Friday, 12 March 2021

సాక్ష్యం


                                                                                            --మోదుకూరి జతీంద్రశర్మ 

మేడమీది గది అది. రెండో అంతస్తులో ఉంది. మొత్తం డాబా అంతటికీ ఒక్క గది మాత్రమే కట్టి మిగిలిన జాగా అంతా ఖాళీ గా ఉంచేసేరు.

ఆ గదిలో ఒక మంచం. ఎత్తైన పరుపులు, దిళ్ళూ. ఆ మంచం మీద జేరబడి పడుకుని కిటికీలోంచి బయటకు చూస్తే ఊరులోంచి వెళుతున్న రోడ్డూ, ఆ ఊరికి వచ్చే రెండుమూడు బస్సులు ఆగే చోటూ ఊర్లోకి వెళ్ళే ఇతర రోడ్లు కనబడతాయి. తలెత్తి కావాలని చూస్తే తప్ప ఆ కిటికీ లోంచి ఎవరో చూస్తున్నారన్న సంగతి రోడ్డుమీద వెళ్ళేవాళ్ళకు తెలియదు.


మొదటిసారిగా పదమూడేళ్ళ వాసుని ఆ గదిలోకి తెచ్చేరు. వాసుతండ్రి తోడుగా కనకం కొడుకు మోసుకొని తెచ్చేరు. వాసు సవతితల్లి రాధ కూడా వారి వెనకే వచ్చి , వాసును కిటికీ దగ్గరగా ఎలా పడుకోబెడితే కష్టపడకుండా ఆ రోడ్లూ కదిలే జనాలు, బయట ప్రపంచమూ కనబడుతుందో, సూచనలిస్తూ వాసుని ఆ మంచం మీద పడుకోబెట్టడానికి సహాయం చేసింది.


అయిదేళ్ళయి కింద ఒక మూలగదిలో చీకట్లో రోజులు గడిపిన వాసుకి ఒక్కసారిగా వెలుతురులో, తెల్లని పక్కమీద పడుకొనేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగేయి. ఏడుస్తున్న వాసు దగ్గరికి వెళ్ళబోతున్న వాసుతండ్రి ని ఆపి రాధ ఆయనచేయి పట్టుకుని మెల్లగా బయటకు తీసుకువెళ్ళింది.


మంచంమీద పడుకున్న వాసుకి తల్లి ఒడి చల్లనిస్పర్శ గుర్తొచ్చింది.


పదేళ్ళ క్రితం , వాసుకి మూడేళ్ళ వయసులో పోలియో సోకింది. వాసు కాళ్లు మాత్రం చచ్చుబడిపోయేయి. నిలబడలేడు కూచోలేడు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వాసుకి కాళ్ళు రాలేదు. తల్లి బ్రతికున్నంతవరకూ వాసుకి ఏలోటూ రాకుండా చూసుకొనేది. అయిదేళ్ళ క్రితం వాసు తల్లి చనిపోయింది చాలా సహజంగా. ఏమీ వ్యాధి పాలన బడకుండా.

వాసుకి చెప్పలేదెవరూ తల్లి పోయిన సంగతి. తల్లికాకుండా భోజనం తెచ్చిన కనకం, "ఏదో అత్యవసరమైన పనిమీద, మీ తాతగారి ఊరు వెళ్ళేరు"అని మాత్రం చెప్పింది వాసుకి.

"అమ్మ నాతో చెప్పకుండా వెళ్ళిందేం?" అడిగాడు వాసు.

"నాకేటి తెలుసూ" అంది కనకం అన్నం తినిపించి వెళ్ళిపోతూ...

రెండోరోజు సాయంత్రం చీకట్లు పడేవేళ ఆ చీకటి గదిలోకి వాసు తండ్రి వచ్చి మంచమీద కూర్చున్నాడు. వాసుకి గుండెల్లో ఏదో దిగులు కలిగింది, అశుభమైన వార్త వినబడేముందు కలిగే ఆందోళన కలిగింది.

వాసుచేయి తన చేతిలో తీసుకుని , వణికే గొంతు తో అన్నాడు వాసు తండ్రి " వాసూ! కన్నా!". ఆయనగొంతు దుఃఖంతో గాద్గదికమయింది.

"ఏమయింది నాన్నా?" ఆందోళనగా అడిగాడు వాసు. తండ్రి గొంతులో విషాదం ఆ కుర్రవాడ్ని భయపెట్టింది.

"వాసూ! కన్నా! మీ అమ్మ నన్నూ నిన్నూ వంటరివాళ్ళని చేసి వెళ్ళిపోయిందిరా!" వాసుతండ్రి మెల్లగావిలపించసాగాడు.

వాసుకి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడవసాగేడు. మరణం అంటే ఏమిటో తెలియని వయసు అయినా తల్లి మళ్ళీ కనబడదని ఆ పసివాడి మనసుకు తట్టింది.

వాసుమామయ్య ఆ గదిలోకి వచ్చేడు. ఏడుస్తున్న వాసు తండ్రిని చూసి మందలింపుగా అన్నాడు "ఏమిటిది రంగా! నువ్వేడిస్తే వాసు చంటివాడు. మరింత డీలా పడడు? "

"లేదురా! నన్నేడవనీయి. నిన్నటి నుంచి అదిమి పెట్టుకున్నా" అన్నాడు వాసుతండ్రి ఇంకా ఏడుస్తూ.

