Thursday, 29 April 2021

తానెరగని తనవారు.

                   ----------మోదుకూరి జతీంద్ర శర్మ

"పదిలక్షలా? " ఆశ్చర్యంగా అడిగాడు రావ్.
"అవును సార్.. మీరు గట్టిగా పట్టుపడితే ఇంకో రెండుమూడు లక్షలు ఎక్కువే రావొచ్చు." అన్నాడు అప్పల్నాయుడి కొడుకు.
రెండెకరాలకి పదిలక్షలా? తనలో తను అనుకున్నాడు రావ్. శ్రీకాకుళం లాంటి ఊర్లోకూడా ఇంత ధరలు పలుకుతున్నాయా భూములు?

"నాకు టెక్కలి దగ్గర శాసనం అని పల్లెలో చిన్నపనిబడింది సార్. నేను సాయంత్రానికి గానీ, రేపు ఉదయాన్నే గానీ వొళిపొచ్చీస్తాను. అప్పుడు మనిద్దరం సూరన్నాయుడితో మాట్లాడి సెటిల్మెంటు అవుదాం." అన్నాడు అప్పల్నాయుడి కొడుకు మళ్ళీ. అన్యమనస్కంగా తలూపేడు రావ్.

అప్పల్నాయుడి కొడుకు వెళ్ళిపోయాడు.

ఆ లాడ్జిలో మూడో అంతస్తులోని గదిలో కూర్చున్న రావ్ కి ఇంకా నమ్మబుద్దికావడంలేదు. శ్రీకాకుళం వదిలి ముప్ఫైఐదు ఏళ్ళయింది. పంతొమ్మిదివందల ఎనభై అయిదులో కొన్నాడు ఆ భూమిని. కొన్నానా...అప్పల్నాయుడు బలవంతంగా నాపేరు మీద రాసేడు అనుకున్నాడు. ఆయనకి ఆ భూమి తనకెలా వచ్చిందో సంఘటనలు గుర్తొచ్చేయి.

అతను శ్రీకాకుళం లో ఓ జాతీయ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు పెద్దపాడు గ్రామంలో ఉంటున్న అప్పల్నాయుడు బ్యాంకు లో బంగారు నగలు తనఖా పెట్టి అప్పు తీసుకుంటూండేవాడు. ప్రతీ పంట సమయానికి లోన్ తీసుకొని , పంట చేతికొచ్చేక ఠంచనుగా తీర్చేసేవాడు. అలా ఏడాదిలో మూడునాలుగు సార్లు బ్రాంచికి వస్తూండడంతో అందరికీ సుపరిచితమైన కస్టమర్ అయేడు. పైగా వచ్చినప్పుడు వేరుశనగకాయలో ఇంట్లో పండేవేవో తెచ్చి అక్కడ పనిచేసే సిబ్బందికి ఇస్తుండేవాడు. అలా పరిచయమైనాడు అప్పల్నాయుడు రావుకి.

ఓరోజు తొమ్మిది గంటలకి బ్రాంచి లో కూచొని పనిచేసుకుంటున్న రావ్ , ఎవరో వచ్చినట్టనిపించి తలెత్తి చూసేడు. అప్పల్నాయుడు.
"నమస్కారం సారు" చేతులెత్తి నమస్కారం చేస్తూ.
"ఏం నాయుడుగారూ! ఇలా ఇంతపొద్దున్నే వచ్చేరు. ఇది పంట సీజన్ కూడా కాదే" అన్నాను గోల్డ్ లోనుకోసం వచ్చి ఉంటాడనుకొంటూ.
"లేదు బాబూ... నగలు మీకాడే ఉన్నాయి గా... మా ఆడదానికి నెలలు నిండేయి. ఆస్పత్రిలో చేరిస్తే పెద్దాపరేసను సేయాలా. ఇరవైవేలేనా అవుద్ది అంతన్నారు. ఏటీ పాలుబోడం లేదు సారూ" అన్నాడు. అతని మాటలు నీరసంగా వచ్చేయి. ఆతని నిస్పృహ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తలవంచుకొని ఎదురుగా ఉన్న బెంచిమీద కూలబడ్డాడు.
ఆలోచనలో పడ్డాడు. రావుని అడగాలని ఆతడు అనుకుంటున్నట్టు లేదు. కానీ ఏదో ఓదార్పు కోసం మాత్రం వచ్చినట్లు ఉంది. రావుకు ముందురోజే పెర్శనల్ లోన్ వచ్చిఉంది. ఆతని అవసరానికి మించి ఓ ముప్ఫైవేలు ఎక్కువే ఉంది.
ఎక్కువగా ఆలోచించకుండా గబుక్కున అన్నాడు రావు. " నాయుడు గారు! నేనిస్తాను. తీసుకువెళ్ళండి. మీకు వీలైనప్పుడు ఇచ్చేయండి"

చటుక్కున తల ఎత్తి చూసేడు అప్పల్నాయుడు. ఆతని కళ్ళలో ఓ ఆశారేఖ తళుక్కున మెరిసి, అంతలోనే సంశయంగా ఆగిపోయింది.
"వద్దులే సారూ! ఎక్కడో దొరక్కపోదు" అన్నాడు.
"ఫరవాలేదు నాయుడు గారు. నా దగ్గర ఇప్పుడు రడీగా ఉంది. తీసుకువెళ్ళండి. మీ ఆవిడ క్షేమంగా ఇంటికొస్తారు. మీమీద నాకెంత నమ్మకం లేకపోతే ఇస్తానంటాను." అన్నాడు రావు.
తరువాత చాలా మాట్లాడేక అయిష్టంగానే, తనది తప్పనిసరి పరిస్థితి కనక ఒప్పుకున్నాడు నాయుడు.

కేషియర్ వచ్చేక డబ్బులు తీసుకుని నాయుడికి ఇచ్చేడు రావు. దండం పెట్టి వెళ్ళిపోయాడు అప్పల్నాయుడు.

