఆకులలో గాలి కూడా ప్రకృతి అందానికి పరవశించినట్లుగా ఊసులాపేసింది. చాలాసేపు నిశ్శబ్దంగా, మాట్లాడితే తనకి భంగం అయిందని ఆ ప్రకృతి అంతా మాయమైపోతుందేమో ఆన్నట్లు కూచున్నాం. 

చివరికి రాజారావు "పదవెళ్గాం " అని లేచాడు. 

వెనక్కువచ్చి పార్కులోకి ప్రవేశిస్తుంటే రాజారావు చటుక్కున నా చేయిని పట్టుకుని  ఆపాడు. 

" ఏమిటి?" అడిగేను. 

" ష్!అటువైపు చూడు." ఆన్నాడు తర్జని చూపిస్తూ. 

పాము!

నాగుపాములా ఉంది. ఒక మూల పడుకుంది చుట్టచుట్టుకొని. 

మధ్యాహ్నం గ్లాస్ కేస్ లో చూసేను. బయటికెలా వచ్చిందో అర్ధం కాలేదు.  తప్పించుకుందా? 

ఏమో ?

 వెన్నెల సూటిగా ఆ పాము మీద పడుతోంది. 

కెమెరా సిద్దం చేసుకుని రాజారావుతో అన్నాను. "చిన్నగా అలికిడి చేయి"

నేను  పని చూడలేదు రాజారావు. కర్రతో నేలమీద కొడుతూ " ష్ష్ ! ష్ష్!" అన్నాడు. చటుక్కున పడగ విప్పి మా వైపు చూసింది. వెంటనే ఫ్లాష్ నొక్కాను. 

'బుస్' మంది కోపంగా.

దగ్గరకి వెళ్లబోయాను. రాజారావు చెయ్యి పట్టుకు ఆపాడు. 

" ఫరవాలేదు. విషం తీసేసిందే !" అన్నాను దగ్గరగా వెళ్తూ. "రాజా నువ్వు ఇటువైపుకి రా " అన్నాను. 

రాజారావు దగ్గర కర్ర వుంది కనక, రాజారావునే చూడసాగింది ప్రత్యేకంగా. రాజారావు అటు వెళ్ళగానే 'బుస్' మంటూ అటు తిరిగింది. పడగమీద ఉండే సులోచనాలు పడేలా ఫోటో తీసేను. 

'బుస్' 'బుస్' మని బుసలు కొడుతోంది కానీ చురుగ్గా కదలలేకపోతోంది ఆ పాము. 

ఇంకా మంచి ఫోజు కావాలని, తోక పట్టుకుని లాగి చటుక్కున రెండడుగులు వెనక్కి వెసేను. రెట్టించిన కోపంతో 'హిస్' మంటూ లేచి నా వైపు తిరిగింది. అప్రయత్నంగా నా వేలు ఫ్లాష్ నొక్కినా ఆ కోపం ఆ వేగం చూసి గుండె ఝల్లుమంది. 

మెల్లగా పాక్కుంటూ పక్క పొదలోకి వెళ్ళిపోయింది. దాని కడుపు ఉబ్బి ఉండటం చూసి రాజారావు అన్నాడు "దేన్నో తినేసింది. అందుకే చురుగ్గా కదల్లేకపోతోంది ".

మా గదులలోకి వెళ్లి పడుకున్నాం. నిద్రపట్టేలోగా, చాలాసేపు కోపంగా పడగ విప్పి నావైపు తిరిగిన ఆ పామే కళ్ళలో కదలాడీంది. 

మర్నాడు లేచేసరికి ఎండవేడి హెచ్చుతోంది. రాజారావు అప్పటికే హడావుడి పడుతున్నాడు. 

తయారయి ఫోటోలు ప్రింట్సు తీసి చూసేను. అద్భుతంగా వచ్చేయి. పామువి మరీ బాగా వచ్చేయి, సహజంగా. బాన్ లోని నా సహోద్యోగులందరు ఆశ్చర్యపోతారు ఈ ఫోటోలు చూసి. ఇండియాకి లాండ్ ఆఫ్ స్నేక్ ఛార్మర్స్ అని పేరు. 

