Sunday, 12 July 2020

సూర్యారావు కథ.

చిన్న బజారులో ఉంది ఆ బ్యాంక్ బ్రాంచి. నాలుగైదు మెట్లెక్కి బ్రాంచిలోకి వెళ్ళాలి. బ్రాంచిసిబ్బంది తమ సైకిళ్ళని ఆ  అరుగుమీద పెట్టేవారు. అవి దాటుకొని, సూర్యారావుని దాటుకొని బ్రాంచిలోకి వెళ్ళాలి తమ పనులు చేసుకోవడానికి.

పెద్దమీసాలతో, భారీకాయంతో , యూనిఫారంలో చూపరులకు భయపెట్టేలా చేతిలో తుపాకీతో  ఆ గేట్ దగ్గర నిలబడి బ్రాంచ్ లోకి  వచ్చే పోయేవాళ్ళని ,  తెలిసిన వాళ్లైతే సెల్యూట్ చేసి, తెలియని వాళ్లైతే "ఏం పని? " గద్దించి అడిగే సూర్యారావు ఆ బ్రాంచి సిబ్బంది అంతా తలలో నాలికలా  ఉంటాడంటారు. 

పదిహేను సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయి, ముప్ఫయైదేళ్ళకి బేంకులో సెక్యూరిటీ గార్ఢ్ గా ఉన్నఊరికి దగ్గరలో శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇస్తామంటే చేరేడు. పదేళ్ళయింది ఉద్యోగంలో చేరి.  మిలటరీ నుంచి వచ్చే ఫింఛను  కాక బాంక్ లో వచ్చే జీతంతో, పల్లెలో ప్రభుత్వం  ఇచ్చిన భూమి మీద ఆదాయంతో  తన కొడుకునీ, కూతుర్నీ మంచి చదువు చదివించు కుంటూ, తన వారి మధ్యలో ఒక స్టేటస్ తో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. 

80వ దశకంలో బేంకు ఉద్యోగం చాలా ఆకర్షణీయంగా ఉండేది. ముఖ్యంగా అవార్డ్ స్టాఫ్, అంటే క్లరికల్, ప్యూన్ సెక్యూరిటీ గార్ఢ్స్ పదవులలో అసలు వత్తిడి ఉండేది కాదు. పదిగంటలకు బ్రాంచికి వచ్చి సరిగ్గా అయిదుగంటలకల్లా  ఇంటికి వెళ్ళిపోయేవారు. అందులో సెక్యూరిటీ గార్ఢ్ కి ఇంకో సౌలభ్యం ఉండేది. మిలిటరీలో పనిచేసి రిటైరయినందువల్ల నెలకోసారి దగ్గరలో ఉన్న  మిలిటరీ కేంటీన్లో బియ్యం, పప్పుదినుసులు తప్ప మిగిలినవన్ని చవకగా దొరికేవి. ముఖ్యంగా మందు బాటిల్స్. 

డిపాజిట్స్ సేకరణ, లోన్స్  ఇవ్వడం అన్నీ బ్రాంచి మేనేజర్ దే బాధ్యతగా ఉండేది. బేంకుల్లో కొన్ని శాఖలలో ఎక్కువగా కేష్ జమ అవుతుంది. కొన్ని శాఖలలో కేష్ చాలా అవసరం ఉంటుంటుంది. శ్రీకాకుళంలో ఉన్న ఈ బ్రాంచిలో నగదు జమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆ బ్రాంచి మేనేజర్ కి తరుచూ ఈ కేష్ విశాఖపట్నంకో, విజయవాడలో ఉన్న తమ కరెన్సీ చెష్టుకో పంపడం ఓ పెద్దపనిగా ఉండేది. 

