Thursday, 27 May 2021

ఆవకాయ జ్ఞాపకాలు

 **ఆవకాయ జ్ఞాపకాలు**


పెద్ద పండగ వెళ్ళిపోయింది. పండగకని చేసిన చేగోడీలు, కారప్పూస, లడ్డూలు డబ్బాలు ఖాళీచేసి, పండగకొచ్చిన అల్లుడు వెళ్ళిపోయినట్టు , వెళ్ళిపోయాయి. 


గతేడాది పెట్టిన ఆవకాయ కూడా జాడీలో అడుగుకి వచ్చేసింది. అమ్మ అటకమీంచి జాడీలని దింపించి, వాటిల్లో ఉన్న ఆవకాయ లని సీసాల్లోకి మార్చేసింది. "ఏమిటో ఈ సారి వందకాయలు పెట్టినా తడుముకోవాల్సి వచ్చేట్టుంది" అనుకుంటూ...


ఉదయాన్నే పిల్లలమందరమూ తినే చల్దన్నాల్లో తప్పనిసరిగా ఉండవలసిన నంజుడు ఆవకాయే మరి. అదిలేకపోతే ఇంకేదైనా చేసుకోవాలి. మళ్ళీ ఉగాది వెళ్ళి వైశాఖం వచ్చేవరకూ సర్దబాటు చేయడం అమ్మకి కష్టమే. 


జనవరినెలాఖరుకు గుంటూరు మిరపకాయలు బజారు నుంచీ తెప్పించేది నా చేత. శ్రీకాకుళం లోని ఆ కూరగాయల బజారులోనే ఓ వరసగా దుఖాణాలు ఉండేవి. మధ్యలో షోడా షాపులు ఉండేవి. అయిదు పైసలకి ఓ షోడా... 

షోడా సీసాని భుజానికి తగిల్చి చూపుడు వేలితో ఆ సీసాలోని గోళీని నొక్కితే 'ఖుయ్'మని శబ్దంతో షోడాని కొట్టేవాడు. ఆ శబ్దం ఎంత బాగుండేదో... ఎంత ఎక్కువ శబ్దం వస్తే షోడాలో అంత గ్యాస్ ఉన్నట్టు. 


ఆషోడా దుఖాణాలకి ఎదురుగ్గా వరసగా కిరాణా షాపులుండేవి. అక్కడ షాపులముందు బస్తాల్లో పోసి మిరపకాయలు, వెల్లుల్లి, పసుపు అన్నీ పెట్టేవారు. అందులో చివర్నుండీ రెండోది నేను వెళ్ళే దుఖాణం. "రా బాబూ ! రా! కూచో " అని ఆప్యాయంగా పిలిచేవాడు. చిన్న చిన్న కర్ర పెట్టెలు ఉండేవి వరసగా వాటలో పప్పులు పోసేవారు. కొంచెం పావుకిలో అంతకన్నా తక్కువ అయితే వాటిలోంచి తూచి పేపరు కవర్లలో వేసి ఇచ్చేవాడు. ఎక్కువైతే లోపల బస్తాల్లోంచి తీసేవాడు. కొన్ని పెట్టెలమీద గోనె వేసి కూర్చోమనేవాడు. ఆ దుఖాణం కి వచ్చే పోయే జనాలని చూస్తు , ఆ కుర్రవాళ్ళకి తన దగ్గరున్న జాబితాలలోంచి వరసగా సామానులు చెప్తూ ఉండేవాడు. పొడుగు రాములు అని కొద్దిగా గుర్తు ఆ కొట్టాయన పేరు. అమ్మ చెప్తుంటే రాసుకొచ్చిన లిస్ట్ ఇచ్చేను. 

"మిరపకాయలు మంచివి నెంబరు వన్ను వి వచ్చేయి. నీకవే ఇస్తాను " అనేవాడు తప్పనిసరిగా. అందరికీ అలాగే చెప్తాడని నాకు అప్పుడు తెలీదు. కొంచెం గొప్పగా ఫీలయే వాడిని. ఇంటికెళ్ళాక అమ్మకి నచ్చకపోతే "ఇవేం కాయలురా. కారమే ఉండవు. వెడల్పుగా, ఎర్రని రంగుతో ఇంత పెద్దవి ఉండాలి"అని చేతితో సైజు చూపించేది. మళ్ళీ సైకిల్ మీద వెళ్ళి "ఏమండీ! ఇవి కాదుట." అని అమ్మ చెప్పిన స్టేండర్డ్స్ చెప్పి మార్చి తీసుకుని వెళ్ళేవాడిని. ఆవాలు వీధిలోకి అమ్మ వచ్చేవి. దాదాపుగా అక్కడే తీసుకునేవారు. గడ్డలుప్పు (ఇప్పుడు లా పేకెట్లు కాదు. ) ఓ బండి మీద పోసుకుని అమ్మవచ్చేవారు. వారి దగ్గర తీసుకొనేది. ఆ ఉప్పుని తడి తగలకుండా జాగ్రత్త చేయడం ఓ పని. ఇక ఇంగువ. ఏడురోడ్ల జంక్షన్ దగ్గర పట్నాల సుబ్బయ్య ఆయుర్వేద మందులషాపు నుండే తేవాలి. ఇంకెక్కడ తెచ్చినా నచ్చేది కాదు. వెల్లుల్లిపాయలు కూడా వీధిలో అమ్మవచ్చేవి. అవికొని ఎండబెట్టి వాటిపాయలు తీసి , పసుపు నూనె రాసి జాగ్రత్త చేసేది. గుడివీధిలో అమ్మలక్కలందరికీ ఈ ఆవకాయ సీజన్ లో ఇవేమాటలు. మెయిన్ రోడ్ లో మురపాక ఆయిల్ మాంగర్స్ సొసైటీ అని ఉండేది. అక్కడనుండి నువ్వులనూనె తేవాలి. ఇంకెక్కడా పనికొచ్చేది కాదు. 


