Sunday, 16 August 2020

వానరయూధమ్. (దేవాలయాలలో కోతులెందుకు ఉంటాయ్)

"మీరు రారా ?" అడిగేను రావుగారిని, అందరం బయల్దేరుతుంటే కాళ్ళు జాపుకుని కుర్చీలో కూర్చున్నారాయన. ఆలంపూర్ లోని జోగులాంబ దేవాలయం చూడ్డానికి వచ్చేం, ఆయన నేను మరికొంతమంది స్నేహితులం.  ఎందుకైనా మంచిదని, అక్కడి హరితా హోటల్ లో ఓ గది తీసుకున్నాము, విశ్రాంతి తీసుకునే అవసరం పడితే కొంచెంసేపైనా ఉండచ్చని. 

" నేనా!" గొల్లున నవ్వేడాయన.   "నా సంగతి తెలుసుండీ ఎందుకు అడిగేరు?"  

ఆయన నాస్తికుడ్నని చెప్పుకుంటాడు. అందుకని మాతో తీర్థప్రదేశాలు చూడ్డానికి వచ్చినా దేవాలయంలోకి రాడు. దేవుడ్ని ప్రార్ధించాలంటే గుడికే వెళ్ళక్కర్లేదని ఆయన నమ్మకం. 

" సరే!మేం వెళ్ళొస్తాం. " కొట్టవలసిన కొబ్బరికాయ, పళ్ళూ, ఇతర పూజకి అవసరమైన సామగ్రి అంతా ఉందో లేదో సరి చూసుకుంటూ చెప్పాను, మిగిలిన మిత్రబృందంతో బయటపడుతూ....

ఏదో పర్వదినం లా ఉంది. చాలా మంది భక్తజనం ఉన్నారావేళ. పెద్దపెద్ద వరసలలో నిలబడి దేవి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం కూడా చాలమందే ఉన్నారు. 

"మన అదృష్టం బాగుంది. అమ్మవారు వెలసిన రోజట. అందుకే ఇంతమంది జనం.  " పరవశంగా అన్నాడో మిత్రుడు. 

భక్తులు చాలామందే వస్తారని ఆ కోవెల వాళ్ళకి తెలుసు కదా..  అందుకే బయటంతా చాందినీలు, అక్కడక్కడ మంచినీళ్లు ఇచ్చేవాళ్లనీ కింద కాళ్ళు కాలకుండా తివాచీలాంటిదీ ఏర్పాటు చేసేరు. 

సుమారు నాలుగు గంటలు పట్టింది దర్శనం చేసుకోని బయటపడ్డానికి. అలసిపోయి జిడ్డు కారుతున్న, మొఖాలతో ఎండలో నిలబడి, నిలబడి కాళ్ళు పీకుతూంటే, నిలుచునీ, కూచొనీ నలిగిపోయిన బట్టలతో, రెండు నిమిషాలకన్నా తక్కువసేపే దేవి దర్శనం అయినా అదే సంతృప్తితో బయటపడ్డాం. 

గది చేరుతుండగా ఓ మిత్రుడు అన్నాడు నింపాదిగా." నా చేతి సంచీ కోతులెత్తుకు పోయాయి. "

"సంచిలో ఏమిటేమిటి ఉన్నాయి ?" అడిగేను ఆందోళనగా. 

"ఆఁ! పెద్ద ఏమీలేవులే. ధ్వజస్థంబం దగ్గర కొట్టిన కొబ్బరికాయ తప్ప." 

అలసిపోయి ఉన్నామేమో, భోజనం చేసి అలా ఉన్న నాలుగు కుర్చీలలో కూచునే పడుకుండిపోయేం. నాలుగు కావస్తుండగా రావుగారు అందర్నీ లేపేరు. "పదండి. పదండి. కొంచెం సేపు తుంగభద్ర అందాలు చూసి వెనక్కి వెళదాం!"

గబగబ తయారయి నది ఒడ్డుకు చేరేం. చాలా మెట్లుదిగి నది దగ్గరకు వెళ్లాం. నదిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి. కాసేపు ఆ మెట్లమీద కూర్చున్నాం. మాటలు కోతులెత్తుకుపోయిన సంచీ మీదకు మళ్లేయి. 