ఆ మేనేజర్ కి తరచూ పుచ్చుకునే అలవాటు ఉండేది, అదీ ఎవరైనా పిలిచి ఇస్తే. లేకపోతే  ఎవరిచేతనైనా పిలిపించుకొనేవాడు. అందుచేత ప్రతీనెలా  మొదటి తారీఖునొ లేదా కేంటీన్ లో సామానులు ఇచ్చే రోజున విశాఖపట్నంకు తప్పనిసరిగా నగదు పంపేవాడు. సూర్యారావు అలా బేంకు పనిమీద విశాఖపట్నంకు వెళ్ళి బేంకు పని చూసుకొని, కేంటీన్ కి వెళ్ళి తనకి కావాల్సిన సామాన్లు వాటితో పాటు మేనేజర్ కోసం ఒక సీసా తీసుకొని వచ్చేవాడు.  ఇదేకాక బేంకు స్టాఫ్ ఎప్పుడైనా పార్టీ చేసుకుంటే అందులో సూర్యారావుది ముఖ్యపానపాత్ర. అందుకే ఓ క్లార్క్ "అందరూ సూర్యారావుని తలలో నాలిక అంటారు.కానీ నేనంటాను. "సూర్యారావు మన తలలో పానపాలిక. త్రీ ఛీర్స్ ". మత్తులో ఉన్న మిగిలిన అందరూ చప్పట్లు కొట్టడడానికి ప్రయత్నం చేసి ఒక చేతిలో గ్లాసు ఉండటంవల్ల  వీలుపడక వచ్చిన వాళ్ళు ఈలలువేసి తమ ఆమోదాన్ని తెలియజేసేరు. 

సూర్యారావు కూతురుకి పెళ్లి కుదిరింది. మేనరికమే. బాంకులో లోను తీసుకుని తన దగ్గిర ఉన్న సేవింగ్స్ తో ఘనంగా చేసేడు. స్టాఫంతా మంచి బహుమతి ఇచ్చి తమ కృతజ్ఞతని తెలియజేసేరు. 

సూర్యారావు కొడుకు సంతోష్ తన తండ్రికి బేంకులో సిబ్బంది అంత గౌరవం  ఇవ్వడం చాలా నచ్చింది. అతడు చక్కగా చదువుకుంటూ ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు అందర్నీ చక్కగా పలకరించి కలిసిపోయాడు. 

********

అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. 

సూర్యారావు కొడుకు సంతోష్ ఓ మంచి  కంపనీలో ఉద్యోగి అయ్యేడు. ఆతనికి తన తండ్రి అంటే  అంతులేని గౌరవం. తమ తల్లి పోయినా తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా తమని పైకి తీసుకువచ్చేడని. తమ తండ్రి తాగుతాడని, ఆ అలవాటు ఆయనకీ ఆర్మీలో అయిందని తెలుసు. కాని తమ తండ్రి అలవాటు తమకెప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులలోకి నెట్టలేదు. అతనికి తన తండ్రి మరీ ఖరీదైన మద్యం తాగేవాడు కాదని తెలుసు. అనవసరమైన ఖర్చు చేయడం  తండ్రికి ఇష్టం ఉండేది కాదు. 

ఓసారి శ్రీకాకుళం సెలవు పెట్టి వచ్చేడు తండ్రి రమ్మని పదేపదే కోరడం వల్ల. సాయంత్రం తండ్రి మెల్లగా కొడుకు కి తను చూసిన పెళ్ళి సంబంధం గురించి చెప్పేడు. సూర్యారావు చెప్పిన ఆ  అమ్మాయి సంతోష్ కి తెలుసు. ఆతనికి ఏమీ అభ్యంతరం లేదని చెప్పేడు. సూర్యారావు ఆనందానికి అవధుల్లేవు. 

" సరేరా అబ్బాయ్! నేనలా బయటికి వెళ్ళొస్తాను."  ఆతనికి వెంటనే ఈ ఆనందాన్ని పండగ చేసుకోవాలనిపించింది. 

సూర్యారావు ఉద్దేశం కనిపెట్టాడు సంతోష్. "ఆగు నాన్నా! " అన్నాడు "నేనూ వస్తాను. మనిద్దరం వెళ్దాం."

" నువ్వూ...." అసందిగ్దంగా ఆగాడు సూర్యారావు.

"లేదు నాన్న!" చిరునవ్వుతూ అన్నాడు సంతోష్. " నీతో గడపాలని. నువ్వు తీసుకో. నేను కూచుంటాను."

'అమ్మయ్య' అనుకున్నాడు సూర్యారావు. 