మిగిలిన స్టాఫ్ కి ఈ సంగతి మెల్లగా తెలిసింది. ఆ బ్రాంచి మేనేజర్ రావుని తన కేబిన్లోకి పిలిచి చీవాట్లు పెట్టాడు. " బ్యాంకు కి సవాలక్ష మంది అనేక సమస్యలతో వస్తారు. మన దగ్గర డబ్బులున్నాయని అందరకీ ఇవ్వగలమా. అదృష్టవసాత్తూ అప్పల్నాయుడు మనదగ్గర గోల్డులోను కష్టమర్ మాత్రమే..అదే మన సర్వీస్ ఏరియా కష్టమర్ అయితే ఎవరైనా ఏదైనా అనుకోగలరు కద... ఏమైనా ప్రామిసరీ నోట్ తీసుకున్నావా? " అడిగేడాయన.
"లేద్సార్! నాకు తట్టలేదు కూడా!"
"ఏమ్మనిషివయ్యా! నా కైతే మళ్లీ నువ్వా డబ్బులు చూస్తావనిపించటం లేదు. జాగ్రత్తగా ఉండాలి" అని పంపేసేడు రావుని.
సీట్లోకొచ్చి కూర్చున్న రావుకి మొదటిసారి తను తెలివితక్కువ గా ప్రవర్తించే నేమో అన్న అనుమానం కలిగింది. అన్యమనస్కంగానే అవేళ గడిచింది.

మర్నాడు అప్పల్నాయుడు ఆస్పత్రి జంక్షన్ లో రావుని చూసి పరుగెత్తుకుంటూ వచ్చి "కొడుకు పుట్టేడు సారు... మా ఇంటిది కూడా బానే ఉందంట. వారం రోజులుండాలంట ఆస్పత్రిలో" అన్నాడు ఆనందంగా.
"మంచిది అప్పల్నాయుడు. జాగ్రత్తగా చూసుకో. బ్యాంకు కి టైమవుతోంది " అంటూ వెళ్ళిపోయాడు రావు. ఓ నిండుప్రాణాన్ని నిలబెట్టేను అనుకున్నాక ఆనందంగా అనిపించింది. అంతలోనే తన సొమ్మును అప్పల్నాయుడు తిరిగి ఇస్తాడా... ఇవ్వకపోతే ఏంచెయ్యాలో... ఛ. ఎందుకివ్వడు.. నాదంతా ఉత్తి అనుమానం. ఇలా పరిపరివిధాల ఆలోచిస్తూ బ్రాంచికి చేరేడు రావు.

రెండు రోజుల తరువాత రావుకి శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలొచ్చాయి. ఆతను చాలారోజులనుంచి కోరుకుంటున్నట్లు ఢిల్లీకి బదిలీ వచ్చింది. అందరూ అభినందించేక మేనేజరు అన్నాడు " ఆ అప్పల్నాయుడి కి కబురు పెట్టు. రెండరోజుల్లో తిరిగి ఇచ్చెయ్యమను నీ సొమ్మును."

"అలాగే సార్"అన్నాడు రావు. ప్రత్యేకంగా కబురు పెట్టవలసిన అవసరంలేకుండా అప్పల్నాయుడే వచ్చేడు బ్రాంచికి. ఎటెండర్ అప్పల్నాయుడి కి రావుకు బదిలీ అయిన విషయం చెప్పేడు.

"ఏం సారూ..ఎప్పటిదాక ఉంటారు? అడిగేడు రావుని అప్పల్నాయుడు.

"ఈ వారాంతానికి నన్ను ఇక్కడ రిలీవ్ చేస్తారు" అన్నాడు రావు.
నా డబ్బులు ఇచ్చేయగలవా అడుగుదామని నోటివరకూ వచ్చినా ఇంతలో ఇంకో కష్టమర్ తో మాటల్లో మునిగిపోయాడు రావు. తలవంచుకొని ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అప్పల్నాయుడు.

రావు ఆ వారాంతపు శనివారం సాయంత్రం శ్రీకాకుళం బ్రాంచిలో రిలీవ్ అయ్యేడు. ఆతని వీడ్కోలు సభలో అందరూ అతను తెలివితక్కువ గా ఇరవైవేలరూపాయలు నష్టపోయిన విషయం అతనికి గుర్తు చేసేరు. కనీసం ఓ రసీదైనా తీసుకుని ఉంటే తను తప్పక వసూలు చేసిఉండేవాడినని, చేబదులు ఇస్తే వసూలు అసాధ్యం అనీ మేనేజర్ అభిప్రాయపడ్డాడు.

వెళ్ళిపోతున్నారని తెలిసీ డబ్బులు ఎక్కడ అడిగేస్తాడో అని వారం రోజులుగా అప్పల్నాయుడు బ్రాంచికి రాలేదని... తప్పకుండా ఎగ్గొట్టేందుకే అనీ కొంతమంది గుమాస్తాలు అభిప్రాయపడ్డారు. ఆతడు నగలు విడిపించేందుకు వచ్చినప్పుడు సారు బాకీ తీర్చేదాకా ఇవ్వొద్దని ఓ తోటి ఆఫీసరు సలహా ఇచ్చేడు, అది సాధ్యంకాదని తెలిసినా....

ఆ రాత్రి బలగలో ఉన్న రావు ఇంటికి అప్పల్నాయుడు వచ్చేడు. అలసటగా ఉంది అతని వాలకం.

ఉన్నకొద్దిపాటి సామాన్లూ సద్దుకుంటున్నాడు రావు..
"ఏమిటి ఇలా వచ్చేరు నాయుడుగారూ?"అడిగాడు అప్పల్నాయుడ్ని.

"సారూ! టయానికి మీరు దేవుడిలా ఆదుకోబట్టి మా ఇంటావిడ బతికి బట్టకడుతోంది సారు. మీ రుణం ఎలా తెగ్గొట్టేది. మిమ్మల్ని బేంకులో అందరూ నాకు సొమ్ములిచ్చినందుకు సీవాట్లేసినారంట కదా...మీరెళిపోతన్నారని తెలిసిన కాడినుంచీ డబ్బులకోసం నానా పాట్లూ పడతన్నా సారు. ఎక్కడా కుదర్లేదు." అన్నాడు చిన్నగా.

గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది రావుకి. పోయినట్లే అనుకున్నాడు మనసులో.

మళ్ళీ అప్పల్నాయుడే అన్నాడు " సారూ! మీ కన్నేయం సెయ్యను. మీరు సోంవారం ఉంటారా"

"సోంవారం రాత్రి కి రైల్లో టిక్కెట్ దొరికింది" అన్నాడు రావు.

" సరే సారు! సోంవారం పొద్దున్న రీజిష్ట్రారాఫీసుకి ఎళ్దాం సారు. నాకు సింగుపురం ఎళ్ళేదారిలో ఓరెండు ఎకరాల చెక్క ఉంది. అది మీ పేర్న రాసేస్తా... మీ డబ్బులు మీకు ఇచ్చే నాడు నాకు తిరిగి ఇచ్చేద్దురు గాని" అన్నాడు అప్పల్నాయుడు.

రావు ఒప్పుకోలేదు. తను సహాయం చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి చేయలేదని నాయుడిమీద తనకి నమ్మకం ఉందని, ఇలా భూమి రాస్తాననడంతో అది బలపడింది అనీ చెప్పేడు. అప్పల్నాయుడు వదల్లేదు. చివరికి సరే అనక తప్పలేదు రావుకి. ఆనందంగా వెళ్ళిపోయేడు అప్పల్నాయుడు.

అలా వచ్చింది రావు చేతికి ఈ భూమి . ఢిల్లీ వెళ్ళేక సివిల్స్ రాసి కేంద్రప్రభుత్వం లో రెవెన్యూ శాఖలో చేరి జాయంట్ సెక్రటరీ హోదాలో అయిదేళ్ల క్రితం రిటైరైనాడు రావు. రావు కొడుకు కూడా సివిల్స్ పాసయి, ఆర్ధిక శాఖలో అండర్ సెక్రటరీగా ఉన్నాడిప్పుడు.

రావు సర్వీసు లో ఉండగా భార్య కనుమూసింది. ఆ ఆడదిక్కు లేని ఇంటికి వాణి రావు కోడలు గా వచ్చి ఆ ఇంటిని ఓ గాడిన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్న నగరం లో పుట్టిపెరిగిన ఆమె త్వరగానే ఢిల్లీలో వీరి జీవనానికి అలవాటు పడటమే కాదు. రోజులో అత్యధిక శాతం ఆఫీసులో గడిపే భర్త ఉద్యోగాన్ని అర్ధం చేసుకొని , రావుకి కోడలూ కూతురు మరో కొడుకూ అయింది.

రావు రిటైరయిన ఇన్నాళ్ళకి కాగితాలు సర్దుతూంటే ఈ భూమి కాగితాలు బయటపడ్డాయి. దాదాపుగా ఆ విషయం మర్చిపోయాడు రావు. అప్పల్నాయుడు భూమి అమ్మకం కాగితాలు పంపుతు ఆతని తరఫున భూమి బాగోగులను చూస్తానని హామీ ఇచ్చేడు. యాజమాన్యం మారినా ఆ భూమి సాగోగులు అప్పల్నాయుడే చూస్తూ వచ్చేడు. రావుకూడా తన ఉద్యోగపు పనులలో తీరికలేక మళ్ళీ దానిగురించి ఆలోచించలేదు.

ఎందుకో అప్పల్నాయుడు పేరుమీద ఉత్తరం రాయాలనిపించి ఆ సేల్ డీడ్ లో ఉన్న చిరునామా కి ఉత్తరం రాసేడు క్షేమసమాచారాలు మాత్రమే అడుగుతూ. జవాబు వస్తుందని ఊహించలేదు కానీ అప్పల్నాయుడి కొడుకు జవాబిచ్చాడు. తన తండ్రి కాలం చేసేడనీ... తరచూ తన తండ్రికి రావు చేసిన సహాయం చెప్పేవాడనీ... ఆ భూమి రావు పేరుమీదే అలాగే ఉందనీ రాస్తూ.....పెద్దపాడు లోనూ శ్రీకాకుళం లోనూ జరుగుబాటుకాక తమ అత్తవారి ఊరైన విశాఖపట్నం వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని.. రావు భూమిని ఏం చెయ్యడమా అనే మీమాంసలో ఉండగా రావు ఉత్తరం అందిందనీ అంచేత త్వరలో వచ్చి.ఆ భూమి సంగతి తేల్చుకోమని రాసేడు.

కొడుకూ కోడలుతో చర్చించిన పిమ్మట ఆ భూమిని ఎంత వస్తే అంతకు అమ్మేసి వచ్చేస్తేనే మంచిది అని నిర్ణయించుకొని శ్రీకాకుళం వచ్చేడు రావు.

తనకి తెలిసిన శ్రీకాకుళం పెద్దగా మారలేదు. జనాభా పెరుగుదల వచ్చిన అవసరాలకు ఊరు పెరిగింది. కొత్తగా రెండు లాడ్జ్ లు వచ్చేయి. అందులో ఒక లాడ్జిలో రూమ్ బుక్ చేసేడు అప్పల్నాయుడి కొడుకు. ఆతనే సూరన్నాయుడితో భూమిని కొనడానికి బేరం తెచ్చేడు. మాటల్లో చెప్పేడతను ఆ భూమినానుకొని సూరన్నాయుడు వాళ్ళూ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని పనులు మొదలుపెట్టారు అనీ. ఆ భూమి ఎక్కడ ఉందో అంచనాగా చెప్పాడు.

పది పన్నెండు లక్షలా? మళ్ళీ అనుకున్నాడు రావు.

అప్పల్నాయుడి కొడుకు వెళ్ళేక కిందకి వచ్చి ఓ ఆటో ని పూర్తిగా తనతో ఉండేటట్టు మాట్లాడుకొని పెద్దపాడు దాటేక ఉన్న తన భూమి వైపుకు బయల్దేరేడు.

