శ్రీకాకుళం లో ప్రభుత్వ కళాశాల పక్కన ఒక జీడిమామిడి తోట ఉండేది. ఒక మట్టిరోడ్డు, కాలేజీకి ఆ తోటకీ మధ్యనించి హాస్పిటల్ కి పోయేది. కాలేజి విద్యార్ధులు ఆ తోటలోని చెట్లమీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఓ చిన్న కాంటీన్ అని పిలువబడే హోటల్ ఉండేది.
ఇప్పుడు ఆ తోట లేదు. ఆ స్ధానే ఇళ్ళు లేచేయి. కొన్ని ఎపార్ట్ మెంట్లు, కొన్ని ఇళ్ళు. శాంతినగర్ అని ఓ కాలనీ. అందులో ఓ నాలుగు అంతస్దుల ఎపార్ట్ మెంట్ లో అంతస్ధుకి ఆరు చొప్పున రెండు పడకగదుల ఇళ్ళ "ఆనందనిలయం" ఉంది.
రావు ఉద్యోగరీత్యా తరచూ బదిలీలతో ఎక్కడా ఒక ఇల్లంటూ కొనుక్కోలేదు అప్పటిదాకా. ఉద్యోగం లో ఉండగానే పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ చేయడంతో ఆట్టే పొదుపు కూడా చేయలేకపోయాడు. రిటైరయ్యాక వచ్చే డబ్బుతో , తను పుట్టిపెరిగిన ఊరు, శ్రీకాకుళంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని విశ్రాంత జీవనం గడపాలని రావు కోరిక. రిటైర్మెంట్ సంధర్భంగా పిల్లలు ఇద్దరూ వచ్చేరు. వాళ్ళకి తన కోరిక తెలియజేసేడు రావు.
అప్పుడే పెద్దవాడు ఈ ప్రణాళిక చేసేడు. వాళ్లిద్దరే శ్రీకాకుళం వచ్చి ఈ ఫ్లాట్ కొనడానికి నిశ్చయించి అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చేరు.
ఆ ఆనందనిలయంలో రెండో అంతస్ధులో రెండు, రెండు పడకగదుల ఇళ్ళు తీసుకొని ఒక్కటిగా ఆధునీకరించి రావు వసంత ఉండడానికి వారి కొడుకులు బహుమతిగా ఇచ్చేరు. "ఆతిధేయమ్" అని పేరు పెట్టుకున్నాడు రావు, తమ ఇంటికి.
ఫ్లాట్ అప్పజెప్పేందుకు ఓ ఏడాది సమయం పడుతుందిగా అంతవరకూ ఆరునెలలు అమెరికాలోను, ఆరునెలలు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆ దేశాలు కూడా చూసినట్టు ఉంటుందని నిర్ణయించేరు.
రావు కొడుకులు ఆ ఇంటికి అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ఏ లోటూ లేకుండా చూసేరు. మొత్తం ఫర్నిచర్ అంతా సమకూర్చేరు. వాళ్ళ పాత సామానులూ ఏవి కొత్త ఇంటిలోకి రానివ్వలేదు, ఒక్క దేవుని సామానులు తప్ప. తమ తల్లిదండ్రులు ఊరికి వెళ్ళాల్సి వస్తే ఎవరూ లోపలకు జొరబడకుండా కిటికీలు, వరండాలూ అన్ని చిన్న కన్నాలున్న జాలీ తో, గాలీ వెలుతురూ వచ్చే వీలుంచుతూ, మూయించేరు. ఇంటిలో ఉన్న నాలుగు గదులకు విద్యుత్ సరఫరా ఆగిపోయినా కూడా ఇబ్బంది రాకుండా ఇన్వెర్టర్ సౌకర్యం ఉంది. ఇంకా ఊరు పెరుగుతూనే ఉంది కనక కారు కొని, పార్కింగ్ లో ఉంచేరు. ముఖద్వారం ముందు ఓ కటకటాల తలుపు ఉంది, ఎవరైనా వస్తే, ముందుగా తెలిసిన వాళ్ళో కాదో చూసుకొని తలుపు తీయాలనే ఆదేశంతో పాటు. అన్నీ ముందుగానే ఏర్పాటు చేసి, ఎక్కడ ఉండవలిసిన వస్తువులు అక్కడ సర్దించేసి, గృహప్రవేశం అయ్యేక, వాళ్ళు తమ తల్లిదండ్రులకు కొడుకులుగా తమ భాధ్యతని సక్రమంగా చేసేం అనే సంతృప్తితో వెళ్ళేరు, పెద్దకొడుకూ కుటుంబం అమెరికా, రెండో కొడుకూ కుటుంబం ఆస్ట్రేలియాకి.