" అసలు దేవాలయాలలో కోతులెందుకు ఉంటాయో!" మామూలుగా జనాంతికంగా అన్నాను, రావుగారు నా పక్కనే ఉన్న సంగతి మర్చిపోయి. ఆయనేదైనా విషయం మీద మాట్లాడటం మొదలు పెడితే ఓ పట్టాన ఆపడు. 

"చాలా మంచి ధర్మసందేహమే వచ్చిందే. దీనికి కారణం గా ఓ కధ ఉంది. చెప్పమంటారా?" అడిగేరు. 

" కధా! తప్పకుండా చెప్పండి"  అన్నాడు సంచి పోగొట్టుకున్న మిత్రుడు, వద్దు వద్దన్నట్టుగా నేను చేస్తున్నసైగలని గమనించకుండా. ఆతనికి కధలంటే ఇష్ఠం. 

" రాముడు, సీత, సౌమిత్రి వనవాసం చేసేవారు." నాటకీయంగా ఆపి అందరు వింటున్నారా అన్నట్టు అందరివైపు చూసేడాయన. 

"రాముడు అయోధ్యనేలిన దశరధుడి కొడుకు. రాముడి భార్య సీత. రాముడికి ముగ్గరు తమ్ములు. అందులో లక్ష్మణుడు ఒకడు.  దశరధుడి మూడో భార్య కైక కోరిక మేరకు దశరధరాముడు పధ్నాలుగేళ్ళు వనవాసం చేసేడు భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో. సీతని రావణుడు ఎత్తుకు పోతే వానర రాజు సుగ్రీవుడు, ఆతని మంత్రి హనుమంతుని సహాయ్యంతో రావణుడ్ని చంపి తిరిగి రాజ్యాన్ని ఏలేడు. ఈ కధని ఈ దేశంలో చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు.!" కొంచెం హేళనగా అన్నాను. 

" నా కధ పూర్తిగా వినవోయ్ ! " నవ్వుతూ అన్నారాయన. 

"రావణుడు సీతని ఎత్తుకు పోయాక, రాముడు సీత కోసం వెదుకుతూ చెట్టు పుట్టా పట్టుకు తిరిగేడు. అలా తిరుగుతున్నపుడే కబంధుడ్ని వధించేడు. కబంధుడు, గంధర్వుడి గా మారి తన లోకానికి వెళ్తూ, ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఉంటాడు. అతని తో స్నేహం చేస్తే నీకు మేలు జరుగుతుంది. అని చెప్పేడు. తరువాత శబరీ అదే మాట చెప్పింది. శబరి దగ్గర తిండి తిన్నవాడు కాబట్టి శబరి చెప్పిన మాటను నమ్మేడు రాఘవుడు. 

"ఆ సమయానికి ......

" సుగ్రీవుడు, అన్నకి భయపడి, తన సన్నిహితులైన కోతులతో ఋష్యమూక పర్వతంపై బతుకుతున్నాడు. మాతంగ మహర్షి శాపకారణంగా వాలి ఋష్యమూకం మీదకి రాలేడు. అది కారణంగా సుగ్రీవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు.           అన్నకి తను చేసిన ద్రోహం, అన్న తనకి చేసిన ద్రోహం రెండూ సుగ్రీవుణ్ణి భయపెడుతున్నాయి. ఉన్న వానరాలలోనే, ఆతని మంత్రి, హనుమకూడా ఉన్నాడు. 

"ఇక సుగ్రీవుడి అన్న వాలి మహా బలశాలి. రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాడు.  కిష్కింధ ప్రశాంతంగా ఉంది. వానరరాజ్యం మంచి స్థితిమంతంగా ఉంది. వానరాలు వాలి పాలనలో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాయి. వానరులకప్పుడు, ఇనుప ములుకులతో ఉన్న బాణాల గురించి కానీ, బాగా వంచి, సన్నటి జంతునరంతో కట్టబడే ధనస్సులగురించి గానీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే. భుజబలం. వాళ్ళ ఆయుధాలు, గోళ్ళూ, రాళ్లూ, చెట్లూ. వాలి తన భుజబలంతో ఒక సాల వృక్షాన్ని పడగొట్టగలడు. సుగ్రీవుడికది చేతకాదు. 