పెద్దపాడు దాటి ఓ రెండుకిలోమీటర్లు దాటేసరికి కుడిచేతివైపు ఏవో పనులు జరుగుతున్న స్థలం కనబడింది. అటువైపు వెళ్ళటానికి ఓ చిన్న దారి ఉంది. లారీలూ ఇతర వాహనాలు వెళ్తున్న గుర్తులు కనబడ్డాయి. ఆ దారిలోకి ఆటోపోనిచ్చాడు రావు. కొన్ని సరుగుడు చెట్లూ యూకలిప్టస్ చెట్లూ ఉన్న పొలాలు దాటి వెళ్ళేసరికి రెండు గడ్డితో నేసిన పెద్ద ఇళ్ళు లాగా కనబడ్డాయి. అవి ఎల్ అక్షరంలాగా ఉన్నాయి. రెండు పొడుగాటి ఇళ్ళు. ఓ స్కూల్ లాగా ఉంది. మధ్యలో ఓ రావిచెట్టు, ఆ చెట్టు మొదట్లో సిమెంటు తో కట్టిన ఓ చెప్టా ఉన్నాయి. ఆ ఇళ్ళముందు పద్దతిలో పెంచిన పూలమొక్కలున్నాయి. వెనక కూరగాయల మొక్కలు పెంచుతున్నట్టన్నారు. కొంత మంది వృద్దులు ఆ రావిచెట్టు మొదలలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ గదుల్లో కొంతమంది పిల్లలున్నట్టు కనబడుతున్నారు.
ఆశ్చర్యపోతూ ఆటో దిగేడు రావు. ఓ ఖాళీ స్థలం ఊహిస్తూ వచ్చిన అతనికి ఈలా కనబడటంతో తను సరైన స్థలానికి వచ్చేనా అన్న అనుమానం కలిగింది.

ఆతను ఆ చెట్టువైపు వెళ్ళబోతుంటే ఓ పెద్దాయన ఆ ఇళ్ళలో ఒక చివరన ఉన్న గదిలోంచి బయటకు వచ్చేడు. ఆయనని చూస్తే ఒక రిటైరైన ఉపాధ్యాయుడేమో అన్న భావన కలిగింది రావుకి.
ఆయన కూడా రావుని చూస్తూ "ఎవరు బాబూ? " అంటు రావుని పిలిచేరు.

తనని పరిచయం చేసుకొని రావు అడిగాడు" అప్పల్నాయుడి భూమి...."

"ఇలా లోపలికి రండి. " అని ఓ ఆఫీసు గదిలోకి తీసుకువెళ్ళారాయన.

రావుని కుర్చీ లో కూచోబెట్టి, మూలనున్న స్టూల్ మీద కూజాలోంచి చల్లని నీళ్ళు ఓ గ్లాసు తో ఇచ్చేరు. చల్లని నీరు గొంతులో దిగుతుంటే హాయిగా అనిపించింది రావుకి.
"నా పేరు సూర్యనారాయణ. నేను జిల్లాపరిషత్ స్కూళ్ళలో పనిచేసి చివరిగా ఇక్కడ సింగుపురం హైస్కూల్ హెడ్మాష్టరుగా రిటైరయ్యాను. అయిదేళ్ళక్రితం అప్పల్నాయుడి ని కలసి ఈ భూమిని అద్దెకు ఇమ్మని అడిగేను ఓ వయోవృద్ధుల శరణాలయం ప్రారంభిద్దామని. అప్పల్నాయుడు అప్పుడు ఈ స్థలం తనది కాదని మీదని మీ కధంతా చెప్పేడు. మీ చిరునామా తన దగ్గరలేదని మిమ్మల్ని అడగకుండా తాను ఈ భూమినివ్వలేనని చెప్పాడు. అయితే మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ స్థలం స్వాధీనం చేస్తామని చాలా వప్పించిన మీదట, అతి కష్టం మీద వప్పుకున్నాడు. నాకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బును పెట్టి ఈ రెండు గదులతో శరణాలయం మొదలుపెట్టాను. చుట్టుపక్కల పల్లెల్లో ఎంతో మంది యువకులు యువతులు జీవనోపాధికోసమో , పెళ్ళిళ్ళయో పట్నాలకి వెళ్ళపోతుండడంతో ఎంతో మంది వయస్సు మళ్ళినవాళ్ళు.చూసేవారులేక తినడానికి తిండిలేక ఉండటానికి కష్టమై రాలిపోతుంటే ఈ ఆశ్రమం వాళ్ళకి ఓ నీడనివ్వాలని అనుకున్నా. పెద్దనగరాలలో ఆశ్రమాలు ఖరీదైపోతున్నాయి. పైగా వీళ్ళకి ఊరు వదిలి వెళ్ళడానికి మనస్కరించదు. రాలిపోతే ఇక్కడే రాలి పోవాలని వారి కోరిక.
ఆశ్రమంలో ఉన్నా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వెనక కూరగాయలు పండిస్తారు. ఈ పువ్వుల మొక్కలని సాకుతున్నారు. ఓ ఇద్దరు నా స్టూడెంట్సే నా ఉద్దేశ్యం నచ్చి రోజూ ఓ గంటో రెండు గంటలో, పక్క ఊర్నించి వచ్చే పేద పిల్లలకి.చదువు చెప్తున్నారు. శ్రీకాకుళం లో కొంతమంది వదాన్యులు నెలనెలా ధనసహాయం చేస్తున్నారు. నా దగ్గర చదువుకున్న చాలామంది శిష్యులు ఇప్పుడు మంచి మంచి పదవులలో ఉద్యోగాలలో ఉండటం వారిని కూడా అర్ధించి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాను.ఇదీ జరిగింది" ఆగేరాయన.

"ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఏం పనిమీద వచ్చేరు?. ఎన్నాళ్ళుంటారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?" చకచక అడిగేడాయన.

రావు తన వ్యక్తిగత విషయాలు సూచనగా చెప్పి, శ్రీకాకుళం లో ఎక్కడ ఉంటున్నానో చెప్పేడు. ఎన్నాళ్ళుంటాడో తెలియదని చెప్పేడు కానీ ఈ జాగా అమ్మాలని వచ్చిన విషయం ఎందుకనో చెప్పాలనిపించలేదు రావుకి.