విషం లేని పాముకి తీసేనని చెప్పకూడదు. థ్రిల్ ఉండదు అలా చెపితే - అనుకున్నాను.  

గోపాల్ కోసం బయటకి వెళ్ళాను. కాళయ్య గోపాల్ ఎక్కడో ఉన్నారు. రాజారావు అసహనంగా కేకేసాడు. "గోపాల్!".

"ఇక్కడున్నా" ఒక మూలనించి సమాధానం వచ్చింది.

అటువైపు వెళ్ళాం. గోపాల్ కి ఫోటోలు చూపించి మా అడ్వెంచర్ గురించి చెప్పాలని ఆత్రపడసాగాను. 

కాళయ్య పొదలో ఏదో వెతుకుతూంటే,  గోపాల్  పక్కన నిలబడి సలహాలు ఇస్తున్నాడు. 

" ఫోటోలు చూడరా!" అంటూ ఫోటోలు చేతిలో పెట్టాను.  

"ఒక్కక్షణం" అని కాళయ్యని పిలిచి ఫోటోలు చూపించేడు. "ఇదే ఆ పాము. "

కాళయ్య మౌనంగా తలూపి మళ్ళీ పొదలో దూరేడు. 

"రాజారావు ఉదయాన్నే చెప్పేడు రాత్రి జరిగిన సంఘటన. నా కేసులోంచి పాములు తప్పించుకోవడం అసాధ్యం. అది ప్రమాదం కూడా! అందుకే కాళయ్య నేను అన్ని కేజ్ లూ తనిఖీ చేసేం. అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటీ తప్పించుకోలేదు." 

" అయితే....అంటే...." నేనూ రాజారావూ ఒకేసారి అయోమయంగా అన్నాం.  

"దొరికింది....." కేక వేస్తూ పొదలోంచి కాళయ్య వచ్చాడు. 

కాళయ్య చేతిలో ఉందా పాము. మంచి పొగరుగా ఉంది. సరిగ్గా దాని తోకదగ్గరా, పడగ దగ్గరా వడుపుగా పట్టుకున్నాడు కాళయ్య. అది బుసకొడుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంది. రాత్రి తోక పట్టుకుని లాగిన పామే అది. 

నిలువు గుడ్లేసుకుని నిలబడ్డాం రాజారావూ నేనూ...

**************అయిపోయింది************

నా ఈ కధ ఆంధ్రప్రభ వారపత్రికలో 06-10-1982 న ప్రచురితమైంది. 1977 లో మద్రాసులో స్నేక్ పార్కు చూసిననాటినుంచి ఈ కధ నా మనసులో మెదలసాగింది. 1980 లో రాసేను గాని ఎవరికీ పంపలేదు. 82 లో ఆంధ్రప్రభకి పంపేను. వారు ప్రచురించేరు. 

ఈ కధ రాసిన సమయానికి, జర్మనీల ఏకీకరణ జరగలేదు. 

  

Saturday, 8 August 2020

మార్గదర్శకులు

 కొత్తగా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి చిరునామా మనకి తెలియనప్పుడు, అక్కడి వారినెవరినైనా మనక్కావలసిన చిరునామా చెప్పి ఆ చిరునామా దగ్గరకి ఎలా వెళ్ళాలో అడుగుతాం. ఇది సర్వసాధారణం. దారి ఎటో కనుక్కోవడంతో పాటు అక్కడికి సులభంగా చేరడానికి నడక మంచిదా, లేక రిక్షానో బస్సో ఎక్కి వెడితే మంచిదా  అని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మార్గదర్శకులతో మాత్రం మహా చిక్కు. వాళ్ళేం చెప్పినా మనం నమ్మాల్సిందే. 

మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ కలసి ఉన్న లోకం కనక, మంచివాడు తారసబడితే ఊరికి కొత్తవాళ్ళమన్న సానుభూతితో జాగ్రత్తగా వివరించి చెప్తారు. ఒక్కోసారి మనతో ఆ చిరునామా దాకా వచ్చి దిగబెట్టి వెళ్తారు, ఊరు చిన్నదయితే. తుంటరి వాళ్ళ చేతికి చిక్కామంటే మాత్రం తప్పుదోవ పట్టించి మూడుచెరువుల నీళ్ళు తాగిస్తారు. 