వాసుకి తండ్రి మెడని కావలించుకొని ఏడవాలనిపించింది. కానీ లేవలేని పరిస్థితి. ఆ విషయాన్ని గ్రహించినట్లు వాసు మామయ్యతో అన్నాడాయన " నువు కొంచెం తలుపు చేరేసి బయటకు వెళ్ళరా"

వాసుమామయ్య మౌనంగా తలుపు దగ్గరగా వేసి బయటకు వెళ్ళేడు. వాసుతండ్రి, వాసుని పక్కకు జరిపి వాసువైపు తిరిగి పడుకొని వాసు కుడిచేతిని తన మెడమీద వేసుకున్నాడు. వాసు ఆ ఓదార్పు కి భోరుమన్నాడు....

"ఊరుకో నాన్నా! ఊరుకో. మనం ఏం చెయ్యగలం చెప్పు?" అంటూ ఓదార్పు గా చాలాసేపు మంద్రస్వరంతో మాట్లాడేడు ఆయన. ఏడ్చి ఏడ్చి అలసిన వాసుకి నిద్ర పట్టేసింది. వాసుతండ్రి మెల్లగా లేచి తలుపు ఓరగా వేసి బయటకు వెళ్ళి కనకాన్ని గదిలో పడుకోమని చెప్పేడు.

అలా మేడమీది గదిలో మంచం మీద పడుకున్న వాసుకి తల్లి పోయిన ఆక్షణాలు గుర్తుకొచ్చేయి.

******

కిటికీ లోంచి బయటకు చూస్తూ మంచంమీద దిళ్ళకి చేరబడి కూర్చున్న వాసుకి తనజీవితంలోకి తన సవతితల్లి రాధ రావడం గుర్తొచ్చింది.

వాసు తల్లి పోయిన ఏడాది నుంచీ వాసుతండ్రిని మళ్ళీ పెళ్ళిచేసుకోమని అందరూ ఒత్తిడి తేసాగారు. చాలా తర్జన భర్జనలు జరిగాయి. వాసుతండ్రి ససేమిరా ఒప్పుకోలేదు. వాసుని వచ్చే ఆమె సరిగ్గా చూస్తుందో లేదో అన్న భయం ఉండేదాయనికి.

చివరికి వాసుమామయ్య వాసు దగ్గర ఈ ప్రస్తావన తెచ్చేడు. "చూడు వాసూ! నీకు అర్ధం చేసుకొనే వయసు వచ్చింది. మీ నాన్నకు ఇంకా నలభైఏళ్ళురాలేదు. నీ గురించి ఆలోచనతో మళ్ళీ పెళ్లి వద్దంటున్నాడు. కానీ , జీవితంలో ఓ తోడు చాలా అవసరం. తప్పనిసరి. నిన్ను చూసుకోడానికైనా మన అనే మనిషి కావాలి. నువ్వే చెప్పి మీ నాన్నని ఒప్పించాలి. "

వాసుమాటని కూడా వాసుతండ్రి వినలేదు. "నీకు తెలీదురా వాసూ...ఆ వచ్చే ఆమె నిన్ను అసహ్యించుకుంటే నేను భరించలేనురా" అన్నాడు.

వాసు ఒప్పకోలేదు. "నాన్నా ! బతికినన్నాళ్ళు నాకింతకన్నా వేరే బతుకు లేదని తెలుసు. కానీ నాగురించి నువ్వు నీ బతుకును ఒంటరిగా గడుపుతున్నావని అందరూ అనుకోవడం నేను భరించలేను. కనకం ఉన్నన్నాళ్ళూ ఏమీ ఇబ్బందిలేదు కదా" అంటూ పట్టుబట్టేడు.

చివరకు వాసుతండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. అలా వచ్చింది రాధ వాసు జీవితంలోకి.

వాసుకి, వాసుతండ్రికీ ఉన్న చీకటి భయాలను పోగొడుతూ ఉషోదయంలా వచ్చింది రాధ. ఈ మేడమీది గదిలోకి వాసుని మార్చడం కూడా ఆమె ఆలోచనే.

మొదటిసారి గా తల్లి రెక్కలచాటునుంచి బయటకు వచ్చి లోకాన్ని చూసే పక్షిపిల్లలా, ఆకాశాన్ని, ఎగిరే పక్షులని ,ఊర్లోంచీ నల్లగా పోతున్న రోడ్డుని, అప్పుడే వచ్చి ఆగిన బస్సు నూ, తమతమపనులమీద హడావుడిగా తిరిగే మనుషులను చూడసాగేడు వాసు.

రాధ ఆ గదిలోకి వచ్చింది. వాసుని చూసి చల్లగా నవ్వి అడిగింది "ఇక్కడ బాగుందా వాసూ?" .

"చాలా బాగుంది పిన్నీ. ఆకాశాన్ని చూసి ఎన్నేళ్ళయిందో... మొదటిసారిగా చూస్తున్నట్టుంది. " అన్నాడు వాసు.

"అమ్మయ్య! నీకెలా అనిపిస్తుందో అని భయపడ్డాను స్మీ" అంది రాధ.

"నీకేం చెప్పాలో నాకు తెలీదు పిన్నీ... కానీ ఒక్కటడగాలనుకుంటున్నాను. అడగనా"అన్నాడు.

"అడుగు వాసూ"అంది రాధ.

"నన్ను అమ్మ పిలిచినట్లు 'వాసూ కన్నా' అని పిలవవా"

రాధ కదిలిపోయింది ఆ మాటకి. చటుక్కున వాసు తలని తన హృదయానికి హత్తుకుని "తప్పకుండా. వాసూ! కన్నా!" అంది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగేయి. ఎన్నో చెప్పాలనుకుది. కానీ మౌనంగానే తన భావాలను వాసు మనసుకి అందించింది.

కాసేపటికి తెప్పరిల్లి అంది. "వాసూ! నువ్వు చదువుకోవాలని ఎందుకు ప్రయత్నించలేదు?"

