"మీరోసారి హేర్ కట్ చేయించుకోవాలేమో" ఆజ్ఞలాంటి సలహా పడేసింది శ్రీమతి. ఆవిడ గమనించి అలాంటి సలహా ఇస్తే ఇక తప్పేదేముంది, ఇంత త్వరలో తిరుమల ప్రయాణం కూడాలేదు.
"అవును. నాకూ అలానే అనిపిస్తుంది" అద్దంలో చూసుకుంటూ గంభీరంగా అని బయటపడ్డాను.
ఉజ్జోగం వెలగబెడుతున్నప్పుడు ఖచ్చితంగా నెలతిరిగేసరికి అలవాటు పడ్డ సెలూన్ కి వెళ్ళేవాడిని. రిటైర్ అయ్యాక నాకు చీకాకుగా అనిపిస్తేనో...ఇదిగో ఇలా ఆవిడ నోటీసు జారీ చేసినప్పుడో సెలూన్ కి వెళ్ళడం జరుగుతూంది. అదీకాక ఆరునెలలకొకసారి తిరుమలలో పరకామణి సేవ పడితే మూడునెలలు గుండుతో, మూడునెలలు గడ్డం జుత్తూ తప్పేవికావు..
ఇంతలో కరోనా వచ్చిపడింది. మూడునెలలు బయటకు వెళ్ళడం బంద్... ఆ తరువాత కూడా 'ఎందుకు రిస్క్ ' అని అర్బన్ కంపెనీ వాడి బిజినెస్ తెలివితేటలవల్ల ఆ మంత్రిగారెవరో ఇంటికే వచ్చి చక్కగా జుత్తుకత్తిరించి, ఒక్క వెంట్రుక కూడా కిందన వదిలేయకుండా నీట్ గా చేసి వెళ్ళడం ఓ పరిణామం.
ఇవేళ మళ్ళీ మూడున్నరేళ్ళ తర్వాత బయట సెలూన్ లో చేయించుకొని వస్తూంటే చిన్ననాటి జుత్తు తరగడం ప్రహసనాలు గుర్తుకొచ్చాయి.
గుడివీధిలో మా పెదనాన్న గారి కర్రల దుకాణం వెనక , బడికి ముఃదూ ఉండేవాడు మంగలి అప్పారావు. నాన్నగారు నెలకోసారి వాడ్ని పిలిచి ఆయనకీ నాకు మా తమ్ముడు కి చక చక కత్తిరింపించేవారు. ఆయనకి అర్ధరూపాయి మాకు చెరో పావలా ఛార్జీ. మా ఇంట్లో కి అడుగుపెడుతూనే చిన్న ఖాళీ ప్రదేశం ఉండేది. అందులో కూర్చొని బుర్రలప్పగించేస్తే వాడికొచ్చినట్టు కట్ చేసేసే వాడు. ఓ రోజు మరీచిన్నగా, ఇంకోసారి ఒకదగ్గరెక్కువా ఒకదగ్గర తక్కువ, ఇలా వాడి నైపుణ్యం మా జుత్తు ల మీదే...
కొంచెం హైస్కూలు మెట్లెక్కేక , శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్ లో అప్పుడే బ్యూటి సెలూన్ అని విద్వాన్ సి హెచ్ (మంగలి) నరసింహులు తెరిచేడు. అందులో హేర్ కట్ చేయించుకోవడం ఓ ఫేషన్ స్టేట్మెంట్ . ఆ రివాల్వింగ్ కుర్చీలో కూచొని వాళ్ళు మంచి తెల్లటి గుడ్డలు కప్పితే ఎదురుగా అద్దంలో చూసుకుంటు స్టైయిల్ గా కట్ చేయించుకోవడం కోసం అమ్మనీ నాన్న నీ సతాయించి డబ్బులు తెచ్చుకోవడం.
కాలేజీ మెట్లెక్కేక ఇంకా ఏ ఏ సెలూన్లు ఉన్నాయో అని వెతికి వెతికి వెళ్ళడం. ఆ సెలూన్లలో సినీతారల బొమ్మలు, బొమ్మల పుస్తకాలు, సినిమా పత్రికలు చూడటం ఓ సరదా. నా స్నేహితుడు ముత్యం వెంకట రమణ ఉండేవాడు. సెలూన్ లోకి వెళ్ళి అక్కడ దువ్వెనతో తల దువ్వుకొని కొంచెం పౌడర్ అడిగి ముఖానికి పట్టించి వస్తూండేవాడు.
తరువాత జ్యోతి హేర్ కటింగ్ సెలూన్ అని గౌరీశంకర్ హోటల్ ఎదురుగా వచ్చింది. శ్రీకాకుళం లో పోస్టాఫీసు లో పనిచేసినప్పుడు అంతకుముందు 'ఆరోగ్యాన్నిపుంజుకుంటున్నప్పుడూ' ..(ఖాళీగా నిరుద్యోగిగా ఉన్నప్పుడు అన్నమాట) ఈ సెలూన్ కే వెళ్ళేవాడిని. అప్పటికి ఇంగ్లీషు నవలలు చదవడం అలవాటు అవడంతో ఆ నవలలలో రాసినట్లు మనకీ ఓ ప్రత్యేకమైన హెయిర్ స్టైలిస్ట్ ఉండాలని ఆ సెలూన్ కే వెళ్ళేవాడిని , మన రేంజ్ లో...
మా అన్న ఫణికి దేవానంద్ హేర్ స్టైల్ ఉండేది. "ఒరే చూడు" భుజంమీద పొడుస్తు చెప్పేవాడు" మంగళవారం ఉదయాన్నే వెళ్ళాలి సెలూన్ కి. ఎందుకంటే సోంవారం సెలవుకదా ఆ గుడ్డలన్నీ ఉతికించి తెస్తారు." అనేవాడు.
ఈ మధ్యనే అప్పుడే హేర్ కట్ చేయించుకున్న నన్నుచూసి నాతోబాటే పనిచేసి రిటైర్ అయిన ఓ మిత్రుడు "ఇంకా హేర్ కట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా" అనడిగాడు తన బట్టతలని నిమురుకుంటూ....
No comments:
Post a Comment