ఆయనతో కాసేపు మాట్లాడేక ఆ పాకలతో ఉన్న ప్రదేశం, ముందు పూలమొక్కలూ , వెనక కూరగాయల మొక్కలు కలయతిరిగి చూసేడు. ఆ రావిచెట్టు దగ్గర కూచున్న వయసుమళ్ళిన వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడాడు. వాళ్ళమాటల్లో మేష్టారు మీద వాళ్ళకున్న గౌరవం ప్రస్ఫుటంగా రావుకి తెలిసింది.

మాష్టారి దగ్గర సెలవు తీసుకొని మరునాడు తాను బస చేసిన హోటల్ కి రమ్మని చెప్పి , ఆటో ఎక్కి వెనక్కి లాడ్జ్ కి వచ్చేడు. ఆటోని పంపేసి హోటల్లో భోంచేసి రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు.

ఆయన మనసులో ఆ ఆశ్రమం తిరుగాడుతోంది. నేలమీద కూర్చొని పలకలమీద రాస్తూ చదువు కుంటున్న పిల్లలు గుర్తొచ్చారు. ఆ రావిచెట్టు మొదలు లో కూర్చుని , ఓ ఆసరా ఉన్న భరోసాతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న వృద్ధులు గుర్తొచ్చారు. అమ్మితే ఏమవుతుంది? బహుశా సూరన్నాయుడి మనుషులు వాళ్ళని ఖాళీ చేయించేస్తారేమో... వారి భవిష్యత్తు ఏమవుతుంది?

అమ్మకపోతేనో... అబ్బాయి ఒప్పుకుంటాడో లేదో...కోడలు డబ్బుదగ్గర చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె ఏమంటుందో... ఈ వయసులో ఆమెని కాదని ఇంట్లో సమస్య తెచ్చుకోగలడా? పది పన్నెండు లక్షలు అంటే సామాన్యమైన మొత్తం కాదుకదా...అబ్బాయి కోడలూ ఈ సొమ్ము మీద ఏం ఆలోచనలు పెట్టుకున్నారో... వాడికి స్విట్జర్లాండ్ వెళ్ళాలని కోరిక. ఈ డబ్బులు వస్తే హాయిగా వెళ్ళిరావొచ్చనుకుంటున్నాడో..

ఈ అప్పల్నాయుడు తనకు ఆనాడు డబ్బులు ఇచ్చేసి ఉంటే తన కిప్పుడు ఈ సమస్య రాకపోను. పోనీ ఇచ్చేడు అనుకుందాం. ఈ ఆశ్రమానికి ఎందుకివ్వాలి నన్నడగకుండా... ఎలా అడుగుతాడు నా ఎడ్రసే లేదే ఆతని దగ్గర....

ఏం చెయ్యడం ఇప్పుడు... గత ఏడేళ్ళుగా కోడలని చూస్తున్నాను కద. ఆమె ఒప్పుకోదు ఇంత డబ్బు వదులుకోవడానికి. ఈ ఆలోచనలతోనే గడిపాడు రావు.

ఆ సాయంత్రం కొడుకు ఆఫీసునించి ఇంటికి వచ్చేవేళ, ఓ రకమైన ఉద్వేగంతో, సంశయిస్తూ ఫోన్ చేసేడు రావు ఢిల్లీకి.

"వీడియో కాల్ చేస్తానుండండి నాన్నగారు" అంటు కోడలితో కలసి వీడియో కాల్ చేసేడు. ముందుగా రావెలా ఉన్నాడో శ్రీకాకుళం ఎలా ఉంది ఇటువంటి మాటలైనాక పూర్తి వివరాలు చెప్పేడు రావు. "పది పన్నెండు లక్షల వరకూ రావొచ్చు అమ్మితే. అమ్మకపోతే ఓ ఇరవై ప్రాణాలు ఆశ్రయం పొందుతాయి. వాళ్ళకి ఎప్పుడు ఎవరొచ్చి తమని ఖాళీచేయిస్తారో అనే భయం ఉండదు కనక ఇంకా ఆశ్రయం వృద్దుల ఇచ్చే సంఖ్యని పెంచచ్చు." అన్నాడు." ఇది నా ఆలోచన. మీరిద్దరూ ఏం చెయ్యమంటే అది చేస్తాను."

వాణి కల్పించుకొని అంది. " మామయ్యగారు! మీరేమనుకుంటున్నారో చెప్పండి".
"నేనేమనుకుంటున్నానో ముఖ్యం కాదమ్మా.... నా జీవితం మీ ఇద్దరి నీడలో గడవాలి. నాకు మీ అండ ఉంది. అదిలేని ఈ అనాధలని చూసేను. మీరేమిటి చెప్తే అదే చేస్తాను. " అన్నాడు రావు. ఆమె గొంతు వినగానే ఆమె ఏం చెప్పబోతోందో అర్ధమైపోయింది రావుకు.

తన అధికారులతో ఎలా నడుచుకోవాలో తెలిసిన అతని కొడుకు"సరే నాన్నగారు! మేం ఇద్దరం మాటాడుకొని ఉదయాన్నే చెప్తా ఏం చేద్దామో". అన్నాడు.

ఆ రాత్రి నిద్రపట్టలేదు రావుకి. తను అమ్మేస్తునాను. ఖాళీచెయ్యమని చెప్పడంతోటే నిరాశతో వేలాడిపోయే ఆ వృద్దుల మొఖాలు చాలాసేపు వెంటాడేయి అతనిని.

తెల్లవారింది. తయారయి ఫలహారం కానిచ్చి కూర్చుండగానే కొడుకు నుంచి ఫోన్ వచ్చింది.

"వాణి మాట్లాడుతుంది నాన్నగారు!" అన్నాడు.

వీడుచెప్పలేక ఆమెచేత చెప్పిస్తున్నాడన్నమాట అనుకున్నాడు రావు.

సుమారు పది నిమిషాలు మాట్లాడింది వాణి. ఆమె చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రావు.