"ఎలా చదువుకోను? బడికి వెళ్ళలేనుగా"అన్నాడు వాసు.

చిర్నవ్వి అంది రాధ. "బడి అంటే ఓ వందమంది పిల్లలూ, నలుగురైదుగురు టీచర్లూ, ఉదయం నుండి సాయంత్రం దాకా పిల్లలకు ఏమిటి అర్ధం అయ్యిందో గమనించకుండా ఒక సబ్జెక్ట్ తరువాత ఇంకొకటీ చెప్పుకుంటూ పోయేదేనా బడి ఆంటే. చదవడం నేర్చుకుంటే ప్రపంచాన్ని మించిన పాఠశాల లేదు. నేను నేర్పుతాను. నేర్చుకుంటావా?"అడిగింది రాధ.

"తప్పకుండా. ఇవేళనించే నేర్పు" ఉత్సాహంగా అన్నాడు వాసు. "కానీ నేను కూర్చోలేనుగా. ఎలా రాయడం?" అంతలోనే మళ్ళీ సందేహం. "ఇన్నేళ్ళకి నేను చదువుకుంటానంటే అంతా నవ్వరూ..చదివి నేనైమైనా ఉద్యోగాలు చేయాలా అని వెక్కిరించరూ"

ఆలోచిస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది రాధ. ఆమెకి కోపం వచ్చిందేమో అని భయపడ్డాడు వాసు.

మంద్రస్వరంతో అనునయిస్తున్నట్టు చెప్పసాగింది రాధ. "చూడూ వాసూ!కన్నా! నే చెప్పేది జాగ్రత్తగా విను. నువు పడుకుని అలా ఆకాశంవైపు, క్రింద జరుగుతున్న విషయాలు చూస్తున్నప్పుడు ఆలోచించు.

"నీకు పోలియో వచ్చి ఇలా అయిపోవడం మంచానపడడం దురదృష్టకరమే...కానీ నీ జీవితం ఆగిపోలేదుగా..నీ వయసు పెరుగుతునే ఉందిగా...నీ కర్మని తిట్టుకుంటూనో నీమీద నువ్వు జాలి పడుతూనో ఇన్నాళ్లు గడిపేవు. కానీ నీకు చదువుచెప్పించాలన్న, చెప్పించవచ్చన్న ఆలోచన ఎవరికీ రాకపోవడం ఆశ్చర్యం. నీకు చదువు ఉంటే, ఈ లోకాన్ని చూడకపోయినా, ఈ లోకం గురించి తెలుస్తుంది. పుట్టంధుడైన బ్రెయిలి చదువుకోవాలనే తపనతో ఓ లిపినే సృష్టించి అంధులకు మార్గం చూపించేడు. స్టీఫెన్ హాకింగ్ తను వీల్ ఛైర్ కి పరిమితమైనా ప్రపంచఖ్యాతిని పొందే పరిశోధనలు చేసి పెద్ద పేరున్న శాస్త్రవేత్త అయేడు.

"నువ్వు అదృష్టవంతుడివి. నీకు కళ్ళున్నాయి. ఆలోచించగల శక్తి ఉంది. ఎదుటివారి సమస్యలని అర్ధం చేసుకోగల సహృదయం ఉంది. మీ నాన్నగారిని నాతో పెళ్ళికి నువ్వు వప్పించడం అందుకు రుజువు. చదువుకోవాలనే తపన ఉంటే ఎవరు ఏం అంటారో, అనుకుంటారో అన్న భయం తగదు.

"ప్రపంచంలో ఏ మనిషికీ ప్రక్కమనిషి గురించి పదేపదే పట్టించుకొనే తీరిక ఉండదూ శ్రద్ధా ఉండదు. మనలో ఉన్న భయాలు, అనుమానాలు మనలను ఇతరులగురించి ఆలోచింపజేసేంతగా ఇతరులూ మనగురించి ఆలోచించరు. మన జీవితాలను మనమే తీర్చిదిద్దుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు మనమే మనలని బాగు చేసుకోవాలి. " తన మాటలని ఆపుతూ అంది రాధ " ఆలోచించు కన్నా. త్వరలోనే నీ చదువు మొదలుపెడదాం."

తన పిన్ని మాటలు అర్ధం అయీ అవనట్టన్నాయి వాసుకి. కానీ చదువు కోవాలనికిటికీ బయట ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలని తపన మొదలైంది.

వాసు చదువు ను ఓ ప్రణాళిక ప్రకారం మొదలుపెట్టింది రాధ. ముందు వర్ణమాల ఉన్న పటాలను తెప్పించి వాసు పడుకున్నా కనబడేటట్లు తగిలించి, అక్షరాలను గుర్తు పట్టి చదివేలా చేసింది. తరువాత దిళ్ళు ఎక్కువగా పెట్టి చేరబడ్డా వ్రాసే వీలున్నట్లు ఓ ఏటవాలుగా బల్లచేయించి , జేరబడి కూచున్నా రాయగలిగేటట్లు చేసింది.

బహుశా ఈ పధ్నాలుగు ఏళ్ళ వయసులో మొదలుపెట్టడం మూలాన, నేర్చుకోవాలి అనే తపన ఉండటం మూలాన చాలా త్వరగానే స్వయంగా చదవడం అలవాటు అయింది వాసుకి. తెలుగు లో బాలలబొమ్మల పుస్తకాలతో మొదలుపెట్టి , క్రమంగా. చిన్న చిన్న పుస్తకాలు చదవడం, ఆపై చదివిన వాటి సారాంశం రాయడం అలవాటు చేసింది. రాధ, వాసుతండ్రి తరచూ వాసు పక్కనే కూర్చొని , ఆరోజు వాసు పూర్తిచేసిన పుస్తకం మీద చర్చించేవారు. అలా వాసుకి పుస్తకం చదవడం ఎలాగో తెలిసింది.

