Friday, 13 November 2020

దీపావళి జ్ఞాపకాలు

 దీపావళి వస్తూందంటే చాలు. ఈ మనసుందే ఒక్కసారిగా చిన్నతనాన్ని సంతరించుకుంటుంది. అలా అలా శ్రీకాకుళం లోని గుడివీధిలో ఉండే మా ఇంటికి, ఆ వీధిలో మిగిలిన స్నేహితులతో గడిపిన చిన్నతనపు ఆటలనీ బంగారుకాలాన్నీ గుర్తుచేసుకుంటుంది. 


"ఆ రోజుల్లో" అంటూ పెద్దవాళ్ళు ఎవరైనా నాముందు అంటే వయసులో ఉన్నప్పుడు చీకాకు పడేవాడిని. 'ఎప్పుడూ గతంలోనే బతుకుతారు'అనుకుంటూ.

కానీ మారుతున్న ఈ రోజులు, కనుమరుగు అవుతున్న ఆ నాటి చిన్ననాటి చేష్టలూ, మీద పడుతున్న ముదిమీ నన్నుకూడా "ఆ రోజుల్లో" అంటూ గతంలోకి, ఆ అద్భుతమైన లోకంలోకి వెళ్ళమని తరుముతోంది.

దసరా పండగ అవుతూనే దీపావళి పండుగ కి కావాల్సిన సరంజామా చేకూర్చే పని మొదలయ్యేది.