"ధనుర్ధరులై  వస్తున్న  రామలక్ష్మణులను చూసి, తన్ని చంపడానికి వాలి వాళ్ళని పంపి ఉంటాడేమో అని భయపడ్డ సుగ్రీవుడు, ఆంజనేయుడ్ని రాయబారిగా పంపి, వాళ్ళని మంచి చేసుకున్నాడు. ఇద్దరికీ త్వరగానే స్నేహం కలిగింది, ఎందుకంటే ఇద్దరి భార్యలూ పరుల అధీనంలో ఉన్నారనే కష్టం ఒకటే కనక. 

"వాలి బలపరాక్రమాల గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడు, వివరంగా, భయంగా. వాలిని చంపుతానని తాను చేసిన వాగ్దానం సుగ్రీవుడు నమ్మాలంటే, వాలికన్న తాను బలవంతుడిని  అని నిరూపించుకోవాలి అని తెలిసింది రామునికి. ఒక బాణాన్ని సంధించి, ఆకర్ణాంతం  లాగి వదిలేడు. ఏడు సాలవృక్షాలలోంచి దూసుకు వెళ్లిందా బాణం. సుగ్రీవుడు నిశ్చేష్ఠుడై పోయాడు. భయపడిపోయాడు. ఉన్నచోటు నుండి కదలకుండ ఏడు సాల వృక్షాలని పడగొట్టిన రాముని చూసి. నీ బానిసని అన్నాడు. రాజ్యం నాకు దక్కిన తరువాత నా సైన్యం అంతా నీదే అన్నాడు. 

"తరువాత, వాలి వధ, హనుమ సాగరాన్నిదాటి లంకకి వెళ్ళి సీత జాడ కనుక్కొని రావడం, వానరసైన్యంతో లంకమీద దాడి సాగించి, రావణుని చంపి, సీతతో లక్ష్మణునితో, మొత్తం వానరులూ, యుద్దంలో చనిపోగా, మిగిలిన విభీషణుని రాక్షససైన్యం తో, రాముడు అయోధ్యకి తిరిగి వెళ్ళి, పట్టాభిరాముడైనాడు. 

" పట్టాభిషేకం తరువాత, రాజారాముడు, వానరులందరికీ వెలలేని ఆభరణాలు కానుకగా ఇచ్చేడు, కృతజ్ఞతతో. వనచరులైన వానరులకి, ఆ అయోధ్య వైభవం, ఆ ఆభరణాలూ చూసి ఆనందానికి, ఆశ్చర్యానికీ అంతులేదు. ' ప్రభో!నీ సామంతుడ్ని ' అని రాముని కాళ్ళమీద పడ్డాడు సుగ్రీవుడు, 'నా రాజ్యం, నా ప్రాణం నీవే '  అన్నాడు. 'ఇంత ధనవంతుడూ, శక్తిమంతుడూ అయిన రామునితో నేనెక్కడ తూగగలను' అనుకున్నాడు, భయంగా, గౌరవంగా. 

" అంతవరకూ ప్రశాంతంగా, స్థిరంగా బ్రతుకుతున్న వానరరాజ్యం 'రామభజన ' రాజ్యంగా తయారయింది. రామభక్తులం అని చెప్పుకొన్నవారికి ఆస్థానంలో ఉద్యోగాలు దొరికేయి. దొంగకోతులూ, నేరం చేసిన కోతులూ, రామభక్తులం అని చెప్పి శిక్షని తప్పించుకోసాగేయి. రామనామ జపం చేసేవాళ్ళని శిక్షించకూడదని సుగ్రీవాజ్ఞ. ప్రతి ఇల్లూ ఒక రామమందిరం అయిపోయింది. రాజు సుగ్రీవుడు రాజప్రాసాదంలో ఉన్న రామమందిరం దాటి బయటకు రావడమే లేదు.  వస్తే అది అయోధ్యకే అయేది. హనుమంతుడు సరేసరి. శ్రీరామపాదపద్మాలను విడచి కిష్కింధకి రానేలేదు. 