ఏడాది తిరగకముందే స్వంతంగా ఏదైనా విషయం మీద రాయగలిగే పట్టు సంపాదించేడు వాసు.

వాసుతండ్రి వాసుకి జిల్లాకేంద్రం నుండి వస్తూ ఓ బైనాక్యులర్ తెచ్చిఇచ్చాడు. వాసుకి ఇది ఇంకా ఉపయోగబడసాగింది, బయట బస్టాండు దగ్గర జరిగే హడావుడి ని చూడటానికి.

ఒకరోజు అలా బయటరోడ్డు మీద జరిగే వన్నీ చూస్తున్న వాసుకి, ఆ బస్టాండ్ పక్కనున్న చెట్టు మీద ఉన్న కాకిని గురిచూస్తున్న ఓ కుర్రవాడు కనబడ్డాడు. ఏంచేస్తాడో అని ఆసక్తిగా ఆ కుర్రాడ్ని చూడసాగేడు వాసు.

ఉండేలులో ఓ గులకరాయి పెట్టి కొమ్మమీద ఉన్న కాకికి గురిపెట్టి కదలకుండా నిల్చున్నాడు ఆ పిల్లవాడు. గురిచూసి గురిచూసి రాయిని వదిలేడు. ప్రమాదం వస్తుందని గ్రహించేలోపలే ఆ గులకరాయి కాకికి తగిలి , ఆ పక్షి కిందరాలిపోయింది. అంతే....మొత్తం చెట్టు మీదున్న కాకులన్నీ గోలగోలగా అరుస్తూ, ఆ పడిపోయిన కాకి చుట్టూ తిరుగుతూ అరవసాగేయి. ఆ కుర్రవాడు అలానే కదలకుండా చూడసాగేడు. ఓ పదినిమిషాలు అవి అలా అరచి గోలచేసేక మెల్లగా వెళ్ళిపోవడం గమనించి, తాను దాక్కున్న చోటునుంచి మెరుపులా పరిగెత్తుకు వచ్చి ఆ చనిపోయిన కాకిని చటుక్కున తన సంచీలో వేసుకొని ఓ మూలకి పారిపోయేడు. ఓ కాకి అరుస్తూ వచ్చి వాడ్ని పొడవబోయింది కాని అప్పటికే వాడు దానికందకుండా దాక్కున్నాడు.

ఇదంతా గమనించిన వాసు వాటి జాతిలో ఓ పక్షి కోసం అవిపడ్డ తపన ఆసక్తికరమైన ది గా అనిపించింది.

ఈ సంఘటన చూసిన నెలరోజులకి వాసు జీవితంలో తుఫాను రేపిన సంఘటన కళ్ళకి కనబడింది.

ఆ రోజు సంజెవేళ , బైనాక్యులర్ లోంచి బయటకు చూస్తున్న వాసుకి అక్కడున్న జనాలందరూ హడావుడిగా ఆ స్థలం వదిలి వెళ్ళడం కనిపించింది. ఉన్న రెండుమూడు దుకాణాలు మూసేశారు. ఇంతలో కనకం కొడుకుని ఎవరో తరుముతూ వచ్చి పట్టుకుని కిందపడేసి అతని వీపుమీద మోకాలు పెట్టి కదలకుండా కూర్చున్నాడు. కనకం కొడుకు గిలగిల లాడుతూ తలెత్తాడు. బైనాక్యులర్ లో ఆతని తల నా చేతికి అందేలా కనిపించింది.

ఇంతలో ఓ జీపు వచ్చి ఆగింది. అందులోంచి ఓ నలుగురు వ్యక్తులు దిగారు. కనకంకొడుకును నిలబెట్టి జబ్బలకింద చేతులు పట్టి మళ్ళీ పారిపోకుండా ఇరువైపులా పట్టుకున్నారు. మంచి దుస్తులు వేసుకొన్న ఒకాయన కనకం కొడుకును ఏదో ప్రశ్నించాడు. కనకంకొడుకు తల అడ్డంగా ఊపుతూ ఏదో చెప్పేడు. ఆ ప్రశ్నిస్తున్నాయన అకస్మాత్తుగా చాచిపెట్టి కనకంకొడుకును ఒక్కటి కొట్టేడు. మళ్ళీ వారిద్దరిమధ్య ఏదో వాదులాట జరిగింది. ఇంతలో ఆయన ఒక్క అడుగు వెనక్కి వేసి పక్కనున్న వాడివైపుచూసి తల ఊపేడు. ఆ వ్యక్తి కత్తితో కనకంకొడుకును ఓ పోటుపొడిచేడు. మళ్ళీ మళ్ళీ పొడిచేడు. కనకంకొడుకు కాళ్ళమీద కూలబడ్డాడు. అతన్ని పట్టకున్న వాళ్ళిద్దరూ ఆతన్ని వదిలేసేరు. కనకంకొడుకు నేలమీద పడి కొంతసేపు కొట్టుకొని చలనం లేకుండా అయిపోయేడు. ఆ పెద్దాయన కాలితో కనకంకొడుకును ఓ సారి తన్ని జీపు ఎక్కి మిగిలిన అందరితో వెళ్ళిపోయాడు. జీపు తిరుగుతూండగా ఆ వ్యక్తి తల ఎత్తి వాసు కిటికీ వైపు చూసేడు. బైనాక్యులర్ లో ఆ వ్యక్తి మొఖం స్పష్టంగా కనబడింది వాసుకి. అప్రయత్నంగా తన బైనాక్యులర్ ని దించేసేడు వాసు.