"సరే! అలాగే చేస్తానమ్మా!"అన్నాడు రావు ఫోను పెట్టేస్తూ.
కిందకి వచ్చి రిసెప్షన్ లో నిరీక్షిస్తున్న మాష్టారి ని కలసి తన ఆలోచన చెప్పాడు. ఇద్దరూ కలసి మాష్టారి శిష్యుడైన ఓ లాయరు దగ్గరకు వెళ్ళారు. ఆ లాయరు దగ్గరుండి కావలసిన విధంగా డాక్యుమెంట్ తయారు చేయించీ తను స్వయంగా వెంట వారిద్దరినీ తీసుకొని వెళ్ళి రిజిష్ట్రార్ ఆఫీసులో ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసేడు.

బయటకు వచ్చిన తరువాత మాష్టారు రావు చేతులు పట్టుకుని రావుకు ధన్యవాదాలు చెపుతుండగా రావు అన్నాడు " మాష్టారూ! చిన్న విన్నపం". చెప్పండి అన్నారాయన. కోడలు వాణి సలహా విన్న దగ్గర్నుండీ తన మనసులో మెదులుతున్న ఆలోచనను చెప్పాడు రావు. మాష్టారు రావు మాటలకు అభినందనలు తెలిపి అలాగే చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు.

ఆ సాయంత్రం వైజాగ్ లో ఢిల్లీ వెళ్ళే విమానం కోసం ఎదురు చూస్తున్న రావుకు తన కోడలు వాణి.మాటలు గుర్తొచ్చేయి.

" మామయ్యగారూ...మనం ఇప్పటికిప్పుడు ఆ స్థలం అమ్మనక్కరలేదు. అయితే మీరు చెప్పిన ఆ రిటైర్డ్ హెడ్మాష్టరుగారి తరువాత ఆ ఆశ్రమం ఇలా నడపబడుతుందో లేదో తెలీదు. పోనీ ఆశ్రమానికి రాసిచ్చేస్తే తరువాత వారు దాన్ని మీరాశించిన ప్రయోజనం నెరవేరకుండా ఇంకేమైనా చెయ్యచ్చు. అందుకని, మీరు ఓ ముప్ఫై సంవత్సరాలకి ఏడాదికి నామమాత్రంగా అద్దెకి లీజుకిచ్చినట్టు డాక్యుమెంట్ రాసి రిజిస్టర్ చేయండి. ఎప్పుడైనా తగిన నోటీసుతో తిరిగి మనం స్వాధీనం చేసుకోగలగాలి. ముప్ఫైఏళ్ళ తరువాత ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచించవచ్చు. ఈ సలహా మీ అబ్బాయి కి కూడా నచ్చింది. మీకూ నచ్చితే అలా చేయండి."

జన్మనిచ్చి పెంచిన కొడుకూ. ఏడేళ్ళై తానెరిగిన కోడలూ , తనవారైన వారిద్దరినే ఇంకా తానెరుగను అనుకున్నాడు రావు విమానంలో కూర్చుంటూ...

విమానం గాలిలోకి ఎగురుతుండగా రావు కళ్ళముందు ఆ వృద్దాశ్రమం పేరు కదలాడింది.

వాణీరావు వృద్దాశ్రమం మరియు పాఠశాల.




**********అయిపోయింది**********


–-----------–--–-–--------------------------------------------------------
అచ్చంగా తెలుగు అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సాహితీమాతకు సేవ చేస్తోంది. వివిధ రచయితల నుంచి కధలు ఆహ్వానించి "క్షీరసాగరంలో కొత్త కెరటాలు" అని ఓ పుస్తకం ప్రచురించేరు. ఇందులో లబ్ద ప్రతిష్ఠులైన పన్నెండు మంది ప్రత్యేక ఆహ్వానితుల కధలతో పాటు మరో నూటరెండు కధలని కలిపి మొత్తం నూటాఇరవై కధలతో ప్రచురించేరు, శ్రీమతి భావరాజు పద్మిని గారు. పన్నెండు మంది లబ్దప్రతిష్ఠులైన రచయితల కధలతో పన్నెండు విభాగాలుగా నూటరెండు కధలను వర్గీకరించేరు. 
కధలు రాయాలన్న ఆలోచన నాకు కలిగించిన స్ఫూర్తి శ్రీ మల్లాది వేంకట కృష్ణమూర్తి గారిది. ఆయన పుంఖానుపుంఖాలుగా కధలు రాసే సమయంలో విడవకుండా ప్రతీ కధనీ నవలనీ చదివేను. నాకు ఆయనంటే ఎనలేని అభిమానం. 
శ్రీమతి పద్మినిగారికీ విషయం తెలీదు. కధావస్తువులో లేశమాత్రం మానవత్వపు ఆనవాలుతో నా కధని శ్రీ మల్లాది వారి కధతో చేసిన వర్గంలో పెట్టడం నాకు కధ ప్రచురించబడినదానికన్నా ఎంతో ఆనందాన్నిచ్చింది. శ్రీ మల్లాదివారు నా కధ చదివిఉంటారా?. 
ఈ పుస్తకానికి రెండు రికార్డులను ఇచ్చేరు.CHAMPION BOOK OF WORLD RECORDS అనీ, ASIAN WORLD RECORDS అనీ. ఈ కధలపుస్తకంలో 95 సంవత్సరాల రచయిత నుండీ ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగులు వేస్తూ రచనలు మొదలుపెట్టిన రచయిత(త్రు) ల కధలుండడం విశేషం. 

23 comments:

  1. మానవత్వం తో మన వారేయ్యారు. బాగుంది.మల్లాది వారి రచనలు నాకు చాలా ఇష్టమే. ఆయన రచనల సరసన నీది చేరినందుకు గర్వంగా ఉంది.

    ReplyDelete
  2. డియర్ జతీంద్ర,
    నేను ఏదైనా కధని చదివేటప్పుడు, ఎక్కడైనా అనవసర వర్ణనలు, సంభాషణలు వస్తుంటే వెంట, వెంటనే పేరాలుకు పేరాలు దాట వేస్తుంటాను.