శ్రీకాకుళం మిగిలిన ప్రపంచంతో బాటుగా  ఎదగడానికి ప్రయత్నిస్తూంది. దానికి గుర్తుగా శివారులలో ఒక కొత్త  రిసార్ట్ లు, బార్లకి కొత్త పేరు, వెలిసాయి. తండ్రిని మోటర్ సైకిల్ మీద ఆటువంటి బార్ కి తీసుకువెళ్ళేడు సంతోష్, శ్రీకాకుళం నుండి సింగుపురం దారిలో కొత్తగా వెలసిన ఆ బార్ కి. 

"ఇక్కడికెందుకురా బాబూ... ఇక్కడ అన్ని చాలా రేట్లెక్కువ. " అన్నాడు సూర్యారావు. 

"పర్లేదు నాన్నా... ఇవేళ ఒక్కరోజుకీ ఏమనకు. " అన్నాడు సంతోష్.

లోపలికి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. బేరర్ వచ్చి మెన్యూకార్డ్ ఇచ్చి వెళ్ళాడు. 

"ఎలా ఆర్డరు చెయ్యాలి?" అడిగేడు సంతోష్. 

తెలిసి అడుగుతున్నాడో నిజంగానే తెలియదో అనుకున్నాడు సూర్యారావు. "ఇలా యియ్యి. " అన్నాడు మెన్యూకార్డ్ వైపు చేయిచాస్తూ. 

" ఏది చెప్పాలో నేను చెప్తాను. ఎంత చెప్పాలో చెప్పు." అన్నాడు సంతోష్. 

ఎంతకావాలో చెప్పేడు సూర్యారావు. బేరర్ ని పిలిచి ఆర్డరిచ్చేడు సంతోష్. సంతోష్ ఆర్డరిచ్చిన బ్రాండ్ పేరు వింటూ తుళ్ళిపడ్డాడు సూర్యారావు. 

"ఒరే బాబూ  అది చాలా ఖరీదైనది రా. నేనెప్పుడు తాగలేదు కూడా అ"న్నాడు సూర్యారావు. 

"పరవాలేదులే నాన్నా!  ఇవేళే కదా. నీ కొడుకు నీకు పార్టీ ఇస్తున్నాడనుకో. " అన్నాడు సంతోష్. 

ఏమనలేక ఊర్కొన్నాడు సూర్యారావు.

తనకోసం తెప్పించిన కూల్ డ్రింక్ తాగుతూ తండ్రితో పిచ్చాపాటీ మాట్లాడసాగేడు సందోష్. 
ఒక రౌండ్ అయింది. ఇంతలో "ఒరేయ్ సూర్రావూ"  అనే పిలుపు వినబడింది గట్టిగా. అదిరిపడ్డట్టు అటువైపు చూసేరు.  రెండు వరసల ఆవల ఓ టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకాయన మళ్ళీ అంతే గట్టిగా "ఒరే సూర్రావూ" అని పిలుస్తూ చెయ్యూపేడు. 

సూర్యారావు చటుక్కున లేచి "రా రా బాబూ" అంటూ అటువైపు అడుగులు వేసేడు. సంతోష్ కి వాళ్ళెవరో తెలియరాలేదు. కాని తండ్రిని ఎంత చనువున్నా అంత గట్టిగా పిలవడం నచ్చలేదు. తండ్రి వెనకనే వెళ్ళాడు. 

అప్పటికే చాలాసేపయి తాగుతున్నట్టున్నారు టేబుల్ మీద ఖాళీ బాటిల్స్ రెండు మూడు దర్శనమీచ్చేయి. టేబుల్ సమీపీస్తుండగా, అందులో ఒక వ్యక్తిని చూసి, మిలటరీ పద్దతిలో సెల్యూట్ చేసేడు సూర్యారావు. ఆయన కూడా ప్రతిగా సెల్యూట్ చేసి " ఏం సూర్యారావు బాగున్నావా "అని అడీగేడు.  

"సార్..." అంటూ ఇంకా ఎటెన్షన్ లోనే ఉన్న సూర్యారావుని, ఇది "బారయ్యా  బార్కాస్ కాదు," అన్నాడాయన. "ఎవరీ కుర్రాడు?" అడిగేడు. 