కాసేపటికి మళ్లీ కనకంకొడుకు వైపు చూసేడు. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కనకంకొడుకు శరీరం ఒంటరిగా పడివుంది. ఇంతలో కనకం, కనకం భర్త మరికొంతమంది ఏడుస్తూ వచ్చి ఆ శరీరాన్ని తీసుకువెళ్ళిపోయారు.

ఈ సంఘటన చూసిన వాసు మెదడు మొద్దు బారిపోయింది. అచేతనంగా అలా ఉండిపోయాడు. ఆ కుర్రవాడికి కొద్దిరోజుల క్రితం కాకి చనిపోతే మిగిలిన కాకులు చేసిన గోల గుర్తొచ్చింది. 'కాకిపాటి చేయడా మనిషి'అనుకున్నాడు. ఎవరూ ఎందుకు అడ్డుకోలేదు సాటిమనిషిని చంపుతుంటే. అందరూ అలా పారిపోయేరేం... ఇలాటి ప్రశ్నలు ఆ పసిహృదయాన్ని బలంగా తాకేయి.

"అమ్మా!"అని గట్టిగా అరచి స్పృహ తప్పిపోయాడు.

వాసుకి తెలివి వచ్చేసరికి, ఆతృతగా చూస్తూ తల్లీదండ్రీ కనబడ్డారు.

"ఏమయింది కన్నా!" ఆందోళనగా అడిగింది రాధ.

"అమ్మా! అక్కడ చూడు" అంటూ కిటికీ వైపు భయంగా చూపించేడు కళ్ళు మూసుకుంటూ.

" ఏముందక్కడ? " అంటూ వాసుతండ్రి, రాధా బయటకు చూసేరు. "ఏమీలేదే!".

వాసు కొంచెం మెడ ఎత్తి ఆ హత్య జరిగిన చోటువైపు చూసేడు. చిమ్మచీకటిలో ఏమీ కనబడలేదు.

"కనకంకొడుకు రావుడ్ని చంపేసేరు నాన్నా" భోరుమన్నాడు వాసు. మళ్ళీ భయంతో స్పృహ తప్పి పడిపోయేడు వాసు.

మళ్ళీ తెలివి వచ్చేసరికి తెల్లవారిపోయి చాలాసేపయింది. తనకి తెలివి వచ్చినట్లుగా తెలియజేసే కాలింగ్ బెల్ నొక్కేడు. కనకం రాలేదు, రాలేదు గదిలోకి. రాధ వచ్చింది.

"ఏం పిన్నీ! నేను చెప్పింది నిజమే కదూ... రావుడ్ని చంపేసేరు కదూ" అన్నాడు వాసు , తనకి దైనందిన కార్యక్రమాలు చేస్తున్న రాధతో.. ఆమె మౌనంగా వాసుకి తడిగుడ్డతో వళ్ళంతా తుడుస్తూ ఉండిపోయింది.

"మాట్లాడవేం పిన్నీ?" కోపంగా అరిచినట్లు అన్నాడు వాసు. "కనకం రాలేదేం? నువ్వెందుకు చేస్తున్నావివన్నీ"

"ఒంట్లో బాగాలేదని రాలేదు. రేపొస్తుందిలే." అంటూ మళ్ళీ "ఎందుకలా అరుస్తున్నావు. నేనేమీ దూరంగాలేనే" అంది కోపంగా.

రాధగొంతులో కోపం చూసి కొద్దిగా భయపడ్డాడు వాసు. ఆ కుర్రాడికి అనుభవంలేదు రాధ కోపం.

"కానీ ...కానీ... నేను చూసేను. రావుడ్ని ఎవరో చంపేసేరు."కళ్ళంట నీళ్ళు ధారగా కారుతుండగా నిస్సహాయంగా అన్నాడు వాసు..

రాధ ఏమీ అనలేదు. చురుగ్గా చూసింది వాసువైపు. "అవును నేను చూసేను. ఈ బైనాక్యులర్ లో స్పష్టంగా కనబడింది."అన్నాడు నిజమా అన్నట్లున్న ఆ చూపుకి.

ఇంతలో వాసుతండ్రి గదిలోకి వచ్చి మౌనంగా వాసు ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు. ప్రశ్నార్ధకంగా రాధవైపు చూసేడు. ఆమె చిన్నగా తలపంకించింది.

వాసు చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆయన అనునయంగా అన్నాడు" ఓ సారి బయటికి చూడు వాసూ! .

వాసు బయటికి చూసేడు. బయట అసలేం జరగనట్లు , ఓ నిండుప్రాణం అక్కడ పోయింది అన్న సంగతే లేనట్లు, ప్రపంచం మామూలుగా రోజూ నడుస్తున్నట్లు నడుస్తూంది.

వెనక్కి తిరిగి తండ్రి వైపుచూసి అన్నాడు పంటిబిగువున "కానీ నిన్న సాయంత్రం అక్కడ రావుడ్ని చంపేసేరు. నేను స్పష్టంగా చూసేను.".

"నువ్వేమీ చూడలేదని నేనడంలేదు. అవును. రావుడ్ని నిన్న పక్కూరిలో ఉండే మాజీ ఎమ్మల్యే, ఆతని మనుషులు చంపేసేరు. రాత్రే పోలీసులు ఆ శవాన్ని తీసుకెళ్లారు. ఇవేళ కనకానికి ఆమె భర్తకి శవాన్ని అందజేస్తున్నారు.