నాగావళి నది లో నీరు తగ్గిపోయేది. అలా నదివడ్డున ఫాజుల్ బేగ్ పేట దాటే వరకూ ఓ అయిదారుగురం, నేనూ , సాలిగ్రామం మూర్తీ, దేవరకొండ ప్రసాద్, అధికార్ల శంకరం, జయంతి రవణ, మా అన్న ప్రభాకరం, బంకుపంతుల శ్రీను అందరం నీళ్ళలో ఆ నదివడ్డున ఉన్న జిల్లేడు కొమ్మలు కొట్టి తెచ్చి ఎండబెట్టేవాళ్ళం. అవి ఎండేక తాటికొండవారి దొడ్డివెనక ఖాళీజాగాలో ఓ గొయ్యితీసి కాల్చడం, అవి పూర్తిగా కాలిపోకుండా కప్పి పెట్టడం, రెండురోజుల తరువాత బొగ్గులని తీసి , గుండ చేసి వస్త్రకాయితం (అంటే ఒక చేనేత గుడ్డలో రెండువేపుల ఇద్దరు పట్టుకుని, వాటిలో ఈ బొగ్గులు చిదిపి వేసి సన్నని పొడి కిందకి జారేదాకా చేత్తో పామడం) పట్టి ఆ వచ్చిన పొడిని జాగ్రత్త చేసేవాళ్ళం.
ఇప్పుడు సిసింద్రీలకి గొట్టాలు చేసే పని. నాన్నగారికి సోవియట్ యూనియన్ పత్రిక స్ఫుట్నిక్ అని వచ్చేది. రెండునెలలముందునుంచి "ఇది నాకు , ఇది నాకు' అని దాచుకొనేవాళ్ళం. ఆ పత్రిక పేపర్ గ్లాసిగా ఉండి దళసరిగా ఉండేది.
మైదాపిండితో పేష్ట్ చేయమని అమ్మని బతిమాలి చేయించుకుని, ఈ పేపర్ ను హోమియోపతి మాత్రలు కట్టడానికి చేసే సైజులో కట్ చేసి వాటిని, కిల్లీలాగా ఓ చుట్టుచుట్టీ నాజూగ్గా పేష్ట్ రాసి ఎండబెట్టడం ఓ ఘట్టం. రోజూ వాటిని లెక్కబెట్టుకుంటుండడం.
ఇక సురేకారం తెచ్చుకోవడం. గుడివీధిలో ఏడురోడ్ల జంక్షన్ కి వెళ్ళే మలుపు లో కుడిచేతి వైపు ఓ ఇంట్లో ఈ మందుగుండు సామాన్లు అమ్మేవారు. అక్కడికి వెళ్ళి సురేకారం తెచ్చి ఎండబెట్టి దానిని చక్కగా నూరి, వస్త్రకాయితం పట్టి సమపాళ్లలో బొగ్గు గుండ సురేకారం కలిపి వాటిని ఈ సిసింద్రీ డొక్కులలో జాగ్రత్తగా నింపి ఓ మేకుతో గట్టిగా కూరి. , ఆ సిసింద్రీ తలని మూసి ఓ దగ్గరగా పెట్టి ఓ రెండవగానే వాటిని మరి టెస్ట్ చేయాలికదా... ఏటొడ్డున శివాలయం కి తోవ ఉండేది. ఖాళీ గా ఉండేది అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అవి చిత్రవిచిత్రంగా సుయ్ మంటూ వెళ్తుంటే గర్వంగా ఉండేది.
అలా ఓ వంద దాకా టెస్టింగ్ అయేవి. మధ్యలో "ఒరేయ్! నానిపండు గాడివి చాలా బాగా వెళ్తున్నాయట"అని అంటే వాడితో పోటీకి మరికొన్ని. మళ్ళీ మొత్తం ప్రోసెస్ తో మరికొన్ని చేసుకోవడం. అమ్మచేత ఇల్లంతా బొగ్గుగుండతోని మందు తోని నింపేస్తున్నారని తిట్లుతినడం.
ఇవి అయేక పిచ్చికలు చేయడం. బ్రిడ్జి రోడ్ మీద కనకదుర్గమ్మ గుడి పక్కన ఈ కుండలు అమ్మే ఇళ్ళు ఉండేవి. అక్కడికి వెళ్ళి పిచ్చికలకోసం చిన్నచిన్న కుండలలా చేసేవారు. ఎలాచేసేవారో అప్పుడు ఆలోచించలేదు గానీ ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం గా ఉంటుంది.
ఆ కుండలు కొని తెచ్చి అమ్మని పంచదార కొనుక్కొని తెచ్చి , పటాసు కొని , రెండు మళ్లీ చక్కగా పొడిచేసి వస్త్రకాయితం పట్టి ఆ కుండలలో కూరడం ఓ ప్రహసనం. ఆ పిచ్చికలు జుయ్ మని ఆకాశంలో దూసుకుపోతుంటే ఆనందించిన క్షణాలు ఎప్పటికీ తిరిగి రానివి.
అలాగే మతాబులు చేయడం. స్ఫుట్నిక్ మేగజైన్ లో పేపర్లతో కొంచెం పొడుగ్గా గొట్టాలు చేసీ, వాటిని ఎండబెట్టీ, సూరేకారం, గన్ పౌడర్ అని వెలుగు కోసం ఓ పౌడర్ ఉండేది అదీ , అల్యూమినియం తొక్కు, ఆముదం కలిపి చేత్తోటే కలిపి ఎండలో పెట్టి, మరీ ఎక్కువగా ఎండకూడదు ఆముదం ఆవిరి అయిపోతుంది,. మతాబాలకోసం చేసిన గొట్టాలలో ఏటొడ్డునుంచి తెచ్చిన ఇసక కొంచెం పోసి దానిమీద పైన చెప్పిన మతాబాలమందు కూరి , మరీ గట్టిగా కూరకూడదు, మీద మూసేసి ఓ పక్కగా పెట్టేవారు. ఇదే మందు చిచ్చు బుడ్లలోకి కూడా.
చిచ్చుబుడ్లని మళ్ళీ ఆ కుండలమ్మే దుకాణం కి వెళ్ళి తెచ్చి ఎండలో పెట్టి ముందుగా, చిచ్చు బుడ్డి కి ఉండే కన్నాన్ని పేపర్ తో కవర్ చేసి , కొంచెం సిసింద్రీలకోసం తయారు చేసిన మందు "రాయబారం" మందు వేసి ఆపైన మతాబాలకోసం చేసిన మందు అవేపాళ్ళతో చేస్తాం కదా దాన్ని వేసి కుడిచేతి బొటనవేలితో దగ్గరగా కూరి ఆ పైన కొంచెం న్యూస్ పేపర్లతో చేసిన ఉండలని పెట్టి, ఆ కిందన మట్టితో మూసి ఎండలో పెట్టడం.
బజారు లో తాటిరేకులు అగాదాలకోసం చక్కగా చెక్కిన వి అమ్మేవారు అవి తెచ్చి, వత్తులు, పటాస్, గంధకం, గన్పౌడరూ తెచ్చి 2,1,1 పాళ్ళని గుర్తు. రెండుపాళ్ళు పటాసు కి ఒకపాలు గంధకం ఒకపాలు గన్పౌడరు జాగ్రత్తగా కలిపి , ఆ మందుని తాటాకులు రెండుతీసుకొని వాటికి ఓ మూల ఈ వత్తిని చిన్న ముక్కలుగా చేసి ఓ వత్తిని పెట్టి, అత్యంత కళాత్మకంగా అగాదాని తయారు చేసేవాళ్ళం. అవి ఢాం అని పేలితే ఆనందం్ తుస్సుమందా ఏడుపు...
మా అన్నయ్య ఫణి , వాడి స్నేహితులు, పంతులవారి బాబీ , తుమరాడ బాబ్జీ, బాచిగాడు (భాస్కర్).జయంతి భాస్కరప్రసాద్ వీళ్లంతా తారా జువ్వలు, బాంబులూ చేసేవారు.
కొంచెం పెద్దయ్యాక అరసవల్లి లో అగాదాలు , తారాజువ్వలూ, చిచ్చుబుడ్లని అమ్మేవారు. అక్కడ్నించి తెచ్చుకోవడం. కాలేజీలో అడుగు పెట్టేక పెద్దవాళ్ళం అయేమని సిసింద్రీలూ పిచికలూ చేయడం మానేసి , అగాదాలు లక్ష్మీ బాంబులు కాల్చడంలో హీరోయిజం చూపడమే...
ఇప్పుడా... ఇప్పుడు మనవరాలు భయపడి గట్టిగా పట్టుకుంటే "ఏం భయం లేదమ్మా " అంటు గదిలో కూర్చోవడమే...

2 comments:

  1. K V Prabhakararao: బావున్నాయి సార్ ! మీ జ్ఞాపకాలు! నేను నా జ్జాపకాలు మీతో పంచుకుందామని అంతా వ్రాసాక పోస్ట్ చేయగానే డిలీట్ అయిపోయింది, కామెంట్స్ పదసంఖ్యా పరిమితులేమైనా వున్నాయా?

    ReplyDelete
  2. లేవే... ఇది పబ్లిష్ అయిందిగా

    ReplyDelete