Saturday, 8 August 2020

మార్గదర్శకులు

 కొత్తగా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి చిరునామా మనకి తెలియనప్పుడు, అక్కడి వారినెవరినైనా మనక్కావలసిన చిరునామా చెప్పి ఆ చిరునామా దగ్గరకి ఎలా వెళ్ళాలో అడుగుతాం. ఇది సర్వసాధారణం. దారి ఎటో కనుక్కోవడంతో పాటు అక్కడికి సులభంగా చేరడానికి నడక మంచిదా, లేక రిక్షానో బస్సో ఎక్కి వెడితే మంచిదా  అని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మార్గదర్శకులతో మాత్రం మహా చిక్కు. వాళ్ళేం చెప్పినా మనం నమ్మాల్సిందే. 

మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ కలసి ఉన్న లోకం కనక, మంచివాడు తారసబడితే ఊరికి కొత్తవాళ్ళమన్న సానుభూతితో జాగ్రత్తగా వివరించి చెప్తారు. ఒక్కోసారి మనతో ఆ చిరునామా దాకా వచ్చి దిగబెట్టి వెళ్తారు, ఊరు చిన్నదయితే. తుంటరి వాళ్ళ చేతికి చిక్కామంటే మాత్రం తప్పుదోవ పట్టించి మూడుచెరువుల నీళ్ళు తాగిస్తారు. 

నామిత్రుడొకాయన ఆ మంచివాళ్ళ కోవకి చెందుతాడు. అతడు చెప్తే,  అలా మనసుకు హత్తుకు పోవాల్సిందే. కళింగపట్నం లాంటి పల్లెలో బతుకుతున్న వ్యక్తి , కలకత్తా అయినా, బొంబాయి అయినా అతని దగ్గర వివరాలు తీసుకుంటే, అదే మొదటిసారి వెళ్ళడం అయినా, కళ్ళు మూసుకుని ఆ చిరునామా కి వెళ్లచ్చు (ప్రమాదం జరగదని నమ్మకం ఉంటే). పెద్దనగరాలైతే ఏ నంబరు సిటి బస్సెక్కాలి, మనం దిగాల్సిన స్టాప్ పేరేంటి, టిక్కెట్ ఎంత ఉంటుంది, బస్ స్టాప్ నుండి ఇంటికి ఎంత దూరం ఉంటుంది, రిక్షా ఎక్కితే ఎంత తీసుకుంటాడు అన్నీ చక్కగా చెప్తాడతను. ఇంకా మనకి అర్ధం కాకపోతే పటం గీసి చూపుతాడతను. 

నేనోసారి హైదరాబాద్ వెళ్లాల్సిన పని పడింది. అదే మొదటిసారి కనక నా మిత్రుడి దగ్గర సలహా తీసుకున్నాను. అతని సూచనల ప్రకారం రైలుదిగి నేను వెళ్ళవలసిన చోటుకి చాలా సులభంగా చేరేను. "అరే ! మొదటిసారి సిటికి వచ్చేవు. ఇల్లు చేరడానికి ఇబ్బంది పడ్డావా? అంత తేలిగ్గా ఎలా రాగలిగేవు.". అంటూ ఆశ్చర్యపోయారు. నా మిత్రుని సంగతి చెప్పకుండా గర్వంగా ఓ చిర్నవ్వు నవ్వి ఊరుకున్నాను. 

ఎవరు తుంటరి వాళ్ళో కాదో తెలుసుకోలేం కనక, ఎవరినడిగితే తమ ఇష్ఠం వచ్చిన రీతిలో చెప్పి మనలని ముప్పతిప్పలు పెడతారోనని భయం ఉంటుంది. పై ఊళ్ళో రిక్షావాళ్లనీ ఆటో వాళ్ళనీ నమ్మద్దనీ, వాళ్ళ చేతిలో ఎలా మోసపోయామో అని మిత్రులు చెప్పిన కధలు గురుతుకొస్తాయి. దగ్గరైతే నడిచి పోవడం, దూరం అయితే సిటి బస్సెక్కడం క్షేమమనుకుంటాం. సిటి బస్ ఎక్కడానికి ఏదో స్టాపులో నిలబడి ఫలానా చోటికి ఏ బస్ పోతుందని అక్కడ నిలబడ్డవాళ్ళని అడిగితే ఈ తుంటరి వాళ్లు అసలు నంబర్లు వదిలిపెట్టి ఇంకెటో పోయే బస్ నెంబరు చెప్తారు. అలాకాదని, మన పక్కనున్నవాడిని అడిగామనుకోండి. ఆతడూ తుంటరి వాడైతే "ఆ" అనేసి ఊరుకుంటాడు. మనం నమ్మి ఆ బస్సు ఎక్కుతాం. సమయానికి కండక్టర్ కనబడడు.  అది బయలుదేరుతుంది.  కండక్టర్ టిక్కట్లు ఇచ్చుకుంటూ మన దగ్గరకు వస్తాడు. మనం దిగాల్సిన స్ఠాప్ పేరు చెప్పగానే, మనం ఎంత ఆధునికంగా కనబడ్డా మనవైపు, చికాగ్గా, కోపంగా, హేళనగా చూసి, బెల్లు కొట్టి బస్సాపి "దిగవయ్యా దిగు, ఇది అటెళ్ళదు" అని గెంటేసినంత పని చేస్తాడు. మనం ఇంకా పూర్తిగా దిగకుండానే బస్సుని జోరుగా లాగించేస్తాడు డ్రైవరు. మిగిలిన ప్రయాణికులు నవ్వుతారు. తలకొట్టేసినంత పని అవుతుంది. ఎవరైనా మనవేపు సానుభూతిగా చూడబోతే నవ్వాలేక ఏడవలేక ఓ బస్సుతప్పిన నవ్వొకటి విసిరేస్తాం.మళ్ళీ మామూలే. మనలని కండక్టరు దింపేసిన చోటినుండి వెళ్ళవలసిన చోటికి బస్సు ఉండదు. 