అదిగో అలా ఆ దేశాలలో ఏడాది గడిపి తిరిగి రాగానే, ఈ ఇంటిలో గృహప్రవేశం చేసి దిగేరు. వాళ్ళకి చాలా అలసటగా అనిపించింది. రైలొచ్చి వెళ్ళిన ప్లాట్ ఫారంలా తోచింది ఇల్లు వాళ్ళిద్దరికీ. కొత్త ఇంటిలో ఆ ఇద్దరే గడిపిన ఆ మొదటి రేయి అలసటతో ఒళ్ళెరగని నిద్ర పోయారు.
*******
మరునాడు ఉదయాన్నే కాలింగ్ బెల్ శబ్దం వినబడి లేచేడు రావ్. బయట వాచ్ మేన్ మరో ఇద్దరు వ్యక్తులతో నిలబడి ఉండటం చూసి తలుపు తీసేడు.
"అయ్యా! ఈడు పాలోస్తాడండి. ఈడు పేపరేస్తాడండి. మీకు కావాలా సార్?" అడిగేడు వాచ్ మేన్.వాళ్లిద్దరితో మాట్లాడి పంపి, లోపలికి వెళ్ళి తయారయి కిందకి వెళ్ళాడు. ఆ భవనం లో ఉన్న మిగిలిన వాళ్ళెవరు కనబడలేదు. వాచ్ మేన్ని ఎవరెవరు ఉంటున్నారో కనుక్కున్నాడు. అందరూ ఉద్యోగస్తులే. చాలామంది భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళే. తన ఉద్యోగ జీవితం, ఆ పరుగులూ ఉరుకులూ గుర్తువొచ్చేయి. 'ఇప్పుడు నాకీ బాధ లేదు' అనుకున్నాడు.
ఆ ఫ్లాట్ లో ఉన్న ఒక బాల్కనీ లోెంచి దూరంగా పారుతున్న నాగావళి నది కనబడుతోంది. నదిలో నీరు ఎక్కువగా ఉన్నట్టు లేదు. నాగావళి లో నీరు మంచివాడి కోపంలా ఎక్కువ రోజులుండదు. రావ్ కి తన చిన్నతనం లో ఆ ఏటి ఒడ్డున ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. మనసంతా ఆనందంగా అయిపోయింది. వసంత వంటయింటిలో ఉంది. ఆక్కడికి వెళ్ళేడు.
"ఇదిగో! అయిపోయింది. అయిదునిమిషాలలో పెట్టేస్తాను టిఫిన్" అంది.
"ఏం చేసేవ్?" అడిగేడు రావు.
"నాలుగురోజులై ఏమిటేమిటో తిన్నాం. ఇవేళ ఉప్మా చేసేను. ఓ రెండురోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది". అంది.
"సరే! నేను ఒక్కసారి అలా ఊర్లోకి వెళ్ళొస్తాను." అన్నాడు రావు.
"వస్తున్నప్పుడు కూరలేవైనా తీసుకురండి " అంది వసంత అలవాటుగా.
