మన బడి
మునిసిపల్ హైస్కూలు. ఆ ఏడురోడ్ల జంక్షన్ లో ఒక ఐకానిక్ బిల్డింగ్ లా, ఠీవిగా నిలబడి అన్నిరోడ్లనూ తేరిచూస్తూ. రెండు గేట్లు ఉండేవి. జంక్షన్ వేపు ఒక గేట్. పోష్టాఫీసు వైపు ఒకటి. మైన్ గేట్ లోంచి లోపలికి వస్తే కుడిచేతి వేపు అరుగమీద సంస్కృతం క్లాసు. పక్కనే స్కూల్ గంట ఉండేవి. ఆ కుడి వరస గదులు పెంకుటింటి గదులు. ఎడమవైపు సిమెంట్ బిల్డింగ్. మొదట హెడ్ మాష్టారు గది. పక్కన టీచర్స్ గది. ఎల్ షేపులో ఉండే ఆ గదులకీ తిలక్ హాలుకీ ఇటువేపు ఉన్న తరగతి గదులకీ మధ్యన కొంత ఖాళీ స్థలం. గాంధీగారి విగ్రహం. ఆ విగ్రహం వెనక్కాల లేబొరేటరీ. మెట్లెక్కి వెళితే హయ్యర్ క్లాస్ రూములుండేవి. తిలక్ హాల్ కి అటువైపు సమాంతరంగా రెండు క్లాసు గదుల హాల్సు ఉండేవి. విశాలంగా ఉన్న దారీ , పడమట వైపు మళ్ళీ తరగతి గదుులు. ఆతరువాత కొత్తగా కట్టిన రెండు గదులు. రెండోగేట్ దాటేక రోడ్డు కి అవతల రెండు తరగతి గదులు. పోస్టాఫీసు కి వెళ్ళే దారి దాటేక గ్రౌండ్ ని చూస్తూ మూడు తరగతులు. గ్రౌండ్ కి ఆవలవైపు ఆర్ ఎండ్ బీ బిల్డింగ్ ముంద మరో మూడు తరగతులు. ఆ ప్రక్కనే పీ.టీ. గది పక్కనే మరో గది.
మన స్కూల్ గురించి తలుచుకుంటే ఈలా ఒక డ్రోన్ షాట్ లాగా కళ్ళముందు కనబడుతుంది. ఆ గ్రౌండ్ ఆ ఫుట్ బాల్ పోస్టులూ, అక్కడ కట్టిన ఒక ఓపెన్ స్టేజ్. ఆ స్టేజ్ కి ఇరువైపులా బ్యాంట్మింటన్ కోర్టులూ. ఖోఖో ఆడే స్థంబాలూ, గ్రౌండ్ కి ఆ చివర బాస్కెట్బాల్ కోర్టూ, పక్కనే కబడ్డీ ఆడే ఇసుకతో నింపిన కోర్టు.
ఎన్ని జ్ఞాపకాలూ, ఎన్ని మధుర స్మృతులూ.
అన్నీ కలబోసుకొని, ఓవైపు కాలేజీ మెట్లు ఎక్కుతున్నామన్న ఆనందం , మరోవైపు కాలేజీలో ఈ స్నేహం దొరుకుతుందో దొరకదో అన్న ఆందోళన , మిత్రులు ఏ ఏగ్రూపుల్లో చేరేరో అన్న ఆసక్తితో ఆ స్కూల్ కు వీడుకోలు చెప్పేం. అప్పట్లో వీడుకోలు వేడుకలు లేవు.
జీవనయాత్రలో ఎక్కడెక్కడో ప్రయాణం చేసేం. చాలామంది జీవితాలు సంతృప్తికరంగానే ఉన్నాయంటే కారణం , మన గురువులు ఇచ్చిన ఆశీస్సులూ, దీవెనలూ.
మళ్ళీ మనం మార్చి మొదటి తారీఖున కలవబోతున్నాం. మన జ్ఞాపకాలను పంచుకొని మధుర స్మృతులు గా మార్చుకొనే అవకాశం మళ్ళీ పొందబోతున్నాం అనే ఆలోచనే చాలా ఉత్సుకతని కలగా జేస్తోంది. తప్పకుండా కలుస్తారు కదూ .
జతీంద్ర
చాలా బాగుంది. నేనుంచి మరెన్నో ఆశిస్తున్నా..
ReplyDelete