 నా మిత్రుడొకాయన ఒకసారి ఏదో పనిమీద పై ఊరు వెళ్ళాడట. అక్కడ సిటి బస్సుల్లేవు. రిక్షా ఎక్కడానికి భయపడి ఈయన వెళ్ళాల్సిన ఆఫీసు అడ్రసు రాసిన కాగితం చేత్తో పట్టుకుని నడకన బయల్దేరాడు. దారిని పోతున్న ఓ పెద్దమనిషిని ఆ కాగితం చూపించి దారెటు అని అడిగాడు. ఆ పెద్దమనిషిలా కనిపించినాయన "ఇక్కణ్ణించి కుడిపక్క వీధిలోకి తిరిగి మళ్ళీ ఎడమవైపు మొదటి సందులోకి తిరిగి మూడో లైటు స్థంబం దగ్గర మళ్ళి కుడి పక్కకి తిరిగి అలా తిన్నగా వెళ్తే ఓ దుకాణం కనబడుతుంది. చాలాపెద్ద దుకాణం అది. అక్కడ్నించి ముందుకి రెండడుగులు నడుస్తే చిన్న సందు కనబడుతుంది. ఆ సందులో చివరగా వచ్చి, సందు చివర కుడివైపు తిరగండి. అక్కడే ఉంది ఈ ఆఫీసు." అంత వివరంగా చెప్పగానే నా మిత్రుడు ఆనందంగా ఆతనికి ధన్యవాదాలు చెప్పి, తూ.చా తప్పకుండా సూచనలు పాటిస్తూ అరగంటపైగా నడిస్తే చివరకి తను బయల్దేరిన చోటుకే చేరాడట. కాళ్ళ పీకు తప్ప ఆఫీసు దొరకలేదు. అప్పుడు బుద్దిగా రిక్షా ఎక్కి వెళ్ళాడట. 

అతని అనుభవం విన్నాక కూడా బుద్దిలేక నేనోసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళడానికి మా బంధువు చెప్పిన సిటీ బస్సెక్కి ఏ.వి.యన్ కాలేజ్ దగ్గర దిగి, అక్కడ నిలబడి మర్యాదస్తుడులా కనబడ్డ ఓ కుర్రాడ్ని "కొత్తఅగ్రహారం ఎటు?" అని అడిగేను. ఆతనికి సరిగ్గా తెలియడంకోసం మా బంధువు పేరు, ఆయన పనిచేస్తున్న వివరం, ఇంటినంబరు, వీధి వివరాలూ నాకు తెలిసినంత వరకు చెప్పేను. ఆ కుర్రాడు నా వైపు ఎగాదిగా చూసి, "ఇక్కడ కాదు. ఇలా వెళ్ళి బస్టాండు దాటాక కుడివైపు తిరగండి. ఆ పక్కనే ఉంటుంది." అన్నాడు. కాలేజి దగ్గరే ఇల్లని చెప్పిన మా బంధువును తిట్టుకుంటూ, మళ్ళీ  ఆ డౌన్ దిగి బస్టాపు వైపు అడుగు వేసేను. ఎందుకైనా మంచిదని ఆ బస్టాపు దగ్గిర ఇంకొకాయన్ని అడిగితే.. "అరే.. ఇటెందుకు వచ్చేరు. ఏ.వి.యన్ కాలేజ్ ముందు కుడివైపు ఓ డౌను ఉంటుంది. అందులోకి తిరిగి ఆ డౌను చివరకి, సందు ఆగిపోయే దగ్గరే మీక్కావలిసిన ఇల్లు" అని చెప్పాడు. అప్పటికే అలసిపోయి, విసిగిపోయి ఉండటం చేత రిక్షా ఎక్కి అడ్రస్ చెప్పి పోనిమ్మన్నాను, బస్టాండ్ దగ్గర వ్యక్తే కరక్టు. రిక్షా దిగి  ఇంట్లో అడుగు పెడుతుంటే వెనకనించి, ఇందాక కాలేజీ దగ్గర ఏ కుర్రాడ్ని అయితే అడ్రసు అడిగానో ఆ కుర్రాడు వచ్చాడు నా బంధువుని "మామయ్యా" అంటూ. నాకు కోపం ఆగకపోతే బూతులు వస్తాయి. అప్పడు నాకు కోపం ఆగలేదు. 