*******
రావు తండ్రిది పెద్దకుటుంబం. అయిదుగురు అన్నదమ్ములూ ఆరుగురు అక్కచెల్లెళ్ళు. అందరూ ఒకే చూరు కింద పెరిగినా, పెరిగిన వయసులతోనూ, కుటుంబాలతోనూ, శ్రీకాకుళం లో ఒక చెల్లి తప్పితే మిగిలిన వాళ్ళు దేశంలో అనేక చోట్ల స్థిరబడ్డారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎలా ఛిన్నమయి పోయేయో చెప్పడానికి రావు తండ్రి కుటుంబం ఒక ఉదాహరణ. రావ్ తండ్రి నాలుగోవాడు, రావ్ తరువాత ఒక తమ్ముడూ, ఒక చెల్లీ ఉన్నారు.
అందరు కలిసి శ్రీకాకుళం లోనే పెరిగి పెద్దయ్యారు. ముందుగా పెద్దన్నయ్యకి ఒరిస్సాలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. ఆతను భువనేశ్వర్ లోనే స్థిరబడ్డాడు. అక్కచెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి తన పెళ్ళి కాకముందే తన తండ్రి ఈ లోకాన్ని వదిలేడు. తనకి బేంకులో ఉద్యోగం వచ్చేక కలకత్తా వెళ్ళిపోయాడు. తన పెద్దబావగారు వసంత వాళ్ల సంబంధం తెచ్చారు. పెళ్ళి చూపులలో వసంత తెగ నచ్చింది రావ్ కి. అప్పటికే తన తమ్ముడికి ఉద్యోగం వచ్చి చెన్నైలో చేరేడు. పిల్లల పెళ్ళిళ్ళకి ఉన్న ఒక్క ఇల్లూ అమ్మవలసి రావడంతో కాలక్రమేణా శ్రీకాకుళం తో సంబంధం పలచబడుతూ వచ్చినా, రావ్ కి శ్రీకాకుళం అంటే వల్లమాలిన ఇష్ఠం. నార్త్ లో ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో పనిచేసినా, ఎప్పుడు వీలయితే అప్పుడు శ్రీకాకుళం వస్తూ ఉండేవాడు. ముగ్గురు నలుగురు స్నేహితులు ఇక్కడే స్థిరబడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే రావ్ చెల్లి కుటుంబం కూడా ఇక్కడే స్థిరబడ్డారు.
ఇప్పుడు రావు బయలుదేరింది ఆతని చెల్లి దగ్గరకే.
కొడుకులు వద్దన్నా వినకుండా, తన స్కూటర్ ని ఉంచుకున్నాడు. ఆస్ట్రేలియానుంచే తన స్నేహితుడూ కొలీగ్ కి ఫోన్ చేసి, తన స్కూటర్ ని శ్రీకాకుళం పంపించే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్కూటర్ మీద బయల్దేరాడు. కాలేజి ప్రాంతం అంతా దాదాపుగా నిర్మానుష్యంగా ఉండేది రావు చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా వైద్యసదుపాయా్లకి కేంద్రం లాగా అయిపోయి, చాలా రద్దీగా తయారయింది.
అలా ఇల్లీసుపురం లోంచి, ఊరిని గమనిస్తూ, బలగ వైపు పోనిచ్చేడు స్కూటర్ని. ఇల్లీసుపురం దాటాక అక్కడ ఫిషరీస్ ఆఫీస్ పక్కనుండి లోపలకి వెళితే ఒక కొత్త కాలనీ తయారయింది. అందులో ఒక ఇల్లు కట్టుకొని ఉంటూంది రావు చెల్లి కుటుంబం.