"తన కూతురితో చనువుగా ఉంటూ మోసంచేసేడని రావుడిమీద ఆ మాజీఎమ్మెల్యేకి కోపంగా ఉందిట. కూతురి పెళ్ళి రేపు జరగబోతోంది. ఈ రావుడితో కూతురు ఎక్కడికో పారిపోతుందని అనుమానం. అందుకే నిన్న చంపించేసేడు. అతనికి భయపడి ఎవరూ బయటకి చెప్పలేరు. ఎలాగో తెలిసింది పోలీసులకి. వాళ్ళు వచ్చి విచారణ జరపుతారు. "

"నా దగ్గరకు వస్తారా... వస్తే నేను జరిగిందంతా వాళ్ళకి చెప్తా" అన్నాడు వాసు.

చాలాసేపు మాటలను కూర్చుకుంటున్నట్టు ఆగి అన్నాడు వాసుతండ్రి. " ఆ మాజీ ఎమ్మెల్యే చాలా కర్కోటకుడు. చాలా చెడ్డవాడని పేరు. తననెదిరించిన వాళ్ళని బతకనీయడు.  మనం చాలా సామాన్యులం. ఆయననెదిరించి నిలబడలేం. ఆయనకి జిల్లా స్థాయిలో కూడా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. ఆయనకి నువ్వు చూసేవేమోనన్న అనుమానం కలిగింది. అందుకే ఇవేళ ఆయన మనిషిగా ఉన్న మన ఊరి సర్పంచ్ నా దగ్గరకు వచ్చి నువ్వేమైనా చూసేవా? అని లోపాయకారి గా విచారించడానికి వచ్చేడు. నీ సంగతి తెలసు మన సర్పంచికి. నీవేమీ చూసే అవకాశం లేదని చెప్పి పంపేసేను. ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదు. మన కుటుంబం మీద ఆధారపడి ఇంకా చాలా కుటుంబాలున్నాయి, కనకం వాళ్ళలాగా. నీ కంట పడరాని దృశ్యం పడింది. కాలమే నీకు ఆ సంఘటన మరిచిపోయేట్లు చేస్తుంది. ఇంతకన్న మనం ఏం చేయగలం? " అన్నాడాయన.

"కానీ...కానీ... మొన్ననే చూసేను , ఒక్కకాకి చనిపోతే అన్నికాకులూ అంత బాధపడ్డాయే...తోటివాడు పోతే అందరూ ఇలా మరిచిపోడానికి ప్రయత్నించడమేనా! ఆ హంతకుడికి శిక్ష పడద్దా?" అడిగాడు వాసు. "నేను జరిగింది అందరికీ చెప్తాను" అన్నాడు.

"ఎలా చెప్తావ్? "అడిగాడు అతని తండ్రి.

ఆవేశంతో ముందుకు వాలిన నా శరీరం నిస్సహాయంగా వెనక్కి వాలిపోయింది , నేనేమీ చేయలేనన్న విషయం వాసుకి తట్టగానే..
రాధ వైపు చూసి జాలిగా అడిగాడు"పిన్నీ ! నాకు చదువు చెప్పి , ఆలోచించడం నేర్పావే... నువ్వైనా హెల్ప్ చెయ్యవా"

వాసుతండ్రి కుర్చీలోంచి లేచి నిలబడి అన్నాడు. "నీకు చదువు చెప్పినదీ, ఆలోచన చేయడం నేర్పినది నీ కన్న పెద్దవారు చెప్పింది విని అర్ధం చేసుకోవాలనీ, నీ మీద ఆధారపడి ఉన్న జీవితాలగురించీ వివేచనతో నిర్ణయం తీసుకోవాలని. ఈ విషయంలో ఇంతకన్న ఏమీ చేయలేం. "

వాసుతండ్రి రాధని రమ్మన్నట్టుగా సైగచేసి బైటకి వెళ్ళాడు. రాధ కూడా వెనకనే వెళ్ళింది..

వాసు మనసులో ఆలోచనలు సుళ్ళుతిరిగేయి. ఉండేలు దెబ్బతిన్న కాకి కోసం మిగిలిన కాకులు అంత అరచి గోలచేసి తమ సానుభూతి ని.ప్రకటించాయే...మనిషి కి మనిషి అన్యాయం చేస్తే ఎవరూ నోరెత్తరేం? నన్ను కూడా మౌనంగా ఉండమంటారేం? వాసుకి దుఃఖం తన్నుకు రాసాగింది.

వారంరోజులు గడిచేయి. రాధతో ఎంతో వాదించేడు వాసు.."కనీసం బయట ప్రపంచానికి నిజాన్ని తెలియజేయనీయి" అన్నాడు బ్రతిమాలుతూ. ఎంత పరుషంగా మాట్లాడినా

అన్నిటికీ ఒకటే సమాధానం రాధది. " మీ నాన్నగారేంచేసినా బాగా ఆలోచించి చేస్తారు వాసూ! ఆయన చెప్పినట్లు చేయడం మనకి మంచిది".

కనకం మళ్ళీ పనిలోకి వచ్చింది. రావుడ్ని చంపేసిన విషయం ఆమెతో ఎత్తేడు వాసు. "అమ్మ నాకు అంతా సెప్పినారు బావూ. ఆడి కర్మ అలాగ కాలిపోయింది, ఏటిసేత్తాం. మాలాటోళ్ళ బతుకులింతే బావు".అంది ఏడుస్తూ.

మర్నాడు కనకాన్ని అడిగేడు" ఓ చిన్న పని చేస్తావా కనకం."

"ఏటి బావూ " అంది.

వాసు పిన్ని రాధ వాసుచేత దినపత్రికల సంపాదకులకి ఉత్తరాలు రాసే అలవాటు చేసింది. అందుకే వాసుకి అందుబాటులో కొన్ని కవర్లూ , తెల్లకాగితాలూ ఉంచింది. ఆ కవరులో ఒక ఉత్తరం పెట్టి అంటించి చిరునామా రాసి ఇచ్చేడు కనకానికి.