నామిత్రుడొకాయన ఆ మంచివాళ్ళ కోవకి చెందుతాడు. అతడు చెప్తే,  అలా మనసుకు హత్తుకు పోవాల్సిందే. కళింగపట్నం లాంటి పల్లెలో బతుకుతున్న వ్యక్తి , కలకత్తా అయినా, బొంబాయి అయినా అతని దగ్గర వివరాలు తీసుకుంటే, అదే మొదటిసారి వెళ్ళడం అయినా, కళ్ళు మూసుకుని ఆ చిరునామా కి వెళ్లచ్చు (ప్రమాదం జరగదని నమ్మకం ఉంటే). పెద్దనగరాలైతే ఏ నంబరు సిటి బస్సెక్కాలి, మనం దిగాల్సిన స్టాప్ పేరేంటి, టిక్కెట్ ఎంత ఉంటుంది, బస్ స్టాప్ నుండి ఇంటికి ఎంత దూరం ఉంటుంది, రిక్షా ఎక్కితే ఎంత తీసుకుంటాడు అన్నీ చక్కగా చెప్తాడతను. ఇంకా మనకి అర్ధం కాకపోతే పటం గీసి చూపుతాడతను. 

నేనోసారి హైదరాబాద్ వెళ్లాల్సిన పని పడింది. అదే మొదటిసారి కనక నా మిత్రుడి దగ్గర సలహా తీసుకున్నాను. అతని సూచనల ప్రకారం రైలుదిగి నేను వెళ్ళవలసిన చోటుకి చాలా సులభంగా చేరేను. "అరే ! మొదటిసారి సిటికి వచ్చేవు. ఇల్లు చేరడానికి ఇబ్బంది పడ్డావా? అంత తేలిగ్గా ఎలా రాగలిగేవు.". అంటూ ఆశ్చర్యపోయారు. నా మిత్రుని సంగతి చెప్పకుండా గర్వంగా ఓ చిర్నవ్వు నవ్వి ఊరుకున్నాను. 

ఎవరు తుంటరి వాళ్ళో కాదో తెలుసుకోలేం కనక, ఎవరినడిగితే తమ ఇష్ఠం వచ్చిన రీతిలో చెప్పి మనలని ముప్పతిప్పలు పెడతారోనని భయం ఉంటుంది. పై ఊళ్ళో రిక్షావాళ్లనీ ఆటో వాళ్ళనీ నమ్మద్దనీ, వాళ్ళ చేతిలో ఎలా మోసపోయామో అని మిత్రులు చెప్పిన కధలు గురుతుకొస్తాయి. దగ్గరైతే నడిచి పోవడం, దూరం అయితే సిటి బస్సెక్కడం క్షేమమనుకుంటాం. సిటి బస్ ఎక్కడానికి ఏదో స్టాపులో నిలబడి ఫలానా చోటికి ఏ బస్ పోతుందని అక్కడ నిలబడ్డవాళ్ళని అడిగితే ఈ తుంటరి వాళ్లు అసలు నంబర్లు వదిలిపెట్టి ఇంకెటో పోయే బస్ నెంబరు చెప్తారు. అలాకాదని, మన పక్కనున్నవాడిని అడిగామనుకోండి. ఆతడూ తుంటరి వాడైతే "ఆ" అనేసి ఊరుకుంటాడు. మనం నమ్మి ఆ బస్సు ఎక్కుతాం. సమయానికి కండక్టర్ కనబడడు.  అది బయలుదేరుతుంది.  కండక్టర్ టిక్కట్లు ఇచ్చుకుంటూ మన దగ్గరకు వస్తాడు. మనం దిగాల్సిన స్ఠాప్ పేరు చెప్పగానే, మనం ఎంత ఆధునికంగా కనబడ్డా మనవైపు, చికాగ్గా, కోపంగా, హేళనగా చూసి, బెల్లు కొట్టి బస్సాపి "దిగవయ్యా దిగు, ఇది అటెళ్ళదు" అని గెంటేసినంత పని చేస్తాడు. మనం ఇంకా పూర్తిగా దిగకుండానే బస్సుని జోరుగా లాగించేస్తాడు డ్రైవరు. మిగిలిన ప్రయాణికులు నవ్వుతారు. తలకొట్టేసినంత పని అవుతుంది. ఎవరైనా మనవేపు సానుభూతిగా చూడబోతే నవ్వాలేక ఏడవలేక ఓ బస్సుతప్పిన నవ్వొకటి విసిరేస్తాం.మళ్ళీ మామూలే. మనలని కండక్టరు దింపేసిన చోటినుండి వెళ్ళవలసిన చోటికి బస్సు ఉండదు. 