ఆప్యాయంగా పలకరించి లోపలకు తీసుకువెళ్ళారు అతనిని. ఓ గంటసేపు కబుర్లు చెప్పకుని బయల్దేరేడు వెనక్కి. అలా బయల్దేరి, రైతుబజారులో కూరలు కొని, రెండుమూడు సార్లు జరగబోయే ప్రమాదాలని తప్పించుకుంటూ డే అండ్ నైట్ జంక్షన్ లోంచి ఇల్లు చేరేడు. స్టేడియం దాదాపుగా మూలపడ్డది.
భోజనం చేసి అలా ఓ కునుకు తీసి, లేచేసరికి సాయంత్రం అయింది. వసంతని బయల్దేరదీసి, అలా కాలేజి లోకి వెళ్ళారు. 'ఇక్కడ మా ఇంగ్లీష క్లాస్ అయ్యేది. ఇక్కడ మా కామర్స్ క్లాస్ అయ్యేది' అంటూ కాలేజీ అంతా కలయ తిప్పేడు. వసంతకి భర్త తన కాలేజీ జ్ఞాపకాలలో అంతలా తేలిపోవడం సరదాగా అనిపించింది. కాలేజి చాలా మారిపోయింది. ఇప్పుడు అందరూ ఇంజనీరింగో లేదా మెడిసినో చదవడానికి శ్రద్ద చూపుతున్నారు కానీ, ఆర్ట్స్, కామర్స్, డిగ్రీ చదువులు చదవక, విద్యార్ధులు రాక, కొంచెం కొంచెంగా, ఒక్కో భాగం లో ఇంకేవో ఆఫీసులు వచ్చేస్తున్నాయి.
రావు మనసు అకస్మాత్తుగా ఉదాసీనంగా బరువుగా అయిపోయింది.
ఆనాటినుండీ రావు దినచర్య దాదాపుగా అలాగే అయింది. ఉదయాన్నే ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి , తన చెల్లెలి ఇంటికో, లేదా తన చిన్ననాటి స్నేహితులను కలసి రావడమో, భోజనం అయ్యేక కాసేపు నిద్రించి, సాయంత్రం భార్యతో అలా షికారు చేసి, కాసేపు టీవీ చూసి పడుకోవడం.
సుఖంగా రోజులు గడిచిపోతున్నాయి రావుకీ వసంతకీ.
అలా సుఖంగా గడిచిపోతే ఎలా... వాళ్ళ జీవితంలోకే కాదు , ప్రపంచంలో అందరి జీవితాల్లోకి ఓ అనవసరపు అతిధి వచ్చింది.
*********
మార్చి ఇరవైరెండో తేదీన జనతా కర్ఫ్యూ పాటించమని, సాయంత్రం దీపాలు వెలిగించమని ప్రధాని పిలుపుకి రావు, వసంతా కూడా ఉత్సాహంగా బయటికి వెళ్ళకుండా, రాత్రి దీపాలు వెలిగించి గడిపేరు. అంతలోనే లాక్ డౌన్ అన్నారు. మొత్తం దేశంతో పాటుగా శ్రీకాకుళం కూడా స్థంభించి పోయింది.
పిల్లలు రోజూ వీడియో లో వాళ్ళ పరిస్థితిని కనుక్కోవడం మొదలు పెట్టేరు. వాళ్ళ అమ్మకి ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చేరు "ఎటువంటి పరిస్థితిలోనూ నాన్నని బయటకు వెళ్ళనీయకు. మీకేమైనా కావలిస్తే ఫోన్ చేసి ఇంటికి తెప్పించుకోండి. వచ్చిన కూరలనీ, వస్తువులనీ శుభ్రంగా కడిగి వాడండి. బయటికి కిందకి వెళ్ళినా సరే, మాస్క్ పెట్టుకొని వెళ్ళండి." ఇలా.
నెల గడిచింది. రెండునెలలు గడిచేయి. రావ్ కి చెల్లిని చూసి రావాలనిపించి, ఫోన్ చేసేడు. "ఇప్పుడు రావడం అదంత అవసరమా అన్నయ్యా? మా అత్తగారు కూడా ఉన్నారు కదా. ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది కదా.." అంది.