"ఎవరికి, పిన్నికి కూడా తెలియకుండా ఈ ఉత్తరాన్ని పోస్టుడబ్బాలో వేయాలి. పిన్నికి తెలిసిందో అన్నం నీళ్ళు మానేసి చచ్చిపోతాను. ఏదీ ఒట్టేయి" అని వట్టువేయించుకొని ఉత్తరం ఇచ్చేడు కనకానికి.

తన కొంగులోదాచుకొని తీసుకువెళ్ళి ఆ ఉత్తరాన్ని డబ్బాలో వేసింది కనకం.

*******

ఉత్తరం పోస్ట్ లో వేసిన పదిహేను రోజులకు వాసు ఇంటిముందు పోలీస్ జీప్ ఆగింది. అందులోంచి ఒకాయన దిగేడు. వాసుతండ్రి ఆయనకి ఎదురు వెళ్ళి నమస్కరించి ఏదో మాట్లాడటం కనబడింది వాసుకి. ఆ పోలీసాయన ఎదో అడిగాడు, వాసుతండ్రి వాసు ఉన్న గదివైపు , ఆ కిటికీ వైపు చూపించి ఏదో చెప్పేడు. కాసేపటికి వాళ్ళిద్దరూ వాసుఉన్న గదిలోకి వచ్చేరు రాధతో పాటు. మరో కుర్చీ తెప్పించి ఆయనకి వాసు మంచందగ్గరగా వేసేరు. ఆయన అందులో కూర్చొని వాసునుద్దేశించి అన్నాడు " నా పేరు ఆనందరావు. నేను ఈ జిల్లా పోలిస్ సూపర్నెంట్ ని. జిల్లా జడ్జి గారికి ఉత్తరం రాసింది నువ్వేనా? "

పోలీసులు అనగానే వాసుగుండల్లో రాయిపడ్డట్టయ్యింది. భయంభయంగా ఔనన్నట్టు తలూపేడు. వాసు భయాన్ని గమనించిన ఆయన "భయపడకు. నీ ఉత్తరం జడ్జి గారు చదివి విచారణ చేయమని నాకు ఇచ్చేరు. అందుకే వచ్చేను. ఇప్పుడు నువ్వు జరిగింది జరిగినట్టు ఏంచూసేవో అదంతా చెప్పు."

వాసు ఆవేళ జరిగింది అంతా తను చూసింది చెప్పేడు. మధ్యమధ్యలో ఆయన ఒకటి రెండు ప్రశ్నలడిగేడు. తనతో తెచ్చిన వాసుఉత్తరంతో వాసు చెప్పిన విషయాలను పోల్చిచూస్తూ. ఆయన లేచి వాసు మంచంమీంచి కిటికీ లోనుండి బయటకు చూసేడు , అసలు కనబడే అవకాశం ఉందోలేదో అని. వాసు బైనాక్యులర్ తీసుకుని దాంతోటీ చూసి సాలోచనగా తలూపేడు.

ఆనందరావు లేస్తూ "అబ్బాయి! ఈ చిన్నవయసులోనే నీకు నువ్వు నమ్మిన నిజాన్ని పై అధికారులకు చెప్పాలనే సంకల్పం ఉండటం నిజంగా అభినందిచాల్సిన విషయం. నేను ఇక్కడ తెలుసుకున్నవి జడ్జిగారికి రిపోర్ట్ చేస్తాను. చట్టప్రకారం ఎటువంటి చర్యలు, తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. హంతకుడికి శిక్ష పడేలా చేస్తాం." అన్నాడు.

బయటకు వచ్చేక వాసుతండ్రికి చెప్పేడు. " సాక్ష్యం చెప్పడానికి బహుశా కోర్టుకు అబ్బాయి రావలసి ఉంటుంది. మరి తేగలరా? అబ్బాయి శారీరక స్థితిని బట్టి ఎలా సాక్ష్యాన్ని రికార్డు చేస్తారో చూడాలి."

"తప్పనిసరి అయితే ఎలాగోలా తీసుకొస్తాం"అన్నాడు వాసుతండ్రి.

జీపు వెళ్ళడం తన కిటికీ లోంచి చూసేడు వాసు.

వాసు భుజాన్ని మెల్లగా అభినందిస్తున్నట్లు నొక్కి రాధ కిందకి వెళ్ళింది.

తరువాత ఆరునెలలవరకూ ఏమీ తెలియలేదు వారికి. ఒకరోజు మళ్ళీ ఆనందరావు వారింటికి వచ్చేడు. ఈ సారి కారులో.

వాసుగదిలోకి వచ్చేరు వారందరూ. నిలబడే వాసుకి షేక్ హేండ్ ఇచ్చి అన్నాడు ఆనందరావు. "కంగ్రాట్స్ వాసు. నీ ఉత్తరం వల్ల హంతకుడికి శిక్షపడింది. నీ పరిస్థితి వివరంగా చెప్పేక మేం చేసిన విచారణ వల్లా ఆ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ఎవరైతే రావుడ్ని పొడిచేడో, వాడు నేరం ఒప్పుకోవడంవల్ల, వాడికి శిక్ష పడింది. "

వాసుతండ్రి ఆయనను సాగనంపడానికి బయటకు వెళ్ళేడు. ఆనందరావు కారెక్కబోతుంటే వాసుతండ్రి అడిగాడు. "నిన్న మాజీ ఎమ్మెల్యే ని నక్సల్స్ చంపేసేరని విన్నాను. నిజమేనా?".

ఆనందరావు వాసుతండ్రికేసి దీర్ఘంగా చూసి అన్నాడు. " ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బయటకు తెలిస్తే మీరు చాలాకాలం జైల్లో గడపవలసి వస్తుంది. అర్ధం అయిందా?