ఇక చైత్రమాసం వెళ్ళి వైశాఖం వచ్చేలోపల ఇవన్నీ ఇమ్ము చేసుకొనేవారు. మా పెద్దనాన్నగారికి కట్టెల దుఖాణం ఉండేది. ఆయన వాళ్ళింటికీ, మాకూ, మా పెద్దదొడ్డగారింటికీ కావలసిన మామిడికాయలు తెప్పించీ కొట్టించేవారు. నాగావళీ బ్రిడ్జి ముందున ఒక మేదరి వాళ్ళ కుటుంబం ఉండేది. వాళ్ళు బుట్టలు అల్లడం పందులను పెంచడం పనులను చేస్తుండే వారు. వాళ్ళు వచ్చి ఈ కాయలను కావలసిన సైజులో కొట్టి ఆ కాయలలో ఉండే జీడిని తీసుకువెళ్ళేవారు. పచ్చావకాయకి ఓ రకంగా , ఎండావకాయకి (ఇదే బెల్లం ఆవకాయ కూడా) ఓరకంగా కొట్టించేవారు తోడికోడళ్ళు ముగ్గురూ. కొన్ని కాయలని ఆల్చిప్పతో (సముద్రంలో దొరికే షెల్స్, ఒక పార్ట్ ఆల్చిప్పనేవారు. వాటిని జాగ్రత్తగా మధ్యలో అరగదీస్తే మామిడి కాయల తొక్కతీయడానికి వీలుగా ఉండేవి. ఈ రోజుల్లో పీలర్ అన్నమాట).జాగ్రత్తగా తొక్కతీసి, ఇనప జల్లెడమీద అరగదీస్తే మామిడి కోరు వచ్చేది. అది పచ్చడి గా చేసేవారు. మాగాయ అని , మామిడి కాయ టెంకలూ, ముక్కలూ కలిపిపెట్టి వాటిని ఎండబెట్టి తయారు చేసేవారు..

ఈ ఎండావకాయ ఓ పెద్ద ప్రణాళిక. ఆవగుండ, కారం , ఉప్పు , ఇంగువ, నూనె ఇవన్నీ వాటి పాళ్ళలో కలిపి ఈ మామిడి కాయముక్కలు నిలువుగా కోయించి, వాటికి దుమ్మూ, జీడీ లేకుండా శుభ్రంగా తుడిచి అందులో వేసి , మూడురోజుల తరువాత కలిపి తరువాత ఎండలో పెట్టేవారు. ఈ ఆవూట ముక్కలూ వేరేగా ఎండబెట్టేవారు. పిల్లలం అటునుంచి ఇటునుంచీ వచ్చీ ఒక్కోముక్క తీసుకుని తినేయకుండా కాపలా ఉండేవారు. డాబామీద చిన్న గది ఉండేది. ఆ గదిలో కూచుని కాపలా కాయడం. ఆ తరువాత ఆ పెద్దముక్కలని చిన్నవిగా కోసి ఈ ఆవపిండిలో కలిపేవారు. వాటిని జాడీలోకి ఎత్తి ఓ గుడ్డ వాసెన కట్టి ఉంచేవారు. వర్షాకాలం అయ్యేక తినడానికి బాగుంటుంది అనేవారు. 

పచ్చావకాయకి ఇంత ప్రోసెస్ ఉండేదికాదు. ఆవగుండ, కారం , ఉప్పు నూనె వెల్లుల్లి  కలిపి రెండురోజులో మూడురోజులో ఉంచేక తినడానికి తయారయ్యేది. 


కంచంలో వేడి అన్నంలో పచ్చావకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే.  నా స్సామిరంగా... ముత్యాలముగ్గు కంట్రాట్రు అన్నట్టు "మర్డరేదో జరిగినట్టు లేదూ కంచంలో" అనాలనిపిస్తుంది. మన జిల్లాలో నే దొరికే సువర్ణరేఖ మామిడి పండు నంజుకుతింటే వారెవ్వా జీవితమంటే ఇదీ అనిపించేది. 


****

"ఏమిటి రాస్తున్నారు" అంటూ వచ్చింది శ్రీమతి. గబగబ చదివి "సరే... ఆవకాయ అంతలేసి తింటే రాత్రంతా కడుపుమంటని, బీపీ ఎక్కువైందనీ, మామిడి పండు తినడం వల్ల సుగర్ ఎక్కవైందనీ, నిద్రపోక చంపుతారు. చాల్లెండి సంబడం " అంది. 

"గత నెల తెచ్చిన ప్రియా ఆవకాయ సీసా అలానే ఉంది చెల్లక. ఇంట్లో ఉండేది ముగ్గురం. ఎంత ఆవకాయ తింటాం?. "


"అందుకే జ్ఞాపకాలన్నాను. జ్ఞాపకాలు జీవితాన్ని నడిపే ఇంధనాలు"అన్నాను గంభీరంగా. (ఇక్కడ గంభీరంగా అనవలసిన పనిలేక పోయినా) 

**


*****

1 comment:

  1. ఈ ప్రహాసనము అంతా చూస్తేనువ్వే మీ అమ్మగారికంటే బాగా ఆవకాయ పెడతావని తెలుస్తోంది
    మోదుకూరి బ్రాండ్ తో ఆవకాయల కంపెనీ పెట్టు
    వాటికీ ఫ్రాంచైశీ లకు ఇవ్వు. పబ్లిక్ ఇష్యూ కి రా. కోట్లు సంపాదించు. ❤

    ReplyDelete