"మనం ఇప్పుడు వెళ్ళే పార్కు రాములపాడులో ఉంది. గోపాల్ అక్కడే ఉంటున్నాడు." అన్నాడు రాజారావు.
ఎనిమిదిన్నర అయింది అప్పటికి సమయం. పశ్చిమజర్మనీ రాజధాని బాన్ నుండి వచ్చేను నా దేశం. నా ఊరు. రాజారావు, గోపాల్ నేను చిన్ననాటి స్నేహితులం. పశ్చిమజర్మనీలో ఓ ప్రసిద్ద మందులు తయారుచేసే కంపనీలో పనిచేస్తున్నాను. రాజారావు శ్రీకాకుళంలోనే వ్యాపారం చేస్తున్నాడు. గోపాల్ శ్రీకాకుళం ఏజన్సీ ప్రాంతంలో రాములపాడు అనే గ్రామం దగ్గర ఒక స్నేక్ పార్కు పెట్టాడు. అక్కడికే ఇప్పుడు ప్రయాణం.
గోపాల్ స్నేక్ పార్కుకి మంచిపేరు వచ్చింది. విషం ప్రాణం పోసే ఔషధంగా మారుతున్న ఈ రోజుల్లో వాడి స్నేక్ పార్కునుండి ఎగుమతి అయ్యే విషానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీలైతే వాడి పార్కుకి మా కంపనీ కి ఒక ఆర్డరు సంపాదించాలని నా ఉద్దేశం. మళ్ళీ మూడు రోజుల్లో నేను వెళ్ళిపోవాలి.
"చిన్నప్పట్నించి సాహసాలంటే వాడికి చాలా ఇష్టం. ఇప్పుడుకూడా ప్రమాదకరమైన పనినే వృత్తిగా ఎంచుకున్నాడు." అన్నాను రాజారావుతో.
పోర్టికోలో ఉన్న కారులో సామానులు సర్దిస్తున్న రాజారావు నా మాటలు విని, వెనక్కి తిరిగి నవ్వి అన్నాడు. "విదేశాలలో ఉండి నువ్వు మనదేశపు అలవాట్లు మర్చిపోయేవులా ఉంది."
"అంటే...." సంధిగ్ధంగా అడిగేను.
"మన చేతికి మట్టి అంటకుండా పని జరగాలన్నది ఈదేశ ప్రజల ముఖ్య సిద్దాంతం. అలాగే గోపాల్ కూడా. వాడు పాములను పట్టడు. వాడి చేతికింద మనుషులున్నారు. వాళ్ళో, ఆ పల్లె ప్రజలు పట్టి అమ్మినవో పాములు. వీడు కేవలం విషం తీస్తాడు అత్యంత ఆధునిక పద్దతులలో. ఆ సమయంలో కూడా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొనే తీస్తాడు. అంచేత అస్సలు రిస్కు అనేదే లేదు." అన్నాడు. "కారెక్కు. బయల్దేరదాం. ఎండెక్కుతోంది."
అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, కెమెరా జాగ్రత్తగా వెనక సీట్లో పెట్టాను. "కెమెరా ఎందుకు?" అడిగేడు రాజారావు.
"పోలోరాయిడ్ కెమెరా ఇది. జర్మనీలో ప్రత్యేకం. ఫోటో తీసినవెంటనే ప్రింట్సు వస్తాయి. ఇవేళ పౌర్ణమిట. కేలెండరులో చూసేను. రాత్రి వెన్నెల్లో దృశ్యాలు అధ్భుతంగా వస్తాయి." అన్నాను.
చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాజారావు. మా ప్రయాణం మొదలైంది.
* * *
రాములపాడు చేరేసరికి భోజనాల సమయం కావొచ్చింది. గోపాల్ కి ముందే కబురు చేయబట్టి బస్టాండు దగ్గర నిరీక్షిస్తూ నిలబడ్డాడు గోపాల్. మమ్మల్ని చూస్తునే వాడి మొఖం ఆనందంతో వెలిగిపోయింది.
"ఎన్నాళ్ళయిందిరా చూసి!. రండి! రండి! వెల్కం టూ స్నేక్ పార్క్.! " అన్నాడు ఆప్యాయంగా కౌగలించుకొంటూ. "ఎప్పడొచ్చావ్ బాన్ నుండి? ఏమిటి విశేషాలు?? ఎన్నాళ్ళుంటున్నావ్? మీ నాన్నగారు అమ్మగారు బాగున్నారా? మీ అక్కయ్యలు ఎక్కడెక్కడ ఉన్నారు? " ప్రశ్నల వర్షం కురిపించేడు.
