...... -- మోదుకూరి జతీంద్ర శర్మ
ఎలా సంభోదించను నిన్ను?
జీవితంలో నీకు ఎన్నడూ ఉత్తరం రాసిన గుర్తులేదు. 'ఏమోయ్' అని తప్పితే నీ పేరుపెట్టి పిలిచిన గుర్తూలేదు. నీతో ఏ విషయమైనా కూర్చుని చర్చించినట్టు జ్ఞాపకం రావడం లేదు.
ఎలా సంభోదించను నిన్ను? .
ఈ క్షణంలో నీకు ఈ ఉత్తరం రాయాలని చాలా బలంగా అనిపించింది. ఈ నిమిషం లో నీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని నేను చేసిన తప్పులు అన్నీ, అన్నీ చెప్పాలనీ, ఒప్పుకోవాలనిపిస్తూంది.
బాగా ఆలస్యం చేసేను. నిజమే... అయినా ఇప్పుడు చెప్పకపోతే మరెన్నటికీ చెప్పలేను.
ఎలా సంభోదించను నిన్ను?
ఎక్కడనుండి మొదలుపెట్టను? . మన పెళ్ళిచూపులు మన జీవితాల కలయికకు మొదలుకాబట్టి అక్కడ మొదలుపెడతాను.
నేను పెళ్ళికూతుర్ని చూడటానికి శాస్త్రిగారి తో వెళ్తానంటేమా నాన్న ఏమన్నాడో తెలుసా?
"పెళ్ళిచూపులకి పెళ్ళి కొడుకు వెళ్ళడం ఏమిట్రా...అప్రాచ్యపు వెధవా? ఆడంగి వాళ్ళలా వాళ్ళింటికి వెళ్ళి 'అమ్మాయికి పాటలొచ్చా? ఆటలొచ్చా' అని చచ్చు ప్రశ్నలేయడానికా? పెళ్ళిచూపులకు పెళ్ళికొడుకు వెళ్ళడం మన ఇంటా వంటా లేవు. పంతులుగారు చెప్పారు ఆడపెళ్ళి వాళ్ళ విషయాలన్నీ. అమ్మాయి చక్కగా కుందనపు బొమ్మలాగ ఉంటుందట. వంటా వార్పూ చేతనవునట. ఆడపెళ్ళి వారు బాగా ఆస్తిపరులూ, మర్యాదస్తులున్నూ. మన తాహతుకు తగిన వారు. సంబంధం ఖాయం చేసేసేను. శాస్త్రిగారు వెళ్ళి ముహుర్తం పెట్టుకు రావడమే తరువాయి." అన్నాడు.
అయినా నేను ఒప్పుకోలేదు. పెళ్ళిచూపులకి నేను వెళ్ళితీరాలని పట్టుబట్టేను. నిన్ను చూడాలని కోరికతో కాదు. పెళ్ళిచూపుల సమయంలో చేసే హడావుడి, ఆర్భాటాలు అంటే నాకు భలే సరదాగా ఉండేది. పెళ్ళికొడుకుకి రాచమర్యాదలు చేసే ఆ తంతు అనుభవించాలని కోరికగా ఉండేది. నీకు గుర్తుందో లేదో నీ వైపుకూడా నేను సరిగ్గా చూడలేదు. ఎర్రపట్టుచీరలో సింగారించి నిన్ను తీసుకుని వచ్చిన క్షణం మాత్రం నిన్ను చూసేను.
ఇప్పుడు అవన్నీ ఎందుకని విసుక్కోకుండా చివరవరకూ చదువు. దయచేసి ఈ ఒక్కసారి కీ నన్ను ప్రార్ధించనీ...దయచేసి చదువు.
మన పెళ్ళి జరిగిపోయింది.
తొలిరాత్రి నా కోరిక తీరగానే ప్రక్కగదిలోకి వెళ్ళిపడుకున్నాను. ఆ రోజేకాదు ఆ తరువాత కూడా ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు రావడం, కోరిక తీరగానే నా గదిలోకి వెళ్ళిపోవడం తప్పితే ఎన్నడూ నీ మనసులో ఏముందో అసలు నాతో సంసారం నీకు నచ్చిందా అని తెలుసుకోవాలన్న ఊహే కలగలేదు. నీ కోరికలు, ఆశలూ, ఆశయాలు - ఇవన్నీ నీకూ ఉంటాయని అవి నేను తెలుసుకోవాలన్న ఇంగితమే కలగలేదు.
మా తాతగారి హయాంలో వంటిల్లు చావడికి దూరంగా పెరట్లో విడిగా ఉండేది. వంటిల్లు ప్రక్కనే ఒక గది. ఆ గదిలో మా మామ్మ ఉండేది. తాతగారు మామ్మ కలసి ఎక్కడికైనా కలసి వెళ్ళడం కానీ , కలసి ఏ పనీ చేయడం కానీ నాకు తెలియదు. .