" వానర రాజ్య ఆర్ధిక పరిస్థితి తారుమారయ్యింది. వర్తకకోతులు, ఆహారధాన్యాలని నిలువజేసి, 'రాములవారికి బహుమానం ' అనే పేరుతో తప్పించుకుని, హెచ్చుధరలకి ప్రజాకోతులకి అమ్మసాగేయి. సైన్యపుకోతులు, 'జగద్రక్షుకుడు రాముడుండగా మేం రక్షసేయవలసింది ఏముంది' అని గంజాయి పీలుస్తూ 'హే రామ్!' అంటూ రామనామస్మరణలో మునిగిపోయేయి. సుగ్రీవుడు ప్రతీ ఏటా అయోధ్యకి కప్పం కట్టడం కోసం ప్రజలమీద అదనపు పన్నులు వేసి వసూలు చేయసాగేడు. 

"కోతుల జీవన ప్రమాణం పడిపోయింది. ఒకప్పుడు  అత్యంత సంపన్నంగా ఉండిన వానర రాజ్యం దరిద్రదశకు చేరుకుంది. ఇది అంతా గమనించిన కొన్ని మేధావి కోతులు యువకోతులూ, రాజు సుగ్రీవుని కలసి, పరిస్థితి అంతా విశదీకరించేయి. "రాముడైనా దేముడైనా మన రాజ్యపటిష్ఠత తరువాతే. ముందు కళ్ళు తెరిచి రాజ్యాన్ని చక్కదిద్దండి." అని విన్నవించుకున్నాయి. 

"సుగ్రీవుడు ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు. రాజు ఆలోచనలో పడ్డం గమనించిన మిగిలిన ఆస్థానకోతులు భయపడ్డాయి. వాటిలో అవి కూడబలుక్కున్నాయి. 'ఇప్పుడు రాజు రాజ్యం పరిస్థితి పట్టించుకుంటే మన నేరాలు అన్నీ బయటపడతాయి. రాజు మనలని ఉరి తీసినా ఆశ్చర్యం లేదు. '  అనుకున్నాయి. 

"సుగ్రీవుడ్ని ఏకాంతంగా కలసి బోధచేసేయి. "రాజా! ఇది కేవలం రాజద్రోహం. మనకి రాజారాముడు రాజూ దైవమూనూ.. అందుచేత ఇది దైవద్రోహం కూడా. జగద్రక్షకుడు రాముడు. ఈ లోకానికి అంతా రాముడే ప్రభువు. రామధిక్కారం రాజద్రోహం. దీనికి కోపించి రాముడు ఈ రాజ్యాన్ని మీనుంచి తప్పించి అంగదుడికి ఇవ్వవచ్చు. మీతో ఎంత విధేయతతో కనబడ్డా, అంగదునికి తన తండ్రి మరణానికి కారణం మీరే అని కోపం ఇంకా ఉంది. మీరు రాజ్యాన్ని కోల్పోయి, అంగదుడు రాజే అయితే, మీకు మరణశిక్ష ఖాయం"  అని భయపెట్టాయి. 

"తనకి రాజ్యముప్పు, ప్రాణముప్పు అనే ఆలోచనని సహించలేకపోయాడు సుగ్రీవుడు. ఒకసారి రాజ్యాన్ని కోల్పోయి అష్టకష్టాలూ పడ్డాడు. అప్పుడు మహనీయుడు శ్రీరాముడు ఈ సింహాసనాన్ని తనకు ఇప్పించేడు. ఆరోజు వాలి వధ జరిగిన తరువాత, తలుచుకుంటే రాముడే ఈ సింహాసనాన్నిఏలి ఉండేవాడు. కానీ మా స్నేహం మీద గౌరవంతో ఆయన నాకు ఇచ్చిన భిక్ష. అటువంటి మహనీయుని మీదా తిరుగుబాటు? సుగ్రీవునికి కోపమొచ్చింది. 

"వెంటనే ఆ మేధావి కోతులనీ, వారితో వచ్చిన యువకోతులనీ దేశబహిష్కరణ చేసి, రాజ్యంలోంచి పంపేశాడు." ఏకబిగిన చెప్పి రావుగారు ఆగేరు. 