"మనం ముందుకు వెళ్దామా లేక ఇక్కడ్నించే వెనక్కి పంపేస్తావా?" రాజారావు చిరునవ్వుతో అడిగేడు.
"సారీ రా పదండి". అన్నాడు కారెక్కుతూ.
"బావుగారూ..." అన్నాడు అతని పక్కన అంతవరకూ నిలబడ్డ వ్యక్తి.
"నువ్వు సామానులు తీసుకొని వచ్చేయ్, కాళయ్యా" అన్నాడు గోపాల్ ఒకపక్క ఆజ్ఞాపిస్తూ. ఇంకోపక్క మాకు పరిచయం చేస్తూ. ఆరడుగుల భారీ విగ్రహంతో నల్లగా ఏకశిల రాయిలా ఉన్నాడు కాళయ్య.
ఓ గంటసేపు పల్లెటూరి మట్టిరోడ్ల మీద ప్రయాణం చేసేక కారు, విశాలంగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది. చుట్టూ చెట్లగుబురులతో అడవి మధ్యలో ఉన్నట్టు ఉంది ఆ ఇల్లు. పూరిగడ్డితో నేసిన ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. బయట ఎంత నిరాడంబరంగా ఉందో లోపల అంత ఆధునికంగా ఉంది. ఇద్దరికి వేర్వేరు గదులు ఇచ్చాడు. పూరి గడ్డతో నేసినది కావడం వల్ల కాబోలు బయట ఎంత ఎండగా ఉన్నా, లోపల చల్లగా ఉంది.
కాళయ్య వచ్చేసాడు. ఏవో సామానులు కొన్నట్టున్నాడు గోపాల్. అవన్నీ లోపల పెట్టి, భోజనాలబల్ల మీద మాకు భోజనాలు ఏర్పాటు చేసేడు. గోపాల్ శ్రీమతి పిల్లలతో తన పుట్టింటికి వేసవి సెలవులకని వెళ్ళిందట. గోపాల్ క్షమాపూర్వకంగా చెప్పేడు. భోజనాలు చేసేక తనకి నిద్ర వస్తూందని రాజారావు వెళ్ళి పడుకున్నాడు. నేను గోపాల్ బాతాఖానీలో పడ్డాం. సాయంత్రం కావొస్తుండగా ఇద్దరం బయటపడ్డాం. చుట్టూ చెట్లతో అడవిలా ఉంది. చల్లగా ఉంది. తన స్నేక్ పార్కుని చూపించసాగేడు గోపాల్.
చాలా చక్కగా అమర్చేడు పార్కుని. ప్రమాదం కలిగించని పాములని ఒకప్రక్కగా, అతి ప్రమాదకారులైన పాములని ఒకప్రక్కగా, విదేశాలనుంచి తెప్పించిన పాములని ఒకప్రక్కగా, ఆల్బమ్ లో స్టాంపులని అతికించినట్లు.
గడ్డితో నేసిన పెద్ద షెడ్డులాగా ఉంది. అందులో వరసగా గాజు తొట్టెలు అమర్చేడు. ఆ తొట్టెల్లో రాళ్ళూ, ఇసక, చిన్న చిన్న కొమ్మలూ అమర్చి, అందులో పెట్టేడు పాములని. ఒక్కొక్క పాము పేరు, అది దొరికే ప్రదేశం, అది తీసుకొనే ఆహారం, ఎలా గుడ్లని పెడుతుందో, అన్నీ తెలుగులో, ఇంగ్లీషులో వివరంగా వ్రాసేడు. రకరకాల పాములు. ఊహల్లో తల్చుకోవడానికే భయమేసే పాములు అలా ఉండగా చూడటానికి చాలా వింతగా, థ్రిల్లింగ్ గా ఉంది.
"ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పాములు పన్నెండు రకాలు మాత్రమే. అందులో కింగ్ కోబ్రా అని పిలవబడే నాగుపాము ఒకటి. అమెరికాలో కనబడే రాటిల్ స్నేక్ అన్నింటికన్న ప్రమాదకారి. కాని నాగుపాముని మించిన అందమైన పాము మరోటి లేదు ప్రపంచంలో. " అన్నాడు గోపాల్ ఇండియన్ కోబ్రా అని రాసివున్న తొట్టెను చూపిస్తూ. అందులో చాలా పాములున్నాయి, ఒకదానిని ఒకటి చుట్టుకొని. మూలమూలల పడుకొని.
"వెన్నెల్లో పడగ విప్పుకుని నిలబడ్డప్పుడు చూడాలి దీని అందం మెచ్చుకోలుగా" అన్నాడు గోపాల్.
వెంటనే నాకు కెమెరా గుర్తొచ్చి అడిగాను. - "వాటికి విషం ఉందా? "
ఎంత మామూలుగా అడిగినా నా కంఠంలో ధ్వనించిన భయాన్ని గమనించి నవ్వేడు గోపాల్. "ఉహూఁ! లేదు. నిన్ననే తీసేసేను. ఫ్రిజ్ లో ఉంది అంతా. బహుశా రేపు పంపేస్తాను. అమెరికా నుండి ఒక ఆర్డరు ఉంది. వాళ్లకి పంపాలి."
ఇంటిముందు ఒక వరండా ఉంది. ఆక్కడ పాతకాలపు ఈజీఛైర్ ఉంది. ప్రక్కనే కొన్ని కుర్చీలున్నాయి. "అలా విశ్రాంతిగా కూర్చో.." అని నన్ను ఆ పడకకుర్చీలో కూచోబెట్టి తను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కాళయ్య లోపల్నించి కొబ్బరి బోండాలు తెచ్చి ఇచ్చేడు. తాగుతూ అడిగేను." నువ్వు పట్టవా పాముల్ని? "
"వూఁహూఁ! నేను పట్టను. కాళయ్య పడతాడు ఎక్కువగా. ఇంకెవరైనా తెస్తే కొంటాను." అన్నాడు.
"అయ్యో ! నీకేవైనా అనుభవాలు ఎదురవుతాయనుకున్నాను " అన్నాను నిరాశగా.
" అనుభవాలా! " చిన్నగా నవ్వేడు. ఇంతలో కాళయ్య వచ్చి ఆ అరుగు మీద గొంతుకిలా కూచున్నాడు. కాళయ్యని చూసి ఏదో గుర్తొచ్చినట్టు అన్నాడు. " ఒకేఒకసారి ఎదురయింది."
"ఏమయ్యింది?" ఆతృతగా అడిగేను.
చీకటి పడసాగింది. సూర్యుని కిరణాలు పడమటి వైపునుంచి, చెట్లకొమ్మలలోంచి ఆ ఇంటి ముంగిటిలో పడసాగేయి. చీకట్లు సూర్యకిరణాలని ఆకలిగా తినేస్తున్నాయి. హిస్ మన్న శబ్దం పక్షుల కిలకిలా రావాలతో కలసిపోతోంది.
" ఒకే ఒకసారి వెళ్ళాను కాళయ్యతో. ఈ దగ్గరలోనే ఉన్న పొదలకు రెండు రోజులై పాము వస్తోెందని చూసిన రైతులు చెప్పారు. కాళయ్య వెళుతుంటే నేను సరదాగా వెళ్లాను. ఆ పొదని సులువుగానే గుర్తుపట్టాడు కాళయ్య. ఆ పొద పక్కనే పాము తరచు వస్తున్నట్లు గుర్తులు, విడిచిన కుబుసం, గడ్డి ఒత్తుకోబడి దారిలా అయినట్టు ఓ పొడవయిన గుర్తు, కాళయ్య ఆవేళ తను పాము అక్కడ తిరుగుతున్నదీ లేనిదీ ఎలా గుర్తిస్తాడో చెప్పేడు. చీకటి పడే దాకా రాలేదు ఆ పాము ఆ పొద దగ్గరకి. కాళయ్య నేను ఆ పొద కి కొంచెం దూరంలో కూచుని, ఊపిరి తీయడానికి కూడా సందేహిస్తూ ఆ పాము కోసం ఎదురుచూడసాగేం. చీకటి పడింది. ఆ రోజు వెన్నెలరోజు అనుకుంటా ---" ఆగి కాళయ్యని అడిగేడు. " వెన్నెెల ఉంది కదూ?"