 నా మిత్రుడొకాయన ఒకసారి ఏదో పనిమీద పై ఊరు వెళ్ళాడట. అక్కడ సిటి బస్సుల్లేవు. రిక్షా ఎక్కడానికి భయపడి ఈయన వెళ్ళాల్సిన ఆఫీసు అడ్రసు రాసిన కాగితం చేత్తో పట్టుకుని నడకన బయల్దేరాడు. దారిని పోతున్న ఓ పెద్దమనిషిని ఆ కాగితం చూపించి దారెటు అని అడిగాడు. ఆ పెద్దమనిషిలా కనిపించినాయన "ఇక్కణ్ణించి కుడిపక్క వీధిలోకి తిరిగి మళ్ళీ ఎడమవైపు మొదటి సందులోకి తిరిగి మూడో లైటు స్థంబం దగ్గర మళ్ళి కుడి పక్కకి తిరిగి అలా తిన్నగా వెళ్తే ఓ దుకాణం కనబడుతుంది. చాలాపెద్ద దుకాణం అది. అక్కడ్నించి ముందుకి రెండడుగులు నడుస్తే చిన్న సందు కనబడుతుంది. ఆ సందులో చివరగా వచ్చి, సందు చివర కుడివైపు తిరగండి. అక్కడే ఉంది ఈ ఆఫీసు." అంత వివరంగా చెప్పగానే నా మిత్రుడు ఆనందంగా ఆతనికి ధన్యవాదాలు చెప్పి, తూ.చా తప్పకుండా సూచనలు పాటిస్తూ అరగంటపైగా నడిస్తే చివరకి తను బయల్దేరిన చోటుకే చేరాడట. కాళ్ళ పీకు తప్ప ఆఫీసు దొరకలేదు. అప్పుడు బుద్దిగా రిక్షా ఎక్కి వెళ్ళాడట. 

అతని అనుభవం విన్నాక కూడా బుద్దిలేక నేనోసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళడానికి మా బంధువు చెప్పిన సిటీ బస్సెక్కి ఏ.వి.యన్ కాలేజ్ దగ్గర దిగి, అక్కడ నిలబడి మర్యాదస్తుడులా కనబడ్డ ఓ కుర్రాడ్ని "కొత్తఅగ్రహారం ఎటు?" అని అడిగేను. ఆతనికి సరిగ్గా తెలియడంకోసం మా బంధువు పేరు, ఆయన పనిచేస్తున్న వివరం, ఇంటినంబరు, వీధి వివరాలూ నాకు తెలిసినంత వరకు చెప్పేను. ఆ కుర్రాడు నా వైపు ఎగాదిగా చూసి, "ఇక్కడ కాదు. ఇలా వెళ్ళి బస్టాండు దాటాక కుడివైపు తిరగండి. ఆ పక్కనే ఉంటుంది." అన్నాడు. కాలేజి దగ్గరే ఇల్లని చెప్పిన మా బంధువును తిట్టుకుంటూ, మళ్ళీ  ఆ డౌన్ దిగి బస్టాపు వైపు అడుగు వేసేను. ఎందుకైనా మంచిదని ఆ బస్టాపు దగ్గిర ఇంకొకాయన్ని అడిగితే.. "అరే.. ఇటెందుకు వచ్చేరు. ఏ.వి.యన్ కాలేజ్ ముందు కుడివైపు ఓ డౌను ఉంటుంది. అందులోకి తిరిగి ఆ డౌను చివరకి, సందు ఆగిపోయే దగ్గరే మీక్కావలిసిన ఇల్లు" అని చెప్పాడు. అప్పటికే అలసిపోయి, విసిగిపోయి ఉండటం చేత రిక్షా ఎక్కి అడ్రస్ చెప్పి పోనిమ్మన్నాను, బస్టాండ్ దగ్గర వ్యక్తే కరక్టు. రిక్షా దిగి  ఇంట్లో అడుగు పెడుతుంటే వెనకనించి, ఇందాక కాలేజీ దగ్గర ఏ కుర్రాడ్ని అయితే అడ్రసు అడిగానో ఆ కుర్రాడు వచ్చాడు నా బంధువుని "మామయ్యా" అంటూ. నాకు కోపం ఆగకపోతే బూతులు వస్తాయి. అప్పడు నాకు కోపం ఆగలేదు. 