" నిజానికి మీ అబ్బాయి రాసిన ఉత్తరం జడ్జి గారు నాకందజేసేక, నేను చాలా ఆలోచనలో పడ్డాను. మాది ఇక్కడికి పక్కనే ఉన్న గ్రామం. అది ఒకప్పుడు ఈ జిల్లాలోనే ఉండేది. జిల్లాల విభజనలో ఈ జిల్లా కి, పక్క జిల్లాకి సరిహద్దు గ్రామం గా అయింది. ఈ మాజీ ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళక్రితం రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో, పార్టీలో తనకన్నా ఎక్కువ పలుకుబడి ఉన్న మరో రాజకీయ నాయకుడిని అడ్డు తొలగించుకోడానికి హత్య చేయించేడు తన అనుచరుడితో. ఆ హత్యకాబడ్డ వాడు నా మేనమామ. అందరికీ తెలుసు వీడే చంపించేడని".

" ఏమయింది. ఆతనికి శిక్ష పడలేదా" అడిగేడు వాసుతండ్రి.

"లేదు. ఆ అనుచరుడు పోలీసులకు లొంగిపోయి, "పాతకక్షలతో ఆవేశంతో చంపేసేను" అని వప్పుకున్నాడు. అప్పుడు న్యాయమూర్తి ని మేనేజ్ చెసి తక్కువ శిక్షతో బయటపడేసేడు. అప్పట్నుంచి వీడికి ఇలా హత్యలు చేయడం అలవాటుగా మారింది. మీ పనిమనిషి కొడుకును కూడా అలాగే చంపేడు. మాకు మావైన మార్గాల ద్వారా వాడు మళ్ళీ ఇటువంటి హత్యలు చేయకుండా చేసేం.

మీ అబ్బాయిది ఎదుగుతున్న వయసు. మంచి అనుకున్నది చేయాలనే తపన ఉంది. వాడిని ఇప్పుడు నిరుత్సాహ పరిస్తే భవిష్యత్తులో అందరిలాగే మారే ప్రమాదం ఉంది. అందుకనే అతని ఉత్తరం వల్ల నేరస్థుడు శిక్షించబడ్డాడని చెప్పేను. మీరుకూడా ఈ సంగతులన్నీ వాడికి తెలియజేయరనే అనుకుంటాను. వస్తాను. "
కారు స్పీడందుకొని మలుపు తిరిగేదాకా నిశ్చేష్టుడై నిలబడి చూస్తుండి పోయాడు వాసుతండ్రి.



********అయిపోయింది*******
---------------------------------------------------------------------------------------------------------------------------


ఈ కథ నేను 1980 లలో రాసేను. కధావస్తువు నాకెందుకో బాగా నచ్చి, రాతప్రతిని అలాగే ఉంచేసేను. ముందు రాసిన కధకి ఇప్పుడు రాసిన దానికి, ముగింపు కొంచెం మార్చేను. మొదటరాసినది ఫస్ట్ పర్శన్ లో రాసేను. కానీ మార్చిన ముగింపు థర్డ్ పర్శన్ లో రాస్తేగాని బాగా రాదని పించింది. 

5 comments:

  1. కొస మెరుపు ల రచయిత గా ఓ.హెన్రీ గారిని అనుకుంటా చెపుతూ ఉంటారు..మీరు కూడా అలానే రాస్తున్నారు..నేరేషన్ చాలా బాగుంటుంది.మీ ఎనభై ల నాటి కథలు ఇలాగ వెలుగు చూడడం చాలా బాగుంది..మీ చేత్తో రాసిన మరిన్ని కధలు చదవాలని ఆశతో ఆశీర్వదిస్తూ

    ReplyDelete
  2. తప్పు చేసినవానికి శిక్ష పడాలి .అది ఎవరివల్లనైనా ,లేక ఏవిధంగా జరిగినా మంచిదే .అప్పుడే కదా మంచితనానికి ,లేదా మంచివానికి రక్షణ ఉండేది . మంచివారందరు మూగ ,చెముడు ,గ్రుడ్డి వారైతే సమాజం బాగుపడేదెన్నడు .వాసు లాంటి వారెక్కడ . నేడు చెడిన సమాజాన్ని బాగుచేయడానికి భగవంతుడే మరో అవతారాన్ని ఎత్తి రావాలేమో .
    చక్కని కథనం . చాలా భావోద్వేగంగా ఉంది .సాక్ష్యం చెప్పడానికి ముందుకువచ్చే వాసు లాంటి వారికీ చెడు జరుగుతుందని భావించా . ఆనందరావు లాంటి పోలీస్ అధికారులు ఇప్పుడెక్కడ ?
    సమాజంలొ మార్పుని ఆశించి వ్రాసినట్లున్నది .రచయిత జ్ఞ్యానం పెరిగేకొద్దీ గత రచనలలో మార్పులు చేయాలనిపిస్తునే ఉంటది .
    సామాజిక న్యాయాన్ని దృష్టికోణంలో వ్రాయబడిన రచన బాగుంది. జతిన్ కు అభినందన .

    ....శ్రీనివాస్ .

    ReplyDelete
  3. మంచి కథ, కథనం M J S గారూ. ఒక్క ఉదుటున చదివించింది నలభై ఏళ్ళైనా!

    ReplyDelete
  4. Chaala bavundi! Intha manchi kadhani 30 elluga maruguna pettesaru! Oka cinema theeyataaniki manchi ithivruttam laga vundi! Vaasuki emaina aipotundani chaala tension paddanu! But kadha chaala chakkaga muginchaaru! Nijam cheppe dhairyam andariki vundelaa!

    ReplyDelete