కాళయ్య అవునన్నట్లు తలూపేడు.
"ఇద్దరమూ చెట్లలోంచి, ఆకుల మధ్యనుంచీ పడుతున్న వెన్నెలలో అలా కూర్చున్నాం. ఇంతలో ఎడమ పక్కనించీ 'హిస్ ' మని వినబడింది. కాళయ్య బరువుగా ఊపిరి వదుల్తున్నాడనుకొని 'ష్' అని మందలించి ఊరుకున్నాను. మళ్ళీ ఆ హిస్ మన్న శబ్దం వినబడింది. అప్పుడు గుర్తొచ్చింది. కాళయ్య నా కుడివైపు కూర్చున్నాడని. దడదడలాడుతున్న గుండెతో, బెదురు బెదురుగా ఓరగా చూసేను. అక్కడుంది."
" ఏమిటీ?" ఆత్రంగా అడిగేను.
"పాము"
" నాగుపాము?!"
" అవును. మేం ఎదురు చూస్తున్న నాగుపామే. అడుగు పైకి నిలబడి పడగ పూర్తిగా విప్పి బుసకొడుతూ ఉంది. నాకు ఊపిరి ఆగినంత పని అయ్యింది. భయంతో ఏం చెయ్యాలో తోచలేదు. కాళ్ళూ చేతులూ ఆడలేదు. నా కళ్లు నిశ్చలంగా ఆ పామునే చూడసాగేయి.
" ఎలా వెళ్ళాడో తెలీదు, కాళయ్య అంత కన్న నిశ్శబ్దంగా, ఆ పాము వెనక్కి వెళ్ళాడు. కాళయ్య చేయి ఆ పాము వైపు సాగడం చూసిన గుర్తుంది. నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి కాళయ్య ఆతృతగా నా వైపు చూస్తూ కనబడ్డాడు. ఇప్పటికీ ఆ అనుభవం తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది " అన్నాడు గోపాల్ ఆగుతూ.
" మరి కాళయ్య కదిలితే ఆ పాము శబ్దం వినలేదా?"
"పాములకి చెవులుండవు. అది భూ ప్రకంపనాలబట్టి అలికిడిని కనుక్కుంటుంది. అసలు ఆ వేళ నేను అలా కొయ్యబారిపోయి పోవడం పనికివచ్చింది - ఆ పాము దృష్టి అంతా నా మీద ఉండటం వల్ల కాళయ్య పని సులువైంది."
"గుడ్ గాడ్! ఆ హిస్ మన్న శబ్దం రాగానే నువ్వు కాలో చెయ్యో కదిపి ఉంటే...."
" కదిపి ఉంటే విదేశాన్నించి వచ్చిన నా మిత్రుడితో ఈ గోపాల్ మాట్లాడుతూ ఉండేవాడు కాదు. " అన్నాడు నవ్వుతూ.
" కబుర్లేనా! కొంచెం టీ లాటిది తాగించడం ఉందా ?" నిద్రలేచి వచ్చిన రాజారావు అడిగేడు ఇంకో కుర్చీలో కూలబడుతూ.
లోపల్నించి కాళయ్య టీలూ కొంచెం అల్పాహారాలు తెచ్చిపెట్టాడు. అలా కబుర్లలో పడ్డాం. పాముల మనస్తత్వం గురించి, తన కొచ్చిన ఆర్డర్సు గురించి, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలనుంచి అనుమతులు ఎంత కష్టపడి సంపాదించవలసి వచ్చిందో.. రాజారావు ఎంత సహాయపడ్డాడో వివరంగా చెప్పాడు.
రాత్రి తొమ్మిది గంటలయింది.
వెన్నెల పుచ్చపువ్వులా మెరిసిపోతోంది. నేను రాజారావు కెమెరా పట్టుకొని బయలుదేరాం. గోపాల్ కి నిద్ర వస్తుందని రాలేదు. కాళయ్య వరండాలో ఓ మూల నిద్రపోతున్నాడు. వీళ్ళకి రాత్రి ఏడు గంటలకే మొదలవుతుంది.
రాజారావు ఆరు సెల్సు ఉన్న టార్చిలైటు ఒకటి, ఆత్మరక్షణకై ఓ పెద్దకర్ర పట్టుకున్నాడు. గోపాల్ సలహా మేరకు మోకాళ్లదాకా ఉండే ఫైర్మన్ బూట్లు వేసుకున్నాం. అంతకు మించి పై ప్రదేశంలో కుట్టలేవట పాములు.
