Thursday, 6 February 2020

parichayam

ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది . శ్రీకాకుళం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డనాటినించి ఒక సమభావ భాగస్వామ్య వేదిక తయారు చేసికోవాలని నాలాగే వున్నా ఇతర భావుకులందరి ఆలోచనలు పంచుకోవాలని ఊహలు బలంగా మారే సమయంలోనే ఇన్నాళ్ళకి సిక్కోలువాసి అని బ్లాగ్ తయారు చేసేఅవకాశం కలిగింది.

ఆ నాగావళి యేరు ఆ తీరం, కోటేశ్వరుని కోవెల, వడ్డాది పాపయ్య గారి చిలుకు ద్వాదశి నాటి చిత్రం లో లాగా ఆ కోవెల తీరం.  గుడివీధి , ఏడురోడ్ల జంక్షన్, రామకృష్ణ టాకీసు, చిన్న బజారు, క్రిష్ణా పార్కు, కాలేజ్ రోడ్, పాత బస్టాండు అరసవిల్లి,  ఇలా ప్రతీ జాగా గుర్తుస్తోంది .

ఏడురోడ్ల జంక్షన్, నా మిత్రుడు అన్నట్టు, దేశం లో ఇంకెక్కడా చూడని ప్రత్యేక కూడలి చిక్కోలుకే ప్రత్యేకం. ఒక పక్క మునిసిపల్ హై స్కూల్ ఠీవిగా అన్ని రోడ్లను పరికించి చూస్తున్నట్లు, పాత బస్టాండ్ నుండి వచ్చే బస్సులను, గుజరాతీపేట నుండి వచ్చే కూరగాయల్ని అమ్ముకునే వాళ్ళను, మూడు చక్రాల రిక్షాలను, పడమట వైపు ఆటస్థలాన్ని , వెనకవైపు హెడ్డుపోస్టాఫీస్ నీ, తూర్పువైపు పాలకొండ రోడ్డుని అటు మురళీ టాకీసు వెళ్లే దారిని కొల్లవారి వీధి నుండి, గుడివీధి వెళ్లే దారిని అన్నీ  పరికించి చూస్తూ, నిక్కర్లలో, పరికిణి జాకెట్లలో బడి కి వచ్చే పిల్లలని ముచ్చటగా చూస్తూ, ఆ హై స్కూల్.

నాగావళి లోకి నీరువచ్చినప్పుడు ఆ వారధి మీంచి చూస్తూ పరవశించిన రోజులు, ఏటవతల ఉన్న వేంకటేశుని గుడికి శనివారం వెళ్లడం. ఆదివారం అరసవిల్లి, సోమవారం ఈశ్వరుడి గుడి, యేరు ఎండిపోయినప్పుడు ఆవలి వడ్డులో ఇసుకలో కబాడీ ఆడటం
.
ఆ వారధి ఎన్ని జ్ఞాపకాల ను పోగు చేసిందో . కాలం తీరిన వృద్ధులని పనికిరాని వారని తీసేసినట్లు ఆ వారధిని పడగొట్టేసేరు. పురాతన కట్టడాలని జాగ్రత్తగా చూసుకోలేని ఈ తరం వాళ్ళం మనం.

అద్దం మీద ధూళి పేరుకున్నట్లు జ్ఞాపకాల పొరలు ఒక్కసారి తుడిచి చూస్తే, అంతరంగంలో ఆ చిన్నతనం మళ్ళీ స్పష్టం గా కనపడుతోంది .

మిత్రులు ఎవరైనా నాతో  పంచుకుంటారా  మీ స్మృతుల్ని.


జతీంద్ర
06/02/2020











5 comments:

  1. స్మృతులెన్ని వున్నా వ్యక్తీకరించ గల నైపుణ్యం భావవ్యక్తీకరణ లేని వాళ్ళం!!! నాకు మాత్రం ఒకటే గుర్తు!! బ్యాంకులో జాయిన్ అయిన తర్వాతనే మన తొలిపరిచయం!! సియేఐఐబి కి కలసి కంబైన్డ్ స్టడీ చేయడం, యెచ్చర్ల తోటలో వనభోజనాలతో కార్తీక మాసపు ఆహ్లాదాన్ని విజయాబ్యాంకు స్నేహితులతో పంచుకోవడం బాగా గుర్తున్నాయ్ !

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. సియేఐఐబి కి కలసి మా మేడ మీద చదివిన రోజులు మీరు గుర్తు చేశారు.

      Delete
  2. Mee sikkolutho parichayam lekapoina , kallamundu pratibimbincharu sikkoluni mukhyanga nagavali bridge nee , edu roads junction nee!!

    ReplyDelete
  3. శ్రావణమాసపు ఇంటి పండగని మీరు బ్యాంకులో సిబ్బంది యావన్మందికీ వదినగారి పిండివంటలతో సందడి చేసి మా అందరికీ శ్రావణలక్ష్మీ వ్రతపండగ వాతావరణాన్ని పంచడం మరచిపోలేము!

    ReplyDelete
  4. ఓహ్ ! ఆజ్ఞాపకాలు వ్రాసేసానా? ఏది ఏమైనా ఆరొజు ఐదు గిన్నెల లంచ్ కేరేజ్ లో తెచ్చి వడ్డించిన బూరెలు, పులిహోరలు లొట్టలేసుకుంటూ తిన్న రుచులు ఇప్పటికీ మరచిపోలేదు.ఇది జరిగినది 1984 & 1985 శ్రావణ లక్ష్మీ పూజ సందర్భముగా అని గుర్తు!

    ReplyDelete