    ఈ కధ...నన్ను మొదటి అక్షరం నుండి చివరి అక్షరం దాకా చడవనిచ్చింది.
    ఏముంది, అది మాములే, ఇ
    ది మాములే, ఇదే కదా లోకం పోకడ అనుకుంటూనే కధ చివరికి వచ్చేసాను. ఫ్లైట్ ఎక్కడమే తరువాయి. కానీ అంతముందు కొడలు వాణితో జరిగిన సంభాషణ,
    తత్ద్వారా జరిగిన తెలివైన పరిష్కారం .
    నేను నమ్మలేక పోతున్నాను.
    ఐనా ఇది నిజం.

    రమేష్.సి

    ReplyDelete
  3. Nenu chadivanu , chala bagundi. Congratulations. Inkaa ituvantivi mee kalam nunchi veluvadalani aasistunnanu. T V Subbarao

    ReplyDelete
  4. శర్మగారూ, మనసుకు హత్తుకునే సంఘటన, ఇది కథ అనుకోలేదు, వాస్తవ సంఘటనే నమ్ముతారో నమ్మరో అనీ కథగా చెప్పినట్లనిపించింది!!! నిజానికి బ్యాంకింగ్ కెరీర్ లో మన అనుకోని మనవాళ్ళని ఎంతమందినొ చూసుంటాము! అవి మథురస్మృతులే సుమా!

    ReplyDelete
  5. Nijanga chaalaa bavundi! Mugimpu inkaa baavundi! Chaalaa manchi idea adi! Mana pakkane vunna , manam chinnappatininchi chustunna vaallu manchi nirnayaalu theesukunnappudu nijamgaane ascharyamga anipistundi. Santhoshanga anipistundi. Manchi title pettaru!
    Ee kadha mee favourite writer group lo padatam , ee pustakaaniki international awards raavatam inka adbhutam! Congratulations for proving your self as one of the best writers!

    ReplyDelete
  6. రెండు కథలు చాలా బాగున్నాయి
    సరళంగా చెప్పిన తీరు బాగుంది
    ఇంకా ఇంకా ఇలాటివి రావాలి - లక్ష్మక్క

    ReplyDelete
  7. కంగ్రాట్స్ శర్మ గారు!
    మీ కధా,కధనం చాలా బాగున్నాయి. అన్ని పాత్రలు సహజత్వం దిశగా వివేచన కు దగ్గర గా వున్నాయి అంటే పూర్తిగా రచయిత గొప్పతనం - సీతాపతిరావు

    ReplyDelete
  8. మీకు స్ఫూర్తి నిచ్చిన మల్లాది వారి సరసన మీకథ ప్రచురితమైన విషయం విని మీకు కలిగిన ఆనందం లో మేము కూడా పాలు పంచుకుంటున్నాము. తండ్రి మనసెరిగిన కొడుకు, కోడలు. బాగుంది అందరికీ ఆదర్శప్రాయం.

    ReplyDelete
  9. డియర్ జతిన్,. మీ కథానిక చదువుతుంటే కళ్ళల్లో నిజమైన జీవితం ప్రదర్సితమైంది ..మోసాలు లేని సామాన్య జీవితాల్లో ఇంతటి సేవా భావం నన్ను ఎంతో కదిలించింది...సరళ మైన పడ జాలం తో అచ్చ శ్రీకాకుళం ప్రాంత భావాలతో బ్యాంక్ ఉద్యోగుల మనోభావాలు ఇంకా గ్రామీణ ప్రాంతం లో సమాజ సేవ చేసే మాస్టారి మనో భావాలు,. అక్కడి ప్రకృతి దృశ్యాలు,,,రావూ గారి కొడుకు కోడలి సంస్కార భావాలు. తిరిగి వచేస్తున్నప్పుడు కూడా రావు గారిని కదిలించిన ఆ మంచి వ్యవహార శైలి మన అందరినీ ఎంతో ఆకట్టుకుంది....నిజంగా మీరు మీ హదయాన్ని ఈ రచనలో ఆవిష్ క రింపజేసి కృకృత్యులయ్యారు... ధన్యవాదాలు. ..ధన్వంతరి....విశాఖపట్నం ...

    ReplyDelete
  10. జతీంద్రగారూ, చాలా బాగుంది. వరల్డ్ రికార్డు లో ప్రచురింపదగ్గ అర్హత కలిగిన కథ. హ్రుదయపూర్వకమైన అభినందనలందుకోండి.పాణంగిపల్లి పద్మిని

    ReplyDelete
  11. 👏👏👏👏 మానవత్వ విలువలతో పాటు కుటుంబ బంధాలకు కూడ విలువ ఇస్తూ రావు గారి ఆలోచనా క్రమం అద్భుతం గా ఉంది..టైటిలే కే పడిపోయాయి మూడొంతులు మార్కులు..టైటిలే వల్లే క్యూరియాసిటి పెరిగింది..పూర్తి అవుతోనే ఒక్క సారి కళ్ళు మూసుకొని భావోద్వేగాన్ని పొందాను..ఇప్పుడు కాదు ఎప్పుడో మీరు మల్లాది వెరీ సరసన నిలబడ గలుగుతుంది గల న వారు..ఆలస్యమైనా మీ అర్హత మీకు దక్కింది...మాలాంటి aged వాళ్ళం కూడ ఏదైనా మంచి పని చేసినప్పుడు ఈ రకంగా ఆలోచించాలి అని తెలిసింది..థాంక్స్ యూ..కొడుకునే కాదు కోడలిని కూడా ఎరిగినందుకు రావ్ గారికి congratulations.

    ReplyDelete
  12. ఇటువంటి కథలు నేటి సమాజానికి చాలా చాలా అవసరం!
    Sudha

    ReplyDelete
  13. చాలా బాగుంది జతిన్ద్రా. కథ మొత్తం సహజత్యం తో నిండి పోయింది. అన్ని క్యారెక్టర్స్ లో పాజిటివిటీ ని చూపించావు.అందుకే అది నీ ఫేవరేట్ రచయిత గ్రూప్ లో పెట్టబడింది. హృదయపూర్వక అభినందనలు. నువ్వు ఇంకా ఇటువంటి ప్రయత్నాలు చేసి పాఠక లోకాన్ని మెప్పిస్తావని కోరుకుంటూ
    Dayal❤❤🙏🙏

    ReplyDelete
  14. Adhbuthangaa undi. My congratulations and admiration to him. Writing such stories reminds humanity and humility. Really great..thanks for sharing. Regards. ARR.