అందరూ శ్రద్ధగా వింటున్నారు. నాకు చిరాకు, కోపం కలగలసి కలిగేయి. పవిత్రమైన రామాయణాన్ని, అందులో అంశాలనీ తన కధకోసం తన కిష్టం వచ్చినట్లు మారుస్తున్న రావుగారిని చూసి. సుగ్రీవుడినీ, మిగిలిన దైవాంశ సంభూతులైన వానరులనీ, కేవలం రామునికోసమే తమ ప్రాణాలను వడ్డి రాక్షససేనలతో పోరాడిన మహనీయులని, కోతులంటూ, వాళ్ళని నీతిలేనివాళ్ళుగా మతిలేనివాళ్ళుగా చిత్రీకరించడం చూసి బాధపడ్డాను. కోపం వచ్చింది. 

దూరంగా కోవెలలోంచి గంటల శబ్దం వినబడుతూంది. సూర్యుడు అస్తమిస్తూ , ఏ చిత్రకారుడూ వేయలేనంత అద్భుత రంగుల మిశ్రమంతో చిత్రీకరిస్తున్నాడు తూర్పూ పడమర అనే తేడాలేకుండా మొత్తం ఆకాశాన్నంతా. 

" రెండున్నరపేజీల కధ చెప్పారు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు!" అన్నాను వ్యంగ్యంగా. 

"ఆ విషయానికే వస్తున్నా.. అలా దేశ బహిష్కరణ పొందిన కోతులు ప్రాణాలకి తెగించి, దేశ సమస్యని, రాజ్యసమస్యని పౌరులందరికీ వివరంగా చెప్పేయి. చాలా కోతులు నమ్మలేదు. కొన్ని కొట్టబోయేయి. మరికొన్ని ఆలోచించేయి. నమ్మేయి. ఆ మేధావి కోతులతో పాటు అరణ్యాలలోకి పారిపోయేయి.

మేధావి కోతుల హెచ్చరికని పెడచెవిన పెట్టినందుకు, కొద్దికాలంలోనే ఆ వానరరాజ్యం విచ్ఛిన్నమైంది. అయోధ్యలో రాముడు నిర్యాణం చెందేడు. తనతో పాటు ఆ అయోధ్యలో ఉన్న ప్రజలనందరినీ, తనతో వైకుంఠం రావడానికి సిద్దపడ్డవాళ్ళందరినీ, సుగ్రీవునీ తీసుకుని పోయాడు. హనుమంతుడు గంధమాదన పర్వతసానువులలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు.

"అంగదుడు ఆ వార్తవిని మరణించేడు. రాజ్యం రాజులేక, ముక్కలు చెక్కలు అయింది. కోతులకి ఆశ్రయం, రక్షణ ఇచ్చేవాడు లేకపోయాడు. వాటికి వనాలలో చెట్లమీద దొరికే ఫలాలు కోసుకుని తినే అలవాటు తరాలకిందే పోయింది. దేవుడు, జగద్రక్షకుడే దిక్కు అనుకున్నాయి.  ఈ ఆలయాలలో భక్తులు పెట్టే ఆహారం వాటికి కష్టపడకుండా దొరకసాగింది. కాలక్రమేణా భక్తులు వాటికి ఆహారం పెట్టడం మానుకున్నారు. అప్పట్నించీ బతుకు తెరువు కోసం దొంగతనాలు చేస్తూ అందరిచేతా అసహ్యించుకోబడుతూ జీవిస్తున్నాయి. 

"సుగ్రీవుడిచేత దేశబహిష్కరణ పొందిన మేధావి కోతులూ, వాటితోపాటుగా అడవుల్లోకి పారిపోయిన కోతులూ, వారి సంతతీ, అరణ్యాలలో, స్వతంత్రంగా, హాయిగా ఉంటున్నాయి. ఆవిధంగా, దేవాలయాల్లో కోతులు ఉండటం జరిగింది." అన్నారు రావుగారు. 

చీకటి పడింది. రావుగారి కధకి ఎలా కౌంటరు ఇద్దామా అని ఆలోచిస్తున్నాను. 