వెన్నెల వెండిలా మెరుస్తూ కనబడుతూంది ఆకులమీద. అక్కడక్కడ నిద్రలో ఉలిక్కిపడ్డట్టు అరిచే పక్షుల అరుపులు మినహా ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంది, ఓ పెద్దలాండ్ స్కేప్ లా. జర్మనీలో ఇంత ప్రశాంతంగా, నిర్మలాకాశాన్ని అన్ని తారలనీ చూసే అవకాశం లేదు. మంచి దృశ్యాలు చూస్తున్నానన్న ఉద్వేగంతో నడుస్తున్న నన్ను అదలించసాగాడు రాజారావు.
రాములపాడు పక్కనే పారుతున్న ఓ వాగు వడ్డున కూర్చున్నాం. వాగు లోని నీళ్ళు కృష్ణశాస్త్రి గారి మాటవిన్నట్లు సడిచేయకుండా సాగిపోతున్నాయి. ఆకులలో గాలి కూడా ప్రకృతి అందానికి పరవశించినట్లుగా ఊసులాపేసింది. చాలాసేపు నిశ్శబ్దంగా, మాట్లాడితే తనకి భంగం అయిందని ఆ ప్రకృతి అంతా మాయమైపోతుందేమో ఆన్నట్లు కూచున్నాం.
చివరికి రాజారావు "పదవెళ్గాం " అని లేచాడు.
వెనక్కువచ్చి పార్కులోకి ప్రవేశిస్తుంటే రాజారావు చటుక్కున నా చేయిని పట్టుకుని ఆపాడు.
" ఏమిటి?" అడిగేను.
" ష్!అటువైపు చూడు." ఆన్నాడు తర్జని చూపిస్తూ.
పాము!
నాగుపాములా ఉంది. ఒక మూల పడుకుంది చుట్టచుట్టుకొని.
మధ్యాహ్నం గ్లాస్ కేస్ లో చూసేను. బయటికెలా వచ్చిందో అర్ధం కాలేదు. తప్పించుకుందా?
ఏమో ?
వెన్నెల సూటిగా ఆ పాము మీద పడుతోంది.
కెమెరా సిద్దం చేసుకుని రాజారావుతో అన్నాను. "చిన్నగా అలికిడి చేయి"
నేను పని చూడలేదు రాజారావు. కర్రతో నేలమీద కొడుతూ " ష్ష్ ! ష్ష్!" అన్నాడు. చటుక్కున పడగ విప్పి మా వైపు చూసింది. వెంటనే ఫ్లాష్ నొక్కాను.
'బుస్' మంది కోపంగా.
దగ్గరకి వెళ్లబోయాను. రాజారావు చెయ్యి పట్టుకు ఆపాడు.
" ఫరవాలేదు. విషం తీసేసిందే !" అన్నాను దగ్గరగా వెళ్తూ. "రాజా నువ్వు ఇటువైపుకి రా " అన్నాను.
రాజారావు దగ్గర కర్ర వుంది కనక, రాజారావునే చూడసాగింది ప్రత్యేకంగా. రాజారావు అటు వెళ్ళగానే 'బుస్' మంటూ అటు తిరిగింది. పడగమీద ఉండే సులోచనాలు పడేలా ఫోటో తీసేను.
'బుస్' 'బుస్' మని బుసలు కొడుతోంది కానీ చురుగ్గా కదలలేకపోతోంది ఆ పాము.
ఇంకా మంచి ఫోజు కావాలని, తోక పట్టుకుని లాగి చటుక్కున రెండడుగులు వెనక్కి వెసేను. రెట్టించిన కోపంతో 'హిస్' మంటూ లేచి నా వైపు తిరిగింది. అప్రయత్నంగా నా వేలు ఫ్లాష్ నొక్కినా ఆ కోపం ఆ వేగం చూసి గుండె ఝల్లుమంది.
మెల్లగా పాక్కుంటూ పక్క పొదలోకి వెళ్ళిపోయింది. దాని కడుపు ఉబ్బి ఉండటం చూసి రాజారావు అన్నాడు "దేన్నో తినేసింది. అందుకే చురుగ్గా కదల్లేకపోతోంది ".