అటు మంచివాళ్ళూ, ఇటు తుంటరి వాళ్లూ కాకుండా మధ్య మరో రకం ఉంటారు. వీళ్ళతో మరీ ప్రమాదం. పక్క ఇంటిలో ఉండే మనిషే మనకి కావల్సి ఉండి పొరపాటున వీళ్ళని అడిగేమనుకోండి, ఏ మాత్రం సంకోచించకుండా "అబ్బే ఇక్కడ అలాంటి పేరు గల వాళ్ళెవరూ లేనేలేరు."అని చెప్పేస్తారు ఈ తటస్థ స్వభావులు. మనకి అనుమానం తీరక అక్కడే వెదికితే ఆతని పక్కఇల్లే అవుతుంది మనక్కావలసిన ఇల్లు. మరీ పక్కింటిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎలా బతుకుతున్నాడు చెప్మా అని ఆశ్చర్యపోవాలి. 

ఒకవేళ అతని మాటలు నమ్మి 'ఇక్కడ కాదు కామోసు' అనుకొని మనం కలవవలసిన వ్యక్తి ఆతను పనిచేసే ఆఫీసుకు వెళ్ళి కలుసుకున్నామనుకోండి "నీ ఇంటికోసం వెతికి వెతికి చచ్చాననుకో" అంటాం. అతను సానుభూతి చూపించి "అయ్యో! పద . ఇంటిలో దిగబెట్టి వస్తాను. నువు రెష్టు తీసుకో. సాయంత్రం మాట్లాడుకుందాం, తీరిగ్గా." అంటాడు. తీరా అతను వెంట వెళ్తుంటే అన్నీ ఇందాక తిరిగిన వీధులే వస్తాయి. "ఇక్కడ కానే కాదు. అలాటివాళ్లెవరు ఇక్కడ లేనేలేరు." అన్న పెద్దమనిషి ఇంటి పక్కనుంచే వెళ్తాం. మిత్రుడు మనలని తెలివితక్కువమనిషి కింద జమకడతాడేమో అన్న భయం ఉంటే ఆ వీధిలోకి కొత్తగా వస్తున్నట్టు ప్రవర్తించడమే మంచిది. ఈ తటస్థ స్వభావుల్లోనే మరో రకం ఉన్నారు. మనం అడిగేదేదో పూర్తిగా వినిపించుకోకుండానే "మాకు తెలీదు" అనేస్తారు. 

"దారెటు?" అని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు అవతలి వ్యక్తి మంచివాడో కాదో ముఖం చూసి కాదో ముఖం చూసి అంచనా వేసుకోవాలి. వీలయినంత వరకూ రిటైరయిన పెద్దవాళ్ళని అడగడం మంచిది.

***********అయిపోయింది*************

పై వ్యాసం 23.09.1979 న ఆంధ్రప్రభ దినపత్రిక కాలక్షేపానికి కబుర్లు శీర్షికన ప్రచురితమైంది నా ఆరెస్ డబల్యూ  అన్న కలం పేరుతో. 

ఆ రోజుల్లో గూగుల్ తల్లి లేదు. గూగుల్ మేపులూ లేవు. కనబడ్డ వారిని విచారించి విచారించి వెతుక్కోవడమే కొత్త చిరునామాలు. 

నిజానికి గూగులే మ్యాపులు ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక్కోసారి ఎవరినైనా అడక్కుండా జరగదు అందునా, ఈ మ్యాపులు ఒకొక్కసారి, దగ్గర తోవ చూపించడం లో చిన్నచిన్న సందుల్లోంచి దారి చూపడం అనుభవంలోకి వచ్చేదే.