మా అమ్మ హయాం వచ్చేసరికి, ఆ వంటగదిలో పని అయిపోయేక ముందుగదిలోకి వచ్చేది. మా నాన్నగది వేరేగా, అమ్మగది వేరేగా ఉండేవి. నాకు ఏడేళ్ళు వచ్చేసరికి నాకో ప్రత్యేకమైన గది ఏర్పడింది. అమ్మతో దూరం పెరగడం ఆరంభమైంది.
మా తాతగారికి బయట ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొనేవారు. మా నాన్నగారు ఆయన కన్నా ఆ విషయంలో నయం. కానీ నాన్నగారు కూడా అమ్మతో , తాతగారు మామ్మతో ఎలా ప్రవర్తిఃచేవారో అలాగే ప్రవర్తించేవారు.
మామ్మకి గానీ అమ్మకి గానీ వాళ్ళ జీవితాలు, వంటింట్లో మొదలయి , వంటింట్లో ముగిసిపోయేయి.
ఇప్పుడు ఈ గతం తవ్వుకోవడమెందుకు అని కోపగించుకోవద్దు. నా గతం నేను పెరిగిన వాతావరణం నన్ను నీ పట్ల ఇంత క్రూరంగా, ఇంత పరాయిగా, ఇంత నిర్దయగా ప్రవర్తించేట్లు చేసింది. నేను బాల్యంలో చూసిన మా అమ్మ మామ్మల జీవితాలు ఆడవాళ్ల పాత్ర అంతే అనేట్లు నాలో ఆలోచనలను కలగజేసేయి. చదువుకున్న చదువు, వికసిస్తున్న నవనాగరికతా - ఇవేవీ నా ఆలోచనల్లో మార్పు తేలేదు. అవన్నీ ప్రక్కవాళ్ళకే కానీ మాకు కాదు అనే భావన.
ఈ సంజాయిషీ అంతా నా తప్పులను ఇతరుల మీదికి, గతం మీదకి నెట్టేయడానికి కాదు సుమా!
పిల్లలగురించి నీ ఆలోచనలు, ఆశలూ ఏమిటో ఎప్పుడూ అడగాలనిపించలేదు. నీకు ఎన్నడూ నీ ఆలోచనలు చెప్పే అవకాశం ఇవ్వనూ లేదు. మన మధ్య ఈ తరహా ప్రవర్తన మన పిల్లలకి.ఏం అనిపించిందో అనే విషయం కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళు బాగా చదువుకోవడం వల్లా, దూరంగా హాస్టళ్ళలో ఉండటం వల్లా వాళ్ళ చదువులలో నా ప్రమేయం కూడా చాలా తక్కువ. సెలవులలోనో, ఏ పండగలకో వాళ్ళు వచ్చినప్పుడు కూడా తండ్రిగా హుందాగా నడిచేనే కానీ వాళ్ళలో ఒక స్నేహితుడిగా కలసిపోలేదు. వాళ్ళ ఆలోచనలూ జీవితం పట్ల వాళ్ళ దృక్ఫధం ఏవీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు.
మన ఇంట్లో నా ముందెప్పుడూ నవ్వులూ కేరింతలూ వినబడలేదు. బహుశా చిన్ననాడు వారిని నొప్పించేనేమోఎన్నడూ నాముందు పగలబడి నవ్వడం, హాయిగా స్వతంత్రంగా ఉండటం నేనెరుగను.
నాకు స్నేహితులు తక్కువ. మన ఊళ్ళో మన స్థాయివల్ల సరదాగా నాతో మాట్లాడేవారూ కరవే. ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు, లేద మరే సందర్భమైనా నేను వెళ్ళగానే ఓ రకమైన గంభీర వాతావరణం ఏర్పడేది. అదంతా నా మీద గౌరవంతో అనుకునేవాడిని.
నేనైనా నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిన సందర్భాలు.గుర్తుకు రావడం లేదు. నువ్వు కానుపులకి వెళ్ళినప్పుడు పాలేర్ల సాయంతో పంపేను. పిల్లలతో నువ్వు తిరిగి వచ్చినప్పుడు ముత్తైదువులు నిన్ను ఆహ్వానించేరు. ఒంటరిగా వెళ్ళినప్పుడు తోడుగా రావాలా అని అడగాలనిపించలేదు. పిల్లలని తీసుకు వచ్చినప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని అడగలేదు.