ఆమె మాటల్లో రావ్ అప్పుడు రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టం అయింది. అతనికి చాలా నిరాశగా అనిపించింది.
మరునాడు తన స్నేహితుడికి ఫోన్ చేసి మాటాడుతూ కలుద్దామని ఆన్నాడు.
" నీకెమైనా మతి పోయిందా? ఎలా ఉందో పరిస్థితి చూస్తున్నావు కద. ఇలా ఉండటమే మనందరికీ క్షేమం." అని చీవాట్లు పెట్టేడు.
రావ్ కి కాలక్షేపం కన్నా, తన వాళ్ళని కలిసి మాట్లాడడమే ఇష్టం. అలా కలవడానికీ అవకపోవడంతో అతనికి, తమ ఇంటికి ఎవరై నా వస్తే బాగుండును అనుకునేవాడు.
"అబద్దాలు ఆడేవాడికి సత్యం అని పేరు పెట్టినట్టుంది మన ఇంటి పేరు. ఆతిధేయమ్ అంటే అతిధులు రా దగ్గ ప్రదేశం అని. ఎవరొస్తారు మన ఇంటికి" అన్నాడు దిగులుగా వసంతతో.
వసంత ఆతన్ని ఓదార్చే యత్నం చేసింది. రావ్ మూడ్ మారలేదు.
"పోనీ ఓ కుక్కని పెంచుకుందామన్నా, ఈ బిల్డింగ్ సొసైటీ నిబంధనలు ఒప్పుకోవట." ఇంకా అదే మూడ్ లో అన్నాడు రావ్.
*********
మర్నాడు ఉదయం మాస్క్ వేసుకుని వరండాలో కూర్చుని, పేపరు చదువుతున్న రావ్, కనుచూపుల చివర్నించి, ఒక చిన్న పిచ్చుక, వరండాలోకి వచ్చి అటూ ఇటూ తిరగడం చూసేడు. కాస్సేపు దానిని పరిశీలించేడు. అది అక్కడ కింద పడి ఉన్న గింజలను తింటూ, ఒక్కసారి, బయటకి ఎగిరి, మళ్ళి వచ్చి గింజలను తినసాగింది.
రావ్ కి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఈసారి ఆ పిట్ట బయటకు వెళ్ళినప్పుడు, లోపల్నించి మరి కొన్ని గింజలు తెచ్చి అక్కడ వేసేడు.
ఆ పిచ్చుక కాసేపు, ఆ కటకటాల మీద నిలబడి, లోపలికి రావొచ్చో లేదో అన్నట్టు చూసింది. "రా.. రాా.." అని మనసులోనే ఆహ్వానించేడు రావు.
అది లోపలికి వచ్చి గింజలు తీసుకొని మళ్ళీ ఎగిరి పోయింది. మళ్ళీ వస్తుందో రాదో అనుకుంటు రావ్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు.
ఈసారి ఆ పిచ్చుక మరో పిచ్చుకని తోడు తెచ్చింది. ఆ రెండు ఆ గింజలని ముక్కున కరచుకొని ఎగిరిపోయాయి.
వసంత లోపలనించి టిఫిన్ చేయడానికి పిలిచే వరకూ ఆ రెండు పిట్టలూ రాకపోక గమనిస్తూ కూర్చున్నాడు రావ్. టిఫిన్ చేసి వచ్చేక మళ్ళీ ఆ పిచ్చుకలు రాలేదు.
"రేపు వస్తాయో రావో?" అనుకున్నాడు. "వస్తే బాగుండును" అనుకున్నాడు ఆశగా.
ఆ రోజు రాత్రి పడుకునేముందు, కొన్ని బియ్యం గింజలు వరండా లో వేయడం గమనించింది వసంత. "ఎందుకూ అక్కడ బియ్యం జల్లేరు?" అడిగింది.