అటు మంచివాళ్ళూ, ఇటు తుంటరి వాళ్లూ కాకుండా మధ్య మరో రకం ఉంటారు. వీళ్ళతో మరీ ప్రమాదం. పక్క ఇంటిలో ఉండే మనిషే మనకి కావల్సి ఉండి పొరపాటున వీళ్ళని అడిగేమనుకోండి, ఏ మాత్రం సంకోచించకుండా "అబ్బే ఇక్కడ అలాంటి పేరు గల వాళ్ళెవరూ లేనేలేరు."అని చెప్పేస్తారు ఈ తటస్థ స్వభావులు. మనకి అనుమానం తీరక అక్కడే వెదికితే ఆతని పక్కఇల్లే అవుతుంది మనక్కావలసిన ఇల్లు. మరీ పక్కింటిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎలా బతుకుతున్నాడు చెప్మా అని ఆశ్చర్యపోవాలి. 

ఒకవేళ అతని మాటలు నమ్మి 'ఇక్కడ కాదు కామోసు' అనుకొని మనం కలవవలసిన వ్యక్తి ఆతను పనిచేసే ఆఫీసుకు వెళ్ళి కలుసుకున్నామనుకోండి "నీ ఇంటికోసం వెతికి వెతికి చచ్చాననుకో" అంటాం. అతను సానుభూతి చూపించి "అయ్యో! పద . ఇంటిలో దిగబెట్టి వస్తాను. నువు రెష్టు తీసుకో. సాయంత్రం మాట్లాడుకుందాం, తీరిగ్గా." అంటాడు. తీరా అతను వెంట వెళ్తుంటే అన్నీ ఇందాక తిరిగిన వీధులే వస్తాయి. "ఇక్కడ కానే కాదు. అలాటివాళ్లెవరు ఇక్కడ లేనేలేరు." అన్న పెద్దమనిషి ఇంటి పక్కనుంచే వెళ్తాం. మిత్రుడు మనలని తెలివితక్కువమనిషి కింద జమకడతాడేమో అన్న భయం ఉంటే ఆ వీధిలోకి కొత్తగా వస్తున్నట్టు ప్రవర్తించడమే మంచిది. ఈ తటస్థ స్వభావుల్లోనే మరో రకం ఉన్నారు. మనం అడిగేదేదో పూర్తిగా వినిపించుకోకుండానే "మాకు తెలీదు" అనేస్తారు. 

"దారెటు?" అని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు అవతలి వ్యక్తి మంచివాడో కాదో ముఖం చూసి కాదో ముఖం చూసి అంచనా వేసుకోవాలి. వీలయినంత వరకూ రిటైరయిన పెద్దవాళ్ళని అడగడం మంచిది.

***********అయిపోయింది*************

పై వ్యాసం 23.09.1979 న ఆంధ్రప్రభ దినపత్రిక కాలక్షేపానికి కబుర్లు శీర్షికన ప్రచురితమైంది నా ఆరెస్ డబల్యూ  అన్న కలం పేరుతో. 

ఆ రోజుల్లో గూగుల్ తల్లి లేదు. గూగుల్ మేపులూ లేవు. కనబడ్డ వారిని విచారించి విచారించి వెతుక్కోవడమే కొత్త చిరునామాలు. 

నిజానికి గూగులే మ్యాపులు ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక్కోసారి ఎవరినైనా అడక్కుండా జరగదు అందునా, ఈ మ్యాపులు ఒకొక్కసారి, దగ్గర తోవ చూపించడం లో చిన్నచిన్న సందుల్లోంచి దారి చూపడం అనుభవంలోకి వచ్చేదే. 




5 comments:

  1. ఈ రోజుల్లో ఇలాంటి అనుభవాలు లేకనేమో, ఉన్నవాళ్ళందరూ ఊళ్ళొదలి దేశాలు పట్టి పోతున్నారు, అందుకే కధకులు కధలు లేక కదం తొక్కుతున్నారు శర్మగారూ.....

    ReplyDelete
  2. Chaala baaga rasaru, kotha vooriki vellinappudu address kanukkotaniki pade ibbandulu! Almost chaala mandi ilaanti anubhavalu face chesi vuntaru, ee google maps raaka mundu! Good narration!

    ReplyDelete