మా గదులలోకి వెళ్లి పడుకున్నాం. నిద్రపట్టేలోగా, చాలాసేపు కోపంగా పడగ విప్పి నావైపు తిరిగిన ఆ పామే కళ్ళలో కదలాడీంది.
మర్నాడు లేచేసరికి ఎండవేడి హెచ్చుతోంది. రాజారావు అప్పటికే హడావుడి పడుతున్నాడు.
తయారయి ఫోటోలు ప్రింట్సు తీసి చూసేను. అద్భుతంగా వచ్చేయి. పామువి మరీ బాగా వచ్చేయి, సహజంగా. బాన్ లోని నా సహోద్యోగులందరు ఆశ్చర్యపోతారు ఈ ఫోటోలు చూసి. ఇండియాకి లాండ్ ఆఫ్ స్నేక్ ఛార్మర్స్ అని పేరు.
విషం లేని పాముకి తీసేనని చెప్పకూడదు. థ్రిల్ ఉండదు అలా చెపితే - అనుకున్నాను.
గోపాల్ కోసం బయటకి వెళ్ళాను. కాళయ్య గోపాల్ ఎక్కడో ఉన్నారు. రాజారావు అసహనంగా కేకేసాడు. "గోపాల్!".
"ఇక్కడున్నా" ఒక మూలనించి సమాధానం వచ్చింది.
అటువైపు వెళ్ళాం. గోపాల్ కి ఫోటోలు చూపించి మా అడ్వెంచర్ గురించి చెప్పాలని ఆత్రపడసాగాను.
కాళయ్య పొదలో ఏదో వెతుకుతూంటే, గోపాల్ పక్కన నిలబడి సలహాలు ఇస్తున్నాడు.
" ఫోటోలు చూడరా!" అంటూ ఫోటోలు చేతిలో పెట్టాను.
"ఒక్కక్షణం" అని కాళయ్యని పిలిచి ఫోటోలు చూపించేడు. "ఇదే ఆ పాము. "
కాళయ్య మౌనంగా తలూపి మళ్ళీ పొదలో దూరేడు.
"రాజారావు ఉదయాన్నే చెప్పేడు రాత్రి జరిగిన సంఘటన. నా కేసులోంచి పాములు తప్పించుకోవడం అసాధ్యం. అది ప్రమాదం కూడా! అందుకే కాళయ్య నేను అన్ని కేజ్ లూ తనిఖీ చేసేం. అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటీ తప్పించుకోలేదు."
" అయితే....అంటే...." నేనూ రాజారావూ ఒకేసారి అయోమయంగా అన్నాం.
"దొరికింది....." కేక వేస్తూ పొదలోంచి కాళయ్య వచ్చాడు.
కాళయ్య చేతిలో ఉందా పాము. మంచి పొగరుగా ఉంది. సరిగ్గా దాని తోకదగ్గరా, పడగ దగ్గరా వడుపుగా పట్టుకున్నాడు కాళయ్య. అది బుసకొడుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంది. రాత్రి తోక పట్టుకుని లాగిన పామే అది.
నిలువు గుడ్లేసుకుని నిలబడ్డాం రాజారావూ నేనూ...
**************అయిపోయింది************
నా ఈ కధ ఆంధ్రప్రభ వారపత్రికలో 06-10-1982 న ప్రచురితమైంది. 1977 లో మద్రాసులో స్నేక్ పార్కు చూసిననాటినుంచి ఈ కధ నా మనసులో మెదలసాగింది. 1980 లో రాసేను గాని ఎవరికీ పంపలేదు. 82 లో ఆంధ్రప్రభకి పంపేను. వారు ప్రచురించేరు.
ఈ కధ రాసిన సమయానికి, జర్మనీల ఏకీకరణ జరగలేదు.
చాలా బాగుంది
ReplyDeleteసూపర్
ReplyDeleteChala thrilling ga vundi.
ReplyDeleteRatnam
Kallaku kattinattuga varnicharu, snake park visit chesinatte anipinchindi! Felt like going to Ramulapadu immediately! Chaala bavundi kadha, kadhanam!
ReplyDeleteథ్రిల్లర్స్ కే థ్రిల్ కలిగించేట్లు భలే థ్రిల్లింగ్ గా వుంది సార్ మీ దిల్ కా థ్రిల్ !
ReplyDelete