    ReplyDelete
  15. శర్మగారు కథ సితక్కొట్టేశారు...

    ReplyDelete
  16. Congratulations. Taneragani Tanavaru katha. Chala bhagundhi.
    The story is narrated in style. Like in a flash back .Began in a flash back. Story is not told in a sequence to keep the tempo or suspense. It is written in a professional style and the language ( pada prayogam) is clear and lucid.
    First I thought it is your personal experience but the hero left his bank job and pursued central services.
    Very good story.
    I don't understand why you didn't become a noted / professional writer and the talent remained a hobby. PSR Sastry

    ReplyDelete
  17. శర్మ గారు మీ కథ చివరా ఖరువరకు చదివాను. కోడలి పిల్ల ఆలోచన బాగుంది. ఈ తరం పిల్లల ఆలోచనను మా బాగా చెప్పేరు..... రచయిత గారికి అభినందనలు............ శర్మా రచయిత అయ్యవుగా అందుకే గౌరవంగా శర్మ గారూ అన్నాను. రాజా రావు

    ReplyDelete
  18. చాలా బాగుంది. కోడలు ఔన్నత్యాన్ని అంత చక్కగా గుర్తించి మామగారి మంచి తనం .ఈ తరం పిల్లల తెలివైన నిర్ణయాలు చక్కని రచనా శైలి తో హృద్యంగా వర్ణించారు Expecting many more

    ReplyDelete
  19. Prati okkari bhavalu Appalanayudi gari nijayitee, anusarinche koduku,appati,ippati taram vari alochanaa saralini ardham chesukuni angikarinche manasu gala Rao gari paatra chala baavundi.kondarinaina inspire chese katha. ilantivi marenno vrayalani masphoorthi ga korukuntunnanu.thank you for sending this. K Vimala

    ReplyDelete
  20. జితేంద్ర! ఇప్పుడే నీ కథ చదివాను. చాలా బాగుంది మన మెరిగిన పరిసరాలు కాబట్టి ఇంకా చక్కగా ఉంది. నా మనస్ఫూర్తిగా అభినందనలు👏👏👏చంద్రమౌళి

    ReplyDelete
  21. "తానెరుగని తనవారు "

    కథ చదువుతున్నంతసేపు ,శ్రీకాకుళం లో కలియతిరిగి నట్లనిపించింది .మన జిల్లాలో అప్పలనాయుడు లకు కొదవలేదు .మనిషి చూపుకు కర్కషం కాని మనసు వెన్న . మొహమాటస్థుడికి కష్టం వస్తే భగవంతుడు "రావు "లను చూపిస్తాడు .నోట్లమధ్య తిరిగే బ్యాంకు వారు" రావు "గారిలో మరొ మనిషిని చూడలేకపోయారు .
    పెద్ద హోదాలో ఉద్యోగవిరమణ చేసిన వారి మనసు కూడా గొప్పగా ఉంటది .రావు గారు అందుకు మినహాయింపుకాదు .కొడుకు కూడా ఆర్థిక శాఖలో అండర్ సెక్రటరీ హొదా .
    పది ,పన్నెండులక్షలు చిన్నమొత్తంఏమీకాదు .అలాగని లాటరీలా వచ్చిన ఈ మొత్తంకన్నా ఇచ్చే ఆత్మతృప్తి సంగతేమిటి ?
    రావు గారు ఆ దిశ గా ఎందుకు ఆలోచించలేకపోయారు .? అంత హోదాలో బ్రతికిన మనిషికి ,కుటుంబముపై పట్టు లేకపోయింది .ఆ క్షణంలో రావు గారికి కూడా ఏదో ఒకరోజు అనాధ ఆశ్రమం అవసరం పడొచ్చు అనిపించింది .ఒంటరి బ్రతుకు ఆలోచన భయపెట్టినట్లున్నది .అందుకే మీరిద్దరూ ఏమి చెబితే అది చేస్తాను అని చెప్పాల్సి వచ్చింది .
    ప్రతీ ఇంట్లోనూ ,కీలక సమయంలో ,కోడలు మాత్రమే మాట్లాడుతుంది .వాణి అందుకు మినహాయింపు కాదు .
    అంత హోదాతో బ్రతుకుతున్న వీరికి అది పెద్ద మొత్తం కాదనిపించింది .సూర్యనారాయణ మాస్టారికున్నంత దొడ్డ మనసు వీరికి లేకపోయిందనిపించింది
    "వాణి రావు - వృద్ధాశ్రమ పాఠశాల " కి ,రావు గారి కుటుంబమే కేర్ టేకర్ గా ఉండి ,సూర్యనారాయణ మాస్టారికి ఆశ్రమ శాశ్వత బాధ్యత అప్పగించి ఉంటె
    బాగుండేది .సూర్యనారాయణ తరువాత ఇంకో నారాయణ బాధ్యతా తీసుకునేవారు .
    ఏడాదికి నామమాత్రపు లీజుకు ఇచ్చి ,దాక్యుమెంట్ ను రిజిస్టర్ చేసిన తరువాత రావు గారి ఉదాత్త కేరెక్టర్ ఎక్కడో పాతాళానికి జారిపోయినట్లనిపించింది .ఇక నుండి కొడుకు ,కోడలు దృష్టి లీజు డబ్బులు ,అశ్రమం ఎప్పుడు మూతపడుతుందో అని ఎదురు చూడటంపైన మాత్రమే ఉంటది .మనలో చాలామంది లాగానే రావు గారు పరిస్థితులకు తలవంచ వలసి వచ్చింది .
    కథనం బాగున్నా ....ముంగింపు కాస్త అసంతృప్తి కలిగించింది .
    ఈ చిన్న విమర్శను మితృడు జతీంద్ర సహృదయంతో తీసుకుంటారని ఆశిస్తూ ...

    ...........శ్రీనివాస్

    ReplyDelete