నీకు కావాలసినవి అన్నీ అమరుస్తున్నానుగా -- ఇంకేం కావాలి, ఏలోటూ చేయడం లేదుగా అనుకొనేవాడ్ని. భార్యకి ఇంతకన్న ఏ మొగుడు ఎక్కువ చేస్తాడనుకొనేవాడ్ని. మొదట్నుంచీ అదుపులో పెట్టకపోతే విపరీతమైన కోర్కెలు కోరితే తీర్చాలనే చెత్త నమ్మకం.
భార్యాభర్తలు ఎలా మెసలుకోవాలో జీవితాలు ఎలా పెనవేసుకోవాలో మొట్టమొదటిసారిగా పిల్లలను చూసి తెలుసుకున్నాను. కొడుకు ప్రతివిషయంలో కోడలి అభిప్రాయం తెలుసుకుంటుంటే వెన్నెముక లేనివాడని ఈసడించుకున్నాను. అల్లుడూ కూతురూ అన్యోన్యంగా తిరుగుతుంటే నీ కళ్ళల్లో కనబడ్డ భావాల్లో నువ్వేం కోల్పోయేవో తెలిపాయి. తొలిసారిగా భార్య జీవితభాగస్వామి కానీ జీవితంలో ఓ భాగం మాత్రమే కాదని అర్ధం కాసాగింది. మన పిల్లలు వాళ్ళ జీవితభాగస్వాముల సలహాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లల భవితవ్యాన్ని కలిసి చర్చించుకొనేటప్పుడు నీ చూపులు మౌనంగానే నా తప్పులు ఎత్తిచూపేయి.
ఎంతలా మానసికంగా హింసించేను నిన్ను. ఎన్నడూ నాతో మాటలాడనివ్వలేదే....కనీసం ఖైదీలకిచ్చే చిన్నపాటి స్వతంత్రం కూడా నీకివ్వలేదు.
ఒక్క అవకాశం ఇవ్వు. నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొంటాను. జీవితంలో నీకు అందజేయని ఆనందం అంతా అంతా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఎలా చెప్పను నీకు నా ఈ ఊహలన్నీ..ఏ లోకంలో ఉన్నా నన్ను మన్నిస్తావు కదూ...మరొక్కసారి అవకాశం ఇస్తావు కదూ...
నీ వాడు కాలేకపోయిన నీ భర్త.
**************అయిపోయింది.**************
2008 జూన్ నెల రచనలో ప్రచురితమైనది.
కథ బాగుందండీ..బహుశా మన ముందు తరం ది అయి ఉంటుంది..మన ఇళ్ళల్లో అయితే మన ముందు తరానికి మార్పులు వచ్చేసినా కథ వాతావరణం బట్టి వాళ్ళ ఇళ్ళల్లో అలాగే ఉండి ఉంటుంది.👍👍👍👍
ReplyDeleteచదివిన తరువాత మనసులో ఎదో కొరత ఉండిపోయినట్టు అనిపించింది. కదావస్తువు వర్తమానం ది కాకపోయినా రచయిత ఆ కాలపు మనుషుల ఆలోచనల్ని, అలవాట్లను బాగా ఆకళింపు చేసుకున్నారు. పిల్లల కాపురాలు చూసిన తర్వాత వచ్చిన పరివర్తన కాక ఇంక ఏదైనా బలమైన కారణం ఉంటే బాగుండేదేమో. మొత్తానికి కధ, కథనం బాగున్నాయి. రచయిత కు అభినందనలు.
ReplyDeleteఅప్పట్లో ప్రతి ఇంటి యజమానీ ఓ పెదరాయుడు! ఇల్లు, ఇంట్లో వాళ్ళూ పెద్దగా ప్రాముఖ్యత లేని వాళ్ళు వాళ్ళ దృష్టిలో. వాళ్ళు పోయాకనో, వీళ్ళు పోయే ముందో జ్ఞానోదయం అయ్యేది. ఉన్నది ఒకటే జీవితం అని మరిచిన వాళ్ళు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో (నిర్ణయాల్లో) తరచూ వి/కన్పిస్తూండే విషయాలు!
ReplyDeleteఉత్తరంలో తనని తాను ఆవిష్కరించుకున్న తీరు ప్రశంసనీయం!అభినందనలు!
మనసుకి హత్తుకునేలాగ రాశారు అండీ. ఒక మౌనరోదన, ఒక హృదయ వేదన చదివాక అయ్యో అనిపించింది.
ReplyDeleteIlaanti manushulu ippudu kuda vunde vuntaaru! Vaalla bharyala maanasika vedana cheppakane chepparu! Raastunnadi bhartha ainaa, kallamundu aame kadalaadindi! Manasu aardhramaipoyindi! Aa vutharamtho paatoo o kanneeti chukka , aame kosam !
ReplyDelete