ఇదంతా చూస్తున్న సంతోష్ కి కోపం రాసాగింది. తన తండ్రితో తన సమయాన్ని వీళ్ళు దోచేస్తున్నారన్న భావన. 

"నాా కొడుకు సార్.. హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు." అని పరిచయం చేసేడు." ఈ సారు మాకు పెద్దసారు. వీళ్ళిద్దరూ మా కంపనీలోనే, మేమందరం కలసి పనిచేసేం." 

"మీ నాన్న మా ప్రాణాలు కాపాడేడయ్యా..." అన్నాడొకాయన. 

ప్రశ్నార్ధకంగా చూసేడు సంతోష్. 

"ఇలా కూర్చోండి. అంటూ ఖాళీగా ఉన్నకుర్చీలు చూపించేరు. అది మేం బారాముల్లాలో తీవ్రవాదులకోసం కూంబింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అటువైపునుంచి కాల్పులు మొదలైనాయి. మీ నాన్న ముందుగా ఉన్నాడు. చటుక్కున వెనక్కి తిరిగి మమ్మల్ని ముగ్గురునీ నేలమీదకి తోసేసి మా మీద తను పడ్డాడు. అప్పడే తనకాళ్ళకి ఒక బుల్లెట్ తగిలింది. ఇంతలో మిగిలిన వాళ్ళ వచ్చి తిరుగు కాల్పులు జరపడంతో  ఆ తీవ్రవాదులు మళ్ళీ పాకిస్తాన్ లోకి పారిపోయారు. అలా మీ నాన్న రక్షించకపోతే మేం తిన్నగా వాళ్ళ కాల్పులు జరుపుతున్న వైపే వెళ్ళేవాళ్ళం. " 

సూర్యారావు కల్పించుకొని అన్నాడు. "అప్పుడు వీళ్ళు నన్ను మోసుకొని 3 కి.మి. నడచి హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు తెలుసా... ఆ శత్రవులు మా వాహనాలన్నీ ధ్వంసం చేసేసారు." 

సంతోష్ కి క్షణం క్రితం తన ఆలోచనలు గుర్తుకు వచ్చి సిగ్గేసింది. వీళ్ళ త్యాగాలు మనం ఎప్పుడూ అర్ధం చేసుకోలేము అనుకున్నాడు. చటుక్కున వంగి వాళ్ళపాదాలకి నమస్కారం చేసేడు. 

"నువ్వుంటే ఉండవయ్యా  లేకపోతే మీ నాన్నని మేం ఇంటి దగ్గర దింపుతాములే"  అన్నాడాయన. తండ్రివైపు ప్రశ్నార్ధకంగా చూసేడు సంతోష్. 

సరే అన్నట్లు తలాడించేడు సూర్యారావు. 

"మంచిదండి నేను వెళ్తాను. జాగ్రత్త నాన్నా!"  అంటూ బయల్దేరేడు సంతోష్. 

గేటు దాటుతూ వెనక్కి చూసేడు. 

ఎవరో ఏదో జోక్ చేసినట్టుంది. పగలబడి నవ్వుతున్నారు నలుగురూ. అప్రయత్నంగా తండ్రిలాగా ఆర్మీ స్టైల్ లో సెల్యూట్ చేసి ఆనందం నిండిన మనసుతో ఇంటివైపు మోటార్ సైకిల్ని పోనిచ్చాడు. 


************************అయిపోయింది.********************







4 comments:

  1. చాలా బాగుంది..శ్రీకాకుళం వాళ్ళకి శ్రీకాకుళం జ్ఞాపకం చేస్తూ మీరు పెట్టిన పేరు చాలా బాగుంది..ఇలాగే తర్చు రాస్తూ మమ్మల్ని ఆనంద పెడతారని అసిస్ట్టూ

    ReplyDelete
  2. చాలా బాగుంది శర్మ గారూ :-)
    వదలక చేయండి రచనా సేద్యం

    ReplyDelete
  3. చాలా బావుంది శర్మగారూ

    ReplyDelete