మళ్ళీ రావుగారి కంఠం వినబడింది. " ఆలోచనలనీ, కధలనీ కట్టిబెట్టండి. పురుగూ పుట్రా ఉంటాయి. ఇప్పుడు బయల్దేరితే అర్ధరాత్రి అవుతుంది హైదరాబాద్ చేరేటప్పటికి." అంటూ లేచేరు. " పదండి!" 


 *************************అయిపోయింది.********************************

ఈ కధ నేను సెప్టెంబరు 1978 లో రాసేను.  ఇన్నాళ్ళ తరువాత ఈ ఆముద్రిత కధని చదివితే ఎన్నో ఆలోచనలు. కధలు రాయడం మొదటిరోజుల్లో రాసిన కధ. మా నాన్నగారికి చాలా నచ్చిన నా కధ. అందుకే నేనే పత్రికకు పంపలేదు ప్రచురణార్ధం. ఈ కధ ఏ ఎడిటర్ కో నచ్చకపోయినా, నాన్నగారికి నచ్చింది. అంతేచాలు అనుకున్నాను. ఇప్పుడు నా బ్లాగులో కద. ఇబ్బంది లేదనిపించింది. 

మీకు నచ్చినా నచ్చకపోయినా ఓ కామెంట్ రాయడం మర్చిపోకండి కామెంట్ కింద మీ పేరు రాయకపోతే unknown అని వస్తుంది.  

16 comments:

  1. చిన్న కథ లోనే మొత్తం రామాయణం అంతా చక్కగా ఇమిడ్చి చాలా చక్కటి శైలి తో రాశారు.

    ReplyDelete
  2. కథగా, కల్పనగా కనిపించెను నాకు కథయంతా మీ మదిలోని భావము నేటికి కూడా సజీవము, త్రేతా యుగమన బహిష్కరించ బడిన మేధావి కోతులే కలియుగ అభినవ నాయకులై సమాజమనే దేవాలయసంపదను దోచుకు తింటున్నాయన్నది నా పోలిక

    ReplyDelete
    Replies
    1. దీనికి సరిఐన కౌంటర్ ఇవ్వాలని కధకునిలాగే నాకు అనిపించినప్పటికి మనసు బాధతో ఉండిపోయింది.ఇంతలో మీ కౌంటర్ "అవును అప్పుడు బహిష్కరింపబడిన మేధావి కోతులే నేడు సూడో మేధావులై పుట్టి కొందరు నాయకులుగాస్ను, కొందరు సోషల్ రెఫార్మేర్లు గాను, కొందరు జర్నలిస్టుల రూపంలోనూ, గుడులు, గుడులలో లింగాల్ని,సమాజాన్ని దోచుకుంటున్నారు. పాపం కోతుల కేముంది ఆకలి బాధతో తప్ప...

      Delete
  3. రమేష్ చౌదరి.

    ReplyDelete
  4. అప్పటి రామాయణాన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా గా మలచి చెప్పిన మీ కథనం చాలా బాగుంది అండి..మీ నాన్నగారి కే నచ్చింది అంటే ఇంక ఎవరం మాత్రం ఎం రాస్తాము...మీరెందుకు ఇన్నాళ్లు రాయడం మనేసేరో కానీ తెలుగు పాఠకులు కొన్ని మంచి కథలు మిస్స్ అయ్యరని అనిపిస్తూ న్నాది..Keep it uo సర్?👌👌

    ReplyDelete
  5. నిజానికి ఇప్పటి పరిస్థితి నేను కధ రాసేనాటికి లేదు. కానీ కాలం నా కధని నిజం చేద్దామని నిర్ణయించుకుందేమో..

    ReplyDelete
    Replies
    1. అయ్యో..నేను రాసిన ఒక కామెంట్ పబ్లిష్ కాలేదండి..ఇలా కాలం మీ కథల్ని నిజం చేద్దామని అనుకుంటుంది అని అప్పుడే తెలిస్తే మీరు వానర రాజ్యం గురించి కాక రామ రాజ్యం గురించే రాసేవారేమో..పోని ఇప్పటికైనా కథ మార్చి రామరాజ్యం గా రాసేయ్యండి.మనఉండు తరాలైనా సుఖ పడతారేమో..