"ఓ ఇద్దరు అందమైన అతిధులకోసం" అన్నాడు రావు.
ఎవరో అన్నట్టు కళ్ళెగరేసింది వసంత ఆతని గొంతులో ఉత్సాహాన్ని గమనించి.
"రేపు నువ్వే చూస్తావుగా" అన్నాడు రావు పడుకుంటూ.
మరునాడు ఉదయం పూజాదికాలు ముగించుకొని, వరండాలో కూర్చున్నాడు రావ్ పేపర్ పట్టుకొని. కానీ ఆతని కళ్ళు పేపర్ మీద లేవు. ఆ పిచ్చుకలు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నాడు. వసంత రెండుసార్లు బయటికి వచ్చి చూసి మళ్ళీ లోపల తన పని చేసుకోసాగింది.
ఇంతలో ఆ పిచ్చుక వచ్చింది. కొంచెం గింజలు ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చినట్టు ఆ కటకటాల మీదే వాలి కొంచెం సేపు కిచకిచలాడింది. మెల్లగా కిందకి వాలి గింజలని తిని బయటకి ఎగిరింది. ఈసారి నిన్నటిలాగే మరో పిచ్చుకని తనతో తెచ్చింది.
వాటిని గమనించి, రావు, తన ఇంటి పేరు ధన్యమైందని. ఆనందంతో వసంతని పిలిచి తన అందమైన అతిధులను చూపించేడు, చిన్నపిల్లాడిలా సంతోషంతో.
********అయిపోయింది.**********
ఎందుకో తెలియదు కాని, శ్రీకాకుళం నేపధ్యంలో ఉన్న ఏ కధ అయినా నాకు నచ్చుతుంది. ఎందుకో ఏమిటి, నాదీ ఆ ఊరేగా..
ReplyDelete"ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు"
అన్నారు ఆరుద్ర. స్నేహారాహిత్యం లో చిరు ఊరట రెండు చిరు ప్రాణాల ద్వారా కలగటం అద్భుతమైన ఊహ. వాస్తవానికి దగ్గరగా ఉంది.కధ నడిపిన తీరు సహజంగా మన ప్రక్కింట్లో జరిగిన కధ లా ఉంది. ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతోంది ఈ కధ. రచయిత కు అభినందనలు.
-గురునాధ్
ధన్యవాదాలు.
Deleteనేను కూడా శ్రీకాకుళ వాసినే అయినా జీవితం అంతా గుడి వీధి, ఏడు రోడ్ల జంక్షన్ అలా అంతా ాఅత్ గడిచింది..మీరు రాసిన అరీలేవి తెలియక పోయినా అది శ్రీకాకుళం అన్న ఫీలింగ్ చాలు..ఎప్పుడూ తిరిగే అలవాటు లేకపోయినా కచ్యన్ బాల్కనీ లోకి వచ్చే కాకులు,పావురాల మాటడుకొడం ,వాటి అలవాట్లు ఆబ్జర్వే చెయ్యడం చాలా సంవత్సరాల అలవాటు..అంచేత మీరు రాసిన అతిథులతో బాగా sync. అయ్యాను..బాగుంది నేరేషన్..కంటిన్యూ చెయ్యండి.. శోని
ReplyDeleteAlan rao garu ankunata jarigite lifelong it will be good
ReplyDeleteChalabagundi.neti situa baga chupincheru.kadhanam baga nadichindi Srikakulam Raogaru family kallaku kattinattu vundi
ReplyDeleteRatnam
ధన్యవాదాలు
Deleteచాలా బాగుంది. చక్కటి శైలి. ఈ నాటి పరిస్థితి కి తగినట్లు రాశారు. మళ్ళీ శ్రీకాకుళం వెళ్లి నట్టుంది.
ReplyDeleteBagundi
ReplyDeleteచాలా బావుందండీ.
ReplyDeleteకథా మరియు కథనం బాగుంది
ReplyDelete