      Delete
  6. కథ బాగుంది అండి..బాగా రాసేరు

    ReplyDelete
  7. అదే అయితే మీరు రామరాజ్యం గురించి రాయల్సింది కదండీ.మరో కొన్ని సంవత్సరాల కైనా మన తర్వాతి తరమైనా రామ రాజ్యాన్ని చూసేవారు కదా..ఇలా మీ కథ నిజమవుతుంది అని తెలియక పాపం వానర రాజ్యం గురించి రాసేశారు.
    ఇవ్వాళే మొదలెట్టి raaseyyandi..కల్పన సినిమా లో అల్లు రామ లింగయ్య లాగ👍👍👍

    ReplyDelete
  8. 👏👏🙏రామాయణం మీద మీకున్న పట్టు బాగా తెలిపారు. కథలో మీరొక చోట అన్నట్టుగానే రామారావు చెప్పింది పేజీలు పెచేందుకు ఉపయోగ పడింది . పట్టాభిషేకం తర్వాత - అనే పేరా దగ్గర నుండీ కోతులకు రిలవెంట్ అయింది. ముందు చెప్పిన రామాయణం కథకు అక్కరకు రాలేదు.

    మీరు మళ్ళీ వ్రాయడం మొదలెట్టండి కొత్తకొత్తవి... బాగుంటాయ్ ... మీకు టైమ్ పాస్ కూడా👍👏👏

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. Katha chala bavundi andi. Ippudu society lo jarugutunnattu undi. Medhavi kotulu vati balanni nammukuni paripoyi svantam ga batukutunnayi (samanya prajalu laga)...durbuddhi kotulu rajakeeya nayakulu laga andari daggara, idi maa hakku ani lakkoni bratukutunnayi.

    ReplyDelete
  11. Chaala bavundi! Kothulu gudulalo endukuntayo anna prasnaki manchi javabu! Telivaina, rama bhajana alavataina kothula taravathi generationse ippudu kuda bhajana groupluga maari rajyanni elurunnai! Medhavulaina kothulu, vaati generations freega vunna, kastapadutune vunnayi! Thretayugam nati kadha kaliyugaaniki kuda paniki vastundani, 4 decades back meeru antha chakkaga vrasarante, really great writing ability! We really missed all these days. Please continue to write and post!

    ReplyDelete
  12. Small correction -‘ Rajyanni elutunnayi’

    ReplyDelete
  13. "వానర యూధం" కధ ని రచయిత ఎప్పుడో 1978 లో రాసినా ఇప్పటి వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతోంది. దేవుడి పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకొనేవాళ్లకు ఇప్పటికీ కొదవేం లేదు. పరిస్తితులు చక్కదిద్దాల్సిన నాయకులు కొంతమంది స్వార్ధపరుల సలహాలతో పరిస్థితి ని ఇంకా పాతాళనికి నెట్గేస్తున్నారు. చివరికి మేధావులు ఆయుధాలు పట్టుకొని అడవుల పాలవుతున్నారు. ఇప్పటి నరుల పరిస్థితి ని వానరాలకు అన్వయించి రాసిన కధ తో పాఠకుల్ని ఆలోచింపచేయడంలో రచయిత సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు. హర్షించదగ్గ ప్రయత్నం. రచయిత నుంచి ఇకపై కూడా ఇలాంటి కధ లని ఆశించవచ్చా...

    B. Gurunadha Rao
    Visakhapatnam
    94900 51456

    ReplyDelete
  14. మిత్రమా
    శుభోదయం

    నీలో ఇంత మంచి రచయిత దాక్కొని ఉన్నాడన్న విషయం ఇప్పుడే ఈ కథ చదివిన తర్వాత తెలిసింది. చక్కటి ప్రయత్నం. ముందు ముందు ఇంకా ఆలోచన రేకెత్తించే మంచి కథలు నీ నుండి కోరుకుంటూ నీ మిత్రుడిని అయినందుకు కించిత్ గర్వపడుతూ

    ఎన్ జి కే మూర్తి

    ReplyDelete